అనుబంధ బంధాలు-20

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 20వ భాగం. [/box]

[dropcap]ప్రొ[/dropcap]ద్దు పొడవలేదు. ప్రొద్దు పొడిచేందుకు ఇంకా టైం ఉంది. ధశరథానికి మెలకువ వచ్చింది. లేచి బయటకొచ్చాడు. బుడతడి జాడ కనిపించలేదు. గుఱకొయ్యల వైపు చూసాడు. తెల్లారవస్తుంది.

‘మరి వీడింకా రాలేదేం?’ అనుకొని ‘సీతా’ అని పిలిచాడు.

“వస్తున్నా లేచాను” అంది.

‘బుడతడింకా రాలేదు? వాని కోసం వెళ్ళి వస్తాను’ అన్నాడు.

‘అలాగే.’

రాకున్నా ఫరవాలేదా? అడిగాడు నడవబోయి.

‘రాని నాడు ఏం చేస్తున్నాం గనుక’ అంటూ బయటకొచ్చింది.

“పని నమ్మకముగా చేస్తామని ఖరారు చేసుకొని వారి కోరికలను మొదటే తీర్చేసుకొని ఏడాది పొడగునా ఇలా ఎందుకు చేస్తారో? అసలు వారి మానసిక స్థితి ఏమిటో అర్థం గాదు. మనతో ఖరాలు నామ ఉంది గనుకనే వస్తున్నారు” అంది.

“రాని నాడు…”

“మనం చేసుకోవడమే!”

‘మనం చేసుకోగల్గితే వాళ్లెందుకు?’

‘మనం మనుషులం. ఈ శరీరానికి అనేక ఋగ్మతలతోపాటు లాలసతలూ ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టి ఆగుతారు. ఇష్టం కాని నాడు అంతే వారి చేత నున్న ఆయుధం అది మనం చేయి గల్గిందేముంది?’

‘మనకు జరిగే నష్టం మాట?’

ఆ భగవంతునికే తెలియాలి’ అని ఒకింత ఆగి ‘ఆయనకే సంగతి అర్థం గాక అనేక అవతారాలెత్తాడు మన సంగతి పట్టించుకునే వాడెవడు?’ అంది నవ్వుతూ.

‘వెళ్తాను’ అన్నాడు దశరథం.

‘నేనెందుకు కాదంటాను’ అంది ఇంకొంచం పెద్దగా నవ్వి.

‘అవును’ అనడం ఇష్టం లేదనే గదా!

“పాఠాలు చెప్పే వృత్తిలో బాగా పేరు గడించిన వారు మీకు అర్థమయిన విధానంలో నేనేం చెప్పగనలను?” అంది.

నాల్గడుగులు వేసినవాడు ఆగి వెనక్కి వచ్చి ‘సీతా నన్ను వెళ్ళొద్దన్నావా?’ అన్నాడు భజం పై చేయి వేసి ఎదురుగా మలుపుకుంటూ…

‘ఇవ్వాళ్ళ పెళ్ళి వారొస్తారు… గుర్తుంది గదా! బుడతడిని రోజుటి కంటే కొంచెం ముందుగా రా రా బాబూ అని చెప్పాను. లంచంగా పావలా బిళ్ళ కూడా ఇచ్చాను.వాడు ఇప్పటికి రాలేదు. మనం వెళ్ళినా వస్తాడనే నమ్మకము లేదు. ఎందుకు ఇవ్వాళ్ళ రావడం లేదు అనేది తెల్సుకునేందుకేగదా మనం వెళ్ళేది? అవునా? అది వాడు వచ్చిన నాడు చెప్తాడు గాదా’  అంది పనిలోకెళ్ళెందుకు చెంగు బిగిస్తూ.

తల ఊపాడు దశరథం.

అంతందూరం వాడి కొంప దాకా కాళ్ళీడుచుకుంటూ వెళ్ళే కంటే పొరక పట్టుకుంటే పొద్దు పొడచే సరికి పని అయిపోతది గదా!

అనుకొని కొష్టం వైపుగా నడచాడు.

ఎందరికో పద్దతిగా చదువు నేర్పిన భర్త ఊగిసలాట చూసి నవ్వుకొని లోనకెళ్ళింది సీతమ్మ.

నిజంగానే పొద్దు పొడుపుతో పాచి పని పూర్తయింది.

కళాపి చల్లి ముగ్గేసి పాలు పితికి ఇన్ని కాఫీ దశరథరామయ్య కిచ్చింది. కాఫీ త్రాగుతూ కూర్చుని… ‘సీతా ఈ మాత్రం దానికి ఇన్నేళ్ళ నుంచీ పని పిల్లాడ్ని ఎందుకు పెట్టుకున్నట్లు?’ అనడిగాడు.

నవ్వింది సీతమ్మ.

నవ్వి ఆగలేదు “పశువులున్నయి గదా, వాటిని ఇడవాలి” అంది.

‘ఆఁ, అవును అదొక టుంది గదూ.’

“ఉండడం కాదు అది చేసేందుకు మీకు టైం దొరకదు.”

‘మరి.’

‘జంగిరిగొడ్లు కాసే రాములయ్య ఉన్నాడు గదా బుడతడు వచ్చిందాక ఈ పని అతనికి చెప్పండి ఉళ్ళోని పశువులతో పాటు వీటిని తొలుకొనిపోతాడు.’

‘అతని దగ్గరికయినా వెళ్ళాలి గదా!’

‘అవసరం లేదులెండి. జంగిరి మందను తోలుకుని ఇటే వస్తాడు. అప్పుడు చెబితే చాలు బంగారంలా తొలుకెళ్ళుతాడు. మనం వీటిని కాసేందుకు ఇచ్చేవి అతనికి అదనం ఆదా. అంచేత జాగ్రత్తగా కాసుకొస్తాడు’ అంటే అని మంచం నుంచి లేచాడు.

‘నాన్నగారు’ అన్న విజయ మాట వినిపించింది.

‘ఆఁ లేచావా మొఖం పుల్ల ఇవ్వనా? బ్రష్ చేత పడతావా?’ అన్నాడు. “ఏదో ఒకటి చేస్తా గానీ మీ కాఫీ కార్యక్రమము కూడా పూర్తయినట్లుంది?” అంటూ ప్రక్కకి వచ్చికూర్చుంది.

‘ఇచ్చేవాళ్ళుండాలి గానీ కాఫీ త్రాగాడానికేమమ్మా?’

‘అమ్మకు మా పైన అంత శ్రద్ధ’ అంది నవ్వి.

‘ఇదోగో నా పైన శ్రద్ద అనుకునేవు. కాదు ఆవిడకు పాలు పితకగానే కాఫీ త్రాగే అలవాటుంది. నేను మెలకువగా కనిపించాను గనుక నాకు ఇన్ని పోసింది. ఓ పని అయిపోయినట్లు అవుతది.’

‘అంతేనంటావా?”

‘నువ్వు అంత ఖచ్చితంగా అడుగుతుంటే చెప్పాల్సి వస్తుంది. లేకపోతే బావుండదు’ అని సీత వైపు వొక సారి చూసి విజయ వైపు మళ్ళి ‘అమ్మ మేం చాలా కాలంగా కలసి బ్రతుకుతున్నాం. ఆవిడకు ఎప్పుడు ఏం కావాలో ఎలా ప్రవర్తించుతుందో నేను ఎప్పుడెప్పుడు ఎలా ఉంటానో మాకు అనుబవం నేర్పింది. దాని కాదనలేంగదా.’

“మొక్కుబడిగా మాత్రమే కాఫీ ఇచ్చానని చెపుతున్నారుగా దానికి” అంది సీతమ్మ దగ్గరగా వచ్చి.

 “ఇదిగో కొప్పడకు, ‘పేమ’ అనేది అంత స్థిరమైంది గాదు. కానీ ఉండాలి ఉంటుంది. భార్యాభర్తలలో మాత్రం ఎంతో కొంత వదిలక మిగిలి ఉంటుంది.”

“కొత్త కాపురాలపుడు ఈ ప్రేమ కోరిక శరీరాల ఆకర్షణపై ఆపేక్ష చూపుతుంది. మామూలుగా మనం దీన్ని కూడా ప్రేమ అంటాం. కాలమగనములో పిల్లలవుతారు. కోరిక యొక్క వేగం క్రమేణా తగ్గుతది.

పిల్లలపై మమకారం, వార్ని కాపాడుకోవడం లాంటి బాధ్యతలు ఉమ్మడి బాధ్యతలవుతయి. మానసికంగా కోరిక వడి తగ్గినా ‘వేళయినా ఈయినింకా రాలేదే? రోడ్డున పడితే ఈ మగాళ్ళకు ఇంటి ద్యాస ఉండదు అనుకుంటునే ఆవేళ ఎదురు చూస్తారు. వచ్చాక మామూలే. అలవాటుగా కలిసి ఉంటుంటారు. మొక్కుబడిగా మాటాడుకోవడం చేస్తారు. పిల్లల పట్ల మాత్రం ఇద్దరూ శ్రద్ద వహిస్తారు. ఇక్కడ వీరికి మళ్ళీ కొత్త బంధం బిగుసుకుంటుంది’ అని సీత వైపు చూసి నీకు ఎక్కడైనా తేడా అనిపిస్తే చెప్పు సరి చేసుకుంటాను” అన్నాడు.

‘నాకంతగా తెలీదు అయినా నేను వినడం లేదు’ అంటూ లేచింది.

తెలియని విషయాన్ని నేను తెలియదు అని స్పష్టంగా చెపుతాను. అలా చెప్పడం మంచి పద్దతి.

“అమ్మా నాన్నగారు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు, నువ్వు మాట్లాడవేం?” అంది.

‘అమ్మా, ఆయన బడిపంతులు. ఎలాగయిన చెప్పగలడు. నువు మొదట మొఖం కడుక్కో. తలారా స్నానం చేద్దువుగాని’ అంది చికాకుగా ధశరథం వేపు చూసి.

“ఇవాళ తలంటు వారం కాదుగా నాన్నగారు” అంది విజయ, ఈ విషయంలో నాకు మీ సపోర్టు కావాలి అన్నట్లుగా.

‘అమ్మ చెప్పినా, గురువు చెప్పినా వినడం పిల్లల కర్తవ్యం’ అన్నాడు దశరథం నవ్వుతూ.

“అమ్మకు జడిసి జారిపోతున్నారు గదూ” అంది ఉడికించాలని.

“మంచి జరిగేటప్పుడు పట్టుదల లెందుకు?”

“నేను ఇవ్వాళ్ళ తలంటుకుటే జరిగే మేలేంటి?”

“మీ అమ్మనడుగు. ఏదో లేంది ఎందుకు చెపుతుంది?”

“పెళ్ళివారొస్తారుగానీ అయ్యా కూతుళ్ళు నన్ను విసిగించకండి. పైగా కాస్తా కూస్తా పని అందుకునేందుకు బుడతడు రాలేదు” అంది.

“అదిగో విశేషం ఉంది. నిన్ను అందంగా కనిపించేలా చూడడం అవిడ బాధ్యత గదా.”

“దీక్షితులు మామయ్య రాలేదేం నాన్నా?” అంది విజయ.

“మీరు కొంచెం దీక్షితులు అన్నయ్య ఇంటికి వెళ్ళి రండి” అంది సీతమ్మ.

“మంచిది వెళ్తానోయ్” అని లేచాడు, నడిచాడు.

***

వచ్చిన దశరథాన్ని చూసి శాంతమ్మ కూర్చోమంది.

“ఉన్నాడా?” అడిగాడు.

“పూజారయ్య దగ్గరికెళ్ళాడేమో” అంది.

“కావచ్చు” అని గబగబా వెనక్కి మళ్ళాడు. ఆలయం దాకా తలైనా ఎత్తకుండా నడచాడు. నిజంగానే అక్కడ కనిపించాడు దీక్షితులు,

గుడి మెట్లెక్కి దీక్షితులు పక్కకు చేరుతూ పూజారయ్యకు నమస్కారం చెప్పాడు.

“ఓఁ అయితే మీరూ వచ్చారన్నమాట” అని కూర్చునేందుకు చోటు చూపాడు.

అప్పటికే వారు మాట్లాడుకుంటున్నారు.

“నేనూ ఒకసారి వీర్ని కలసి వద్దామనిపించి ఇటుగా వచ్చాను” అన్నాడు దీక్షితులు. తల ఊపాడు దశరథం.

“బ్రహ్మరథం పట్టారు అంటే గొప్పగా కీర్తించారు గానీ, బ్రహ్మ దేవుని వాహనం హంస గనుక అది రథాన్ని గుంజుతుంటే బ్రహ్మ దానిపై కూర్చోని ఉంటాడనీ గానీ బ్రహ్మ ఎక్కాడు గనుక ఆ రథాన్ని బ్రహ్మ రథమని గాని అనే వీలు లేదు” అన్నాడు పూజారయ్య.

బ్రహ్మరథం పైన ఏదో చర్చ జరుగుతుందన్న మాట అనుకున్నాడు దశరథం.

“మరి బ్రహ్మరథం అనేది ఇలా వాడుకలోకి ఎందుకు వచ్చినట్లు?”

“పొద్దుటే ఇలా సాగదీస్తావేమిటి సంగీతము చేత, బేరసారములుడిగెన్ అంటూ నీ మీమాంసతో కుస్తీ పడుతూ దైవకార్యానికి న్యాయం చేయలేనేమో” అన్నాడు పూజారయ్య కొంచెం నొచ్చుకుంటూ.

“అయ్యా నాకు అనుమానం వచ్చిందే పో, నివృత్తి అయిందాకా మనస్సు చాలా చంచలంగా నడస్తది. పాదులో ఉండదు. నేను తమ దగ్గరికి వచ్చిందీ మా విజయ పెళ్లి చూపులు ఉన్నాయి గనుక మిమ్మల్ని కూడా ఆహ్వానిద్దామని వచ్చాను.”

“ఇవ్వాళ్ళనేనా?” అని ఏవో లెక్కలు కట్టి “శుభం బాగానే ఉంది పో” అన్నాడు.

“మీరు వస్తున్నారా?”

“వస్తాను” అని,  “బ్రహ్మదేవుని వాహనం హంసే అయినా ఆయన హంస వాహనుడు అని పిలిపించుకున్నా దీనికి మన శబ్దరత్నాకరంలో ఎనిమిది అర్థాలు చెప్పారు. ఒకటి అంచ, రెండు యోగవిశేషము, మూడు ఆత్మకు సంభందించిన పరమాత్మ, నాలుగు శ్వేతశ్వము, అయిదు మంత్ర విశేషము, ఆరు శరీర వాయువిశేషము, ఏడు మాత్సర్యము, ఎనిమిది శ్రేష్ఠమైనది ఉత్తమైనది అని అర్థము. ఇక కొందరు మతాధిపతులు, మహాయోగులు అంటే పరమహంసలు వారు ఎక్కే పల్లకిని ఈ హంసలు మోస్తుంటాయట.

శ్రీ జగద్గురు శంకరుడు ఊరేగింపు పల్లకిని సత్ బ్రహ్మణులు మాత్రమే మోస్తుంటారు గనుక బ్రాహ్మణులు మోసేది కనుక దీనికి బ్రహ్మరథం అని పేరు వచ్చినట్లుగా చెపుతారు.

దీనికి ఇంకొ వివరణ కూడా ఉంది. ఇహాన్ని చాలించిన, సర్వ సంగ పరిత్యాగులైన సన్యాసులను మోసెడి వాహనమును కూడా బ్రహ్మరథము అని పిలుస్తారు.

అంటే శవవాహిక అన్నమాట.

దీన్నే మనం పాడే అంటాం” అన్నాడు నవ్వుతూ.

“ఆఁ ఆఁ మరో విధంగా కూడా చెప్పినట్లు గుర్తు.

దేవరాజు ఇంద్రుడు, అనవాయితీగా మహార్షులు మోసే పల్లకిల ఊరేగేవాడట అంచేత కూడా దీన్ని బ్రహ్మరథం అని అన్నారంటారు. యోగిపుంగవులూ, సన్యాసులూ ఒకానొక కాలంల హంస వాహానాన్ని మోసారట దాన్ని బ్రహ్మ అధిష్టించేవాడట. అంచేత కూడా దీన్ని బ్రహ్మరథం అన్నారని చెపుతారు.

దీనిపైన పంచమవేదంగా బావించి, కీర్తింపబడుతున్న మహాభారతంల ఒక కథ కూడా ఉంది.

నహుషుడు అని పరాక్రమ విక్రమాలు కల్గిన ఓ రాజున్నాడు. ఆయన విజయవంతంగా నూరు యాగాలను పూర్తిచేసాడు. తదుపరి ఇంద్రపదవిని కూడా చేపట్టాడు. ఈయన అంతటితో ఆగలేదు.

ఇంద్రునిగా అధికారం ఏమిట ఎల్ల లోకాలకు తలిసేలా చేయాలనుకున్నాడు అంటే అధికార దర్పం వెర్రితలలు వేసిందన్నమాట. ఇంద్రలకపు సుఖభోగాలల తేలియాడడం ప్రారంబించాక మదమత్సరాలు ఆవహించినయి.

కన్నూ మిన్నూ తోచి చావలేదు. రంభా, ఊర్వశి, మేనక తిలత్తమ పుజకిస్తల లాంటి అప్సరసలు చాలలేదు.

శచీదేవి రూపలావణ్యాలపై వ్యామోహం పెంచుకున్నాడు. కావాలని కోరుకురన్నాడు. అహం పరాకాష్టలో ఉన్న తరుణాన శచీదేవిని పంపమని దేశించాడు కూడా ఈ విపరీతాన్ని చూసిన శచీదేవి భయపడి దిక్కుగానక బృహస్పతి దగ్గరకు చేరి మార్గాంతరం చెప్పమని వేడుకుంది.

“ఇంద్రాజ్ఞను ధిక్కరించరాదు గదా” అన్నాడు. శచీదేవి వళ్ళక తప్పని స్థితి ఏర్పడింది. తనుగా ఆలోచించింది. ఇలా కబురుపంపింది – పల్లకిల ఆయన కూర్చుని మహార్షులు బోయిలుగా వస్తే కోరిక తీరుస్తానని. ఇంద్రపదవిలో అహంకరించి ఉన్న నహుషుడు వెంటనే అగస్త్యాది మహార్షులకు కబురు చేసాడు. తన పల్లకికి బోయిలుగా ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంద్రునితో ఇది తగని పని అన్నాడు. ఈ ధిక్కారాన్ని సహించ లేకపోయాడు ఇంద్రుడు. తన మాట కాదనడమా అంటూ అగస్త్యుల వారి తల పైన తన్నాడు. జరిగిన పరాభవాగ్నికి మహాఉగ్రుడయ్యాడు ఋషి. కొండచిలువగా మారి భూలకంలో సంచరించమని శపించాడు. అంతే అహం దిగిన నహుషుడు కాళ్ళ పై పడి శాపవిమోచన మార్గం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు.

ఋషి కొంత శాంతించి నహుషునిపై జాలిపడి “ద్వాపరయుగంలో ధర్మజుడు నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలడు అప్పుడు నీకు శాపవిమోచన అవుతుంది. అప్పటిదాక ఇంతే… కనిపించిన వాడినల్లా పీడిస్తూ అక్కడ బ్రతకాల్సిందే” అన్నాడు.

నమస్కరించి వెళ్ళిపోయాడు. శాప ప్రభావంతో జీవితం గుడుపుతూ ధర్మజుడు ఎదురుపడి సమాధానం చెప్పాక శాపవిముక్తి పొందాడంటారు. నహుషునిలా అమరావతిల, ఆ తరువాత బ్రహ్మరథాన్ని అదిరహించిన వారు మనకు కనిపించలేదు.

ఏది ఏమైనా పీఠాధిపతులు, ఇంద్రపదవి నలంకరించినవారు బ్రహ్మఋషులు. బ్రహ్మరథంపై కూర్చునడంపోయి కాలగమనంలో గొప్పసత్కారం లేదా గౌరవం పొందిన వారికి బ్రహ్మరథం పట్టారు. అలా పట్టిన దాన్నే వాడుకల బ్రహ్మరథం అని అన్నారు.”

“ఇక మనం వెళ్దామా” అన్నాడు దశరథం సంబాషణ ముగింపుకు రావడం గమనించి సంతోషిస్తూ.

“వెళ్దాం” అని లేచి “మీరూ రావాలి” అన్నాడు దీక్షితులు పూజారయ్యను చూస్తూ…

“ఆఁ” అన్నాడు.

“శెలవా మరి.”

తల ఊపాడు పూజారయ్య

నమస్కారం చేసి ఇద్దరూ గుడి మెట్లు దిగారు. నడుస్తున్నారు.

“ఎప్పుడో కాలక్షపానికి తడిమే విషయాన్ని ఇప్పుడా ప్రస్తావించేది” అన్నాడు కటువుగా దశరథం.

“ఎప్పిటి దప్పుడు పూర్తి అవడం మంచిదని పిస్తుంది నాకు. ఏది మంచో ఏది చెడో నీకే తెలియాలి” అంటూ కొంచెం వడిగా నడిచాడు కోపాన్ని తనలోనే బలవంతంగా దిగమింగుకుంటూ.

ఇద్దరూ నడుస్తూన్నారు… కొంచెం వెనకా ముందు ఇద్దరూ దశరథం ఇంటికి చేరుకున్నారు.

సీతమ్మ విజయ తలంటు పూర్తి చేసి వరండాలోకి వస్తూ కనిపించింది. “ఎన్ని గంటలకు వస్తానన్నారు? మళ్ళీ ఏమైనా కబురుగానీ వచ్చిందా?” అడిగింది ఎదురుగ వచ్చి.

“వస్తారని చెప్పారు గనుక తప్పక వస్తారు. పొద్దస్తమానం కబురు చేయనక్కరలేదు” అన్నాడు దీక్షితులు.

“మనం బస్సు దగ్గరికి వెళ్ళాలిగదా.

“వెళ్దాం” అని, “అమ్మాయి ఎలా ఉంది?” అనడిగాడు.

“బాగానే ఉంది పరవాలేదు. కొంత మరుపు వచ్చిందేమ తెలీదు. మనిషి మాత్రం కుదురుగానే ఉంది. వేరే భావనేదీ దానిలో కనిపించలేదు. కాఫీ అడిగి త్రాగింది. తలంటుకుంది” అంది లోనకెళ్తూ.

“అయితే ఇంకేం పరవాలేదన్నమాట” అని ధశరథం వైపుగా మళ్ళి “నువ్వు పదకొండుగంటలకు మా ఇంటికి రా చెపుతాను. అక్కడి నుంచే బయలుదేరి వెడదాం” అన్నాడు వెనక్కి మళ్ళుతూ.

“నువ్వు ఇప్పుడు ఎక్కడికి?”

“ఇంటికి”

“సీతలోన కెళ్ళింది. వచ్చాక వెళ్ళొచ్చుగదా?”

“ఫరవాలేదు వెళ్తాను” అని గేటువైపుగా నడచాడు.

“వీడు ఒక పట్టాన అంతు పట్టి చావడు” అనుకున్నాడు ధశరథం వెళుతున్న వాణ్ణి చూస్తూ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here