[dropcap]పొ[/dropcap]ద్దుగాల లేశి
సద్దెన్నం బుక్కీ
చెర్నాకోల తీస్కొని
రంగనెంట పొలం పోతి
గప్పుడే అచ్చినవా అని నవ్విన సూరీడు
జర్రంత సేపు కాంగనే ఈపు కాలేటట్టు చేసిండు
ఎండ ఎర్రగా చేద్దామన్నా నా పెయ్యి నల్లగానే మెరుస్తది
ఈడ ఆడ్ని ఓడించినన్న గర్వము నా తెల్ల పల్లల్ల కానోస్తది
రంగడి గొంతు మీది గజ్జెలు గల్ గల్ మంటే
నాకు పొలం దున్న నీకి ఊపు ఒస్తది
పొద్దుమీకే వరకు కాయ కష్టం జేస్తే
అయిదేల్లు నోట్లకి పోతయ్ అన్న సత్తా ఒస్తది
పంట పండే దాకా గుబులు
పండిన పొలం దలారీల పంచినాక
మిగిలింది అప్పులోల్లకి ఇచ్చినాక
కడమది నాకు నా పిల్లలకి
పంట నష్టపోతే అప్పులోల్లకి కడుపుమంట
పంట మంచిగొస్తే పెద్ద సారొల్లకు కాసులపంట
దినం రాత్రి కష్టపడే మా రైతుల బతుకులు మాత్రం
సేరు బియ్యం
సవ్వాసేరు ఆకలి
అరసేరు గంజి
ఆరుగురు పిల్లల అరమోము!