[dropcap]రం[/dropcap]గారావు గారి అబ్బాయి సోమేశ్వర్ ఒక కొత్త స్కూటీ కొన్నాడు ఒకనాడు. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి స్కూటీకి ఇంటి వద్దనే పూజ స్వయంగా చేసి మజ్జిగౌరమ్మ గుడికి వెళ్ళి వచ్చారు ఆ స్కూటీ మీద సోమేశ్వర్ అతని భార్య జ్యోతి వారి చిన్నపాపయితో. తరువాత తెరువలిలో ఉన్న లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళాలనుకున్నారు, కానీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మందిరం తలుపులు మూసివేస్తారని, స్వామి దర్శనం అవదని మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుని సాయింత్రం నాలుగు గంటల తరువాత కొత్త స్కూటీపై సరదాగా రాయగడ నుంచి తెరువలి వెళ్తూ దారిలో కొల్లిగూడ కొత్తపేటకు మధ్యలో ఉన్న ఆంజనేయస్వామి కోవెల, ఆ కోవెలకు మరికొంత దూరంలో ఉన్నశివాలయం దర్శించుకుని కొత్తపేట చేరుకున్నారు. ఆ ఊరిలో ఉన్నశ్రీరామమందిరంలో సీతారామస్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయులను లక్షణంగా దండాలు పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరారు.
జేకేపూర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి మందిరంలో స్వామివారిని, లక్ష్మి అమ్మవారిని, ఆ ప్రక్కనే ఉన్న శ్రీరామచంద్రమూర్తిని వేడుకుని ముందుకు సాగారు. నాగావళి నదికి దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడీ, ఆంజనేయస్వామి కోవెల, శివాలయాలను చూసి నాగావళీ నదిపై ఉన్నవంతెన పైనుంచి వెళ్తూ జంజలబడి ఊరి దగ్గర రోడ్డు ప్రక్కనే ఉన్నాఅంజనేయస్వామికి మ్రొక్కుకొని తెరువలి లక్ష్మినారాయణ కోవెల చేరుకున్నారు.
మందిర ప్రాంగణంలో ఉన్న అందమైన పూల చెట్లను చూస్తూ మందిరంలో ప్రవేశించి లక్ష్మినారాయణ మూర్తులను భక్తిశ్రద్దలతో నమస్కరించుకున్నారు, వారి పాప చేత కూడా నమస్కరింపజేసారు. కొంత సమయం మందిర ప్రాంగణంలో కూర్చున్నారు వచ్చేపోయే భక్తులను గమనిస్తూ.
“ఇక చీకటి అవుతుంది బయలుదేరుదాము” అని సోమేశ్వర్ భార్య చేయి పట్టుకుని లేపాడు. పాపను ఎత్తుకొని మందిరం వెలుపలికి వచ్చి మరొకసారి దేవాలయాన్ని మనసారా చూసుకున్నారు.
అక్కడినుంచి కదిలారు. స్కూటీ సాగుతుంది సైలెన్స్‌గా.
అది బ్యాటరీతో నడిచే స్కూటీ. జేకేపూర్ దాటి కోమట్లపేటకు కొంత దూరం ముందుకు వెళ్ళి ఆగిపోయింది. మరి ముందుకు సాగడం లేదు. బండి దిగి దాన్ని నెట్టుకొంటూ సోమేశ్వర్, పాపను ఎత్తుకొని జ్యోతి అడుగులు భారంగా వేస్తూ నడుస్తున్నారు. ఇంకా వెళ్ళవలసినది ఆరు, ఏడు కిలోమీటర్లు దూరం ఏం చేయాలి దేవుడా అని, ఇలా అయిందేమిటీ కర్మ. అంత దూరంఎలావెళ్తాం అని దిగులు ఆవరించింది వారిద్దరిలో.
వీరి ప్రక్కనుంచి వాహనాలు సర్…సర్ న సాగిపోతున్నై. ఒకతను బైక్ పై వెళ్తూ వీళ్ళను చూసి ఆగాడు. “ఏమైంది నడుస్తున్నారు?” అని అడిగాడు.
“చార్జింగ్ అయిపోయింది. బండి లాగడం లేదు” అని చెప్పాడు సోమేశ్వర్.
“మీరు ఎక్కడికి వెళ్ళాలి?” అని అడిగాడు అతను.
“రాయగడ రైతుల కోలనీకి వెళ్ళాలి.”
“అలాగా చిన్నపాపతో ఉన్నారు. ఒకపని చేయండి నా బైక్ తీసుకుని వెళ్ళండి. మీ స్కూటీ ఉంచేయండి, నేను అదిగో ఆ షోరూం దగ్గర ఉంటాను. వీళ్ళను ఇంటి దగ్గర దించి వచ్చేయండి” అని చెప్పి అతని బైక్ ఇచ్చాడు.
బ్రతుకు జీవుడా అనుకున్నాడు సోమేశ్వర్. అతను చెప్పినట్లు భార్యను పాపను బైక్ పై తీసుకుని వెళ్ళి ఇల్లు చేర్చాడు. సోమేశ్వర్ తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పాడు.
“మంచిదే అతనెవరో సాయం చేయకపోతే చాలా శ్రమ అయ్యేది. పద నేనూ వస్తాను” అని చెప్పి సోమేశ్వర్ నాన్న రంగారావు బయలుదేరాడు.
ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ షోరూం చేరుకున్నారు. బైక్ ఇచ్చిన అతనికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. స్కూటీని తోసుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరంవెళ్లగా ఒక ఆటో వీరి ప్రక్కనుంచి వెళ్ళింది. ఆ ఆటోను ఆపి “మీరు ఇంటికి వెళ్ళండి నాన్న నేను వచ్చేస్తాను” అన్నాడు సోమేశ్వర్.
“లేదు నీవు ఒక్కడివే అయిపోతావు నీకు సాయంగా ఉంటాను. కొంత దూరం నీవు, కొంత దూరం నేను బండిని తోసుకుని వెళ్దాం” అన్నాడు రంగారావు.
“పరవాలేదు మీరు ఆటోలో వెళ్ళండి” అని ఆటో ఎక్కించి పంపించాడు వాళ్ళ నాన్నను సోమేశ్వర్.
రంగారావు ఇల్లు చేరిన అరగంట తరువాత సోమేశ్వర్ బండితో ఇంటికి వచ్చేసాడు. ఇంకో అబ్బాయిని ఇంట్లోకి రమ్మని అంటున్నాడు అతను మొహమాటపడుతూ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. సోమేశ్వర్ చెప్పాడు “ఈయన నా అవస్థ చూసి తన బైక్ ఆపి విషయం తెలుసుకుని నన్ను స్కూటీ మీద కూర్చోమని చెప్పి తన బైక్ ను స్టార్టు చేసి స్కూటీ వెనుక అతని కాలు దన్నుపెట్టి బైక్‌ను పోనిస్తూ నన్ను మన ఇంటి వరకు చేర్చారు” అని నవ్వుతూ చెప్పాడు.
కూల్ డ్రింక్ ఇవ్వబోతే తీసుకోలేదు. నిమ్మరసం కలిపిన నీళ్ళు తీసుకుని “ఇతన్ని చూసి కొంత దూరం వెళ్ళిపోయాను. మనసు ఒప్పుకోలేదు. ఆగిపోయాను. సంగతి తెలుసుకుని అలా విడిచి వెళ్ళబుద్దికాలేదు” అని చెప్పాడు ఆ అబ్బాయి.
“మంచి సహాయం చేసావు బాబు. దేవుడే నీ రూపంలో ఆదుకున్నాడు లేకపోతే ఇంత వేగం మా అబ్బాయి ఇంటికి వచ్చేవాడు కాదు. నీ మేలు మర్చిపోలేము” అన్నాడు రంగారావు.
“దానికేముందిలెండి నాకు తోచినది చేసాను, వెళ్తాను” అని చెప్పి బయలుదేరాడు సంతృప్తితో.
“ఆపదలో ఆదుకునే అదృశ్యహస్తం సాయపడడం మన అదృష్టం బాబు. నీవు కూడా నీకు చేతనైన సహాయం ఎవరికైనా చేస్తూ ఉండు బాబూ” అని సోమేశ్వర్‌తో రంగారావు అన్నారు.