చాణక్యః:
ఆపి చ –
శ్లోకం:
గృధ్రై రాబద్దచక్రం వియతి విచలితై
ర్దీర్ఘ నిష్కమ్పపక్షై
ర్ధూమై ర్ధ్వస్తార్కభాసాం సఘన మివ దిశాం
మణ్డలం దర్శయన్తః
నన్దై రానన్దయన్తః పితృవననిలయాన్
ప్రాణినః పశ్య చైతాన్
నిర్వాన్త్య ద్యాపి నైతే స్రుత బహుల వసా
వాహినో హవ్య వాహాః (28)
అర్థం:
ఆపి+చ=ఇంకా,
ఆబద్దచక్రం=వలయాకారం కలిగి, దీర్ఘ+నిష్కమ్ప+పక్షై=నిశ్చలంగా చాపిన పొడవైన రెక్కలతో వున్న, వియతి+విచలితైః+గృధ్రైః=ఆకాశంలో తిరుగుతుండే గ్రద్ధలతోనూ, స+ఘనం+ఇవ+ధూమైః=మబ్బులు కమ్మినట్లుండే పొగలతో, ధ్వస్త+ఆర్కభాసాం=సూర్యుని వెలుగుని నశింపజేస్తున్న, దిశాం+మణ్డలం=దిగ్వలయాన్ని, దర్శయన్తః=ప్రదర్శిస్తూ, – నన్దైః=నందుల (శవాలతో), పితృవన+నిలయాన్+ప్రాణినః= శ్మశానాలలో బ్రతికే (నక్కలు, రాబందులు మొదలైన) జీవులను – ఏతాన్=ఇట్టివారిని,
ఆనన్దయన్తః=సంతోషపెడుతూండే, ఏతే+హవ్య వాహాః=ఈ (చితి) మంటలు, స్రుతబహుల+వసా+వాహినః=మిక్కిలిగా కారే కొవ్వును వహిస్తూ, అద్య+అపి=నేటికి కూడా, న+నిర్వాన్తి=ఆరకుండా ఉన్నాయి. పశ్య = చూడు.
వృత్తం:
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.
అలంకారం:
రూపకోత్ప్రేక్ష – ఉపమానోపమేయాలకు అభేదం పాటిస్తూ ఉత్ప్రేక్షించడం వల్ల (అతిశయంగా చెప్పడం వల్ల) ఇక్కడీ అలంకారం. శ్మశానంలో మంటలు నిర్విరామంగా మండడానికి కారణంగా – నందవంశం వారి శవాల చితులలో స్రవిస్తున్న కొవ్వు కారణం అని – ఉత్ప్రేక్షించడం గమనించదగినది.
రాజా:
అన్యే నై వేద మనుష్ఠితమ్.
అర్థం:
ఇదం=ఇది, అన్యేన+ఏవ=వేరేవాని చేతనే, అనుష్ఠితమ్=ఆచరించడమైనది (ఇది చేసిన వాడు వేరే వాడే).
చాణక్యః:
ఆః కేన?
అర్థం:
ఆః+కేన=అలాగా! (ఆఁహా!) ఎవరివల్ల? (జరిగింది)
రాజా:
నన్దకుల విద్వేషిణా దైవేన!
అర్థం:
నన్దకుల+విద్వేషిణా+దైవేన=నందవంశాన్ని ద్వేషించే దైవం వల్ల (జరిగింది).
చాణక్యః:
దైవ మవిద్వాంసః ప్రమాణయన్తి।
అర్థం:
అవిద్వాంసః=మూర్ఖులు, దైవం=దేవుడిని, ప్రమాణయన్తి=నమ్ముతూంటారు.
రాజా:
విద్వాంసోఽప్యవిక త్థనా భవన్తి!
అర్థం:
విద్వాంసః+అపి=తెలివైనవాళ్ళు కూడా, అవికత్థనాః+భవన్తి=స్వోత్కర్ష ప్రదర్శించేవారుగా అవుతూంటారు.
చాణక్యః:
(సకోపమ్) వృషల, భృత్య మివ మా మారోఢు మిచ్ఛసి।
అర్థం:
(స+కోపమ్=కోపంతో) వృషలా, భృత్యం+ఇవ=సేవకుడినన్నట్టు మాం+ఆరోఢుం=నాపై సవారి చేయాలని, ఇచ్ఛసి=కోరుకుంటున్నావు.
శ్లోకం:
శిఖాం మోక్తుం బద్ధా మపి పున రయం ధావతి కరః।
(భూమౌ పాదం ప్రహృత్య)
ప్రతిజ్ఞా మారోఢుం పున రపి చల త్యేష చరణః
ప్రణాశా న్నన్దానం ప్రశమ ముపయాతం త్వ మధునా
పరీతః కాలేన జ్వలయసి మమ క్రోధదహనమ్. (29)
అర్థం:
బద్ధాం+అపి+శిఖాం=ముడివేసి ఉన్నప్పటికీ యీ శిఖను, మోక్తుం=విప్పడానికి, పునః+అయం+కరః+ధావతి=ఈ చెయ్యి ఉరకలు వేస్తోంది.
(భూమౌ=నేలపై, పాదం+ప్రహృత్య=బలంగా తట్టి)
ఏష+చరణః=ఈ పాదం, పునః+అపి=ఇంకొక మాటు కూడా,
ప్రతిజ్ఞామ్+ఆరోఢుం=ప్రతిజ్ఞ పట్టడానికి, చలతి=కదలుతోంది. నన్దానం+ప్రణాశాత్=నందవంశం నాశనం కావడం వల్ల, ప్రశమం+ఉపయాతం=శాంతిపొందిన, మమ+క్రోధ+దహనమ్=నా కోపాగ్నిని, కాలేన+పరీతః=కాలం మూడినవాడవై, త్వం=నువ్వు, అధునా=ఇప్పుడు, జ్వలయసి=రగిలిస్తున్నావు.
వృత్తం:
శిఖరిణి – య – మ – న – స – భ – లగ – గణాలు.
అలంకారం:
రూపక – ఉత్ప్రేక్షల సంసృష్టి (కలగలుపు). క్రోధ దహనం (క్రోధమనే అగ్ని)+కాలం మూడిన వ్యక్తిని రగిలించడం – అనేవి రెండు విధాల కారణాలు.
రాజా:
(సావేగ మాత్మగతమ్) అయే! కథం సత్య మే వార్యః కుపితః! తథాహి
అర్థం:
(స+ఆవేగం+అత్మగతమ్=తత్తరపాటుతో, తనలో) అయే!=అయ్యో, కథం=ఏమిటీ? ఆర్యః=అయ్యవారు, సత్యం+ఏవ+కుపితః=నిజంగానే (భావించి) కోపగిస్తున్నారు! తథా+హి= అంతే కదా!
శ్లోకం:
సంర మ్భోత్స్పన్ది పక్ష్మ క్షర దమల జల
క్షాలన క్షామ యాపి
భ్రూభ ఙ్గోద్భేద ధూమం జ్వలిత మివ పురః
పిఙ్గయా నేత్రభాసా;
మన్యే, రుద్రస్య రౌద్రం రస మభినయత
స్తాణ్డవేషు స్మరన్త్యా,
సఞ్జాతో గ్రప్రకమ్పం కథ మపి ధరయా
ధారితః పాదఘాతః. (30)
అర్థం:
సంరంభ+ఉత్స్పన్ది+పక్ష్మక్షరత్+అమలజల+క్షాలన+క్షామయ+అపి=తొందరపాటు కారణంగా పైగా లేచి (విప్పారిన) కంటి రెప్పలనుంచి జారే స్వచ్ఛమైన కన్నీటితో కడగడం చేత, వెలుగు తగ్గినప్పటికీ (కంటిచూపులో, కన్నీరు క్రమ్మడం వల్ల తేజస్సు తగ్గినప్పటికీ) -పిఙ్గయా+నేత్రభాసా=ఎర్రబారిన కంటి వెలుగుతో, (మే) పురః= నా సమక్షంలో, భ్రూభఙ్గ+ఉద్భేద+ధూమం=బొమ ముడి పడడం వల్ల పైకెగిసిన పొగయేమో అనిపించే, జ్వలితం+ఇవ=మంటమండినట్లు (తోస్తోంది).
తాణ్డవేషు=తాండవమనే నృత్య విశేష సందర్భాలలో, రౌద్రం+రసం+అభినయత=రౌద్రరసాన్ని అనుకరిస్తున్న, రుద్రస్య=రుద్రుని (యొక్క స్థితిని), స్మరన్త్యా+ధరయా=తలచుకుంటున్న భూమి చేత (ఈ నేల చేత), సఞ్జాత+ఉగ్ర+ప్రకమ్పం=పుట్టిన భయంకరమైన కదలికను (అదురును) పుట్టించిన, పాదఘాతః=పాదపు తాకిడి, కథం+అపి=ఎలాగో అలాగా (అతి కష్టం మీద), ధారితః=భరించిందని, మన్యే=భావిస్తున్నాను.
వ్యాఖ్య:
చాణక్యుడి కళ్ళలో నీరు క్రమ్మింది. చూపు మసకబారింది. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కనుబొమలు ముడిపడి – పొగ లేచిన మంటను తలపించాయి. కాలితో అతడు నేలను తన్నిత తన్ను ఎలాగున్నదంటే తాండవ నృత్యం వేళ పరమశివుడు రౌద్రరసం అభినయిస్తుండగా – ఆయన పాదం తాకి వణికిన తీరులో – ఆ నేల వణికింది. ఆ అదరుపాటును అతి కష్టం మీద తట్టుకుంది – అని చంద్రగుప్తుడికి తోచింది.
వృత్తం:
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.
అలంకారం:
ఉత్ప్రేక్ష (సంభావనాస్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా – అని కువలయానందం). ఇక్కడ – హేతువు ప్రధానంగా చెప్పడం వల్ల హేతూత్ప్రేక్ష – సంభావనాలంకారమని కూడా చెప్పదగును (సంభావనాయదీత్థం స్యాది త్యూహోఽన్యస్య సిద్ధయే – అని కువలయానందం). ‘జ్వలితమివ మన్యే’ – అనే సందర్బం గమనించదగినది.
(రుద్ర రౌద్రరస అభినయ వేళ పాదతాడనం – అనుకుంటున్నాను అనేది కూడా సంభావనాలంకార సమర్థకం).
చాణక్యః:
(కృతకకోపం సంహృత్య) వృషల వృషల, అల ముత్తరోత్తరేణ. య ద్యస్మత్తో గరియాన్ రాక్షసో ఽవగమ్యతే, త దిదం శస్త్రం తస్మై దీయతామ్। (ఇతి శస్త్ర ముత్సృజ్యోత్థాయ, ఆకాశే లక్ష్యం బధ్వా, స్వగతమ్) రాక్షస రాక్షస, ఏష భవతః కౌటిల్యబుద్ధి విజిగీషో ర్బుద్దేః ప్రకర్షః।
అర్థం:
[కృతక+కోపం+సంహృత్య=కృత్రిమ కోపాన్ని విడిచిపెట్టి (ఉపసంహరించి)] వృషలా వృషలా! ఉత్తరోత్తరేణ+అలం=ఇకపై మాటలు చాలు. యది+రాక్షసః+అస్మత్తః+గరియాన్+అవగమ్యతే= రాక్షసుడు మాకంటే గొప్పవాడైతే (శ్రేష్ఠుడనిపిస్తే), తత్=అప్పుడు, ఇదం+శస్త్రం+తస్మై+దీయతామ్=ఈ ఆయుధాన్ని అతడికే ఇవ్వవచ్చును. [ఇతి=అని – శస్త్రం+ఉత్సృజ్య= (అధికార చిహ్నమైన) ఆయుధాన్ని విడిచి, ఉత్థాయ= (ఆసనం నుంచి) లేచి, ఆకాశే+లక్ష్యం+బధ్వా=ఆకాశంలోకి చూపు నిలిపి, స్వగతమ్=తనలో], రాక్షసా, రాక్షసా!, ఏషః=ఇది, భవతః+కౌటిల్యబుద్ధి+విజిగీషోః=కౌటిల్యుడి బుద్ధి చాతుర్యాన్ని జయించాలనుకునే నీ (యొక్క), ప్రకర్షః=తెలివి! (ఇదయ్యా నీ తెలివి – అని వెటకారం).
శ్లోకం:
చాణక్యత శ్చలిత భక్తి మహం సుఖేన
జేష్యామి మౌర్య మితి సంప్రతి యః ప్రయుక్తః
భేదః కి లై ష భవతా, సకలః స ఏవ
సంపత్స్యతే శఠ, త వైవ హి దూషణాయ. (31)
(ఇతి నిష్క్రాన్తః)
అర్థం:
“చాణక్యతః+చలితభక్తిం=చాణక్యుని పట్ల గౌరవం చెదిరిపోయిన, మౌర్యమ్=చంద్రగుప్తుణ్ణి, అహం=నేను, సుఖేన+జేష్యామి=సులువుగా జయించేస్తాను”, ఏషః+ఇతి=అని, సంప్రతి=ఇప్పుడు,భేదః=విడదీయడం, ప్రయుక్తః= ప్రయోగింపబడిందో, సః+ఏవ=అదే, సకలః=మొత్తంగా, తవ+ఏవ+దూషణాయ=నీ (యొక్క) నిందకే, హే+శఠ=ఓ మోసగాడా! సంపత్స్యతే=పనికి వస్తుంది. (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళిపోయాడు).
వ్యాఖ్య:
ఓరి ఓరి మోసకారీ, నువ్వు మా ఇరువురి మధ్య కల్పించిన భేదోపాయం నీ పతనానికే కారణమౌతుంది – అని చాణక్యుడు రాక్షసమంత్రికి హెచ్చరిక చేస్తున్నాడు.
వృత్తం:
వసంత తిలక – త- భ – జ – జ – గ గ – గణాలు.
అలంకారం:
కావ్యలిఙ్గం (సమర్థనీయ స్యార్థస్య కావ్యలిఙ్గం సమర్థనమ్’ అని – కువలయానందం). ఇక్కడ రాక్షసుడి ప్రయత్నం విఫలం కాగలదనడానికి గల కారణ సమర్థనం గమనించవచ్చు.
రాజా:
ఆర్య వైహీనరే, అతః ప్రభృత్య నా దృత్య చాణక్యం చన్ద్రగుప్తః స్వయమేవ రాజ్యం కరిష్యతీతి గృహీతార్థాః క్రియన్తాం ప్రకృతయః
అర్థం:
ఆర్య+వైహీనరే=అయ్యా (పూజ్య) వైహీనరా!, అతః ప్రభృతి=ఇప్పటి నుంచి, చాణక్యం+అనాదృత్య=చాణక్యుని పరిగణింపకుండా (విస్మరించి), చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు, స్వయమేవ=తనకు తానుగా, రాజ్యం+కరిష్యతి=రాజ్యపాలన చేస్తాడు, ఇతి=అని, ప్రకృతయః=ప్రజలు, గృహీత+అర్థాః+క్రియన్తాం=ప్రజలు గ్రహించుకొనే విధంగా చేయండి (ప్రకటించండి).
కఞ్చుకీ:
(ఆత్మగతమ్) కథం! నిరుపపద మేవ చాణక్య మితి, నార్యచాణక్య మితి! హన్త! సంగృహీతో ఽధికారః! అథవా, న ఖల్వ త్ర వస్తుని దేవదోషః; కుతః…
అర్థం:
(ఆత్మగతమ్=తనలో), కథం=ఏమిటీ! (ఎలాగా?!). నిర్+ఉపపదం+ఏవ=చాణక్య పదానికి ముందు వాడే గౌరవ పదం లేకుండా, ఆర్య+చాణక్యమితి+న=ఆర్య చాణక్యమనే ప్రయోగం లేదాయే, హన్త=అయ్యో! అధికారః+సంగృహీతః=అధికారం లాగుకొనడమైనది, అథవా=అయినా, అత్రవస్తుని=ఈ విషయంలో, దేవదోషః+న+ఖలు=దేవరవారి తప్పు లేదు కదా! కుతః=ఎందుకంటే…
శ్లోకం:
సదోషః సచివ స్యైష య దసత్ కురుతే నృపః,
యాతి యన్తుః ప్రమాదేన గజో వ్యాళత్వవాచ్యతామ్. (32)
అర్థం:
నృపః=పరిపాలకుడు, అసత్+కురుతే+(ఇతి)+యత్+ఏషః=తప్పు చేస్తే అనేది ఏది ఉన్నదో, సః+దోష= ఆ తప్పు, సచివస్య+ఏవ=మంత్రికే చెందుతుంది. గజః=ఏనుగు, వ్యాలత్వ+వాచ్యతామ్=పొగరుబోతు అనే అపవాదును, యన్తుః=నడిపించేవాడిని (మావటిని)- ప్రమాదేన=పరాకు వల్ల, యాతి=పొందుతుంది.
వృత్తం:
అనుష్టుప్.
అలంకారం:
అర్థాంతరన్యాసం. (ఉక్తి రర్థాంతర న్యాసస్స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలాయనందం). దృష్టాంతం కూడా.
(చేద్బింబప్రతిబిమ్బత్వం దృష్టాన్తస్తదలం కృతిః).
రాజా:
ఆర్య, కిం విచారయసి?
అర్థం:
కిం+విచారయసి=ఏమి ఆలోచిస్తున్నావు?
కఞ్చుకీ:
దేవ, న కిఞ్చిత్. దిష్ట్యా దేవ ఇదానీం దేవః సంవృత్తః.
అర్థం:
దేవ=దేవరా!, న+కిఞ్చిత్=ఏమీ లేదు; దిష్ట్యా=అదృష్టవశాత్తు, ఇదానీం=ఇప్పుడు, దేవః=దేవరవారు, దేవః+సంవృత్తః=(అసలైన) ప్రభువైనారు!
రాజా:
(ఆత్మగతమ్) ఏవ మస్మాసు గృహ్యమాణేషు, స్వకార్యసిద్ధికామః సకామో భవత్వార్య. (ప్రకాశమ్) శోణోత్తరే, అనేన శుష్కకలహేన శిరోవేదనా మాం బాధతే. శయనగృహ మాదేశయ.
అర్థం:
(ఆత్మగతమ్=తనలో) ఏవం+అస్మాసు+గృహ్యమాణేషు=ఈ విధంగా మేము (స్వతంత్రత నెరపుతున్నట్టు) (అందరిచేత) తలపబడుతుంటే, స్వకార్యసిద్ధికామః=తన పని నెరవేరాలని కోరుకునే, ఆర్య=అయ్యవారు, స+కామః+భవతు=కోరుకున్నది నెరవేరినవాడు అగుగాక! (ఆర్యుడు ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరుగాక!). (ప్రకాశమ్=పైకి) శోణోత్తరే=ప్రతీహారీ, శోణోత్తరా!, అనేన+శుష్కకలహేన=పనికిమాలిన యీ తగవుతో, శిరోవేదనా+మాం+బాధతే=నాకు తలనొప్పి బాధిస్తోంది. శయనగృహం+ఆదేశయ=పడకటింటికి దారి చూపించు.
ప్రతీహారీ:
ఏదు దేవో. (ఏత్వేతు దేవః).
అర్థం:
ఏతు+ఏతు+దేవః=దేవరా, ఇటు, ఇటు!
రాజా:
(ఆత్మగతమ్)
ఆర్యాజ్ఞ యైవ మమ లఙ్ఘిత గౌరవస్య
బుద్ధిః ప్రవేష్టు మివ భూవివరం ప్రవృత్తా,
యే సత్య మేవ హి గురూ నతిపాతయన్తి
తేషాం కథం ను హృదయం న భినత్తి లజ్జా? (33)
అర్థం:
ఆర్య+ఆజ్ఞయా+ఏవ=అయ్యవారు ఆదేశించడం మూలానే, లఙ్ఘిత+గౌరవస్య+మమబుద్ధిః=మర్యాద మీరిన నా తెలివి, భూ+వివరం=నేలబొరియను, ప్రవేష్టుం+ఇవ=దూరిపోవడానికన్నట్టుగా, ప్రవృత్తా=అయిపోయింది (సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకొవాలో తెలియని పరిస్థితి), యే=ఎవరైతే, సత్యం+ఏవ=యథార్థంగానే, గురూన్+అతిపాతయన్తి=గురువులను (వారి ఉద్దేశాలను) అతిక్రమిస్తారో, తేషాం+లజ్జా+కథం+న+హృదయం+భినత్తి=అటువంటి వారికి గుండెనెందుకు పగలజేయదు? (పగిలేలా చేస్తుంది).
వృత్తం:
వసంత తిలక – త- భ – జ – జ – గ గ – గణాలు.
అలంకారం:
ఉత్ప్రేక్ష (సంభావనాస్యాదుత్ప్రేక్షౌ వస్తుహేతు ఫలాత్మనా – అని కువలయానందం). ఇక్కడ – హేతు ప్రధానంగా అర్థం ఉన్నది గనుక హేతూత్ప్రేక్ష – గమనించదగినది.
వ్యాఖ్య:
చంద్రగుప్తుడికి ఈ సందర్భం సంకటకరం అయింది. కృత్రిమ కలహం పెట్టుకోమని గుర్వాజ్ఞ. తీరా పెట్టుకున్నాక, అరే! గురువును అవమానించినంత పని చేశాననే చింత బాధించింది. నా కృత్రిమ కలహమే ఇంత పనికిమాలినదే! నిజంగానే గురువుల ఆదేశాలకు వ్యతిరేకంగా పోయేవాళ్ళు ఎంత దుఃఖించాలి? – అని తలచుకున్నాడు. ఈ ‘పనికిమాలిన కలహం’ వల్ల గురువుగారి పని నెరవేరితే చాలనే ఎరుక కూడా గమనించదగ్గది.
(ఇతి నిష్క్రాన్తాః సర్వే)
(ఇతి=అని, సర్వే+నిష్క్రాన్తాః=అందరూ వెళ్ళిపోయారు).
ముద్రా రాక్షస నాటకే కృతక కలహో నామ
తృతీయాఙ్కః
ముద్రారాక్షస నాటకే=ముద్రారాక్షసమనే నాటకంలో, కృతక+కలహః+నామ=’దొంగ దెబ్బలాట’ అనే పేరుగల – తృతీయ+అఙ్కః=మూడవ అంకం ముగిసినది.
(సశేషం)