[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 8వ భాగం. [/box]
34
[dropcap]శ్రీ[/dropcap]కాంత్ ఇంట్లోకి వస్తూనే, “అమ్మా… నాన్నా…” అంటూ బిగ్గరగా పిలిచాడు. ఏం జరిగిందోనని ఆదుర్దాగా శ్రీకాంత్ దగ్గరకి వచ్చారు అమ్మానాన్న. ఇంట్లోనే వున్న చెల్లి కూడా అక్కడకు చేరింది.
“అమ్మా… నాన్నా… ఒకసారి మీరిద్దరూ ఇక్కడ నిల్చోండి” చెప్పాడు శ్రీకాంత్. కొంచెం ముందుకు వచ్చి నిల్చున్నారు వాళ్ళు. మోకాళ్ళపై కూర్చుని ముందుకు వంగి ఇద్దరి కాళ్ళకు నుదురు ఆనించి నమస్కారం చేస్తూ “నన్ను దీవించండి నాన్నా… అమ్మా నువ్ కూడా” అని అలాగే వున్నాడు.
విషయం తెలియని వాళ్ళిద్దరూ… “దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబూ” అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. లేచి నిల్చుని తన జేబులో వున్న చెక్కును అమ్మా… నాన్న చేతుల్లో పెట్టాడు శ్రీకాంత్. వాళ్ళు చెక్ వైపు తేరిపార చూశారు.
తన జీవితంలో తన పేరుమీద లక్ష రూపాయల చెక్కును ఇంత వరకూ చూడని తండ్రి, శ్రీకాంత్ పేరుతో వ్రాయబడి ఉన్న లక్ష రూపాయల చెక్కును చూసి, కళ్లు తేలేసి,
“ఏంట్రా ఇదీ….? లక్ష రూపాయల చెక్కు… అదీ నీ పేరు మీద… అసలేం జరిగింది?” అని గాబరా పడుతూ అడిగాడు.
“ముందు మీరు కూర్చోండి” అని వాళ్ళని కూర్చోపెట్టి “అసలేం జరిగిందంటే…” అని మొదలుపెట్టి… యన్.టి.ఆర్ స్టేడియంలో సదానంద్ గారితో పరిచయం అయిన దగ్గర నుండి ఈరోజు వరకు జరిగిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీకాంత్.
విషయమంతా విన్న శ్రీకాంత్ తల్లిదండ్రులు, చెల్లి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆనందాతిశయంలో మునిగితేలారు.
“చూసావా… శ్రీకాంత్… ఇది ఎంత విచిత్రమైనదో… ఏ టైం కి ఏం జరుగుతుందో మనమెవ్వరం ఊహించలేం… ఇక నీకు మంచి రోజులు వచ్చినట్టే. చాలా సంతోషం బాబూ! పెద్ద వాడివయ్యావు… మంచేదో చెడేదో అర్థం చేసుకోగలవు. ప్రతీ విషయంలో జాగ్రత్తగా అలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపో…” చెప్పాడు శ్రీకాంత్ తండ్రి.
“అవును బాబూ!… ఆ భగవంతుడి దయ వుంటేనే మనకేదైనా మంచి జరుగుతుంది. త్వరగా అందరూ తయారవండి… గుడికెళ్ళి భగవంతుని దర్శించుకొని, పూజలు చేయించి, ఆ పరమాత్ముడి ఆశీర్వాదాలు తీసుకుందాము. పదండి. రెడీ అవ్వండి” చెప్పింది శ్రీకాంత్ తల్లి.
అందరూ తయారయే పనిలో పడ్డారు.
35
అక్కడ శ్రీలక్ష్మి కూడా ఇంట్లో తమ కోసమే ఎదురుచూస్తున్న అమ్మా… తమ్ముడి దగ్గరకు వచ్చింది. ముందుకు వంగి అమ్మ కాళ్ళకు నమస్కరించి…
“అమ్మా! నన్ను దీవించమ్మా” అంది.
“భగవంతుడు నీకు అన్ని విధాలా మంచి చేయాలమ్మా…” అని దీవించి, “ఏంటమ్మా ఉన్న పళంగా దీవించమని అడిగావు… ఏవైనా విశేషమా?” కుతూహలంగా అడిగింది.
“అవునమ్మా! విశేషమే…” అంటూ పర్సులోని చెక్కును తీసి, అమ్మ చేతుల్లో పెట్టి…
“ఇది లక్ష రూపాయల చెక్కు… నా పేరు మీద… మన ముగ్గురి కోసం” అని నింపాదిగా చెప్పింది.
“ఏంటమ్మా… నువ్ చెప్పేది… లక్ష రూపాయలా… నాకేదో భయంగా వుందమ్మా…! అసలేం జరిగింది?”
“నే చెప్తాగా… ముందు మీరు కూర్చోండి” అని వాళ్ళను కూర్చోబెట్టి బుక్ ఫెయిర్‌లో సదానంద్ గారితో పరిచయం అయిన దగ్గర నుండి నేటి వరకు జరిగిన అన్ని విషయాలను ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పింది.
“ఏమోనమ్మా! ఇదంతా వింటుంటే నాకేదో భయంగా వుందమ్మా… మనమా… ఎవరి విషయాలు పట్టించుకోకుండా గుట్టుగా బతికేవాళ్ళం… పైగా ఈ మధ్యనే టీవీలో చూస్తున్నాం… సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు జరుగుతుంతాయట!… మరి అక్కడ నువ్వెలా నెగ్గుకు రాగలవమ్మా?”
“మరేం పరవాలేదమ్మా… నా అంతట నేనుగా… సినిమాల్లో నటిస్తానని, నాకు అవకాశాలు ఇవ్వండని ఎవరి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడడం లేదు. ఆ అవకాశం దానంతట అదే నా దగ్గరకు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. భగవంతుడే నా భవిష్యత్తును అలా వ్రాసి పెట్టాడమ్మా… నువ్వు లేని పోని అనుమానాలతో భయపడి, నన్ను భయపెట్టకు.. అంతగా అక్కడ నాకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మానేసి వస్తాను. సరేనా… అమ్మా!” అంటూ వాళ్ళమ్మకు ధైర్యం నూరిపోసింది శ్రీలక్ష్మి.
“సరేనమ్మా… ఏది ఏమైనా నీ జాగ్రత్తలో నువ్ ఉండాలమ్మా… అన్ని వేళలా నీకు రక్షగా వుంటూ కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” చెప్పింది కొంచెం ధైర్యం పుంజుకున్న శ్రీలక్ష్మి వాళ్ళమ్మ.
“సరే… ఈ రోజు మన ముగ్గురం కలిసి గుడికెళ్దాం… మనకు మంచి రోజులను ప్రసాదిస్తున్న ఆ దేవుడికి పూజలు చేద్దాం. పదండి… తయారవండి” చెప్పింది శ్రీలక్ష్మి.
కలలో కూడా ఊహించని ఈ సంఘటనలతో కలిగిన ఆశ్చర్యం నుండి తేరుకుని ఆనందంలోకి చేరుకుని గుడికి వెళ్ళడానికి తయారవుతున్నారు వాళ్ళు ముగ్గురు.
36
ప్రస్తుతానికి ఈ విషయాన్ని అందరికీ చెప్పవద్దనుకుంది శ్రీలక్ష్మి. కాని జాబ్‍లో తనకు ఎంతగానో అండగా నిలిచిన సుజాతక్కకు, కష్టకాలంలో తనకు జాబ్ ఇచ్చి ఆదుకున్న ప్రొప్రయిటర్ గారికి మాత్రం చెప్పాలనిపించింది. అందుకే ఆదివారం షోరూమ్‌కి వెళ్ళి సుజాతక్కకూ, ప్రొప్రయిటర్ గారికి తనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందనీ, రేపటి నుండి తాను జాబ్‌కి రాలేనని చెప్పింది. సుజాతక్కకు, ప్రొప్రయిటర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. వాళ్ళిద్దరూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి, అప్పుడప్పుడూ వస్తూండమని కోరారు. చివరగా ప్రొప్రయిటర్ గారు… సన్నని బంగారు గొలుసును… అదే రోజూ తను యూనిఫాంతో పాటు వేసుకునే గొలుసును శ్రీలక్ష్మికి బహుమతిగా గుర్తుగా ఇచ్చారు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని భారంగా అడుగులు వేస్తూ, బరువెక్కిన హృదయంతో షోరూం బయటకు వచ్చింది శ్రీలక్ష్మి.
37
మహేంద్ర, లావాణ్య సోమవారం నుండి ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు. సదానంద్ చెప్పిన విషయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ, నటనలో అవగాహన పెంచుకోవటమే కాకుండా అందులోని మెళకువలు తెలుసుకున్నారు. డాన్స్‌లు, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. మొత్తానికి సినిమా ఇండ్రస్ట్రీలో ఇమడగలమనే నమ్మకం వారికి కలిగింది. మరే యితర విషయాలపై ఆలోచనలు మరల్చకుండా, నటనపైనే దృష్టి సారిస్తూ, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు వాళ్ళిద్దరూ. సదానంద్, మిగతా డిపార్ట్‌మెంట్ హెడ్స్ వాళ్ళిద్దరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, వాళ్ళకు మార్గదర్శకులుగా ఉన్నారు. సదానంద్ గారు చెప్పిన పెరుగుతో భోజనం అనే చిట్కాతో వాళ్ళ గొంతులు సవరించబడ్డాయ్. దానికి తోడు, ఆరోహణా, అవరోహణా క్రమంలో డైలాగులు చెప్పడంలో, పదాల ఉచ్చారణలో తర్ఫీదు తీసుకున్నారు. కెమెరా ముందు నటించే విషయంలో, శరీర భాగాల కదలికలు, ముఖకవళికలు, ఆహార్య ఆంగికంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక షూటింగ్‌లో పాల్గొనడమే తరువాయి. నిజానికి చేసే పనిలో ఏకాగ్రతతో లీనమైతే టైమే తెలియదు. రోజులు గడుస్తూనే వున్నాయ్. నెలరోజులు కాలగర్భంలో కలిసిపోయాయ్. రేపే మొదటి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం. ఆఫీసులో అందరూ బిజీ బిజీగా ఏరాట్లలో మునిగిపోయారు. మహేంద్ర, లావణ్యలు కూడా అందరితో కలిసిపోయి ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్నారు.
38
ఉదయం నుండే ఆఫీసులో హడావిడి మొదలైంది. రాత్రికి రాత్రే ఆఫీసును పచ్చ తోరణాలతో, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. పదకొండు గంటలకు పూజా కార్యక్రమం. పన్నెండు గంటలకు ముహూర్తపు షూటింగ్. ఒంటిగంటకు విందు భోజనం. ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయ్… చెప్పాలంటే, అక్కడ ఓ పండగ వాతావరణం నెలకొంది.
ఆఫీసు స్టాఫ్, నటీనటులు, డిపార్ట్‌మెంట్ హెడ్స్, చిత్ర బృందం, అందరూ చక్కగా ముస్తాబై వచ్చారు. అన్నీ తానై చక్కబెడుతూ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు సదానంద్. ఇవాల్టి కార్యక్రమం ముఖ్య అతిథి, సదానంద్ గురువు, డైరక్టర్ విశ్వం గారి కారు వచ్చి ఆఫీసు ముందు ఆగింది. విషయం తెలుసుకున్న సదానంద్ పరుగు పరుగున వెళ్ళి విశ్వంగారికి పూలగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికాడు. అందరూ కలిసి పూజగదికి చేరుకున్నారు.
పురోహితులు వేదమంత్రోచ్చారణలతో గణపతి పూజ, లక్ష్మీదేవి పూజ, సరస్వతీదేవి పూజ, నటరాజ స్వామి పూజలను నిర్వహించారు. చర్చి ఫాదర్ క్రీస్తు మహిమలను స్తుతించి ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు అల్లాను ప్రార్థించి ఆశీర్వాదాలు ఇచ్చారు.
ముహూర్తం షాట్ కోసం సెట్ రెడీ అయ్యింది. యన్.టి.ఆర్. స్టేడియం, బుక్ ఫెయిర్ స్టాల్ నెంబర్ 123లో ‘ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది’ అనే పుస్తకంపైన సదానంద్, మహేంద్ర, లావణ్య, ముగ్గురు కలిసి ఒకేసారి చేతులు వేయడమనేది షాట్. షాట్ రెడీ. విశ్వం గారు క్లాప్ కొట్టి ఆ సీన్‌ని డైరక్ట్ చేశారు. టేక్ ఓ.కే. అయింది.
కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, స్నేహితులు, శ్రేయోభిలాషులూ, అందరూ సదానంద్‌కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆహ్వానితులందరూ భోజనాలు ముగించుకుని వెళ్ళిపోయారు. విశ్వంగారు వెళ్ళడానికి బయలుదేరుతూ…
“ఆ! సదానంద్!! డిస్ట్రిబ్యూటర్స్ గురించి, థియేటర్స్ అవైలబిలిటీ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్ మాత్రం సినిమా మీదనే పూర్తిగా దృష్టి పెట్టు. ఇది నీ మొదటి చిత్రం. ఇది నీకు మోస్ట్ సక్సెస్‌ఫుల్ డిబట్ మూవీ అవ్వాలి. ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
“మీ మాటలు నాకు ఏనుగంత బలాన్నిచ్చాయ్ సార్! ఆ మాటల్తో నా సక్సెస్ మరెంతో దూరం లేదనిపిస్తుంది సార్. థాంక్యూ సర్” అంటూ విశ్వం గారి కాళ్ళకు నమస్కరించాడు సదానంద్.
మర్యాదపూర్వకంగా విశ్వం గారిని కారు దాకా సాగనంపి వచ్చాడు సదానంద్. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చేసారు. ఇంతలో…
“సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ హాల్‌లో మీటింగ్ వుంటుంది. అందరూ హాజరు కావాలి” అని అనౌన్స్ చేశారు ఆఫీసు మేనేజర్.
39
సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. మీటింగ్ హాల్‌లో అందరూ సదానంద్ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే హుందాగా నడుచుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చున్నాడు సదానంద్. కార్డ్‌లెస్ మైక్రోఫోన్‌ని ఆన్ చేసి, మైక్ టెస్టింగ్ చేసుకుని తన ఉపన్యాసాన్ని గంభీరంగా ప్రారంభించాడు.
“మిత్రులారా! ఈ రోజు కోసమే మనమంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాము. ఈ రోజు మనందరి జీవితాలల్లో ఒక మరపురాని మైలురాయి. ఈరోజు మనందరి భవితవ్యాలను నిర్ణయించే రోజు.
మీ అందరికీ తెలుసు… నేను కోట్లు సంపాదించాలని ఈ సినిమా ఇండస్ట్రీకి రాలేదు. కేవలం సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక సినిమాలు తీయాలనే వచ్చాను. నిజానికి అలాంటి సినిమాలు తీయాలన్నదే నా జీవిత లక్ష్యం. లక్ష్య సాధన దిశగా నేను అడుగులు వేస్తూంటే, నాతో పాటు కలిసి నడవటానికి నాకు తోడుగా నిలబడడానికి మీరందరూ వచ్చారు. మనమందరం కలిసి నా డ్రీమ్ ప్రాజెక్టు అయిన మూడు సినిమాలను వరుసగా తీయబోతున్నాం… మరో చరిత్ర సృష్టించబోతున్నాం.
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి చిత్రం ‘భక్త ప్రహ్లాద’. అదొక బ్లాక్ అండ్ వైట్ మూకీ చిత్రం. మరుగుజ్జుగా వామన రూపంలో ఉండే ఆ స్థాయి నుండి, ఈ రోజు తెలుగు సినిమా, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, విశ్వమంతా వ్యాపించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. ఇంతటి ఘనకీర్తి వెనకాల ఎంతోమంది రచయితలు, నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, కళాదర్శకులు, ఛాయాగ్రహ దర్శకులు, నృత్య దర్శకులు, సాంకేతిక నిపుణులు… వీరందరి కఠోర శ్రమ, అవిరళ కృషి, సడలని పట్టుదల, అంకిత భావం, త్యాగనిరతి దాగి ఉన్నాయ్.
మరి ఈ స్థాయికి చేరిన తెలుగు సినిమా పేరు ప్రఖ్యాతులను ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళడం మన మరియు మన సమకాలీనుల ముందున్న ఒక గురుతర బాధ్యత. ఆ ప్రతిష్ఠాత్మకమైన బాధ్యతలో పాలుపంచుకోవడమనేది మనందరి అదృష్టం. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన వరం.
ఇక మన ప్రాజెక్టు గురించి చెప్పుకుందాం. ‘ఒక్క పుస్తకం మీ జీవితాన్ని మార్చేస్తుంది’… ఇది మన మొదటి సినిమా. అది తీయడం పూర్తయే లోపే మనం రెండో సినిమా, రెండో సినిమా తీయడం పూర్తయే లోపే మన మూడో సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ మూడు సినిమాల విజయ పరంపరతో మనం హ్యాట్రిక్ సాధించబోతున్నాం” అని ఆవేశపూరితంగా చెప్పుకొచ్చాడు సదానంద్.
సదానంద్ మాటలకు కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో అక్కడ ఉన్న వారందరూ ఆపకుండా కొట్టిన చప్పట్లకు హాలంతా కాసేపు దద్దరిల్లి పోయింది. సద్దు మణిగిన తర్వాత తిరిగి మాట్లాడుతూ…
“ఎవరైతే నిరంతరం ఉత్సాహంతో ఉంటారో, వారు మాత్రమే ఏ కార్యాన్నైనా సాధించగలరని మన పెద్దలు చెప్తుంటారు. మరి ఈ రోజు ఉత్తుంగ తరంగాల్లా ఎగిసిపడుతున్న మీ ఉత్సాహం చూస్తుంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అనుకున్నది తప్పక సాధించగలననే నమ్మకం కలిగింది. ఇప్పుడు మనందరి లక్ష్యం ఒక్కటే కావాలి. ఆ లక్ష్య సాధనే మనందరి యొక్క బలీయమైన కోరిక కావాలి. మరి ఆ కోరిక నెరవేరాలంటే కేవలం ఆశ ఉంటే సరిపోదు. సంకల్పం, యస్, సంకల్పం కావాలి. సాధారణ సంకల్పం కాదు… సత్సంకల్పం కావాలి… దృఢ సంకల్పం కావాలి. అలాంటి సంకల్పానికి ఉన్న మహత్తర శక్తి మనల్ని విజయం వైపు పరిగెత్తిస్తుంది. ఇప్పుడు మనందరం అలాంటి సంకల్పాన్ని మనసుల్లోనే చేద్దాం. రెండు నిమిషాలు మౌనంగా కూర్చుని… ఏకాగ్రచిత్తులుగా అయి, భగవంతుడిని ధ్యానించి, మన ప్రాజెక్టు విజయం కోసం సంకల్పం చేద్దాం” అని తెలియజేశాడు సదానంద్.
అందరూ రెండు నిమిషాలు మౌనముద్రలో కూర్చుని దృఢ సంకల్పం చేశారు.
“థాంక్యూ ఆల్! ఆఁ… ఇవాల్టికి రెస్ట్ తీసుకోండి. రేపటి నుండి మన షెడ్యూల్స్ మొదలవుతాయ్. లెట్ అజ్ ఆల్ డూ ఇన్ సీరియస్ యాక్షన్ ఫ్రమ్ టుమారో… బై” అంటూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ తన క్యాబిన్ వైపు నడిచాడు సదానంద్. సదానంద్‌తో పాటు అందరూ హాల్ బయటకు నడిచారు.
(ఇంకా ఉంది)