[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 71” వ్యాసంలో గుంటూరు జిల్లా లోని ఎత్తిపోతల జలపాతం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]గుం[/dropcap]టూరు జిల్లాలో వున్న ఒకే ఒక జలపాతం ఎత్తిపోతల.
నాగార్జున సాగర్ నుంచి మాచర్ల వెళ్ళే మార్గంలో సుమారు 11 కి.మీ.ల దూరంలో వున్నది ఈ జలపాతం. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం చంద్రవంక నదిపై వున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం వున్నది.
పూర్వం యతులు (ఋషులు) తపస్సు చేసుకున్న ప్రదేశం కనుక ‘యతి+తపో+తలం’గా పిలువబడిన ఈ ప్రదేశం క్రమేణా ‘ఎత్తిపోతల’గా మారిందంటారు.
ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా, ప్రకృతి సౌందర్యంతో అలరారుతూంటుంది. పల్నాటి సీమలో నల్లమల అడవుల్లో పుట్టిన దంతెవాగు ఆత్మకూరు చెరువుకి చేరుతుంది. అక్కడనుండి తేరాల గ్రామ సమీపానికి చేరుతుంది. తేరాలలో బ్రహ్మనాయుని చెరువునుండి బయలు దేరిన కానవాగు, తేరాల సమీపంలో దంతెవాగుతో కలసి అర్ధ చంద్రాకారంతో ముందుకు సాగుతుంది. అందుకే తేరాలనుండి కృష్ణా నదిలో కలిసే వరకు ఈ వాగును చంద్రవంక అంటారు. ఎత్తిపోతలనుండి ఇంకా 4 కి.మీ. ముందుకు వెళ్ళి చంద్రవంక గంగపాదాలు అనే చోట కృష్ణా నదిలో కలుస్తుంది.
నదులను, జలపాతాలను చూడటానికి నీళ్ళు ఎక్కువగా వుండే సమయం, అంటే వర్షాకాలం బాగుంటుంది. వర్షాకాలంలో నాగార్జున సాగర్ డామ్ గేట్లు తెరిచినప్పుడు ఆ సుందర దృశ్యం చూడటానికి జనాలు తండోప తండాలుగా వెళ్తారు. అక్కడనుండి ఎత్తిపోతల కూడా వెళ్ళి ఆ సుందర దృశ్యాలను సందర్శిస్తారు.
ఎత్తిపోతల కేవలం పర్యాటక ప్రదేశమే కాదు గొప్ప పుణ్య క్షేత్రం కూడా. ఇక్కడ కొండలలో అనేక గుహలున్నాయి. జలపాతానికి ఎదురుగా ఒక గుహలో శ్రీ రంగనాధ స్వామివారు, రెండవ గుహలో జైన దేవత మధుమతి దేవి, చాముండేశ్వరి పూజలందుకొంటున్నారు.
ఈ లోయలో వెలసిన దత్తాత్రేయుడు సుగాలీల ఇలవేల్పు. తొలి ఏకాదశినాడు ఇక్కడ జరిగే తిరునాళ్ళకు అధిక సంఖ్యలో సుగాలీలు హాజరవుతారు.
ఎత్తిపోతల అత్రి, అనసూయల ఆశ్రమ ప్రదేశమని, దత్త జననం ఇక్కడేనని చెబుతారు. పిఠాపురంలో జన్మించిన శ్రీపాద వల్లభులవారు మహబూబ్ నగర్ జిల్లాలోని కురుగడ్డకు వెళ్తూ దోవతో ఎత్తిపోతలలో వున్న దత్తాత్రేయుని చెంత కొంత కాలం తపస్సు చేసుకున్నారని కూడా చెబుతారు.
ఈ ప్రదేశానికి మేము నాగార్జునసాగర్ గేట్లన్నీ ఎత్తినప్పుడు వెళ్ళి అక్కడనుండీ వెళ్ళాము. అప్పుడు వర్షాలు, వరదలు బాగా వున్నాయి. ఎత్తిపోతలలో నీరు చాలా వుంది. వరద నీరు కూడా అవటంతో నీళ్ళు ఎర్రగా కూడా వుండి చాలా అందంగా వున్న దృశ్యాలను వీక్షించగలిగాము.