[dropcap]మా[/dropcap]యమాటల తేటతేనియ లందు ప్రజలను ముంచితీసిరి
చట్ట సభలలో ప్రవేశించి మేటి సూటిగ మాటలాడిరి
దేశసంపద కోట్ల కోట్లను కొల్లగొట్టిరి పైరవీలతో
ఆశాపాశము కంతులేదని దోసిళ్ళతో దోచుకొనిరి
జనత మాత్రం దగా దోపిడి వీపులో బళ్ళాలు అవుదురు.
జై జవాన్, జై కిసానన్న లాల్ బహాదూర్ శాస్త్రిని మరిచిరి
స్వాతంత్ర్య సమర అమరుడు మదన్‌లాల్ ఢీంగ్రాను దలచరు
దేశ దౌర్భాగ్యమును పెంచిన నాయకులెందరినో గొలిచిరి
పదవి పెదవులు రుచులు మరిగిన జోతలకు జోహార్లు పలికిరి
ప్రజలు మాత్రం దేశభక్తుల గౌరవించుట ధన్యమనిరి.
భారతాంబిక స్వేచ్ఛ కోసం భాస్వరమై ప్రజ్వరిల్లెను
వి.వి. అయ్యర్, మేడమ్ కామా విమల గురువై నిలిచెనాతడు
బ్రిటీషు మ్యూజియమందు జొచ్చి పస్తులతో పరిశోధనమున
ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామము రాసి రెండు
జన్మల ఖైదుల ననుభవించిన వీర సావర్కరును దలుతు.