[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం. [/box]
“ ‘ఇలలో’ ఉన్నది
కలలో అబద్ధం
‘కలలో’ ఉన్నది
‘సుషుప్తి’లో సుప్తం
మాటని తెలిపే
‘సాక్షి’ ఎవ్వరో
అది తెలియటమే
పరమార్థం.”
***
వేదాంతం
“ఇలలో
కలలో
సాక్షే మిగిలిన
గాఢ నిద్రలో…,
మెలకువ నిండిన
మధుర భ్రాంతిలో
‘తానే’లోకమై
లోకమే ‘తానై’
మార్పులు చెందే
‘శరీర’ శలభం
మార్పులు పొందని
‘అమృత’ కలశం
కూర్చే ‘మాయ’ను గమనించావా?
చేర్చే ‘భ్రాంతిని’ స్మరియించావా?”
***
ప్రయాణం
ముందుకు ముందుకు
మున్మున్ముందుకు
ఉరకలు వేస్తూ
పరుగులు తీస్తూ
రేగిన బాధల
నదిలించేస్తూ
రేపటి కోసం
బాటలు వేస్తూ
ముందుకు ముందుకు
సాగాలోయ్
జీవన గమ్యం
చేరాలోయ్!
***
“పాదచారీ…”
“ఊ?”
“ఎక్కడి దాకా వచ్చావూ?”
“వచ్చేది ఎక్కడికి పోయేది ఎక్కడికి?”
“అంటే రాకపోకలే లేవా?”
“ఏమో!”
“అంటే?”
“రాకపోకలంటే ఏమిటా అని? పుట్టకా చావు అనా? ఓ మనిషి, వాటికి అర్థమే లేదు. ఎందుకంటావా? పుట్టేవాళ్ళు ఎలా పుడుతున్నారో తెలుసు కానీ, ఎక్కడి నించి వస్తున్నారో తెలీదుగా. అలాగే శీరీరాలు మరిణించి నాశనం అవటం తెలుస్తోంది కానీ, శరీరాన్ని ఆశ్రయించి ఉన్న వారు ఎక్కడికి పోతున్నారో తెలీదుగా!
చూడు… చూడు… అద్దె ఇంట్లో కొంత కాలం ఉండి దాన్ని వదిలేసి మరో ఊరికి ట్రాన్స్‌ఫర్ అయివెళ్ళే ఉద్యోగుల్లాగా యీ శరీరాన్ని వదిలి వేసే జీవిని చూడు! ఎక్కడికి బదిలీ అయి వెడతారో మరి! “బాట నుంచి ఓ బాటకి బదిలీ” లాగా ఓ శరీరం నించి మరో శరీరానికి బదిలీ….
“మరో శరీరాన్ని ఆశ్రయించటం చూశావా?”
“లేకపోతే కొత్త శరీరాలు ఎందుకు ఉద్భవిస్తాయి?”
“నీది అర్థం లేని వాదన….”
“ఏమో మరి! సూర్యరశ్మిలోని శక్తినీ, భూమిలోని బలాన్ని సంపాదించుకుని ఓ చిన్ని విత్తనం బీజదళమై, అదే మహా వృక్షమౌతుంది. ఆ ఆకులే పండిపోయి, ఆ వృక్షం కిందనే రాలిపోయి, వర్షరాణి ఆగమనంతో కుమిలిపోయి కుళ్ళిపోయి, మళ్ళీ ఆ వృక్షానికే బలాన్ని ఇచ్చి, సరి కొత్త ఆకుల బిడ్డల్ని ‘చివుర్లుగా’ ప్రసవించటానికి ఎరువుగా (manure) మారినట్లు, మట్టిలో కలిసే మానవ యంత్రాలే మరో మానవ సజీవ యంత్రాలకి మూలమౌతాయని అనుకోవడంలో అర్థం లేనితనమేముంది అయినా భాయీ, అర్థం కానంత మాత్రాన అర్థం లేదని అనుకోవటమూ అర్థం లేని మూర్ఖత్వం కాదూ?”
“నీ బుద్ది యీ జన్మలో మారదు!… నీ అహంకారమూ అంతులేనిదే!”
దారేపోయే దానయ్య విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
పకపకా నవ్వుకుని పాదచారి పరికించి చూశాడు.
ఓ దిరిసెన చెట్టు పచ్చని నీడల్ని వర్షిస్తూ “రా పాదచారీ…. రా…. కాలపు కెరటం అంచుల్లో నిలబడి మా నీడల జాడల్ని గమనిద్దాంగాని!…” అంటూ పాదచారిని ఆహ్వానించింది.
“Men may come and men may go. But I go on forever…” అంటూ ఓ కాలువ పాదచారితో అని, తన దారిన తాను ప్రవహిస్తూ సాగింది.
“ఆ కాలువ కాలం లాంటిది పాదచారీ!… ఎందుకూ? అదే కాలం కూడా!… మనుషుల్లాగానే దానికీ మజిలీలు ఉన్నాయి! కాలం తోటి అదీ రెక్కల కూర్పుల్ని విప్పుతూ ఉంటుంది. నిన్నటి గ్రీష్మంలో అది శుష్కించిపోయింది!…. ఇవ్వాళ చూడు! ఎవరో తరుముకొస్తున్నట్లు ఎంత వేగంగా ప్రవహిస్తోందో! మునకలు వెయ్యి నేస్తమా! అది నిన్నేమీ చెయ్యదులే!… అదీ మాలాగే నీ నేస్తమేగా!.. ఓ క్షణం దానిలోనూ దాహం తీర్చుకో! నీదాహాన్ని తీర్చుకుని ప్రకృతి నీడల్లో విశ్రమించు!…
మెల్లగా సాగే ఓ మబ్బుతునక పాదచారికి ప్రబోధం చేసింది.
“హేయ్…. ఆర్యూ” అన్నట్లు ‘హేక్…హో హేక్…హో’ అని వినీలాకాశం నించి అరిచిందో గురడపక్షి.
“ఎక్కడ చూసినా చల్లదనమే యీ ఋతువు ఎంత చక్కనిది…” ఓ వృద్ధసర్పం భారంగా శరీరాన్ని కదిలిస్తూ పుట్టలోకి పాకిపోయింది.
“మేం శ్రమజీవులం!… క్షణక్షణమూ మాకు విలువైనదే! జీవించే ప్రతి క్షణమూ అమూల్యమైనదే! అందుకే మేం బద్ధకించం, ఆహారమనే అనుభవాన్వేషణ అనంతంగా సాగిస్తాం!…
చీమ రాజులు సైన్యంతో బారులుగా కదిలిపాతూ పాదచారిని పలుకరించాయి.
“చూశావోయ్ పాదచారీ మా ఎరుపుదనం? బాలసూర్యుడు మాముందు హుళక్కి…”
గర్వంగా నవ్వాయి అగ్నిపూలు….
ఓ కాలమనే తొండ జీవమనే పురుగని నోట కరుచుకుని కాండంనించి కొమ్మ మీదకు గబగబా పరుగుతీసింది.
“ఇదిగో… దీని మీదే మా భక్తి!” అంటూ ఆశాతటాకంలో, ఊహాకొంగలు, మోహపు చేపల్ని ముక్కన కరుచుకుని రివ్వున నింగికి ఎగసిపోయాయి.
సంభ్రమంగా చుట్టూ చూశాడు పాదచారి. ఓ మర్రి ఊడ గాలికి ఊగుతూ ‘రా…రా రమ్మని’ పాదచారిని పిలిచింది.
విశ్వాసం ఠీవిగా నీడలోకి అడుగువెయ్యిగా వెనకాలే వృక్షపు నీడలోకి అడుగులు వేశాడు పాదచారి!
***
“యీ విశ్వ శరీరంలోకి మరో మజిలీ” తనలోతానుగా అనుకున్నాడు పాదచారి.
“పిచ్చి వాడివి కదూ! నీ శరీరమే నీకు తెలీదు! మరి విశ్వ శరీరం ఎలా తెలుస్తుంది?” దీర్ఘం తీస్తూ పలికింది మానసి.
“ఆ విశ్వశరీరాన్ని నువ్వు గమనించావుగా?” నవ్వాడు పాదచారి.
“ఊ గమనిస్తే ఏమయిందిట? యీసడింపుగా అంది మానసి.
“నువ్వెవరివి?” ప్రశ్నించాడు పాదచారి.
“నేనెవరో తెలీకుండానే ఉన్నావా?” మానసి గొంతులో ఎగతాళి.
“ఓ మూర్ఖ మానసీ, నువ్వు నా స్నేహితుల్లో ఒకదానివి. నా భావాల్లో నా శరీరంలో ఒక దానివన్నమాట! నువ్వే విశ్వశరీరాన్ని గుర్తించగలిగినప్పుడు. నేనెందుకు గమనించలేను ఓ భాగమే అనుభవాన్ని గురించి …. సంపూర్ణంత్వం సంపూర్ణత్వాన్ని ఎలా గుర్తించలేదనుకున్నావు?” నవ్వుతూ ప్రశ్నించాడు పాదచారి.
“నేను గుర్తించనంత మాత్రాన నీవు సంపూర్ణడవయ్యావా?”
విప్లవమూర్తి గుర్తించలేదే? విజ్ఞనాచార్యూలు, కవితకుమారి, జీవన్ మూర్తీ, స్వప్నమూర్తి, ఎవరూ గుర్తించలేదే?” కచ్చగా అంది మానసి.
“నీ అభిప్రాయాల్ని మాకు అంటగట్టకు. విశ్వం లేనపుడు విప్లవం ఎక్కడిది? నువ్వు తప్పుదారిన నడుస్తూ అతన్ని తప్పు దారి పట్టించకు.” తీవ్రంగా అన్నడు విప్లవమూర్తి.
“ఆ మాట నిజమేనమ్మాయి… విశ్వం లేని విజ్ఞానం దేనికీ? విశ్వాన్ని గుర్తించాను కనకనే విజ్ఞానాచార్యుడనయ్యాను!” అనునయింగానే వ్యతిరేకించాడు విజ్ఞానాచార్యులు.
“ఇలలో లేనిది కలలో కెలావస్తుందీ? అసలు విశ్వాసాన్ని ముందుగా గుర్తించిన వాడిని నేనూ!” తేల్చేశాడు స్వప్నమూర్తి.
“ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను! మళ్ళీ ఎప్పటికప్పుడు మార్చిపోతూనే ఉంటాను. అందుకే… విశ్వాన్ని గుర్తిస్తూనే మర్చిపోతాను మార్చిపోతూనే గుర్తిస్తాను!” నవ్వుతూ తన అభిప్రాయం వినిపించాడు జీవన్ మూర్తి.
“అవునూ విశ్వశరీరంలోకి మరో మజిలీ అన్నావు కదా, మరినీ అసలు శరీరం ఏది? ఎక్కడుంది?” తీరిగ్గా ప్రశ్నంచింది కవితాకుమారి.
“అదీ ప్రశ్న అంటే?” మెచ్చుకున్నాడు విజ్ఞానాచార్యులు.
“యీ విశ్వానికి అవతల….. యీ విశ్వాన్ని నాలోనే ఇముడ్చుకుని” ఎటో చూస్తూ అన్నాడు పాదచారి.
“నీలో ఇముడ్చుకోవటం ఏమిటి? నీలో ఉన్న దానికి అవతల ఏమిటి? అసలు నువ్వు మాట్లాడుతున్నది నీకైనా అర్థమౌతుందా?” కోపంగా అన్నాడు విప్లవమూర్తి.
“ఇటురా పాదచారీ… ఇటురా… నా నీడలోకి…. ఆ ఎండ వదుల్చుకుని ఇటురా!” ఆహ్వానించింది అపుడే ఎదుగుతున్న రావికన్య.
“అది నా బిడ్డ! ఇప్పుడు తానే పెద్దదై నిన్ను పిలుస్తోంది చూశావా!” సంభ్రమంగా, ఆనందంగా ఆకులు రాల్చింది రావి చెట్టు.
“అదీ! అదీ ప్రకృతి రూపం అంటే” మెచ్చుకున్నాడు విజ్ఞానాచార్యులు.
“భాష లేని దానికి భావాన్ని అంటగడుతున్నావా?” తీవ్రంగా శ్వాస వదుల్తూ అన్నాడు విప్లవమూర్తి.
“వినే వాళ్ళకి భాష!… మనస్సుని వినీ చూసే వాళ్ళకి భావం! భావాల్ని స్తంభిస్తే, సంభించగలిగితే అదే స్వస్వరూపం” నవ్వాడు వేదాంతి.
“నువ్వెవరివి?” ప్రశ్నించాడు విప్లవమూర్తి.
“నా పేరు వేదాంతి!…”
“పిచ్చివాడివా?” హేళనగా నవ్వాడు స్వప్నమూర్తి.
“నిజమే! ఇప్పుడు పిచ్చే! తరవాత కాదు!”
“తరవాత అంటే?” ప్రశ్నించింది కవితాకుమారి.
“మరో స్థితిలో!… మరో కాల ప్రవాహంలో!” నవ్వాడు వేదాంతి
ఇవన్నీ పట్టనట్టు ముందుకి నడిచింది విశ్వాసం.
వారందర్నీ వారి మానాన వదిలి విశ్వాసం కుక్క వెంట నడిచాడు పాదచారి. అతడి కళ్ళల్లో అదో కాంతి! కాంతి అంచున అశృవు.
(సశేషం)