అనుబంధ బంధాలు-21

1
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 21వ భాగం. [/box]

[dropcap]టైం[/dropcap] దాటిం తరువాత ఎదురు చూడడం చాలా కష్టం. టైం తెలీక ఎదురు చూడటం మరీ కష్టం. అవతల వాడు అశ్రద్ధ మనిషయి, ఇవతల వాడు తొందరపాటు ఉన్నవాడయితే ఇక వేరే చెప్పే పనే ఉండదు. వెధవది ప్రతి సెకనూ ఆలస్యంగా గడిచినట్టే అనిపించింది.

టైం గడచిన తరువాత ‘అరె’ అనుకుంటే మాత్రం అరక్షణం కూడా ఎన్ని పిల్లి మొగ్గలెసినా వెనక్కి రాదు. ఎదురు చూసేప్పడు మాత్రం ‘అమ్మో’ ఇంకా గంట ఉంది? అనుకుంటాం ఊసురుమనుకుంటూ…

ఏది ఏమయినా, ఎదురు చూసే క్షణాలు మన బ్రతుకులలో ఎక్కువే. కొందరికి జీవిత కాలము కూడా చాలదేమో?

రిటైరయ్యాక కలుసుకునే స్నేహితులు కనిపిస్తారు మనకు. ఒక్కోసారి అరె ‘అరేరే! నువ్వు సుందరానివేగా! ఎవరూ?’ అని పలకరించుకొని ‘పూర్తిగా బట్టతలయింది. లోగా N.T.R జుత్తున్నట్లుగా ఉండేది. ఆ రోజులలో నువ్వు అందగాడివని అనేకసార్లు అనుకునే వాళ్ళం. నీకో విషయం తెలుసా? సువర్చలా టీచరు లేదు మన దగ్గర పని చేస్తూనే పెళ్ళాడేసింది, ఆ పిల్ల నిజంగా నిన్ను ఎంతగా ప్రేమించిందో ఊహించలేం. ముఖ్యంగా నీ తల పై నున్న జుత్తును చూసే అంతగా వ్యామోహ పడటం ముప్పయి ఏళ్ళ క్రిందటి మాటయే. ఇప్పుడావిడ నూనె పూసిన గుండ్రాయిలాగయింది, జుత్తేమో పూర్తిగా ఊడిపోయింది.’

ఎంతెంత కాలం… ఎంత తేలికగా గడచిపోయింది?

‘అరేఁ ఇన్నేళ్ళయింది మన పెళ్ళయి?’ అని తెల్లబోతుంటారు.

పెళ్ళికెదిగిన బిడ్డలను చూసి…

ఏది ఏమైన కాలగమనంలోని నడకలో మార్పు లేదు. ఖచ్చితంగానే నడుస్తూంది.

మనస్సుపై పడే వత్తిళ్ళ వల్ల ఈ ఆలస్యంగా అనిపించడాలు, త్వరగా గడచిపోవడాలును. ఇదంతా భ్రమే. ఎప్పటిలా వరవడిన డొల్లిపోయేదే కాలం.

దీక్షితులుకో స్నేహితుడున్నాడు. చిన్ననాటి నేస్తం.

పట్నం పారిపోయి, ఏదో ఒక తప్పుడు తోవ నాశ్రయించి కుబేరుడయి పోయాడు. ఈ సంపాదన ఎక్కడిది? ‘ఏం వ్యాపారం చేసి గడించాడు’ అని ఈ వ్యవస్థ అతన్ని ప్రశ్నించ లేక పోయింది. అతని ‘చే తడుపుడు’ కు గులామైంది.

అతగాని బిడ్డ పెళ్ళికి నిశ్చితార్థం చేసుకుంటూ ఆహ్వానం పంపాడు. అదీ అకస్మాత్తుగా ఒక నాడు తోవలో ఎదురుపడినపుడు.

స్నేహితుడు గనుక (పూర్వం) ‘సరే’ నన్నాడు.

నిశ్చితార్థానికి వెళ్ళాడు. విశాలమైన చోటున మండపం కట్టి మరీ చేసాడు. కాని ఇరుకుగా అనిపించింది.

మిత్రుడు అందర్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.

దీక్షితులును చూసాడు దగ్గరికి రాబోయాడు కాని ఇంతలో ఓ ‘Business magnet’ దిగాడు. అటూగా వెళ్ళాడు హడావిడి పడుతూ. లోనికి నడచాడు దీక్షితులు.

ఆహ్వానించిన వారితో నడుస్తూ అతని కంటే పెద్దగా ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగాడు తప్ప దీక్షితుల్ని పలకరించేందుకు రాలేకపోయాడు.

ఎవరు చేసినా వ్యాపారమే ఎలా ఆలోచించినా వ్యాపార ధోరణితో ఉన్న సంభందాలే అనుబందాలు… ఆత్మీయతగానీ, అభిమానం గానీ దగ్గరితనంగాని ప్రేమ గానీ అక్కడ పిసరంత కనిపంచలేదు. అంతా కృతకం. కానీ ఆగక నడుస్తూన్న ఆ పరుగుక, మనకు ‘జాలి’ అనిపిస్తుంది. ప్రవర్తించే తీరు ఆనందించే దోరణి జుగుప్సాకరంగా కూడా అనిపిస్తుంది. ఉన్నవాడి ముందు గులాము వ్యవహారం. ఆత్మీయుల ఎడల రాజరికపు ఫోజు.

సమాజానికి పుట్టుకురుపు లాంటిది.

‘ఆ తీరును గౌరవంగానో స్టేటస్ గానో లెవల్‌గానో భ్రమసి అందని అంతస్తుగా భావించి మేం కూడా అందులోని వారమే అని తమకు తామే అనుకోవడం అలా కనిపించ ప్రత్నించడం’ సాధారణమైపోతోంది.

***

దశరథరామయ్య దీక్షితులింటికి పదకొండు గంటలకు కొంచెం ముందుగానే చేరిపోయాడు. దీక్షితులు ఇంట్లో హడావిడి పడుతూ కనిపించాడు. దశరథాన్ని చూసి “అసలు నేనెప్పుడు రమ్మన్నాను ఇప్పుడా రావడం? బస్సు ఇక్కడ ఆగాక మనం బస్సు స్టాండుకు వెళ్తే వాళ్ళు ఎంత అవమానంగా ఇదవుతారు. అసలే మగపెళ్ళివారు గదా!” అంటూ ఎదురొచ్చాడు.

దీక్షితులుని మారు మాట్లడక చూసాడు.

నాల్గయిదు నిముషాలు ఇంట్లోకి బయటకు తిరిగి ‘టైం ఎంతయింది?’ అనడిగాడు మళ్ళీ. ‘పదకొండు’. అయిందా నేను అనుకుంటూనే ఉన్నాను. ‘శాంతా కండువా ఇవు’ అని లోనికి కేకవేశాడు.

‘చిలక్కొయ్యన ఉంది’ అంది ఆవిడ. తీసుకొని భుజాన వేసుకొని వేగంగా నడచాడు బస్సు వచ్చిందో ఏమో అనుకుంటూ

‘దీక్షితులూ’ పిలిచాడు దశరథం నడుస్తూ… ‘ఆఁ’ అన్నాడు వెనక్కి తిరగకుండానే.

“నువ్వు నన్ను పదకొండు గంటలకు రమ్మన్నావుగదా!”

‘మనం ఏదన్నా ఉంటే తరువాత మాటడుకుందాం గానీ రా’ అన్నాడు చక చకా నడుస్తూ. బస్టాండుకు ఇద్దరు ఉరుకులు పరుగుల మీద చేరుతుండగా ఓ బస్సు ఆగి కదలడం కనిపించింది.

దీక్షితులు పరుగులాంటి నడకతో అక్కడకు చేరాడు. అయితే ఆ బస్సు తాము అనుకున్నది కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు స్థిమితంగా.

బస్సు వస్తే మాత్రమేం? ఆగతుంది గదా? వచ్చిన వాళ్ళు ఎలాగూ దిగాలి దిగుతారు మనం రాలేదని వెళ్ళిపోతారా?

మన పని వత్తిడిని పట్టి మనం నడుస్తుంటాంగానీ ఎక్కడికని పరుగెత్తగలం. కాకపోతే ఇది మన పనే గనుక దీనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని దీనికిస్తాం. ఇలా ఆలోచనలు ముసురుతుండగా దశరథం దీక్షితుల్ని కలవవచ్చాడు. “అరేయ్ ఆలూ చూలు లేదు నన్ను ఇలా పరుగెత్తిస్తున్నావు. బ్రతుకంతా పరుగెత్తించేలా ఉన్నావుగదా” అన్నాడు అడ్డంగా ఉన్న ఇనుపకమ్మ మీద కూర్చుంటూ….

“మనం ఇక్కడ కనపడటం పద్ధతి.”

‘ఎవరు కాదన్నారు?’

‘మరి…’

“నువు తీసుకొని వస్తున్న తీరుకు బాధగా ఉంది తప్ప…. మర్యాదగా ప్రవర్తించడంలో తప్పులేదు. అని ఒక క్షణం ఆగి ‘దీక్షితులూ ఇట్లా నన్ను పరుగులు తీయించకు, చచ్చి నీ కడుపున పుడతాను. అసలే నేను బడిపంతులును. రిటైర్ కూడా అయ్యాను. ఆడపిల్ల తండ్రిని కనుక ఏదైన ఉంటే కొంచెం ముందుగా చెప్పు’ అంటుండగా బస్సు వచ్చి ఆగింది. అందులో నుండి జాలయ్య పోష్టు మాష్టారుగారు దిగారు.

“దీక్షితులుగారు, ఎక్కడిదాకా ప్రయాణం?” అని పలకరించాడు. “ఎటూ లేదు? చుట్టాలు వస్తున్నారు.”

“అలాగా! వస్తాను, ఇరవై రోజులయిందయ్యా ఇల్లు వదిలి. నాగపూర్ అనుకొని వెళ్ళాను. ఢిల్లి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి కాన్‌పూర్‌లో మీటింగ్ పెట్టామన్నారు. అది చూసుకొని వస్తున్నాను. ఇంత తిరిగానే కాని న్యాయంగా స్వాతంత్య్రసమరంలో పాల్గొని వికలాంగులైన వారికి, భర్తలను కోల్పోయిన వారికి ఇది వచ్చేలా చూడలేకపోయాను. పైగా ఫైళ్ళలోని న్యాయాన్యాయాలని గమనించడం లేదు. ‘ఫైలు’కు ఇన్ని రూపాయలు అని ముట్టచెప్పిన వానివి అవుతున్నాయి. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనని వారైనా కనీసం ఆ age group వాళ్ళయితే ఫరవాలేదు. స్వాతంత్య్రం వచ్చాక పుట్టిన వారికి కూడా ఇచ్చేస్తున్నారు. నేను ‘ఫిరియాదు’ చేసాను కొన్ని అధారాలు చూపాను, పట్టించుకున్న వాడేవ్వడు లేడు. నా ఆక్రోషం అరణ్యరోదనే అయింది. ఈ సారి మీటింగుకు వెళ్ళి ‘అయోతుమో’ తేల్చుకొని రావాలని ఉంది” అంటూ ఓ నమస్కారం చేసి వెళ్ళిపాయాడు.

దీక్షితులు నిముషానికోసారయినా రోడ్ల వైపు నిక్కి నిక్కి చూస్తూన్నాడు. జాలయ్య చెప్పింది వినిపించుకున్నా జాడలేదు.

ఇక లారీ లాంటి వాహనం శబ్దం వినిపిస్తే ‘వచ్చేస్తుందోయ్’ అని రోడ్డెక్కుతున్నాడు. చివరకు పన్నెండున్నరకు బస్సు వచ్చి ఆగింది.

అప్పటికి దీక్షితులు పాపం నిజంగా సుడిబడిపోయాడు అనవసరంగా. అనుకున్నట్లుగానే రాజయ్య ఆయన పెద్దకొడుకు గోపాలం ఆయన భార్యా, శ్రీనివాసు బస్సు దిగారు చెమటలు తుడుచుకుంటూ.

‘వెధవ బస్సులు ఎంత లేటనుకున్నారు? ఇక్కడికిది పదకొండు కొడుతుంటే రావాలి? కానీ ఎవరినీ అడగగలం?’ అని ‘ప్రయాణం బాగా జరిగిందా?’ అనడిగాడు దీక్షితులు సాదరంగా.

దశరథం దీక్షితులు వెంట నడుస్తున్నాడు.

తల ఉపారు వాళ్ళు నవ్వుమొఖాలతో. వాళ్ళ చేతులలో ఉన్న సామానులను సోములను పిలిచి అప్పగించి ‘మన ఇంటికే’ అని చెప్పాడు.

పిచ్చాపాటి మాటాడుకుంటూ దీక్షితులిగారింటికి చేరేసరికి ఒంటి గంట అయింది.

శాంతమ్మ ఎదురుగా వచ్చి బస్సు దిగి వచ్చిన ఆడకూతుళ్ళను లోనికి తీసుకెళ్ళింది. మగవారు కాళ్ళు చేతులు కడుక్కోని బోజనాలు కార్యక్రమం పూర్తి చేసేసరికి దాదాపు రెండు కావచ్చింది.

‘ఓ గంట విశ్రాంతి తీసుకొండి. ప్రయాణం చేసి వచ్చారు గదా! ఆ తరువాత మాటాడుకుందాం’ అన్నాడు దీక్షితులు.

‘సరే’ అని మంచాల దిశగా నడిచి పక్కలెక్కారు.

సాయంత్రం నాల్గు గంటలకు గానీ పెళ్ళి చూపుల తంతు పూర్తికాలేదు. పూజరయ్య వచ్చి కూర్చున్నాడు.

ఆయన సమక్షంలోనే మాటా మంచీ జరిగింది.

పిల్లపైన పిల్లవాని వారికి పిల్లవాని పైన పిల్లవాళ్ళకు సదభిప్రాయం ఏర్పడడాన ఫ్రీగా మాటాడుకున్నారు.

కట్నం లక్షకు తగ్గకుండా, లాంఛనాలు లేకున్నా ఆడబిడ్డ కట్నం కింద అయిదు వేలు వెండి కంచం, తాంబూలం, గ్లాసు, కుంకుమకాయ, ఇలా పట్టి చదివారు. కట్నం పూడ్చడమే గగనమైతే ఇవన్నీ అదనమేగదా!

వారం రోజులలో ఉత్తరం వ్రాస్తామని చెప్పి పంపారు. కట్నం కానుకల విషయంలో కొంచెం తేడా తప్ప పిల్లా పిల్లాడు నచ్చారు. ఆ రాత్రి సీతమ్మ కూతురి అభిప్రాయం అడిగింది. మీ ఇష్టం అమ్మా మీరు మంచి చెడూ చూసే గదా పెండ్ళి చూపులు ఎర్పాటు చేసింది. ఇదే మాట మగ పెళ్ళివారి నుంచి వచ్చింది.

శ్రీనివాసు మాత్రం ఈ అమ్మాయినే చేసుకుంటాను అని ఖండితంగా అన్నట్లుగా తెల్సింది. ఇది ఆనందిచదగిన వార్తే గదా.

మర్నాడు ప్రొద్దుట దీక్షితులు ఇంటికి వెళ్ళాడు దశరథం. ‘ఏమనుకుంటున్నారు?’ అనడిగాడు కూర్చోమని. సంభంధం మంచిదే కానీ మనం తూగగలమా అన్నాడు. నాకు మాత్రం ఎవరున్నారురా అన్నాడు దీక్షితులు.

ఈ మాట మంచిదే అయినా నేనుగా చేయాల్సి వస్తే వాళ్ళతో తూగలేను. ‘ఎచ్చులకు ఏరనాలకు వెళ్తే తన్ని తలగుడ్డ తీసుకున్నారట.’ అంచేత అసలు అభాసుపాలయ్యే దాని కంటే ఊర్కోనండ మర్యాదగా ఉంటుంది గదా.

‘పాతిక వేలకు వాయిదా ఇస్తారు.’

‘ఇస్తారు కాని తేలిక భావన కల్గుతుందెమో?’

‘పెళ్ళి అంటే నూరు అబద్దాలాడి అయినా చేసేది. మనం అలా చేయొద్దురా.’

‘భయమెందుకు? ఇంకా టైం ముందిగదా! చూద్దాం ఎదో ఒకటి మార్గం దొరకకపోతుందా?’

 ‘మంచిది.’

***

సూర్యోదయమవుతుంది. చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది. లేలేత ఎఱుపుదనపు, నులివెచ్చదనం, ఒక్కటే చలిని పారదోలుతుంది. కావురు నుంచి వెలుగు చారలు గమ్మతుగా కనిపిస్తున్నాయి.

పూరిళ్ళ పై నుంచి లెగిసే వంటల పొగ ఆకాశంలోకి పొగ మేఘాలలా వెళ్తున్నవి. చెట్టు పై నున్న పక్షులు రెక్కలు విప్పనయి.

‘ఇవ్వాళ్ళ దీనమ్మ సిగదరగ ఏదో ఒకటి తేలాల్సిందే’ అంటున్నాడు రామదాసు.

“పొద్దుటేళ్ళగాదు ఆ మాట అనాల్సింది? మాపటేళ్ళ మందు వెసుకున్నాక బజారు జనం నిలబెట్టి నీ నోట్లో ఉమ్మేసి నన్ను మరోకడ్ని కట్టుకొమ్మని చెప్పుతారు. నీతో ఓలి కట్టెం చేస్తారు. ‘ఆఁ! ఊఁ! అంటే మక్కెలు విరిచెస్తారు’”అంది దేవమ్మ.

‘అదేనే పూజరయ్య దగ్గరికి వెళ్తామంటివి గదా! రా! రావే’ అంటూ రెక్క పట్టుకొని లాగాడు.

దేవమ్మ విదిలించుకుని “పోరణ్ణి బడికి తోలినంక పోదాం” అంది. “అవునే! ఇది నీ యిట్టమే! అసలు దేశములోనే ఆడ రాజ్యమొచ్చింది. ఇక మాదేముంది. దీనెమ్మ గాజులు తొడుక్కొని వంట జేస్తం. మరీ రోడ్డేక్కి తైతక్కలాడండి” అన్నడు పెద్దంగ

తాంబూర మట్టుకుంటూ నల్గురు సాదువులు లేచి వీర్నిబొత్తిగా పట్టించుకోనకుండానే వెళ్ళిపోయారు.

పొద్దెకింది బడివేళ్ళ అయింది.

పొరడికి పలకా బలపం ఇచ్చి బడిలోకి తోలొచ్చి, ఇంటి పనిలో పడింది.

‘ఇంకా రావేందసె’ అడిగాడు రాందాసు లేచొచ్చి.

‘ఏళ్ళకింత పిండాకుడు కావాలి గాద అది వండి పడేసి వస్తా.’

‘బువ్వ ఉడికినంక చీర సింగారి బ్రాలంటవు, బొట్టుకాటుక పెట్టాలంటావు. ఇయన్ని కుదరవుగానీ లే’ అంటూ చేయిని పట్టుకొని దొవకు నడిచిండు. తోవన వెళ్తున్న ముత్తయ్య జరుగుతున్న తంతును జూచి… ఆగి ‘ఎందిరా పొద్దుటే గుఱ్ఱం ఎక్కిన వెందుకు? ఇదేం పాడుగోల? చేసెటందుకు కుదురుగ పని దొరక్క చస్తుంటే దొరికినోడికి మిక్కటంగ దాగలేక చస్తున్నాడంట. ఛ.. దాన్ని మొదట వదలు’ అని అరిచాడు. అంటే “నువ్వు కూడ… ముత్తయ్య ‘మామ’ తప్పంటం లేవా? ఛ..ఛ..ఛ..ఛ.. మా మగ ఎదవలకు బుద్దిరాదు. కోక కనపడితే చాలు ఏం తెలికపోయినా దానేపే మాటడతరు” అన్నడు.

ఈ మాటకు ముత్తయ్య మండిపడి.

“అరేయ్! అది నోరేనా? అసలు నువ్వేం మాటడతున్నావో అర్దమయితుందా? ఎంత మాట పడితే అంత మాటను ఊళ్ళోని వాళ్ళనంటే ఉరుకుంటారురా. ఈ ఊరేమన్నా …. తాళిగట్టిన పెళ్ళామనుకుంటున్నావుర.

తాళికట్టడమంటే సుఖంగ సంసారం జేయ్యడం రా ఏబ్రాసి ఎదవ. ఉరితాడనిపించడం గాదు. పుట్టుక పుట్టగానే సరా ‘థూ’ నీ బతుకు చెడ. పెద్దయ్యగోరికి మోసే సారాయిలో సగం దాగి చేసేదట్రా సంసారం. వాళ్ళకేంరా తాగుతరు, అంటారు బాగోత మాడతారు. అక్కరొస్తే చలకలమ్ముకుంటారు. నీకు తెలికుండ నిన్ను తనఖాపెడ్తారు. కొండ మీద కోతిని దింపుతారు. అమ్మెటందుకు కొనేటందుకు మనకాడ ఏం ముందిరా పిజారీ నాయాల.

మన కష్టం చేసి బ్రతికితే…. మన ఆడోళ్ళు ఇమానింగా ఉంది బతుకుతరు. అంతే గానీ…

ఇదేం పని ఇది కాపురమవుతదటరా? అయిన నాకు తెలువక అడుగత ఎన్నిదినాలయే నువ్వు ఇంటికి బత్తేలు పంపక సిగ్గుగాకపోయే సిగ్గు చితికే దనక లాగి తందనాలాటాయే దాని కష్టంలో వండేసిన పిడచే గదారా నువ్వు గతకేది. పైగ అది పోరణ్ణి బడికి తోలుతున్నది. ఆడి కడుపున నాల్గు అచ్చరాలు పడితే కన్న మన రాత మారతదేమోనని.

ఆ పోరడ్ని కూడా పెద్ద గాడేలకి తోలితేగాని నీ కళ్ళు చల్లబడవు. అరేయ్ మన బతుకంత నీ బాంచన్ దొర అని ఆళ్ళ కాళ్ళకాడనే బతుకుతున్నం గదా కనీసం వాళ్ళనైనా వాళ్ళ మానాన బతకనియ్యండిరా” అని చుట్టూరా పారజూచి ‘అరేయ్ గంగులు రాచయ్య ఇట్రాండి’ అని పిలిచిండు.

గంగులతో పాటు వాడ జనం పది మంది వచ్చారు. వాళ్ళ ఎదురంగ రాందాసును నిలబెట్టి “ఇదిగో రాందాసూ ఇందరిలో చెపుతున్న దేవమ్మ ఎట్టాంటిదో ఈడ అందరికీ తెల్సు నువ్వు కడుపుల ఏదో పెట్టుకొని ఇట్టాంటి పనులు చేయడం బాగలేదు. అసలు లెక్కమ్మటయితే నువ్వు దాని కాడ ఉండేటందుకే ఖాబిల్ గదు. రూపాయి తేకుండా దాని దగర తింటున్నావు పైగా ఇదేంది?

ఇంకోసారి ఇట్ట కనపడివంటే అది నితోన ఉండదు. దాని పోరణ్ణి అది పెట్టుకొని బతుకుతది. దాని జోలికి అడ్డుగోలుగా పోతివో కులపంచాయితి జేస్తా పూరా నలిగిపోతవు. ఇదే ఆఖరు మాట ఆఁ!” అని…

‘దేవమ్మా నువ్వు పూజరయ్య కానకు పోనక్కరలేదు. అక్కరుంటే రాందాసునే పొమ్మను. అంతే! ఒక వెళ్ళ పిలిపిస్తే నేను అన్నానని పూజరయ్యతో చెప్పు. చల్లటి మనిషాయన సరే నంటాడు. ఇక ఈడు మంచిగ ఇంటికి వచ్చిన నాడు ఇంత పిడిచెయ్యి దొవన పోయేటోడు వచ్చినా ఏస్తంగదా! ఈడు ఎంత చెడ్డా తాలి కట్టినోడు మెడకు పడ్డపాము. అస్సలు బొత్తిగా రాలేదూ బేఫికర్‌గా ఉండు. ఈడికి మనువెట్ట అయితదో? ఈడి నఖరాలేందో మేం జూస్తం’ అని…

అందిరిని ఉద్దేశించి ‘ఇదిగో నేను చాటుంగ చెపెడిదేం లేదు. ఆడోళ్ళు అందరూ ఇనుకోండి. తప్పతాగి గుడిసెకొచ్చినోడ్ని రానీయడం రానీయకపోవడం మీ యిట్టం అట్టని బలవంతంగలోన దూరితే కుదరదు. అట్టాంటి దేదన్న జరిగితే ఈడనే కాళ్ళకు వాతలు పెడతం. కనిపెట్టి ఉండండి’ అని ‘దేవమ్మా ఇక నువ్వుపో’ అన్నాడు. ‘అట్టనే’ అని మొక్కేసి ఎనక్కి మళ్ళింది.

రాందాసు కోపం పోక కాళ్ళను నేలకు బలంగా బాదుతూ ‘పెద్దొర గడీ’యేపు నడిచిండు.

పెళ్ళాం ముందు ముత్తిగాడు… ఎంత పెద్దయినా ఇట్టా చెప్పడం ‘ససేమిరా’ నచ్చలేదు. నా పైసలు నా తాగుడుకే సాలకపోవచ్చు నిబద్దె! నా పెళ్ళాం తెచిచందాని పైన నాకు హక్కెందుకుండదు? ఇదీ నిబద్దేగదా! నా పొరడు తింటున్నది దానిదే అయినప్పుడు ఆడికి హక్కు ఉన్నప్పుడు ఆడి తండ్రిని నాకు లేదనడానికి వీడేవడు? అనుకున్నాడు నడుస్తూ.

కుక్కతోక వంకర పోయే కాదుకదా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here