తప్పును సమర్థిస్తే

0
3

[dropcap]వి[/dropcap]జయనగరం నుంచి ధర్మపురి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ప్రభుత్వ భూమిని ఆక్రమించి పాకలు వేసుకుని చాలా కాలంగా కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

వీరిలో ఎక్కువమంది పారిశుధ్య కార్మికులు, పళ్ళు అమ్ముకునేవారు ఉన్నారు. వారిలో రాములమ్మ కుటుంబం ఒకటి. రాములమ్మకి నలుగురు కూతుళ్లు. అందరూ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.

ఒకరోజు..”నీ కూతురు నాకొడుకుని రక్తం వచ్చినట్లు ఎలా కరచిందో చూసావా? రోజు రోజుకి నీ కూతుళ్ళ ఆగడాలు ఎక్కువై పోతున్నాయి” అని రాములమ్మని నిలదీసింది వెంకాయమ్మ.

“నా కూతురు కరవడం నువ్వు చూసావా?” అని ఎదురు ప్రశ్న వేసింది రాములమ్మ.

“నా కొడుకు చెప్పాడు”

“నీ కొడుకు మాట నువ్వు నమ్ముతావు. నా కూతురు కరవలేదని చెప్తోంది. దాని మాట నేను నమ్ముతాను.”

“తోటి పిల్లలు కూడా చెప్తున్నారు కదా”

“అందరూ మమ్మల్నే ఆడిపోసుకుంటారు. మేం పచ్చగా ఉంటే చూడలేరు. పాపం నీ కొడుకు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. వాడేమీ అనకుండా నా కుతురు ఏమీ అనమన్నా అనదు. నీ కొడుకు చేసేవన్నీ చెడ్డ పనులు తిరిగి మమ్మల్ని అంటారు” అని రచ్చ రచ్చ చేసింది రాములమ్మ.

ఇద్దరూ పాఠశాలకు వెళ్లి జరిగినదంతా ప్రధానోపాధ్యాయనికి చెప్పారు. ప్రధానోపాధ్యాయులవారు సంబంధిత తరగతి ఉపాధ్యాయుణ్ణి పిలిచి విద్యార్థుల గురించి వాకబుచేశారు.

“రోజూ ఇదే పరిస్థితి మాకు. పిల్లల్ని దెబ్బలాడితే రాములమ్మ తగవుకు వస్తోంది. ఊరుకుంటే వీళ్ళ అల్లరి ఎక్కువైపోతోంది” అన్నారు తరగతి ఉపాధ్యాయులు.

“మీ అబ్బాయిని నా దగ్గరే కూర్చో బెట్టుకుంటాను మీరు వెళ్ళండి” అని వెంకాయమ్మను, రాములమ్మను సముదాయించి పంపించారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు.

రాములమ్మ కూతుళ్ళని తోటి పిల్లలు ఎవరైనా ఏమైనా అంటే పెద్ద నోరేసుకుని పడిపోతుందని ఆమె నోటికి జడిసి ఎవరు ఏమనేవారు కాదు. అది అలుసుగా తీసుకుని రాములమ్మ పిల్లలు తోటి పిల్లలను కొట్టడం, తిట్టడం, వారి వస్తువులు పాడుచెయ్యడం, దొంగతనం చెయ్యడం చేసేవారు.

ఉపాధ్యాయులు మందలిస్తే, “మా పిల్లలు మంచివాళ్ళు, మీరు కావాలనే తిడుతున్నారు” అని కయ్యానికి వెళ్ళేది రాములమ్మ. ఈ బాధ పడలేక ఎవ్వరూ ఏమనేవారు కాదు.

ఇలా కొన్నాళ్ళు గడిచింది. అనేవారు, అడ్డేవారు లేకపోవడంతో రాములమ్మ కూతుళ్ళ పరిస్థితి చేయి దాటిపోయింది. ఆ వీధిలో ఉండే చిల్లర దుకాణాల్లోని, ఇరుగు పొరుగు ఇళ్లల్లోని డబ్బులు తరచుగా పోవడంతో రాములమ్మ కూతుళ్లపై అందరికి అనుమానమొచ్చింది. కానీ రాములమ్మ నోట్లో నోరు పెట్టలేక ఊరుకున్నారు.

ఒకరోజు వ్యాపార నిమిత్తం ఎవరి దగ్గరో అప్పు చేసి పదివేల రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టాడు రాములమ్మ భర్త. ఇదే అదనుగా భావించి ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో డబ్బులన్ని దొంగిలించారు రాములమ్మ కూతుళ్లు. పనిమీద బయటకి వెళ్లి వచ్చిన భర్తకి డబ్బులు కనపడక పోయేసరికి లబో దిబో మన్నాడు. ఏం చెయ్యాలో తోచలేదు అతడికి. ఇల్లంతా వెతికాడు. పిల్లల్ని అడిగాడు.

‘మేము తీయలేద’న్నారు.

భార్యని అడిగాడు ‘నాకు తెలియదు’ అంది. ఇరుగు పొరుగును వాకబు చేసాడు

“ఇంటి దొంగను ఈశ్వరుడైనా కాయగలడా?” అన్నారు ఇరుగు పొరుగు. మంచిగా మాటలాడి పిల్లలనుంచి నిజం రాబట్టాడు తండ్రి. తన పిల్లలే తీసారన్న విషయం తెలుసుకున్నారు భార్యాభర్తలు.

“నీ వల్లే పిల్లలు ఇలా తయారయ్యారు. నువ్వు వాళ్ళని వెనకేసుకు రావడం వల్ల తప్పుదారి పట్టారు”. అని రాములమ్మని, పిల్లల్ని చివాట్లు పెట్టాడు భర్త.

చిన్ననాడే తప్పు చేయొద్దని పిల్లల్ని మందలించకపోవడం, ఎవరైనా చెప్పినదానిని విని నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటివారిని దూషించడం తాను చేసిన తప్పని తెలుసుకుని ఎంతగానో కుమిలిపోయింది రాములమ్మ. నాటి నుంచి పిల్లలు, రాములమ్మ అందరితోనూ కలసి మెలసి, మంచిగా మసలుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here