సంభాషణం: శ్రీ సంజయ్ చౌధురితో ముఖాముఖి

0
5

[box type=’note’ fontsize=’16’] ‘మనసులోని ప్రేమను సంగీతం ద్వారా వ్యక్తం చేయడం నాన్నకు ఇష్టం’ అంటున్న సంజయ్‌ చౌధురితో వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ జరిపిన సంభాషణం. [/box]

[dropcap]కొం[/dropcap]దరితో ఎప్పుడు ఎలా పరిచయం అవుతుందో తెలియదు! కన్నడ చిత్రం ‘ఉదర్ఘ’కు సంబంధించిన మీడియా సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్‌ నుండి బెంగళూరుకు వెళ్ళిన పాత్రికేయుల బృందంలో నేనూ ఒకడిని. వివిధ భాషల్లో ‘ఉదర్ఘ’ సినిమా ట్రైలర్‌ను బెంగళూరులో ఆ రోజు సాయంత్రం ఆవిష్కరించారు. అక్కడే వేదికపై సంగీత దర్శకుడు సంజయ్‌ను మీడియాకు పరిచయం చేశారు. మొట్టమొదటిసారి ఆయన కన్నడ చిత్రానికి సంగీతం సమకూర్చారని చెప్పారు. అతి నిరాడంబరంగా, కాస్తంత కురచగా, గుబురు మీసాలతో, కళ్ళజోడుతో ఉన్న ఆయన్ని చూడగానే… నిజం చెప్పాలంటే… నాకు పెద్దంత ఇంప్రషన్ కలగలేదు. అయితే… ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు సలిల్ చౌధురిగారి అబ్బాయి అని వ్యాఖ్యాత చెప్పగానే నేను ఒక్కసారిగా అలర్ట్ అయ్యాను. శ్రీ సలిల్‌ చౌధురిని ప్రత్యక్షంగా చూడకపోయినా… ఆయన స్వరపరిచిన అద్భుతమైన పాటలను వింటూ పెరిగిన వాడిని. ఆయన ఎంత గొప్ప చిత్రాలకు సంగీతం సమకూర్చారో చెప్పడం మొదలు పెడితే… పుటలు సరిపోవు. చిత్రం ఏమంటే నాకెంతో ఇష్టమైన ఆమిర్ ఖాన్ ‘సర్ఫరోష్‌’కు సంజయ్ నేపథ్య సంగీతం అందించారనే విషయమూ నాకప్పుడే తెలిసింది. దాంతో అప్పటికప్పుడు సంజయ్ గురించి నెట్‌లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. సంజయ్ ఆ తండ్రికి తగ్గ తనయుడు అనడంలో ఎలాంటి సందేహమూ నాకు కలగలేదు. ఆ మర్నాడు ఆయనతో ఎలాగైనా కాసేపు ముచ్చటించాలనే కోరిక కలిగింది. ప్రొడక్షన్ మేనేజర్‌తో మాట్లాడితే, మేం స్టే చేసిన హోటల్ లోనే ఆయన కూడా దిగారని చెప్పాడు. ఈ లోగా ప్రముఖ మ్యూజికాలజిస్ట్ ‘హాసం’ రాజా గారితో ఫోన్‌లో మాట్లాడి, సలిల్ దా గురించి మరికొంత సమాచారం సేకరించి సిద్ధంగా పెట్టుకున్నాను. దాంతో సంజయ్‌తో నా సంభాషణ సజావుగా సాగిపోయింది. ఉదయం హోటల్‌లో అల్పాహారం చేస్తూ దాదాపు గంట పాటు ఆయనతో జరిపిన ముఖాముఖీ ఇది. నవంబర్ 19వ తేదీ సలిల్ చౌధురి జయంతి సందర్భంగా ఆయన కుమారుడు సంజయ్ తో జరిగిన ఇష్టాగోష్టిని సంచిక పాఠకులతో పంచుకుంటున్నాను.

***

♣ సలిల్ చౌధురి పేరు ప్రస్తావిస్తే చాలు… ఆయన స్వరపర్చిన వందలాది పాటలను అలవోకగా ఇప్పటికీ పాడే సంగీత ప్రియులు ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. అసలు అప్పట్లో మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది?
సంజయ్: ఎప్పుడూ సంగీతం వినిపిస్తూ ఉండేది. ఉదయం ఒక రకం, మధ్యాహ్నం ఓ రకం, రాత్రికి మరో రకం. నాన్నగారు ఉదయం లేవగానే క్లాసికల్ మ్యూజిక్ వినేవారు, మధ్యాహ్నం జానపద సంగీతం వినేవారు, రాత్రిళ్ళు వెస్ట్రన్ క్లాసిక్ వినేవారు. ప్రతి రోజూ దాదాపుగా ఇలానే ఉండేది. నా రెండేళ్ళ వయసు నుండీ పదిహేనేళ్ళ వరకూ మా ఇంట్లో నేను ఇదే విన్నాను. నాన్నగారి పాటల్లో వెస్ట్రన్ క్లాసికల్‌ను ఇండియన్ క్లాసికల్‌లో మిక్స్ చేయడం మనం చూడొచ్చు. అంతేకాదు… ఆయన స్వరాల్లో అస్సాం, కేరళ, బంగ్లా జానపదాలు మనకు కనిపిస్తాయి. విశేషం ఏమంటే… ఆయన మాదిరిగా డిఫరెంట్ మెలోడీస్‌ను వేరెవరూ కంపోజ్ చేయలేదు. ఆయన స్వరాల్లో ఓ మ్యాజిక్ ఉండేది. వాటిని పాడటం చాలా కష్టం. అయినా గాయనీ గాయకులు ఎంతో ఇష్టంతో వాటిని పాడేవారు. ‘మధుమతి’లోని పాటలు అలాంటివే. ‘చద్ గయో పాపి బిచువా’ పాటలో అస్సామీ ఫోక్ మిక్స్ అయి ఉంటుంది. అలానే ‘సుహానా సఫర్ …’ పాట వింటే దానిని పాడటం ఎంత కష్టమో అర్థమవుతుంది. ‘ఆనంద్’ మూవీలోని గీతాలు ఆ కోవలోకే వస్తాయి. ముఖ్యంగా ‘మైనే తెరే లియే హీ సాత్ రంగ్ కే సప్నేచునే’ పాట పాడటం చాలా కష్టం. ఇవన్నీ శ్రావ్యమైన గీతాలు కావడంతో అందరూ పాడటానికి ఇష్టపడుతుంటారు. నాన్నగారు చాలా డిఫరెంట్ నోట్స్‌తో చేసినవి ఇవి. ఆయన సంగీతంలోని మ్యాజిక్ అది!

♣ ఆయనతో కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయా?

సంజయ్: దక్షిణాదికి వస్తే ఆయనతోనే ఉండేవాడిని. ముఖ్యంగా మద్రాస్‌కు నాన్నతో వస్తుండేవాడిని. ఆరేళ్ళ వయసు నుండీ ఆయన నన్ను వెంట పెట్టుకుని తిప్పుతుండేవారు. నేను బయట ఆడుకుంటూ ఉంటే… ఆయన కంపోజ్ చేసుకుంటూ ఉండేవారు. కాస్త వయసు వచ్చాక నాన్నదగ్గర కూర్చుని, ఎలా కంపోజ్ చేస్తున్నారో గమనిస్తూ ఉండేవాడిని. ఆయనతో పాటు రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లేవాడిని. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాయిద్యాన్ని నేర్చుకోవాలని నాన్న చెబుతుండేవారు. అలా నేను పియానో ట్రినిటీ కాలేజీ ద్వారా నేర్చుకున్నాను. నిజానికి నాకు సంగీతంలో కంటే క్రీడల్లో ఎక్కువ ఆసక్తి ఉండేది. బాక్సింగ్ చేసే వాడిని. స్టేట్ ఛాంపియన్ అయ్యాను. నేషనల్స్‌కూ వెళ్ళాను. ఆ తర్వాత అథ్లెటిక్స్ అభ్యసించాను. జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. సంగీతం అప్పట్లో నాకు సెకండరీగా ఉండేది. అన్నయ్యను సంగీత దర్శకుడు చేయాలని నాన్న అనుకున్నారు. కానీ తను కంప్యూటర్స్ వైపు వెళ్ళాడు. మా చెల్లి అంతర ఆరేళ్ళ వయసులోనే పాటలు పాడింది. నాన్న సంగీతం అందించిన ‘మిను’ అనే హిందీ సినిమాలో మన్నా డే, ఆశా భోంస్లేతో కలిసి పాడింది. నిజానికి సంగీతం అనేది తన రక్తంలోనే ఉందనిపిస్తుంది. నాన్న ఇంట్లో స్వరాలు సమకూర్చుతుంటే… తను బాత్ రూమ్ లోని టబ్‌లో స్నానం చేస్తూ పాట పాడేస్తుండేది. అమ్మ ఈ విషయం గమనించి ‘మీరోసారి అంతర పాట వినండి… మీ స్వరాలకు తగ్గట్టుగా పాడుతోంది’ అని చెప్పింది. దాంతో నాన్న తన దగ్గర కూర్చోపెట్టుకుని పాడమంటే అద్భుతంగా పాడేసింది. ఓ రకంగా నాన్నగారి సంగీత వారసత్వాన్ని మా చెల్లెలు కొనసాగిస్తోందని చెప్పాలి. నాన్న సంగీతం మీద రీసెర్చ్ చేయడంతో పాటు ఓ మ్యూజిక్ స్కూల్ కూడా నిర్వహిస్తోంది.

♣ నాన్నగారి జ్ఞాపకాలు ఇంకా మిమ్మల్ని వెంటాడుతున్నవి ఏవైనా ఉన్నాయా?

సంజయ్: ఆయన చాలా ఎమోషనల్ పర్సన్. అదే నాకూ అబ్బింది. నాన్నగారు కవితలు బాగా రాసేవారు. తన భావాలను, తన స్పందనను కవిత రూపంలో వ్యక్తం చేసేవారు. ఆ లక్షణం నాకు అబ్బలేదు. నేను నా స్పందనను ఫిజికల్‌గా వ్యక్తం చేస్తుండేవాడిని. దానిని ఆయన హర్షించే వారు కాదు. అది సరైనది కాదని నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేసేవారు. ‘నీ మనసులోని భావాలను కాగితం మీద పెట్టడం చేతకాకపోతే ఎవరితో నైనా వాటిని పంచుకో, వారి ద్వారా నీ భావాన్ని వ్యక్తం చేయి’ అనేవారు. అదీ కుదరని పక్షంలో పాటడం ద్వారా దానిని బయట పెట్టమనేవారు. అలాంటి భావనే ఉన్న వారికి ఆ పాట కనెక్ట్ అవుతుందని, సంగీతానికి ఉన్న గొప్ప శక్తి అదేనని చెప్పేవారు.

♣ ఆయన నుండీ మీరు నేర్చుకున్న లక్షణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?

సంజయ్: నేల మీద నిలబడటం అనేది ఆయనలోని ఓ గొప్ప గుణం. ఎంత ఎత్తుకు ఎదిగినా మన పాదాలు నేలపైనే ఉండాలని చెప్పేవారు. ఎప్పటికీ నేలతల్లిని విస్మరించవద్దనే వారు. తోటి మనుషుల్ని, మన చుట్టూ ఉన్న పక్షులను, చెట్లను, పుట్టలను ప్రేమించమనే వారు. ఆ ప్రేమను సంగీతం ద్వారా వ్యక్తపరచమని చెప్పేవారు. ఓ వ్యక్తి ఎలాంటి వాడో అతను వినే సంగీతం ద్వారా తెలుసుకోవచ్చన్నది నాన్నగారి అభిప్రాయం. సంగీతం అనేది పారదర్శకమని ఆయన నమ్మకం.

♣ ఆయనలో మీకు నచ్చిన గుణం?

సంజయ్: ఆయన ఫ్రీడమ్ ఫైటర్. బ్రిటీషర్స్‌కు వ్యతిరేకంగా కవితలు రాసి, పాడేవారు. ఇద్దరు ముగ్గురు మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి పల్లెలు, పట్టణాలకు వెళ్ళేవారు. ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చేసేవారు. అందువల్లే ఆయనకు జానపదాలతో అనుబంధం ఏర్పడింది. ప్రజాకవుల గీతాలు సైతం బాగా పాడేవారు. వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో, రైతు పోరాటాలలో పాల్గొనేవారు. టాటా బిర్లా వంటి ధనికుల పక్షాన కాకుండా మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రతినిధిగా ఉండేవారు. బస్సుల్లోనే తిరిగేవారు. ప్రజలతో కలిసి మెలిసి ఉంటూ నేల మీదే ఆహారం తీసుకునే వారు. టేబుల్, కుర్చి వంటివి వాడేవారు కాదు. ఆ మట్టినేల నుండి తాను వచ్చానని భావించేవారు. ఆయన సిద్ధాంతమే అది… అదే ఆయన కవితల్లో, సంగీతంలో మనకు కనిపిస్తుంది. విశేషం ఏమంటే… అదే సమయంలో ఆయన వైవిధ్యమైన సంస్కృతుల గురించి తెలుసుకున్నారు. జీవితంలో ఎప్పుడూ విదేశాలకు వెళ్ళింది లేదు. ‘భారతదేశం ఎంతో విశాలమైంది. దీనిని అధ్యయనం చేయడానికి, ఇక్కడి ప్రదేశాలను చూడటానికే జీవిత కాలం సరిపోదు… ఇక బయటకు వెళ్ళి ఏం చేయాలి?’ అనేవారు! అటు హిమాలయాల నుండీ ఇటు కన్యాకుమారి వరకూ ఆయన ప్రజలను, వారి జీవితాలను అధ్యయనం చేయడానికి ప్రయాణించేవారు. దేశంలోని భిన్న సంస్కృతులను గురించి తెలుసుకుని, జానపద సంగీతాన్ని అధ్యయనం చేసేవారు. అలా చేస్తేనే మంచి సంగీతం ఇవ్వగలమన్నది ఆయన భావన.

♣ సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీకు బాగా నచ్చే వ్యక్తి?

సంజయ్: ఇక్కడ ఎంతో మంది జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. చిత్రం ఏమంటే వాళ్ళంతా నాన్న గారిని జీనియస్ గా, మాస్టర్ గా భావిస్తుంటారు. అది నాకు గర్వకారణం. ఎందుకంటే ముంబైలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా వాళ్ళకు స్వర రచన తెలియదు. ఇక్కడ ఇళయరాజా గారి వంటి సంగీత దర్శకుడిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన లాంటి గొప్ప విద్వాంసులు అరుదుగా ఉంటారు. వెయ్యికి పైగా చిత్రాలకు ఆయన సంగీతం అందించారంటే అబ్బురమనిపిస్తుంది.

♣ ‘సర్ఫరోష్’తో మీరూ సంగీత దర్శకులు అయ్యారు. ఆ అవకాశం ఎలా వచ్చింది?

సంజయ్: నేను సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించాను. ముంబైలో స్టూడియో కూడా ఉంది. చిన్న చిన్న జింగిల్స్‌కు మ్యూజిక్ కంపోజ్ చేస్తుండేవాడిని. జాన్ మాథ్యూస్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఆయన యాడ్స్‌కు నేను సంగీతం అందించాను. ఓ రోజు ఇంటికి పిలిచి ‘సర్ఫరోష్’ కథను ఐదారు గంటల పాటు వినిపించారు. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఆమీర్ ఖాన్‌తో చేద్దామనుకుంటున్నానని అన్నారు. అన్నట్టుగానే ఆమీర్ డేట్స్ దొరికాయి కాకపోతే ఐదేళ్ళ తర్వాత! అప్పుడు నన్నే నేపథ్య సంగీతం ఇవ్వమని కోరాడు. ఓసారి నాన్నగారిని మనసులో తలుచుకున్నాను. ఏదైనా సన్నివేశంలో ఎక్కడ సంగీతం మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ దాని అవసరమే ఉండదనేది ఆయన దగ్గర అప్పటికే నేర్చుకుని ఉన్నాను కాబట్టి భయపడలేదు. హాయిగా పని పూర్తి చేసేశాను. నిజానికి సంగీతం అందించడానికి శిక్షణ అవసరం. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే కష్టం. నాకు అది మా నాన్న వంటి లెజెండ్‌తో కలిసి చేసిన ప్రయాణంతో అబ్బింది. ఆయన నుండీ అందుకున్న ‘చిప్’ ను నేను సేవ్ చేసుకుని నా మనసులో పెట్టేసుకున్నాను. నిజానికి నేను సంగీత పరంగా మాస్టర్ నో, లెజెండ్ నో కాదు. కానీ నాన్న నుండి లభించిన ఆ ‘చిప్’ ఇవాళ నాకెంతో ఉపయోగపడుతోంది.

♣ దక్షిణాదిలోనూ మీరు కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. ముఖ్యంగా ‘ఉద్ఘర్ష’ చిత్రంతో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ మూవీ గురించి ఏం చెబుతారు?

సంజయ్: స్టోరీ బేస్డ్ మూవీస్ కు సంగీతం అందించడం నాకు మొదటి నుండీ అలవాటు. అందులో థ్రిల్లర్ జానర్స్ కూడా ఉన్నాయి. నీరజ్ పాండే రూపొందించిన ‘ఏ వెడ్నెస్ డే’, ‘బేబీ’, ‘ఎమ్మెస్ ధోనీ బయోపిక్’, ‘అయ్యారే’ చిత్రాలకూ సంగీతం ఇచ్చాను. కన్నడ సీనియర్ డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ గతంలో ఎన్నో థ్రిల్లర్ మూవీస్ రూపొందించారు. ఆయన తాజా చిత్రం ‘ఉద్ఘర్ష’. ఈ ప్రాజెక్ట్ పై వాళ్ళు మూడేళ్ళుగా పనిచేస్తున్నారు. కథ నచ్చి నేనూ వారితో కలిశాను. నేపథ్య సంగీతం అందించడానికి నాకు మూడు నెలలు పట్టింది. నిజానికి వారు పడిన శ్రమతో పోల్చితే నేను పడిన శ్రమ తక్కువే.

♣ తెలుగు చిత్రాల్లో అవకాశం వస్తే సంగీతం అందిస్తారా?

సంజయ్: తప్పకుండా. ఏ భాషా చిత్రమైనా పనిచేయడానికి నేను సిద్ధం. అన్ని ప్రాంతాల్లోని మనుషుల భావోద్వేగాలు ఒకేలా ఉంటాయి. వాటిని గుర్తించి సంగీతం ఇవ్వడమే మనం చేయాల్సిన పని. పూర్తి స్థాయిలో ముంబై వదిలి దక్షిణాదికి వచ్చేయాలని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. చాలామంది ముంబై చిత్రసీమ గురించి చెబుతుంటారు. కానీ అక్కడ ఇక్కడున్న ఆప్యాయత, అనురాగం, పని పట్ల అంకిత భావం, వ్యక్తుల పట్ల ఉండాల్సిన గౌరవం కనిపించడం లేదు. అవన్నీ ఇక్కడ నాకు కనిపిస్తుంటాయి. నిజం చెప్పాలంటే ముంబై పరిశ్రమ టైలర్ మేడ్ లా తయారైంది. అది బిజినెస్ మెన్ నడిపేదిగా మారిపోయింది. అక్కడ క్రియేటివ్ ఎథిక్స్ లేవు. పరిజ్ఞానం కూడా లేదు. చాలామంది పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయా? లేదా? అనే ఆలోచిస్తుంటారు తప్పితే, సృజన గురించి ఆలోచించడం లేదు. ఇంకా చెప్పాలంటే… ఆ వాతావరణంలో అది చంపేయబడుతోంది. ఇక్కడ సౌత్ లో బెంగాలీల మాదిరిగానే సంగీతాన్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో సంగీతం గురించి తెలుసుకోవాలని, నేర్చుకోవాలనే తపన కనిపిస్తుంటుంది. వారికి సంగీతం పట్ల ఓ ఆరాధనా భావం ఉంది. అది నాకు బాగా నచ్చింది.

  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here