ఒక్క పుస్తకం-9

16
3

[box type=’note’ fontsize=’16’] తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల ‘ఒక్క పుస్తకం‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 9వ భాగం. [/box]

40

[dropcap]ఏ[/dropcap] సుముహుర్తాన సినిమా మొదలెట్టారో ఏమోకాని, ఏ రోజు ఒక ఆటంకం కాని, ఒక విఘ్నంకాని, ఒక సమస్య కాని, ఒక ఇబ్బంది కాని, ఏమి లేకుండా అనుకున్న టైం కన్నా ఒక నెల ముందే పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా సినిమా అంతా పూర్తయింది. కోనసీమలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, సారధీ స్టూడియోస్‌లో, రాయోజీ ఫిల్మ్ సిటీలో ఘాటింగ్స్ జరిగాయి.

ప్రారంభోత్సవం రోజున చేసిన పూజలు ఫలించి సినిమా దిగ్విజయంగా పూర్తయింది. చిత్ర బృందంలోని సభ్యులందరూ కలిసి ఆ రోజున చేసిన సత్సంకల్పం సిద్ధించి ఈ సత్ఫలితాన్నిచ్చిందనేది నిర్వివాదాంశం. ఇక పిక్చర్ రిలీజ్ కావడం, ప్రేక్షకుల మన్ననలను పొందడం, విజయాన్ని వరించడమే తరువాయి.

డైరెక్టర్ విశ్వంగారి చొరవ మూలంగా పిక్చ్‌ర్ రిలీజ్ చేయడానికి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ముందుకొచ్చారు. కావలసినన్ని ధియేటర్లు కూడా సునాయాసంగానే లభించాయి. రిలీజ్ డేట్ కూడా నిర్ణయించారు.

41

రేపే పిక్చర్ రిలీజ్ కాని ఈ రోజే సారధీ స్టూడియోస్ ప్రీవ్యూ ధియేటర్‌లో ఆహ్వానితుల ముందు చిత్రాన్ని ప్రదర్శించారు. డైరెక్టర్ విశ్వంగారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఆ సినిమాను చూసి సదానంద్‌ను బాహాటంగా అభినందించకుండా ఉండలేక పోయారు.

డైరెక్టర్ విశ్వం సదానంద్‌ను కౌగలించుకుని….

“సినిమా చాలా బాగా వచ్చింది. డెఫెనెట్‌గా సక్సెస్ అవుతుంది. నువ్ నా శిష్యుడైనందుకు చాలా గర్వంగా వుంది” అన్నాడు.

డైరెక్టర్ విశ్వం కాళ్లకు నమస్కరించడం తప్ప నోట మాట కరువైంది సదానంద్‌కి. ఘాటింగ్ ఉందంటూ డైరెక్టర్ విశ్వం అక్కడ నుండి నిష్క్రమించారు.

ఆ తరువాత మీడియా ప్రతినిధులు సదానంద్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అందరి ప్రశ్నలకు ఓపిగ్గా సవివరంగా సమాధానాలు చెప్పాడు సదానంద్.

ప్రశ్న: ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, డైరెక్టర్ కదా…. అందరూ కొత్త వారితో సినిమా తీయాలని మీకెందుకనిపించింది?

జవాబు: అందుకు మొదటి కారణం లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమా తీయాలనుకోవడం. రెండో కారణం, నా సినిమాలోని ప్రాతలకు అనుభవం ఉన్న పెద్ద నటీనటులు అవసరం లేదు, ఫ్రెష్ లుక్‌తో నార్మల్‌గా కనిపించే ఫేసెస్ సరిపోతాయి. లక్కీగా అందరూ నేను కోరుకున్న విధంగా ఉండే వ్యక్తులు నా సినిమాలో నటీనటులుగా లభించారు. ఆ మాటకొస్తే, డిపార్ట్‌మెంటల్ హెడ్స్, సాంకేతిక నిపుణులు అందరూ నాకు సరిపడేవారు కావడం నా అదృష్టమనే చెప్పాలి.

ప్రశ్న: ప్రేక్షకులు మీ సినిమాను ఆదరిస్తారని మీరు నమ్ముతున్నారా?

జవాబు: తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకంటే ఈ చిత్రంలోని పాత్రలు ప్రేక్షకులకు ఎక్కడోచోట తారసపడే వుంటాయ్. నిత్యం మనం మన చుట్టూ వున్న సమాజంలో వింటున్న, చూస్తున్న సంఘటనలే ఈ సినిమాలోని సన్నివేశాలు. మాస్ మసాలా లేకపోయినా ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ చివరిదాకా ఆ కథతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు.

కాకపోతే ప్రేక్షకుల్లో కూడా సినిమా చూసే విధానంలో మార్పురావాలి. సినిమాకు వెళ్లే ముందే ఈ సినిమా బాగుందని, ఈ సినిమా బాగుంటుందని… అనే అభిప్రాయంతో వెళ్లకూడదు. ఎందుకంటే కథాంశం, కథా నేపథ్యం, అందించే సందేశం, సినిమా తీసే విధానం ఒక్కో సినిమాకు, ఒక్కో రకంగా వుంటుంది. ఒక సినిమాకు మరో సినిమాకు పోలికే వుండదు. దేనికదే ఒక మంచి సినిమా. అందుకే సినిమాకు ఓపెన్ మైండ్ తోనే వెళ్ళాలి. సినిమాను సినిమాలాగా చూడాలి. ప్రేక్షకుడు ధియేటర్‌లో కూర్చోగానే ఆ సినిమా పైనే దృష్టిని కేంద్రీకరించి చూస్తూ దాన్నే ఆస్వాదించాలి. ఆనందించాలి. ఆదరించాలి. అంతే కాని, తాము అభిమానించే హీరో సినిమా అయితే బాగుందని, వేరే హీరో సినిమా అయితే బాగాలేదని దుష్ప్రచారం చేయడం బాధాకరం. ప్రేక్షకులకు మూడు గంటల పాటు వినోదం పంచడానికి ఒక సినిమా తీయడం కోసం కోట్ల కొద్ది డబ్బును పెట్టుబడి పెట్టడమే కాకుండా, దాని వెనుక కొన్ని వందల మంది కఠోర శ్రమ, అకుఠింత దీక్ష సడలని పట్టుదల, అవిరళ కృషి, కనిష్టంగా మూడు వందలరోజుల తిరిగిరాని సమయం ఉంటాయని ప్రేక్షకులు కూడా గ్రహించాలి. అప్పుడే వాళ్లు ఆ సినిమాను సరైన రీతిలో చూడగలుగుతారు. సముచితంగా గౌరవించగలుగుతారు.

ప్రశ్న: మీ సినిమా చాలా చిన్న సినిమా కదా అయినా పైరసీ ప్రభావం ఉంటుందనుకుంటున్నారా?

జవాబు: పైరసీ భూతానికి చిన్నా, పెద్దా అనే తారతమ్యం ఉండదు. అందుకు మా సినిమా అతీతం కాదు. ఈ భూతాన్ని తుదముట్టించాలంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సహకారం కావాలి. అడ్డదారుల్లో దొంగచాటుగా తీసిన వీడియోలను చూడకూడదని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి. అలాంటి వీడియోలు మార్కెట్లో ఉన్నట్లు ఏ మాత్రం సమాచారం ఉన్నా, వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు, నిర్మాతలకు, దర్శకులకు తెలియజేయాలి. ఈ పైరసీ మహమ్మారిని అంతమొందించే దాకా అందరూ కలిసికట్టుగా నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న: “ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది.” అనే టైటిల్‌తో సినిమా తీశారు కదా! దీని ద్వారా సమాజానికి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

జవాబు: వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్రజలలో పుస్తక పఠనంపై ఆసక్తి కొరకవడింది. అందువల్ల పుస్తక విక్రయాలు గణనీయంగా పడిపోయాయ్. బుక్ పబ్లిషర్స్ కూడా మునుపటిలా పుస్తకాలను పబ్లిష్ చేయడంలేదు. ఆర్థిక స్తోమత వున్న కొంత మంది రచయితలు సొంత ఖర్చలతో ప్రింట్ చేయించుకుని వాటిని మార్కెటింగ్ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇక స్తోమత లేని రచయితలు కోకొల్లలు. అలాంటి వారి రచనలను పట్టించుకునే నాథుడు లేక, ఆ రచయితలందరూ ప్రస్తుతం అజ్ఞతవాసంలో వున్నారు. ఎంతో విలువైన వారి రచనలు మరుగున పడిపోతున్నాయ్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఏదో ఒక నాటికి పుస్తకాలు కనుమరుగయి పోయే ప్రమాదం లేక పోలేదు.

నిజానికి మన పుస్తకాల్లో మన సంప్రాదాయాలు, సంస్కారాలు, జీవిన విధానాలు, ఘనచరిత్రలు, ఎన్నో…. ఎన్నెన్నో… పొందుపరచబడ్డాయ్. శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు, అన్ని ఆ పుస్తకాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. పుస్తకాలు వినోదం కోసమే కాదు… విజ్ఞానం కోసం కూడా దోహదపడతాయి. అలాంటి పుస్తకాల ప్రచురణలు ఆగిపోతే భావితరాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. చదువుకునే పిల్లలు విషయానికి వస్తే వాళ్లని పుస్తకాలకు ఎంత చేరువగా ఉంచితే వారు అంతగా వాళ్ల చదువుల్లో రాణిస్తారని ఇటీవల ఒక సర్వే తేల్చింది. పుస్తకాలనకు దగ్గరయ్యే కొద్దీ, పిల్లలు ఎక్కువ పుస్తకాల పేర్లు గుర్తుంచుకుంటారట….

అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనాన్ని దిన చర్యలో ఒక భాగంగా అలవాటు చేయాలి. అన్ని విధాలా పుస్తకాలను ఆదరించాలి. రచయితలను ప్రోత్సహించాలి.

ఆ దిశగా ఒక సందేశాన్ని సమాజానికి అందించాలనే ఆశయంతో ఆ టైటిల్‌తో సినిమా చేశాం. ఒక్క పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది. అనేది పచ్చి నిజం. ఇదమిద్ధంగా చెప్పలేం కాని ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గంలో పుస్తకం ద్వారా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరకుతుంది. ఇది తథ్యం. ఈ సినిమాలో సదానంద్, మహేంద్ర, లావణ్యల జీవితాలను ఆ విధంగా మార్చేసింది ఆ పుస్తకం. మీరే చూశారు కదా అలాగే పుస్తకాలు చదివే ప్రతి ఒక్కరి భవిష్యత్తుని తప్పనిసరిగా విజయం వైపు నడిపిస్తాయ్… ఆ పుస్తకాలు.

ప్రశ్న : మరి మీరు అందిరిలా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ప్రిరిలీజ్ ఫంక్షన్ నిర్వహించలేదు. కనీసం సక్సెస్ మీట్ అన్నా పెడ్తారా?

జవాబు: వ్యక్తిగతంగా అలాంటి ఫంక్షన్లంటే నాకు ఇష్టం ఉండదు. అయినా అలాంటి ఫంక్షన్లను జరుపుకునే స్థాయి ప్రస్తుతం మా బ్యానర్‌కు లేదు. మా మొదటి మూడు సినిమాలు వరకు ఇదే వర్తిస్తుంది. ఇక నాలుగో సినిమా నుండి మీరడిగిన వాటి గురించి తప్పక ఆలోచిస్తాను.

ప్రశ్న: అలాంటి ఫంక్షన్లతోనే కదా… మంచి పబ్లిసిటీ వచ్చేది మరి మీ సినిమాకి పబ్లిసిటీమాటేంటి?

జవాబు: న్యూస్ పేపర్లలో టి.వి ఛానెళ్ళలో పబ్లిసిటీ కోసం కొంత బడ్జెట్ కేటాయించాము. బహుశా ఈ పాటికే మా యాడ్స్ మీరు చూసేవుంటారు. ఆ తరువాత మీరంతా ఉన్నారు. మా సినిమా చూశారు కదా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అందరికి తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను. అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు, వారికి నిజంగా నచ్చితే… బాగుందని… పది మందికీ తప్పకుండా చెప్తారు. అంతే కాని, మా అంతట మేము ఈ సినిమా గొప్పదనం గురించి బాకా ఊదదలుచుకోలేదు. దయచేసి మా అభిప్రాయాన్ని సకారాత్మకంగా అర్థం చేసికొని, మీ సంపూర్ణ సహకారాన్ని అందజేసి, మా సినిమా విజయానికి మీవంతు సహకారాన్ని అందించగలందులకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థింస్తున్నాను.

సదానంద్ చెప్పిన విషయాలను విని హర్షాతిరేకంతో అందరూ చప్పట్లు కొట్టారు. సదానంద్ అందరి దగ్గరకు వచ్చి కరచాలనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేయడంతో సమావేశం ముగిసింది.

అందరూ ఇళ్లకు వెళ్ళారు. యూనిట్ సభ్యులెవరికీ ఆ రాత్రి తిండి సహించలేదు. నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు, రేపే మనసినిమా రిలీజ్. ఏమౌతుందో… ఏమో… మన సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా… సక్సెస్ అవుతుందా… మన శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందా… ఏం జరుగుతుందో… ఏమో… అనుకుంటూ ఎడతెగని ఆలోచలతో ఆ రాత్రంతా జాగరణ చేశారు.

42

ఉదయం 8 గంటలకే చిత్ర బృందం అంతా ఆఫీసుకు వచ్చి మీటింగ్ హాల్లో సమావేశమై ఎవరికి తోచిన విధంగా వారు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో అలజడి ఆత్రుత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయ్. పైకి చెప్పడం లేదు కాని అందరి మనసులు ఒక విధమైన భయాందోంళనలకు గురవుతున్నాయ్. ఏం వినాల్సి వస్తుందో ఏమో అనే ఉత్కంఠ. తమ సినిమా విజయం కోసం అందరూ మనసులోనే ఆ దేవుడ్ని వేడుకుంటూ సదానంద్ కోసం ఎదురు చూస్తున్నారు.

అప్పుడే సదానంద్ ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా మీటింగ్ హాల్లోకి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అందరూ తమ తమ ఆసనాల్లో ఆశీనులయ్యారు. అంతా నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడటానికి సాహసించడం లేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మాట్లాడటానికి ఉపక్రమించాడు సదానంద్.

“మీ అందర్నీ పరిశీలనగా చూస్తూ మీ మానసిక పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాను. ఈ సమయంలో మీకు కొన్ని విషయాలను చెప్పదలిచాను. శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు.

‘నీ కర్తవ్యాన్ని నీవు త్రికరణ శుద్ధిగా నిర్వర్తించు. ఫలితం కోసం ఎదురుచూడకు. అది నీ కర్మానుసారం నీకు లభిస్తుంది.’

ఈ మాటలను ప్రస్తుతం మనందరి మానసిక స్థితికి అనునయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా చూసినట్లైతే, మనమంతా కలిసి సమిష్టి కృషితో సినిమా తీశాం. అది సక్సెస్సా… ఫెయిల్యూరా అనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. సరేనా?

ఇంకో విషయం…. విజయానికి పొంగిపోకూడదు.అలా జరిగితే మనకు గర్వం పెరుగుతుంది. ఆ గర్వంతో తరువాత సినిమాపై అలసత్వం, నిర్లక్ష్యం కూడా పెరుగుతాయి.

అలాగే… అపజయానికి కుంగిపోకూడదు. అలా జరిగితే మనలో నిరాశా, నిస్పృహలు పెరుగుతాయి. వాటితో తరువాత సినిమాపై నిరాసక్తత, నిర్లిప్తత కూడా పెరుగుతాయి.

జయాపజయాల ప్రభావం మన మీద పడితే అది దుష్పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ఆ ప్రభావానికిలోను కాకుండా మీరంతా స్థిరచిత్తులై జయాపజయాలను సమాభావంతో చూడండి.

అదృష్టవశాత్తు మీడియా మనకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ రోజు అన్ని పత్రికలు, మన సినిమా గురించి చాలా పాజిటివ్‌ రివ్యూసే ఇచ్చాయి. అది చాలా సంతోషించ దగ్గ విషయం.

ప్రస్తుతం మన మంతా గ్రూపులుగా విడిపోదాం. ఒక్కో గ్రూపులో ఐదారుగురు ఉండాలి. ఒక్కో గ్రూపు ఒక్కో ఏరియాకు వెళ్లి అక్కడ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడాలి. అలా చూస్తూ, ప్రేక్షకుల కామెంట్స్‌ని వినాలి. వాళ్ల మనోభావాలు తెలుసుకోడానికి ప్రయత్నించాలి. అవి పాజిటివ్ కావచ్చు…. నెగటివ్ కావచ్చు. మనం రెండూ తెలుసుకోవాలి. తిరిగి రాత్రి 8 గంటలకు మన మంతా ఇక్కడే కలుద్దాం. మనందరం కలిసి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, సహేతుకమైన విశ్లేషణ చేద్దాం. ఆ విశ్లేషణ ద్వారా మన సినిమా భవితవ్యం గురించి మనం తెలుసుకో గులుగుతాం. అదే సమయంలో ఉపయుక్తమైన సూచనలు, సలహాలు కూడా మనకందుతాయి. వాటిని మన తదుపరి సినిమాల్లో ఉపయోగించుకుందాం. ఓ.కే లెట్ అజ్ డిస్పర్స్ నౌ… బయలుదేరుదాం పదండి…” అంటూ సదానంద్ లేచి నిల్చున్నాడు. కరతాళ ధ్వనుల మధ్య అందరూ తదుపరి కార్యాచరణకు ఉద్విక్తులయ్యారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here