[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 70” వ్యాసంలో గుంటూరు లోని బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
గుంటూరు గురించి రాసి రాసి తిరుపతిని కూడా తీసుకొచ్చి గుంటూరులో కలిపేస్తున్నాననుకుంటున్నారా. లేదండీ. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఎక్కడున్నా వైభవంగానే వెలుగొందుతాడు కదండీ. అత్యంత వైభవంగా వెలుగొందుతున్న ఆలయాలనన్నింటినీ ఆ వూరు తిరుపతిగా పిలుచుకుంటారు మనవాళ్ళు. అలాంటి గుంటూరు తిరుపతిని కూడా అనుకోకుండా చూశాము ఒకసారి.
అసలీ ప్రయాణం ఎలా మొదలయిందంటే ఒకసారి మా చెల్లెళ్ళతో కలిసి పెద కాకాని శివాలయానికి వెళ్ళాము. ఆ రోజేదో ఉత్సవం జరుగుతోంది. భక్తులంతా పొంగళ్ళు వండి నైవేద్యాలు పెడుతున్నారు. గుడి కిటకిటలాడుతోంది. ఆ రద్దీలో మేము దైవ దర్శనం చేసుకోలేక వచ్చేశాము. అప్పటినుంచీ మావాళ్ళు నేను వాళ్ళకా గుడి చూపించలేదు అంటూనే వుంటారు. ఒక సారి ఏదో సందర్భంలో అంతా కలిసి వెళ్దామనుకుంటే వెళ్దామనుకుని పెద కాకాని శివాలయం చూశాం. తర్వాత చాలా సమయం వుంది. ఏం చెయ్యాలనుకుని గుంటూరులో ఏదైనా ఆలయం వుంటే వెళ్దామని బస్ కోసం రోడ్డుమీదకొచ్చాం. కాకానికి గుంటూరుకి మధ్య 11 కి.మీ. దూరమే. ఆటోలు కూడా తిరుగుతూ వుంటాయి.
మేము బస్టాప్‌లో నుంచోవటం చూసి ఒక ఆటో అతను వచ్చాడు. మేము గుంటూరు బస్ కోసం చూస్తున్నాం ఆటో వద్దు అని చెప్పాము. అతను గుంటూరు దగ్గరే. ఆటోలో కూడా వెళ్ళచ్చు 20 నిముషాల్లో.. రోడ్డు బాగుంటుంది అన్నాడు. ఇంక ఆగుతామా! పైగా గుంటూరు అనుకున్నాముగానీ, అక్కడ ఎక్కడికెళ్ళాలో తెలియదాయే. ఆటో అతన్నే అడిగాము. ఒక మంచి ఆలయమేదైనా చూపించి తర్వత భోజనానికి ఒక మంచి హోటల్ దగ్గర వదలాలని. అలాగే ఆటో ఎక్కండి ఆలయాలేం చూడచ్చో చెబుతాను అన్నాడు. మాక్కావాల్సిందీ అదేగా. ఎక్కేశాం.
ప్రయాణంలో చెప్పాడు బృందావన గార్డెన్స్‌లో వెంకటేశ్వరస్వామి ఆలయం పది పన్నేండేళ్ళ క్రితం కట్టారని, చూసి తీరవలసినదని ఆ రోజు శనివారం గనుక మేము వెళ్ళేసరికి తీసి వుంటుందని, మిగతా ఆలయాలు కొంచెం అనుమానం అనీ. సరే అక్కడికే వెళ్దామన్నాము. మేము వెళ్ళేసరికి ఆలయం తెరిచే వున్నది. సమయం మించి పోతుందేమోనని ముందు దర్శనానికి వెళ్ళాము గబగబా. నైవేద్యం జరుగుతున్నది. మేము వెళ్ళాక తెర తీశారు.
అబ్బో!! ఏం వెలిగిపోతున్నాడండీ వెంకన్నబాబు!! అత్యంత సుందరమైన అలంకరణ. ఒకదానితో ఒకటి పోటీ పడే అందమైన పూల హారాలు. గుడి మూసే సమయం కదా భక్తులు ఎక్కువమంది లేరు. తృప్తిగా దర్శనం చేసుకుని బయటకి వచ్చాము. అప్పుడు తెలుసుకున్నాము ఆలయం గురించి.
ఈ ఆలయం గుంటూరు బృందావన గార్డెన్స్ ఐదో లైనులో వున్నది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయం అంటే గుంటూరులో ఎవరైనా చెప్పేస్తారు. ఇక్కడి పూజలు, ఉత్సవాలు అన్నీ దాదాపు తిరుమలలో జరిగే ఉత్సవాలలాగే వుండటంతో దీనిని భక్తులు గుంటూరు తిరుపతిగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవాలు ఇలా నిర్వహించటానికి పాలక మండలి కృషి చేసింది. నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. స్వామివారికి కావాల్సిన ఆభరణాలు, అలంకారాలన్నీ భక్తులే సమకూర్చారు. శ్రీ కంచి కామకోటి పీఠానికి దత్తత ఇచ్చారు. వారి ఆశీస్సులతో ఇక్కడి కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటారు.
ఆలయం విశాలమైన తోటలో వున్నది. దీనిపేరు అన్నమయ్య తోట. స్వామి దర్శనానికి వచ్చిన వారు కొంత సేపు ఇక్కడ తమవారితో సేద తీరవచ్చు. గీతోపదేశం, తెలుగుతల్లి విగ్రహం, కైలాస దృశ్యం, అన్నమయ్య విగ్రహం, మొదలైనవి ఇక్కడ చూడచ్చు. ఇందులో నిర్మించబడిన అన్నమయ్య కళావేదికకు చాలా ప్రత్యేకత వున్నది. ఇక్కడ సంవత్సరంలో 365 రోజులపాటు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే వుంటుంది. ఈ వేదిక మీద కార్యక్రమం నిర్వహించటానికి కనీసం మూడు నెలల ముందు నమోదు చేసుకుంటేనేగానీ ఈ వేదిక లభ్యం కాదట. ఏ కాలమైనా కార్యక్రమాలు ఏ ఆటంకం లేకుండా నిర్వహించుకోవటానికి వీలుగా సెల్లార్, పద్మావతి కల్యాణ వేదిక వున్నాయి.
అంతేకాదు ఇక్కడ ఒక సువిశాలమైన యాగశాల కూడా వున్నది. ఉత్సవ సమయాల్లోనే కాక మిగతా సమయాల్లో కూడా యజ్ఞ యాగాదులు నిర్వహించటానికి ఇక్కడ తగిన ఏర్పాట్లు వున్నాయి. ఈ యాగశాల పక్కనే నవగ్రహ ఆలయం కూడా వున్నది. భక్తులు గ్రహదోష నివారణకు సంబంధించిన పూజలు ఇక్కడ చేయించుకుంటారు.
2011లో యాగశాల పక్కన ఒక మూడంతస్తుల భవనం మొదటి అంతస్తులో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇందులో శ్రీ లంకా సూర్యనారాయణగారు సేకరరించిన దాదాపు లక్ష పుస్తకాలున్నాయి. నేనీ ఆలయాన్ని దర్శించటానికన్నా ముందే ఈ గ్రంథాలయంలో నా యాత్రా దీపికలు చోటు చేసుకున్నాయి. ఆ గ్రంధాలయాన్నీ, ఆలయాన్నీ దర్శించటానికి రమ్మని అప్పుడు వారు చెప్పినా, కుదరక వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆలయం మూసే సమయం కదా మాకు తెలిసినవారెవరూ లేరు. అందుకే గ్రంథాలయం చూడలేక పోయాము.
ఈ ఆలయ కమిటీ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ అటు మాధవ సేవతోబాటు ఇటు మానవ సేవ కూడా చేసి తరిస్తున్నారు.
ఆలయ దర్శనమయింది కదా. ఇంక ఆత్మారాముణ్ణి శాంత పరచటానికి బయల్దేరాము.