[dropcap]“అ[/dropcap]మ్మా ఎవరే అతను” అంది ఆ పిల్ల. కోటేరు లాంటి ముక్కు పెద్ద కళ్ళూ, చామన ఛాయ కంటె కొద్దిగా మెరుగ్గా ఉన్న ఛాయ, మంచి కళ గల మొహంతో ఉన్న ఆ పిల్ల పేరు రత్తమ్మ, వయసు ఇరవై. వాళ్ళమ్మ ధనమ్మ యాభై ఏళ్లు వొచ్చినా ఇంకా గట్టిగా ఉంది. ధనమ్మ అరుణాచల ఆలయంలో తిరువూడల్ ఉత్సవంలో స్వామి వారు ఊరేగుతుంటే ముందర నాట్యం చేయటానికి హక్కున్న దేవదాసీ. ధనమ్మ ఊర్లో షావుకారైన నాట్టుక్కొటి రామస్వామి చెట్టియార్ అధీనంలో మొదటి నుంచీ ఉంది. పేరుకి తగ్గట్టే ధనానికి ఏ లోటూ లేదు ఆమెకి. నాట్యంలోనూ సంగీతంలోనూ బాగా కృషి చేసి పండిత ప్రశంసలు అందుకుంది. ఒక్క కూతురైన రత్తమ్మని కూడా సంగీతమూ సాహిత్యమూ బాగా తెలిసిన వాడూ, మర్యాదస్తుడూ అయిన పక్క ఊరి జమీందారు కృష్ణప్ప నాయకుడి అధీనం చేసిన తరవాత ఆమెకి మనస్సు శాంతిగా ఉంది. నాయకుడు వారానికి ఒకటి రెండు సార్లు వొచ్చి పోతూ ఉంటాడు. రత్తమ్మ కూడా సంగీతమూ, నాట్యమూ బాగా నేర్చుకుంది.
అపీత కుచాంబ గుళ్ళో దసరా మూడో రోజున నాట్యం చేసి, తల్లితో, సేవకులైన ముగ్గురు వస్తాదులతో కలిసి అరుణాచల గిరి ప్రదక్షిణ మొదట్లోనే గుడి దగ్గిర ఇప్పచెట్టు కింద కళ్ళు మూసుకుని ఉన్న ఒక యువకుణ్ణి చూసి రత్తమ్మ ఎంతో ఆకర్షణకి గురైంది. అతన్ని గురించి ప్రశ్న అడిగినా తల్లి సమాధానం చెప్పక పోయేటప్పటికి రత్తమ్మ మళ్ళీ అడిగింది. “అమ్మా ఎవరే అతను” అని. పరధ్యానం లోంచి బైటికి వొచ్చిన ధనమ్మ “ ఆ ఎవరో కుర్రాడు. ఏదో వేషం కాకపోతే ఇంత చిన్న వయసులో సన్యాసం పట్టుబడుతుందా” అని తీసేసినట్టు అంది ధనమ్మ. అరుణాచలానికి వొచ్చి పోయే మనుషుల సంగతీ, సాధువుల సంగతీ ధనమ్మకి బాగా తెలుసు. కనిపించేది అంతా కనకం కాదనీ, మన జాగ్రత్తలో మనం ఉండాలనీ కూతురికి చాలా సార్లు హిత బోధ చేసింది. ఇప్పుడు కూతురు ఇలా అడుగుతుంటే ఇంటికెళ్ళిన తరవాత కూతురితో మళ్ళీ మాట్లాడాలని నిర్ణయించుకుంది ధనమ్మ.
“అతను చాలా తపస్వి లాగా ఉన్నాడే అమ్మా” అంది ధనమ్మ.
“నీకు అందరూ అల్లాగే కనిపిస్తార్లె. ఆరు నెల్ల ముందు మనింటికి భిక్ష కొచ్చిన సన్యాసి పెద్ద విరాగి అన్నావు, చివరికి ఏమైంది, నీ గొలుసు కొట్టేసి పారిపోయాడు కదా” అంది ధనమ్మ.
“ఇతను వేరమ్మా. ఇతన్ని చూస్తేనే మనస్సు ఎంతో ప్రశాంతం గా అవుతోందే. నువ్వు కూడా ఓసారి ఈయన్ని సరిగ్గా చూడకూడదూ” అంది రత్తమ్మ. కాదు కూడదంటూ బయల్దేరదీసింది ధనమ్మ.
రత్తమ్మకి ఎవరో సన్యాసి వొచ్చి తనని ఉద్ధరిస్తాడని గట్టి నమ్మకం. ఇది ధనమ్మకి బాగా తెలుసు. అందుకే వీలైనంత వరకూ రత్తమ్మని సన్యాసుల దగ్గరికి పోకుండా చూస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్లకి ఇలా జరగటం సామాన్యం. గిరిప్రదక్షిణ పూర్తయ్యేసరికి రాత్రయింది.
మర్నాడు పొద్దున్న నాట్య శిక్షణ పూర్తయిన తరవాత తల్లితో “ ఆ స్వామి రాత్రి కలలోకి వొచ్చాడే. భోజనం పెట్టమని అడిగాడు” అన్న రత్తమ్మ మాటలు విని ధనమ్మకి విషయం అర్థమైంది. పక్కనే కూర్చుని ఉన్న పక్క వాద్యం పాడే అయ్యవారితో “మీరన్నా చెప్పండి అయ్యవారూ, నిన్న గిరి ప్రదక్షిణం చేసేప్పుడు గుడి దగ్గర ఒక కుర్రాడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. వాడు చాలా గొప్పవాడని నిన్న సాయంత్రం చెప్పింది. ఇప్పుడేమో అతను కల్లోకొచ్చాడు అంటోంది. దీనికి ఇప్పట్నించీ ఇంత భక్తీ వైరాగ్యాలయితే ఎలా” అంది ధనమ్మ.
“ఆ భక్తీ వైరాగ్యాలు ఎప్పుడు వస్తయ్యాఆని ఎదురు చూడటమే సరిపోయింది మాకు. నీ కూతురికేం, అదృష్టవంతురాలు. సరే, విషయమేంటో సరిగ్గా చెప్పు” అన్నాడు అయ్యవారు. గొంతు సవరించుకుని “అయ్యవారూ, చిన్నప్పుడే నా జాతకం చెప్పిన శంభు దీక్షితులవారు నా జీవితంలో ఒక గొప్ప సన్యాసిని కలుస్తాననీ ఆ మహనీయుడి వల్ల నా జీవితం ధన్యమౌతుందనీ చెప్పారు. అప్పట్నుంచీ చాలా మంది స్వాముల్ని చూసాను. నిన్న చూసిన స్వామి మట్టుక్కు వాళ్ళ అందరికంటే భిన్నంగా వున్నారు. నేనక్కడ వున్నంత సేపూ ఆయన కళ్ళు కూడా తెరవ లేదు. చివరికి గాలి పీలుస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. కానీ మనస్సుకి అక్కడున్నంత కాసేపూ ఎంతో శాంతిగా అనిపించింది. రాత్రి నా కలలో ఆయన మళ్ళీ కనిపించారు. అలాగే కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. నేను మాట్లాడించినా మాట్లాడలేదు. కానీ నన్ను భిక్ష తీసుకు రమ్మని అన్నట్లు అనిపించింది. నాకు ఎంతో ఆనందం వేసింది” అంది రత్తమ్మ.
“మన నాయకుల వారు అంత కంటె అందంగా ఉంటారు. ఇంకా కావాలంటే అంతకంటే అందమైన కుర్రాళ్ళు వరస కట్టి నిల్చుంటారు నీ కోసం. తెలుసా” అంది ధనమ్మ. రత్తమ్మ ముఖంలో విసుగూ అసహ్యమూ వ్యక్తం అయ్యాయి. అది గమనించి “ఆయన ఎట్టాంటి వాడో కనుక్కుని రేప్పొద్దున చెబుతాను” అని అయ్యవారు లేచి వెళ్లాడు.
మర్నాడు అయ్యవారు రాగానే “కనుక్కున్నారా” అంటూ వొచ్చింది రత్తమ్మ. “మీ అమ్మని కూడా పిలు” అని ధనమ్మ వొచ్చిన తరవాత అయ్యవారు మొదలెట్టాడు. “నిన్న మీరు చూసిన ఆయన్ని బ్రాహ్మణ స్వామి అంటారు. ఆయన ఎవరితోనూ మాట్లాడరు. పిలిచినా పలకరు. ఎవరన్నా ఏదన్నా ఆయన ముందు తినడానికి పెడితే ఎప్పుడో ఆయనకి బుద్ధి పుట్టినప్పుడు కొద్దిగా తింటారు.. లేకపోతే లేదు. చాలా నియమంగా ఉంటారు. నిన్న ఆయన గురించి అడిగితే మా గురువు గారు కూడా ఆయన లాగా తపస్సు చేసేవాళ్ళు తక్కువ అని ఆయన్ని చాలా మెచ్చుకున్నారు” అన్నాడు అయ్యవారు.
“అయితే ఆయన నిజమైన స్వామి అన్నమాట. అదే నాకు చూడంగానే ఏదో అనిపించింది. ఈయన్ని వదలకూడదు. ఈయన దగ్గిర చాలా మహత్తు ఉంది” అని అంది రత్తమ్మ. “నిజమో కాదో నిలకడ మీద తెలుస్తుంది” అంది ధనమ్మ
“అలా అనకమ్మా. అయ్యవారు కూడా చూసి వొచ్చారు కదా. ఆయన నిజంగా దేవుడే” అంది రత్తమ్మ. ధనమ్మ మాట్లాడకుండా లోపలికెళ్ళింది.
పొద్దున్న నాట్య సాధన పూర్తయ్యి రత్తమ్మ గదిలోకి వెళ్ళిన దగ్గరినించీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం ధనమ్మ కంటపడింది. కాసేపాగి ధనమ్మ దగ్గిరికి అడుగులో అడుగు వేసుకుంటూ వొచ్చి“అమ్మా, స్వామి అడిగాడు కదా, ఆయనకి భోజనం పెడదామా” అంది రత్తమ్మ. “నీకేమైనా పిచ్చెక్కిందా, ఆయన ఎక్కడ? మనం ఎక్కడ? ఆయన స్వామి. మనం దేవదాసీలం. అందులోనూ ఆయన కుర్రవాడు మనం వెళితే జనం ఆయన్ని ఎలా చూస్తారో చెప్పు? ఇంకో సారి ఈ ఇంట్లో ఆ స్వామి మాట తీసుకొస్తే ఊరుకునేది లేదు” అంది ఖండితంగా ధనమ్మ. కాసేపటి తర్వాత “భోజనానికి రావే” అని పిలిచిన ధనమ్మకి ఏ జవాబూ రాకపోతే గదిలోకి వెళ్ళి చూస్తె రత్తమ్మ ఏడుస్తూ ఉంది. “రా భోజనానికి” అంది విసురుగా ధనమ్మ. రత్తమ్మ ఏమీ మాట్లాడలేదు. ధనమ్మకి కోపం వొచ్చి దగ్గిరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని కూతురిని లాక్కెళ్ళటానికి చూసింది. రత్తమ్మ చెయ్యి విడిపించుకుని “అమ్మా, ఇక నించీ, ఆ బ్రాహ్మణ స్వామికి పెట్టిన తరవాతే నేను తింటాను లేకపోతే లేదు” అని సద్దుకుని స్థిరంగా కూర్చుని ఆ స్వామి ఉన్న వైపుకి తిరిగి దణ్ణం పెట్టింది. “నీకు పిచ్చేక్కిందే నిజంగా. మనం ఎక్కడ ఆ సన్యాసి ఎక్కడ. అందులోనూ బ్రాహ్మడు. నీకెక్కడ దొరికాడే వాడు” అంది ధనమ్మ. రత్తమ్మ నిశ్చలంగా అంజలి ఘటించి కూర్చుంది. “అలా ఉలుకూ పలుకూ లేకుండా బెల్లం కొట్టిన రాయల్లె కూర్చుంటే ఎట్లా. ఇవాళ సాయంత్రం వొస్తానని నాయకుల వారు వర్తమానించారు గుర్తుందా?” అంది ధనమ్మ. రత్తమ్మ ఏమీ మాట్లాడలేదు. ధనమ్మకి విషయం అర్ధమైంది. “చూడమ్మా, ఇప్పటికి ఇప్పుడు అంటే ఎట్లా. రేపు చూద్దాంలే” అంది. రత్తమ్మ రాయిలాగా కూర్చుంది. రత్తమ్మ ఒక విషయం అనుకుంటే ఎంత మొండిగా ఉంటుందో తెలిసినది గనక ధనమ్మకి తను తగ్గటం తప్పదు అని అర్ధమైంది. “సరే మన సుబ్బు చేత భోజనం పంపిస్తున్నాను సరా” అని ధనమ్మ అనంగానే అప్పటిదాకా కదలకుండా ఉన్న రత్తమ్మ జువ్వలాగా లేచి “ మా అమ్మ మంచిది” అని “ అమ్మా నేను వెళ్ళి భోజనం పెడతానే” అంది రత్తమ్మ. “ఆ స్వామి ధ్యానంలో ఉండి అసలు తినటమే లేదు అందుకని ఎవరన్నా ఆయన్ని పట్టుకుని, బలవంతంగా నోట్టో పెట్టాలి. నువ్వూ, నేనూ ఆయన్ని ముట్టుకోవటం ఎలాగా. అందుకనే సుబ్బుని పంపిస్తున్నాను” అంది ధనమ్మ. “నేను కూడా వెళ్ళి సరిగ్గా పెడుతున్నాడో లేదో చూసొస్తానే” అని తల్లి వైపైనా చూడకుండా గదిలోకి దూరి తలుపేసుకుంది రత్తమ్మ.
కాసేపట్లో సుబ్బూ, రత్తమ్మా ఇప్ప చెట్టు దగ్గిరికి జేరారు. అక్కడ బ్రాహ్మణ స్వామి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆయన వయసుకి కుర్రాడైనా చేస్తున్న తపస్సువల్లా, గజిబిజిగా పెరిగిన గడ్డమూ,జుట్టూ వల్లా, సరిగ్గా స్నానం చేయని, తిండి తినని, దేహం వల్లా, పెద్ద వయసు అనిపిస్తున్నారు. ఆ దుమ్ము లోనే సాష్టాంగం పెట్టింది రత్తమ్మ. సుబ్బు మెల్లిగా ఆయన దగ్గిరి కెళ్ళి “స్వామీ” అని పిలిచాడు. ఆయనలో చలనం లేదు. మళ్ళీ మళ్ళీ పిలిచాడు. “గొంతెత్తి గట్టిగా పిలవరా” అంది రత్తమ్మ. “ఇంకెంత అరవమంటావు” అని స్వరం పెంచి ఆయన చెవి దగ్గర గట్టిగా అరిచాడు. ఏ చలనమూ లేదు ఆయనలో. “నా వల్ల కాదు ఇంక” అని సుబ్బు పక్కకొచ్చి కూర్చున్నాడు. రత్తమ్మకి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఏడుపు తన్నుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. సుబ్బు తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు. ఇంతలో “ఎందుకేడుస్తున్నావు” అంటూ ఓ ముత్తైదువ గుళ్ళో నించి బయటికొస్తూ అడిగింది. సుబ్బు జరిగింది చెప్పాడు. రత్తమ్మ దగ్గిరి కొచ్చి తల నిమిరి “మా నాయన మహా తపస్వి. మామూలు మాటలకే లేస్తాడూ? చెయ్యి పట్టుకుని గట్టిగా కదిలించండి. కొద్దిగా స్పృహ లోకి వొస్తాడు. అప్పటికీ లోకంలోకి రాడు. ఎలాగోలా నోట్లో అన్నం పెట్టి కాసిని నీళ్ళు పోస్తే అదే లోపలి వెళుతుంది” అని గుళ్ళో ఏవో మంత్రాలు వినబడేటప్పటికి ఆ ముత్తైదువ మళ్ళీ గుళ్ళోకి వెళ్ళింది హడావుడిగా.
సుబ్బు, స్వామి భుజం పట్టి కదిలించాడు. స్వామి స్పృహలోకి వొస్తున్నట్టు శ్వాసలో మార్పు వొచ్చింది. రత్తమ్మ ముఖం వికసించింది. స్వామి కళ్ళు కొద్దిగా విచ్చుకున్నాయి. రత్తమ్మకి ఆనందం ఆగలేదు, మళ్ళీ సాష్టాంగం చేసింది. రత్తమ్మ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగకుండా రాలుతున్నయ్యి. స్వామి వైపువొంగి చేతులు జోడించి దణ్ణం పెట్టింది. “మీకోసం భోజనం తెచ్చాను స్వామీ” అంది. స్వామి చిరునవ్వు నవ్వుతున్నట్టు తోచింది. రత్తమ్మకి బ్రహ్మానందంగా ఉంది. “సుబ్బూ, భోజనం పెట్టరా” అంది రత్తమ్మ హడావిడిగా. సుబ్బు కొద్దిగా కూరా, అన్నమూ కలిపి ముద్ద చేసి స్వామి నోట్లో పెట్టాడు. స్వామి నోరు ఏమీ కదల్చలేదు. అప్పుడు గుర్తొచ్చి కాసిని నీళ్ళు పోస్తే మెల్లిగా కాసేపటికి ముద్ద దిగింది. అలా ఓ గంట సేపటికి నాలుగు ముద్దలు దిగాయి. రత్తమ్మ ఆనందానికి అంతే లేదు. కన్నీళ్లు కారుస్తూ, వొంగి నమస్కారం చేస్తూ ఆనందంతో “మళ్ళీ రేపు వొస్తాను” అని మనలో ఉన్నా మనలో లేని, ఆ మాట్లాడని స్వామికి మళ్ళీ మళ్ళీ చెప్పి ఇంటికి బయల్దేరింది రత్తమ్మ. “దీనికి ఏమొచ్చినా పట్టలేం” అనుకుంటూ ఆ స్వామికి తను కూడా ఓ దణ్ణం పెట్టి బయల్దేరాడు సుబ్బు.