[box type=’note’ fontsize=’16’] మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. [/box]
దేవుడు – మనిషి
22.0. ప్రపంచసృష్టి జరిగిన విధానం :
[dropcap]మ[/dropcap]నం ఇంతవరకు బ్రహ్మాండసృష్టి ఎలా జరిగింది, లోకాలు, లోకాలకు తగ్గ జీవుల సృష్టి ఎలా జరిగాయి మొ॥న విషయాలు చర్చించుకున్నాం. అవి ఇంకోసారి చూద్దాం.
- సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు వికల్పరహితంగా, ఉపాధిరహితంగా. అందుకు దాన్ని పరమాత్మ చైతన్యం లేక శుద్ధచైతన్యం అంటారు.
- మాయ: పరమాత్మను ఆశ్రయించుకుని మాయ ఉంది. ఈ మాయనే అవ్యాకృతం, మూల ప్రకృతి, ఈశ్వరశక్తి అంటారు. అవిద్య అన్నా అదే. పరమాత్మలోనే సృష్టికి కావలసిన ప్రకృతంతా బీజరూపంలో నిక్షిప్తమై ఉంది. ఇది అవ్యక్తం. ఇది వ్యక్తం కావాలంటే పరమాత్మ ఈశ్వరుడిగా వ్యవహరించి సృష్టినికల్పించాలి.
- పరమాత్మ ప్రపంచసృష్టి కోసం సత్త్వగుణం ప్రధానంగా కలిగిన మాయలో ప్రతిఫలించి ఈశ్వరుడుగా వ్యవహరించాడు. దాన్నే ఈశ్వర చైతన్యం అంటారు.
- ఇంతవరకు నిర్వికల్పంగా ఉన్న పరమాత్మకు, సృష్టి ఆరంభంలో, ఈశ్వరునిగా వ్యవహరించడంవల్ల, సృష్టి చేయాలని ఇచ్ఛకలిగింది. ఆ ఇచ్ఛాయోగంలో మాయయందు క్షోభ కలిగింది. అంటే స్పందన శక్తి కలిగింది. ఆ శక్తి నుండి మహత్తత్వం పుట్టింది. ఉదాహరణకి ఎవరైనా ధ్యానస్థితిలో ఉంటే బయట ఏం జరిగినా తెలియదు. ఏదైనా శబ్దం కలిగి ధ్యానం భంగమైతే మనస్సు వికల్పం చెందుతుంది. అదే క్షోభ కలగడమంటే.
- మహత్తత్వంనుండి ఆయన ప్రేరణచే అహంకారం కలిగింది. ఈ అహంకారం 3 రకాలు: సాత్త్విక, రాజస, తామస.
- తామసాహంకారం నుండి 5 తన్మాత్రలు పుట్టాయి :శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు.
- ఈ తన్మాత్రలనుండి పంచభూతాలు పుట్టాయి: ఆకాశం,వాయు, అగ్ని, జలం,పృథ్వి.
- రాజసాహంకారం నుండి 10 ఇంద్రియాలు=5 జ్ఞానేంద్రియాలు+5కర్మేంద్రియాలు ఉత్పన్నమయ్యాయి.
- సాత్వికాహంకారంనుండి ఇంద్రియ అధిష్టాన దేవతలు, మనసు ఉత్పన్నమయ్యాయి.
- సూక్ష్మపంచభూతాల నుండి సూక్ష్మశరీరరూప హిరణ్యగర్భుడు పుట్టాడు. ఇతన్నే మహాలింగ,సూత్రాత్మ, ప్రాణశక్తి, క్రియాశక్తి అంటారు. ఇదే సర్వవ్యాపి.
- స్థూలభూత సమూహంనుండి విరాట్పురుషుడుద్భవించాడు.
- విరాట్పురుషుడి నుండి సంపూర్ణ స్థావరజంగమాత్మకమైన ప్రపంచం పుట్టింది.
- ఈశ్వరుడు జీవుల కర్మానుసారంగా సృష్టిచేస్తాడు. జీవుల సృష్టిలో మొదటగా దేవతలు పుట్టారు. ఈ క్రమంలో అన్నిరకాల స్త్రీ, పురుషదేవతలూ సృష్టించబడ్డారు. విశ్వనిర్వహణ, విశ్వపరిరక్షణలకోసం ఈ దేవతల్లో ముఖ్యులు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు. వారు తమ స్త్రీశక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో కలిసి సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహిస్తారు.
- సృష్టికర్త అయిన బ్రహ్మవల్ల మనువులు, ఋషులు మొ॥న ప్రజాపతులంతా పుట్టుకొచ్చారు. వారివల్ల ప్రజాభివృద్ధి జరిగింది. వారి పేర్లనే గోత్రాలుగా కొందరు చెప్పుకుంటారు ఇప్పటికీ. ఆ గోత్రమే వారి డి.ఎన్.ఏ అని అంటున్నారు విజ్ఞులు.
22.1. సృష్టిలోగల నియతి :
ఇంతవరకు ప్రపంచసృష్టి క్రమం చూసాం. దీన్నిబట్టి మనకేం తెలుస్తున్నదంటే ప్రపంచ సృష్టికి పరమాత్మే కారణమని. ఎందుకంటే సృష్టిలో ప్రతిది ఒక నియతి ప్రకారం ఏర్పడింది. ఏది ఇష్టమొచ్చినట్లు కూర్చబడలేదు. ఈ నియతివల్లే గ్రహనక్షత్రాలన్నీ ఏవీ గతులు తప్పకుండా వాటివాటి స్థానాల్లో ఉన్నాయి. అందువల్లే భగవంతుడున్నాడని వేద ప్రమాణం. అంటే వాటి గురించి వేదాల్లో ఉంది కాబట్టి వేదాలనే ప్రమాణంగా తీసుకోవాలి. ఏ విషయమైనా చూసి మన చిత్తానికి తగినట్లు మన మనస్సుకు తోచినట్లు చెప్పకూడదు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
22.2. మనిషికి అర్థంకానివాడు దేవుడు :
సృష్టిలో మొదటగా దేవతలు, ఋషులు మొ॥వారు పుట్టారు. చివరగానే మనిషి పుట్టాడు. అందుకే మనిషి అల్పజ్ఞుడు. మనిషి యొక్క అల్పజ్ఞత్వం వల్లన్డే దేవుడంటే మనిషికి అర్థంకాడు. దేవుడున్నాడాయని మనిషికి ఎప్పుడూ సందేహం కలుగుతూనే ఉంటుంది. తనకు దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు లేడని మనిషనుకుంటే అంతకన్నమూర్ఖత్వమింకోటి ఉండదు. దేవుడ్ని చూడాలంటే మాంసచక్షువులు సరిపోవు. దివ్యచక్షువులు కావాలి. అవిచ్చినా చూడలేకపోయాడు అర్జునుడు లాంటి వాడు గూడా, కృష్ణపరమాత్మగీతోపదేశమప్పుడు ఆయన యొక్క దివ్యరూపాన్ని. కష్టాలొస్తేనే మనిషికి దేవుడు గుర్తొస్తాడు తన్ని దేవుడు ఆదుకోలేదని, అందుకు తిట్టుకుంటూ ఉంటాడు దేవుడ్ని. అందుకు మనిషి నిజానికి చాలా తెలివితక్కువ వాడు. తాను చేసుకున్న కర్మఫలితాన్ని తాను అనుభవిస్తున్నాడన్న ఇంగితం తనకు లేదు. ఎప్పుడూ దేవుడికి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాడు. మనవాళ్ళలోన్లే రెండురకాల వాళ్ళున్నారు. ఒకరకం వాళ్ళు, ఆధునిక ఆంగ్ల విద్యలు నేర్చుకున్నవారు. వారికి విదేశీ సంస్కృతే గొప్పగా, పరమావధిగా అనిపిస్తుంది. వాళ్ళకి మన దేవుడంటే నమ్మకం ఉండదు. ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. రెండోరకం వాళ్ళున్నారు. వాళ్ళు మన ప్రాచీనతని తెలుసుకున్నవాళ్ళు. మనకు గొప్ప సంస్కృతి ఉందని తెలిసినవారు. గతాన్ని మరచిపోనివారు. భగవంతునివల్లే ప్రపంచం నడుస్తోందని నమ్మేవారు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. మనిషిగూడా జంతువుతో సమానమే. వాటికి వివేకం లేదు. మనిషికి ఉంది. అందుకు మనిషి జంతువుల్లో ఉత్తముడు. జంతువులకి వెన్నెముక అడ్డంగా ఉంటుంది. మనుషులకు నిలువునా ఉంటుంది. దానివల్ల మనిషి తనలో నిద్రాణమై ఉన్న దివ్యశక్తిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తే మనిషిగూడా దేవుడై పోతాడు.
22.3. భగవంతుని లక్షణాలు :
భగవంతుడు, ఈశ్వరుడు,దేవుడు అన్నపదాలన్నీ ఆ పరమేశ్వరునికే చెందుతాయి. భగవంతునికి కొన్ని లక్షణాలు ఆపాదించారు విజ్ఞులు, అవి:
- ఆయన ఈశ్వరుడు అంటే ఆయనకన్నా ఐశ్వర్యవంతుడు ఇంకెవరూలేరు
- ఆయన సమగ్రతకలవాడు.సంపూర్ణుడు. పరిపూర్ణుడు.
- ధార్మికతగలవాడు. ఆయనకన్నా ధర్మసూక్ష్మం తెలిసినవారు ఇంకెవరూలేరు.
- యశస్సుకలవాడు. ఎంతో కీర్తిమంతుడు.
- ఆయన ఎంతో శ్రీమంతుడు. ఆయనున్నచోటల్లా లక్ష్మీప్రదమే,సంపదమయమే.
- జ్ఞానమే ఆయన. ఇన్ని ఉన్నా ఆయన విరాగి. వేటియందు మమకారంలేదు. ఇలా ఇంకా ఎన్నోఉండచ్చు.
కానీ ఆయనకి ఇవే ముఖ్య లక్షణాలుగా చెప్తారు. ఈశ్వరుడంటే నిర్వచించారు గూడా మనవారు. అది శ్రీపోతనగారి శ్రీమహాభాగవతంలో గజేంద్రమోక్ష ఘట్టంలో ఉంది:
ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వనియందుడిందు బరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాదిమధ్యలయుడెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబువేడెదన్॥
22.4. అష్టమూర్తులుగా ఈశ్వరుడు :
ఈశ్వరుడు కనపడడు. కానీ ప్రత్యక్షంగా 8 రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. అవి : పంచభూతాలు : 1.ఆకాశం, 2. వాయువు, 3. అగ్ని, 4. జలం, 5.పృథ్వి. 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8.యజమాని (జీవుడు). మనకు కనపడే విశ్వమంతా ఈ 8 మూర్తులతో నిండిపోయి ఉంది. ఈశ్వరుడు ఈ 8 మూర్తుల్లో లీనమై ఉన్నాడు. అలా ఉండి వాటికి అతీతంగా ఉన్నాడు. పంచభూతాలు లేకపోతే ప్రపంచమే లేదు. సూర్యుడు లేకపోతే మనకు బతుకేలేదు. చంద్రుడు లేకపోతే మనని పోషించే పంటలు ఉండవు. ఇవన్నీ ఉండి అనుభవించే యజమాని లేకపోతే మరి ఎట్లా? అందుకే మనిషిలో గూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడు తన అవివేకంవల్ల.
22.5. ఈశ్వరుడు నడయాడిన భూమి :
ఈ భూమ్మీద భగవంతుడు ఎన్నో రూపాల్లో అవతరించాడు. సృష్టి మొదలైనప్పడినుండి తన అవతారాలతో దుష్టశిక్షణ, శిష్టరక్షణ అన్న ఘనకార్యాలను చేస్తునే ఉన్నాడు. భగవంతుడు దివినుండి భువికి దిగి విష్ణువుగా, శివుడిగా ఎన్నోరూపాల్లో ఎన్నో ప్రదేశాల్లో మహిమలు చూపి తన అవతార ప్రయోజనం నెరవేర్చాడు. అందువల్ల విష్ణువుని, శివుడిని అనేక రూపాల్లో చూస్తాం. అలాగే పరాశక్తి గూడా అనేక రూపాల్లో అవతరింంచి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసింది. అందులో మన భరతభూమి ఎంతో పుణ్యం చేసుకుంది. భగవంతుని అవతార కార్యాలను గుర్తుపెట్టుకుని పురాణాల రూపంలో భద్రపరచింది.
22.6. అనేక పుణ్యక్షేత్రాలుగల భరతభూమి :
ఒక్క భారతదేశంలోనే భగవంతునికి సంబంధించి అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయి. ఋషులు తపస్సు చేసి తమ తపశ్శక్తిని కొన్నిచోట్ల నిక్షిప్తం చేసి , ఉర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. అలాగే బ్రహ్మ, ఇంద్రుడు మొ॥న దేవతలు గూడా తపస్సుచేసి కొన్ని ప్రదేశాలను పవిత్రీకరించి క్షేత్రాలుగా మలచారు, తీర్థాలుగా చేసారు. ఆలయాలు నిర్మించారు. విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్ఠించారు. దేనికోసం? సామాన్యుల పాపపరిహారాల కోసం. కొన్ని ప్రదేశాలు భక్తులవల్ల పవిత్రీకరించబడ్డాయి. కొన్ని ప్రదేశాల్లో భగవంతుడు స్వయంభువుగా వెలిసాడు. కొన్ని ప్రదేశాల్లో దేవతలు, ఋషులు చేసిన తపస్సులు, యజ్ఞయాగాలవల్ల భగవంతుడు వారి కోరికల కనుగుణంగా వెలిసాడు. కొన్ని ప్రదేశాల్లో భగవంతుడు భక్తుల కోరికలననుసరించి వెలిసాడు. కొన్నిచోట్ల దేవదానవ యుద్ధాలు జరిగి పరాశక్తి వల్ల దానవ సంహారం జరిగాక ఆవిడ స్వయంగా ప్రతిష్ఠింపబడిన ఆలయాలున్నాయి. అందుకు మొత్తానికి అడుగడుగునా మన దేశంలో పవిత్రభూములున్నాయి. ఆలయాల్లో దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయాలు దేవశిల్పి విశ్వకర్మచే నిర్మించబడినవి గూడా ఉన్నాయి. ఎవరికోసం? జనులందరికోసం. కష్టాల్లో ఉన్నవారి కష్టాలు తీరడంకోసం. ఎక్కడైనా ఓ పురాతనమైనగుడి ఉందంటే దానికి సంబంధించి ఓ స్థలపురాణం ఉంటుంది. మన నదీనదాలు గూడా ఎంతో పవిత్రమైనవి. గంగాదినదుల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయంటారు. మనిషి పాపపుణ్యాలనుభవించడానికే భూమ్మీద పుడతాడు. మరి పాపాలు పోగొట్టుకోవాలంటే పుణ్యక్షేత్రాలు దర్శించాలి, నదీస్నానాలు చేయాలి. అందుకు మనవారు తీర్థయాత్రలు చేస్తారు.
22.7.కొన్ని పుణ్యక్షేత్రాలు :
ఎన్నో పుణ్యక్షేత్రాల్లో అత్యంత పుణ్యస్థలం కాశీ అని కాశీను గురించి ఎక్కువగా అంటుంటారు. కాశీలో విశ్వనాథుడు భక్తులకు భౌతికంగా గూడా దర్శనమిచ్చి అనుగ్రహించే వాడని కథలు చెప్పుకుంటారు. అక్కడ మరణిస్తే ముక్తేనని అంటారు. అలాగే కేదార్‌నాథ్, బదరీనాథ్, పూరి,అవంతి,మొ॥న ప్రదేశాలు. అయోధ్యలో పుట్టిన శ్రీరాముడు భారతదేశాన్నంతటిని కాలినడకన ప్రయాణించి పవిత్రం చేసాడు. శ్రీకృష్ణుడు మథురలో పుట్టి బృందావనం, ద్వారకలను పవిత్ర క్షేత్రాలుగా మలచాడు. మన దక్షిణ భారతంలో గూడా ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. మన తెలుగునాట అతిపవిత్రమైన ప్రదేశం తిరుమల క్షేత్రం. ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భువికి దిగివచ్చి భౌతికంగా నడయాడిన పుణ్యక్షేత్రం. అలాగే అక్కడి స్వామి పుష్కరిణి అతి పవిత్రమైన నదుల సంగమం. విజయవాడలో నున్న దుర్గాదేవి ఒకానొకప్పుడు ఒకరాజుయొక్క ధర్మనిరతికి సంతోషించి కనకవర్షం కురిపించింది విజయవాటికలో. అందుకు ఆదేవి కనకదుర్గగా పూజలందుకుంటోంది.
అలాగే కాంచీపురంలోని గల కామాక్షీదేవి. ఎంతో తపస్సు చేసి శివుని పరీక్షలకు నిలచి ఆయన్ని మెప్పించింది. దేవతలను బంధకుడన్న రాక్షసుడు పీడిస్తుంటే వాడ్ని సంహరించి దేవతలను రక్షించింది. అక్కడే స్వయంభువుగా ప్రతిష్ఠించబడింది. ఇది ఎప్పడో స్వయంభువు మన్వంతరంలో జరిగిందిట. ఈ కాంచీనగరమే భూలోకంలోని మణిద్వీపమంటారు, శ్రీమన్నగరమంటారు. అంత ప్రాచీనతకలిగిన ప్రదేశాలన్నమాట మన క్షేత్రాలు. మధురై మీనాక్షీదేవికి సంబంధించిన కథలు, వింటూంటే ఎంతో అద్భుతమనిపిస్తుంది. మలయధ్వజ పాండ్యన్ అన్నరాజు యజ్ఞం చేస్తుంటే అగ్నిగుండంలోంచి ఉద్భవించి పుత్రికగా పెరిగి, వీరవనితగా పేరుగాంచి, శివుని సుందరేశ్వరుని రూపంలో వివాహమాడి మధురైను పాలించి పవిత్రం చేసింది మీనాక్షీదేవి. ఇలా ఎన్నో ప్రదేశాలను దేవీదేవతలు పవిత్రీకరించారు. ఇక్కడ గల మట్టి యొక్క కణకణంలోను శంకరుడుంటాడు. ఇవన్నీ కట్టుకథలు కావు. ప్రతిస్థలం గురించి ఓ నమ్మలేని నిజం దాగుంది. చెప్పుకుంటూపోతే చాలా ఉంది. అంతే కాదు ఇక్కడ గురువులుగా సంచరించినవారు గూడా మహిమగలవారే. ఆదిశంకరులు తన 8వ ఏటనే ఓ పేదరాలిని చూసి కరుణించి కనకధారాస్తవం చదవగా లక్ష్మీదేవికరుణించి కనకధార కురిపించింది. విద్యారణ్యులవారు అమ్మవారిని గూర్చి తపస్సుచేయగా కనకధార కురిపించింది. దానితోనే ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇంత గొప్ప గురువులు ఇంకో మతంలో కనిపిస్తారా? ఇదీ భారతదేశంలోని వేదధర్మం యొక్క గొప్పతనం.
22.8. ఏ దేవుడ్ని ఆరాధించాలి?
మనకు 33 కోట్ల దేవతలున్నారు. అందులో ఎవరిని ఆరాధించాలి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దాని సమాధానంగా ఆదిశంకరులు చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఆయన ఉన్న కాలంలో 72 కుమతాలు ఉండేవి. వాటిని ఖండించి షణ్మత స్థాపన చేసారు. అంటే శివుడు, గౌరి, గణపతి, స్కందుడు, విష్ణువు, సూర్యుడు అన్న అన్న 6 గురు దేవతలను పూజించాలని చెప్పారు. ఎందుకంటే ఈ ఆరుగురు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలరు. అందులో పంచాయతనంగా 5 గురిని, అంటే శివుడు, గౌరి, గణపతి,విష్ణువు, సూర్యుడిని పూజలో పెట్టుకోవాలి. స్కందుడికి బదులుగా దీపాన్ని వెలిగించి పూజించాలి. దీపం స్కందుడికి ప్రతీక. చాలామంది పంచాయతన పూజ అని ఇలానే చేస్తారు. సూర్యుని ఆరాధనఅంటే ఊర్థ్వలోకాలకు మార్గం సుగమం. సూర్యమండలం ఓ ద్వారంలా పనిచేస్తుందిట బ్రహ్మలోకానికి.
22.9. విగ్రహారాధన :
మన ఆలయాల్లో విగ్రహాలు అందమైన దేవతామూర్తలవి. అవి ఎవరో మామూలు వాళ్ళుచెక్కినవి కావు. కొన్ని విశ్వకర్మలాంటి వాళ్ళు చెక్కినవి. కొన్ని స్వయంభువుగా వెలసినవి. బ్రహ్మ, ఇంద్రుడు మొ॥న దేవతలు ఈశ్వరుడిని, విష్ణువుని గూర్చి పవిత్రస్థలాల్లో తపస్సుచేసి వారి మూర్తులను విగ్రహరూపంలో తయారుచేయించి ప్రతిష్ఠించారు, ఆలయాలు నిర్మించి. విష్ణువే ఆదేశించాడు తన భక్తులను, తన్ను విగ్రహరూపంలో పూజించమని. అలాగే శివుడ్ని లింగరూపంలో పూజిస్తారు. లింగం అంటే అన్నిటినీ తనలోనికి లీనం చేసుకునేది, తను అన్నిటిలో లీనమైపోయి ఉండేది. ఆ లింగమే ఈ బ్రహ్మాండానికి ప్రతీక. లింగాన్ని పూజిస్తే బ్రహ్మాండనాయకుడైన ఈశ్వరుడ్ని పూజించినట్లే. అంటే బ్రహ్మాండాన్ని పూజించినట్లే. దేవాలయాలని ఏదో కాలక్షేపం కోసం కట్టలేదు. అవి విజ్ఞాన కేంద్రాలు. అక్కడ సాధకులు తమ సాధన కొనసాగించేవారు. అవి మనకు పవిత్ర ప్రదేశాలు. ఆలయాలమీద మనశాస్త్రాలు చెక్కించేసారు. ఉదాహరణకి కోణార్కదేవాలయంమీద కామశాస్త్రాన్ని చెక్కారు. అది అలా పదికాలాలపాటు ఉండటానికి. కొన్ని దేవాలయాల్లో రామాయణ కథ, భాగవతంలో శ్రీకృష్ణుని లీలలు మలచారు.
అలాంటిది విదేశీయులు కాలు పెట్టారు పవిత్ర క్షీణించుకు పోయింది. మన ఆలయాలు ధ్వంసంచేసారు. ఏ నరకానికి పోతారో? ముస్లింల దండయాత్రల్లో మన ఆలయాలు చాలా దయనీయంగా ఉండేవి. ఉదాహరణకి శ్రీరంగంలోని శ్రీరంగనాథుడి ఆలయం ఆ సమయంలో పూజాపునస్కారాలకి నోచుకోలేదు. ఆలయ ప్రదేశమంతా కల్లుపాకలతోనూ, వేశ్యావాటికలతోను నిండి ఉండేది. అటువంటిపరిస్థితిలో ఓ వేశ్య ఆ రాజుని మచ్చిక చేసుకుని ఆ దేవాలయం బాగయ్యేట్టు చేసింది. ఆవిడ సంకల్పబలంతో దేవాలయం బాగుపడింది, కానీ ఇంత చేసిన ఆవిడకు మాత్రం రంగనాథుడ్ని చూడ్డానికి అనుమతి నిరాకరించారు. ఈ కథంతా ‘తపస్సిద్ధి’ అన్న పుస్తకంలో ఉంది. ఎప్పుడో అది డిగ్రీ విద్యార్థులకు తెలుగుకు నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ గా ఉండేది.
22.10. తారుమారైన పరిస్థితులు :
కాలం మారుతుంటుంది. కాలానికనుగుణంగా పరిస్థితులు గూడా మారుతుంటాయి. ఇప్పుడంటే ఈ కలి ఐదువేల సంవత్సరాలు దాటాక పరిస్థితులు తారుమారుగా కనిపిస్తున్నాయి. అందులో విదేశీ దురాక్రమణల్లో విదేశీ సంస్కృతుల విజృంభణలో మన నమ్మకాలన్ని తుడిచిపెట్టుకొని పోయాయి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఈ నమ్మకాలు ఎక్కువ. కష్టాలు వచ్చినవాడు మొక్కుకుంటే కష్టాలు తీరుతున్నాయి. కాబట్టి పల్లె ప్రజల్లో ఇంకా భక్తి ప్రబలి ఉంది. గురువులు, బాబాలు, స్వామీజీలు ఇప్పటికీ ఉన్నారు. వారిలో మాయావులు కూడా ఉన్నారు. ఏ గురువు దగ్గరకైనా వెళ్ళాలంటే ఎవరెలాంటివారో తెలియకపోతే కష్టం. ఈ కాలంలో గురువుల వద్దకు వెళ్ళాలంటే ముందుగా డబ్బు బాగా సమర్పించుకోవాల్సి వస్తుంది. ఎవరు మంచో ఎవరు కాదో ఎలా తెలుస్తుంది. గురువుల గురించి తెలియనివాళ్ళకి ఎవరిదగ్గరకు వెళ్ళాలో తెలియదు. తెలియనివారు ఏంచేయాలి? ఆదిశంకరాచార్యుల పటం పెట్టుకుని ఆరాధించాలి. ఆదిశంకరులు, రమణమహర్షి లాంటి వారు భక్తులను ఉద్ధరించడానికే అవతరించారు. అలాంటి వారు మన మధ్య లేకపోయినా వారు మనకు మార్గనిర్దేశం చేస్తారు. వారికి భౌతిక శరీరం లేకపోయినా ఆ పుణ్యాత్ములు అన్ని లోకాలు సూక్ష్మశరీరంతో తిరుగుతూ వుంటారు. అందుకే వారిని ధ్యానిస్తే చాలు సద్గురువు లభించినట్లే. ఐనా జగద్గురువైన మనకృష్ణ పరమాత్మ ఉండగా వేరే గురువులెందుకు?
22.11. ఎవరి ధర్మం వారికి గొప్ప :
మన వేదధర్మం మనకు అనేక ధర్మాలను నేర్పింది. ఇతరులకు కీడుచేస్తే పాపం అని కూడా చెప్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది. ఇవి ఆచరిస్తే వేరే దైవారాధన గూడా అక్కరలేదుట. కీకరకాయ చదువులవల్ల మనగురించి మనకు తెలియకుండా పోయింది. అదీగాక ఆంగ్లేయులు ఇప్పుడూ కూడా మన ధర్మం మీద బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వేదాలమీద, మన ధర్మాలమీద ఇష్టం వచ్చినట్లు అధర్మ ప్రచారం చేయడం వల్ల ఏమి ప్రయోజనమో ఆలోచించాలి. ఇదేనా వారి సంస్కారం అని ఆలోచించాలి. మనం విగ్రహారాధన చేస్తామట. అది వారికి హేళనగా అనిపించింది. మనం అందమైన దేవతామూర్తులను విగ్రహరూపంలో ఆరాధిస్తాం. మరి వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళూ అదే చేస్తున్నారు. ఐతే అశుభసూచకంగా ఉండే కష్టాల గుర్తును, నెత్తురోడుతున్న మృతకళేబరాన్ని ఆరాధిస్తున్నారు మన వేదధర్మం ఋషుల ద్వారా వ్యాప్తి చెందింది. వాళ్ళ మతం చేపలుపట్టేవాళ్ళద్వారా గొర్రెల కాపర్ల ద్వారా ప్రచారం చెందింది. చదవండి Lloyd C Douglas రాసిన The Big Fisherman. మనకు యుగాలకు సంబంధించిన సంస్కృతి ఉంది. వాళ్ళది కేవలం రెండువేల సం॥లకి మించిలేదు. వీళ్ళా ఇతరుల సంస్కృతి సంప్రదాయాలమీద బురదజల్లడానికి ప్రయత్నించేవారు? మన గుళ్ళల్లోకి వచ్చి మన విగ్రహాలు ధ్వంసంచేస్తున్నారు. మన అర్చకులను చావచితక్కొడుతున్నారు. ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. ఎందుకు వాళ్ళు మన ధర్మాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు అనే ఆలోచన చేస్తేనే కాని మనం మన ధర్మాన్ని కాపాడుకోలేము. ఇంకోళ్ళ ధర్మం మీద అపవాదులు చేసి ఆ ధర్మానికి చెందిన వాళ్ళని మత మార్పిడి చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడా? ఆగ్రహిస్తాడా? ఇది గ్రహించాలి. డబ్బుతో, కల్లబొల్లి కబుర్లతో ఇతర ధర్మాలను దెబ్బతీయడం పాపం కాదా మరి. అది తెలుసుకోవాలి వారు. దీనికో కథ వుంది. అది చూద్దాం.
22.12. మతం మార్చుకుని నరకానికి పోయిన ఓ జర్మన్ మేధావి :
ఫాస్టస్ అన్న జర్మన్ మేధావి ఓ వైద్యుడు. ఎన్నో చదువులు చదివి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ ఇంకా తనివి తీరక మానవాతీత శక్తులకోసం సైతానును ఆశ్రయించాడు 24 ఏళ్ళు. ఆ సైతాను తనకి మానవాతీత శక్తులు ఇస్తే తన ఆత్మను ఆ సైతానుకి ధారాధత్తం చేస్తాను అని బేరం కుదుర్చుకున్నాడు. 24 ఏళ్ళు ఆయన పేరు ఆ చుట్టు ప్రక్కల ప్రదేశాలలో మారుమ్రోగిపోయింది మానవాతీత శక్తులు కలవాడిగా. కానీ చివరి క్షణం వస్తుంది. ఆ క్షణంలో చాలా ఏడుస్తాడు. తను చాలా తప్పు చేసానని. కానీ ఏం లాభం? నరకానికి పోతాడు.
22.13. ఇంతవరకు చెప్పుకున్నవి :
మనం ఇంతవరకు చాలా విషయాలు బ్రహ్మాండానికి భూమికి సంబంధించినవి చెప్పుకున్నాం. ప్రపంచ సృష్టి ఎలా జరిగిందోనని చెప్పుకున్నప్పుడు మరి ప్రపంచం ఎలా లయమవుతుందో కూడా చెప్పుకోవాలికదా! అదీ చూద్దాం. లయం అంటే అంతం అవడం కాదు. పరమాత్మలో లీనమయిపోవడం. అంతా బీజరూపంలో పరమాత్మలో లీనమైపోయి ఉంటుంది. తరువాత మళ్ళీ సృష్టి, స్థితి, లయం జరుగుతూ వుంటాయి.
22.14. మహాప్రళయం :
ప్రళయం గురించి లోగడ కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు మహా ప్రళయం గురించి తెలుసుకుందాం. ప్రళయంలో పంచభూతాలు విలీనమయ్యే సమయం ఆసన్నమవుతుంది. ఆ ప్రళయంలో ‘ఆదీ అంతం’ లేని కాలం నామరూపాత్మకమైన జగత్తును మాయాశక్తిలోకి విలీనం చేస్తుంది.
- వాయువు భూమినుండి గంధాన్ని హరించగా భూమి జలంలో కలిసిపోతుంది.
- వాయువు జలంలోని రసాన్ని హరించగా జలం అగ్నిలో లయిస్తుంది.
- ప్రళయాంధకారం రూపాన్ని హరించగా అగ్ని వాయువులో లీనమవుతుంది.
- ఆకాశం స్పర్శగుణాన్ని హరించగా వాయువు ఆకాశంలో లయిస్తుంది.
- కాలరూపుడైన ఈశ్వరుడు శబ్దగుణాన్ని హరించగా ఆకాశం తామసాహంకారంలో లీనమవుతుంది.
- సమిష్టి ఇంద్రియాలు సమిష్టి బుద్ధి సమష్టి రాజసాహంకారంలో లయిస్తాయి.
- సమిష్టి మనసు ఇంద్రియాధిష్టాన దేవతలతో సహా సాత్వికాహారంలో లీనమవుతుంది.
- అహంకారం తన సత్త్వ, రజస్తమోగుణాలతో సహా పరమాత్మలో లయిస్తుంది.
- బ్రహ్మాండానికి అంత్య కాలం : పృథివ్యాది పంచ స్థూల భూతాలు వాటి గుణకార్యాలైన శబ్దాది తన్మాత్రల్లో (విషయాల్లో లీనమయిపోతాయి).
- అగ్ని ప్రళయం : భూలోకంలో అమిత వేడి కలుగుతుంది. వంద సంవత్సరాలు వర్షాభావం వల్ల సూర్యోష్ణోగ్రత చేత సకల లోకాలు దహించబడతాయి. సంకర్షణుడైన ఆదిశేషుని ముఖం నుండి వెలువడే అగ్ని జ్వాలలు ప్రచండ వాయువుచే ప్రేరేపించబడి అథోలోకమైన పాతాళం నుండి అన్ని లోకాలను దహించి వేస్తుంది. ప్రపంచం బద్దలవుతుంది.
- జల ప్రళయం : ఆ పైన వంద సంవత్సరాలు సంవర్తకమనే పేరుగల మేఘాల వల్ల ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. ఏనుగు తొండాలంత ధారలతో బ్రహ్మాండం నీట మునిగి పోతుంది. ఉపాధి లయమవడంతో బ్రహ్మాండదేహాభిమానియైన హిరణ్యగర్భుడు బ్రహ్మాండ దేహాన్ని విడిచిపెడతాడు. అంటే ఈశ్వరడే జీవరూపంలో దేహేంద్రియాల్లో చిక్కుకుని కర్మఫలాలను అనుభవిస్తున్నాడు, మహాప్రళయంవరకు. ప్రళయంలో అంతా బీజరూపంలో పరమాత్మలో లీనమైపోయి ఉంటుంది. తరువాత మళ్ళీ సృష్టి, స్థితి, లయం జరుగుతూ వుంటాయి. ప్రళయకాలంలో బీజరూపంలోనున్న ఈ ఈశ్వరశక్తి సృష్టిదశలో ప్రపంచంగా వ్యక్తమవుతుంది.
ఈ అధ్యాయం ముగించే ముందు మన భరతభూమిలో ఒక భాగమై, శిరస్సు లాంటిదైన కశ్మీరదేశం గురించి కొంచెం తెలుసుకుందాం.
22.15. కశ్మీరరాజ్య చరిత్ర :
సృష్టి ప్రారంభంనుండి, దాదాపు 200 కోట్ల సం॥ల పై నుండే కశ్మీర భూభాగమంతా ‘సతీసరోవరం’ గా పిలువబడేది. వైవస్వతమన్వంతరాదిలో కశ్యప ప్రజాపతి బ్రహ్మ, ఉపేంద్రుడు, రుద్రుడుమొ॥దేవతలను అవతరింపచేసి ఆ సతీసరస్సులో దాగిఉన్న జలోద్భవుడనే రాక్షసుని చంపి ఆ సరస్సులోని నీటిని తీసివేసి కశ్మీరదేశాన్ని నిర్మించాడు. కశ్యపుడు నిర్మించిన మిర్రు కాబట్టి కశ్యపమేరు, కశ్మీరు అని పేరు వచ్చింది. ఇది యుగాలకిందటి కథ. ఇప్పటికి 5000సం॥ క్రితం ద్వాపర యుగాంతంలో కశ్మీరరాజు మొదటి గోనందుడు బలరాముని చేతిలో మరణించాక అతని కుమారుడైన దామోదరుడు రాజై శ్రీకృష్ణునితో వైరం పూని ఆయన చేతిలో బలయ్యాడు. అతని పుత్రుడు రెండవ గోనందుడు మొదలుకొని ‘లవ’ మహారాజువరకూ కశ్మీరాన్ని 35 మంది రాజులు పాలించారు. వీరిలో అశోకుడు అన్నవాడు శ్రీనగరాన్ని నిర్మించాడు. ఇతనే కశ్మీరంలో బౌద్ధాన్ని ప్రవేశపెట్టాడు. దేశవిదేశాలకు బౌద్ధభిక్షువులను పంపించాడు. ఈతని కొడుకే ‘జలౌకుడు’ అన్నవాడు. ఈయన తర్వాత దామోదరుడన్నవాడు కశ్మీరానికి రాజయ్యాడు. ఈ దామోదరుడే విశ్వనాథభట్టు అన్న విప్రశాపానికి గురై సర్పంగా మారాడు. దానివల్ల కశ్మీరం అల్లకల్లోలమై విదేశీయులపాలైంది. ఆ విదేశీయుడు తురుష్కమహారాజు (తుర్కీస్థానం నుండి వలస వచ్చిన బౌద్దపండిత మహారాజు) – హుష్కమహారాజు. దామోదరుడు పాముగా మారడం అన్నది జరిగి ఇప్పటికి 3వేల 5వందలసం॥క్రితం.
అప్పటికే బౌద్ధులు విజృంభించి వైదికధర్మంమీద దాడులు సాగించారు. బుద్ధుడికాలం బి.సి.ఇ 1887-1807. దామోదరుడి సమయానికి 400 సం॥గడిచాయి. అప్పటికే కశ్మీరానికి చుట్టుపక్కల గల ప్రదేశాల్లో బౌద్ధం వ్యాప్తిలోకి వచ్చింది. అందుకని వాళ్ళు కశ్మీరాన్ని ఆక్రమించాలని చూసారు. ఆక్రమించి సనాతన ధర్మానికి చెందిన బ్రహ్మణులను హింసించసాగారు. వారి గుళ్ళు, గోపురాలను లాక్కొని బౌద్ధారామాలుగా, చైత్యాలుగా మార్చసాగారు. వైదికబ్రాహ్మణులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. వారిని ఆదుకునే నాథుడే లేడు.
ఆ తర్వాత మహమ్మదీయ మతం ప్రబలి మహమ్మదీయులు ఇతర రాజ్యాల్లో ప్రవేశించి రాజుల మనస్సులను ప్రాపంచిక సుఖాలవైపు మరల్చి వారిని అవైదికులుగా చేసారు. కశ్మీరరాజులు గూడా ఈ మ్లేచ్ఛ తురుష్కులకు తమ ఆస్థానంలో ప్రవేశం కల్పించి ఉన్నతస్థానాలిచ్చారు. వారి సంపర్కంలో రాజులే దేవాలయాలని విగ్రహాలతో సహా ధ్వంసం చేసారు. ఆసమయంలో తురుష్కహర్షుడు(తురుష్కులను పోషించాడు) అన్న రాజు యొక్క మంత్రి చంపకుడన్నవాని కొడుకు కళ్యాణుడు, తండ్రి ఆనతితో కశ్మీరరాజుల చరిత్రను రాయసాగాడు. తండ్రి కొంతరాసి మిగతా చరిత్రను దేశమంతా తిరిగి విషయాలు సేకరించి నిజాన్ని నిష్పక్షపాతంగా రాయమని చెప్పాడు. అలాగే అతను దేశమంతా తిరిగి కశ్మీర రాజులకు సంబంధించిన గాథలను సేకరించి ‘కశ్మీరరాజ తరంగిణి’ గా లిఖించాడు. అతని పేరు గూడా సరిగా పలకడంరాని వారివల్ల ‘కళ్యాణుడు’ అన్నఅతని పేరు ‘కల్హణుడు’ గా మారింది. ఈతను 11వ శతాబ్దానికి చెందినవాడు. ఏ రాజాశ్రయం లేకుండా సొంతంగా లిఖించాడు ఈ గాథలను. విదేశీయుల దురాగతాలను అనుభవించి రాసాడు. ఒకప్పుడు వైదికధర్మంతో విలసిల్లిన కశ్మీరం కాస్తా ఇప్పుడు కల్లోల కాశ్మీరంగా మారిపోయింది. దీనికి కారణం మన రాజకీయనాయకులే.
ఇంతటితో ‘దివినుండి భువికి దిగిన దేవతలు’ అన్నఈ వ్యాసపరంపర సమాప్తం. ఈ వ్యాసాల్లో నాసొంత తెలివితేటలుపయోగించలేదు. అన్నీ పుస్తకాలు చదివి సేకరించిన విషయాలే. బాగుంటే ఆనందించండి – ఇలాటి గొప్ప సంస్కృతి మనకు ఉందని.
ఈ రచనకు సహకరించిన గ్రంథాలు :
తెలుగు:
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీ 2002 ‘గంగావతరణం’ రాగరాగిణి ప్రెస్, మైసూర్.
- గోవింద దీక్షితులు, మల్లాది, శ్రీ పాద శ్రీవల్లభచరితామృతం, సంసృతమూలం – శంకరభట్టు- శ్రీ పాద శ్రీవల్లభమహాసంస్థానం – పిఠాపురం.
- మురళీకృష్ణ, కస్తూరి, కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, ఎమెస్కో హైదరాబాద్.
- విశ్వనాధ శాస్త్రి, సరిపెల్ల, శ్రీ దేవి భాగవతం( వచనం) శ్రీ రామాపబ్లిషర్స్, హైదరాబాదు.
- విశాఖ, సనాతన ధర్మం. 1997. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి వారి తమిళ ఉపన్యాసములకు అనువాదము). గురుకృప,చెన్నై.
- వెంకట రమణయ్య, బులుసు: మహాభాగవతం(వచనము). ఎడ్యుకేషన్ పబ్లిషర్స్, కర్నూలు.
- వెంకటాచలం,కోట, బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం , ఆర్షవిజ్ఞాన ట్రస్ట్, హైదరాబాద్.
- వేంకటానందరాఘవరావు, గబ్బూరి 1954 నక్షత్రములు, సరస్వతీ పవర్ ప్రస్, రాజమహేంద్రవరము.
- వేంకట కృష్ణమూర్తి, కుప్పా, యోగవాసిష్ఠహృదయము, రాగరాగిణీ ట్రస్ట్, మైసూర్.
- శివానందమూర్తి, కందుకూరి, అనంతకాలచక్రం, శివానందసుపధ ఫౌండేషన్, తాడేపల్లి గూడెం.
- శ్రీనివాసశాస్త్రి, రాణి, భారతీయ ప్రాచీన విజ్ఞానం, భారతీయ రసాయనశాలా, విజయవాడ.
- సూర్యసుందరం, పింగళి, వేదములు (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి తమిళ ఉపన్యాసములకు అనువాదము). కంచి శ్రీమహాస్వామి శతాబ్ది ప్రచురణలు- గురుకృప,మద్రాసు.
English:
- Sivananda Murty, K., 2014. Structure of the Universe (Vedic) Viswaroopa, Sivananda Supatha Foundation, Bheemunipatam.