[dropcap]మ[/dropcap]ల్లెమొల్లల నవ్వులన్నీ
మెల్ల మెల్లగ విసిరి విసిరీ
ఉల్లమంతా నిండిపోయిన
ఉవిద ఎవ్వరొకో ?
పల్లెపాటల పైరు ఆటల
కల్లకపటము లేని మాటల
మెల్ల మెల్లగ మనసు గెలిచిన
మగువ ఎవ్వరొకో ?
ఉషా కాల మయూఖ కాంతుల తుషారోదయ శీత వేళల
మృషా కధలను మళ్ళి చెపుతూ
హుషారిస్తూ హస్కు కొట్టే
భామ ఎవ్వరొకో ?
హృదయమంతా నిండిపోయీ
మదిని మొత్తం ఆక్రమించీ
సుధామయమౌ సొదలు చెప్పే
ముదిత ఎవ్వరొకో
గుండెలోతుల ఘోషలన్నిటి
పిండివేసే బాధలన్నిటి
మండిపోయే మంటలార్పే
అండ ఎవ్వరొకో
రాగయుక్తముగాను పాడుచు
భొగములలో నన్ను తేల్చుచు
నాగమోహిని లాగ వెలిగే
భోగి ఎవ్వరొకో
కమ్మకమ్మగ నెమ్మనమ్మును
నమ్మలేని విధమ్ము నెంతో
నెమ్మదిలగా జేసినట్టీ
బొమ్మ ఎవ్వరొకో
కన్నులతొ ప్రేమాభిషేకము
వెన్నెలలనే వేడి చేయగ
సన్నచేస్తూ సంస్కరించే
మిన్న ఎవ్వరొకో
చిన్ననాటనె వెన్నెలల్లే
తిన్నగా నా మనసు దూరీ
వన్నెచిన్నెలు అన్నిచూపే
చిన్నె ఎవ్వరిదో
వాళ్ళపైనా వీళ్ళపైనా
కళ్ళతోనే కబురు చెబుతూ
కాళ్ళగజ్జెలు ఆడుకుంటూ
మళ్ళీ మళ్లీ ముద్దుపెట్టే
బుల్లి ఎవ్వరొకో