కావ్య పరిమళం-17

0
3

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

నంది తిమ్మన పారిజాతాపహరణం

[dropcap]ము[/dropcap]క్కు తిమ్మనగా ప్రసిద్ధి పొందిన నంది తిమ్మన 16 వ శతాబ్ది తొలి భాగానికి చెందినవాడు. రాయలవారి భువన విజయ సభాభవనంలో అష్టదిగ్గజ కవులలో పెద్దన తర్వాత పెద్ద పీట ఈయనకే. అరణపు కవిగా రాయల దేవేరి వెంట వచ్చినవాడు. ‘నానా సూన వితాన వాసనల’ అనే ముక్కు మీది పద్యం ఈయనదేనని ప్రచారంలో ఉంది. అందుకే ‘ముక్కు’ తిమ్మన అయ్యాడు.

పారిజాతాపహరణ కావ్యానికి మూలం సంస్కృత భాగవతంలోని మూడు శ్లోకాలే. సంస్కృత హరివంశంలోని వజ్రనాథుని వధ – అనే కథకు దగ్గరగా వుంది ఈ కథ. అయితే కొద్దిపాటి ఇతివృత్తాన్ని ఐదాశ్వాసాలలో తీర్చిదిద్దడం పాండితీ ప్రకర్షకు నిదర్శనం. ఈ కావ్యం వ్రాయడానికి మరో సంఘటనను కూడా నేపథ్యంగా చెబుతారు. ఒకానొకనాడు శయనమందిరంలో తిరుమలదేవి పాదం శ్రీకృష్ణదేవరాయల శిరస్సును తాకింది. కోపించిన రాయలు ఆమె గృహానికి వెళ్ళడం మానేశాడు. అరణపు కవిగా ఆమె వెంట వచ్చిన తిమ్మన రాయలకు కనువిప్పు కలిగించడానికి పారిజాతాపహరణం ఎంచుకొన్నాడంటారు.

ఇందులో నాయికా నాయకులైన సత్యాకృష్ణుల జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది. శ్రీకృష్ణుడు సౌహార్దంతో దానిని స్వీకరించాడు. పాత్ర పోషణలోనూ, ఇతర వర్ణనలలోనూ కవి ప్రతిభాశాలి. అందుకే లోకంలో ‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు’ అనే నానుడి ప్రబలింది. ఈ కావ్యాన్ని రాయలకే అంకితమిచ్చాడు. సత్యభామ అంతఃపురంలో కృష్ణుని దినచర్య రాయల దైనందిన దినచర్యయే. వైభవోపేతమైన స్వర్ణయుగానికి నిదర్శనం.

కృష్ణరాయల వంశాన్ని, శౌర్యప్రతాపాలను అవతారికలో 18 పద్యాలలో వర్ణించాడు. జనమేజయ మహారాజు హరికథామృతపానంలో నిత్యం తృప్తి చెందేవాడు. ఆయన ఒకనాడు వైశంపాయన మునితో – శ్రీకృష్ణుడు యాదవ వంశంలో పుట్టి భూలోకానికి పారిజాత వృక్షాన్ని ఏ విధంగా తెచ్చాడో – చెప్పమని ఆదరంగా పలికాడు. అప్పుడు ముని కథా కథనం మొదలుపెట్టాడు. ఈ కావ్యంలో ప్రధానంలో మూడే మూడు పాత్రలున్నాయి. (1). శ్రీకృష్ణుడు (2). సత్యభామ (3). నారదుడు.

సత్యభామ పాత్ర:

ఈ కావ్యంలో ప్రధానంగ సత్యభామ స్వభావం ప్రతిఫలించి కథాగమనం కొనసాగింది. నిరహంకారమైన, నిర్మలమైన ప్రేమతత్వాన్ని సత్యకు చెప్పడానికే కవి ఆ పాత్రను అలా తీర్చిదిద్దాడు. ఆమె స్వాధీనపతిక. శ్రీకృష్ణుడు దక్షిణనాయకుడు. ఓర్పుగా, నేర్పుతో పనులు చక్కబెట్టడానికి ప్రయత్నించి సత్యను మెప్పించాడు. దైవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా గాక సాధారణ మానవుడి వలె ప్రవర్తించాడు. ఈ కావ్యంలో ముఖ్యంగా నారదుని కలహప్రియత్వం, రుక్మిణీదేవి వినయసంపత్తి, దేవేంద్రుని అహంకారం, సత్యభామ స్వాభిమానం అంతటా ప్రతిఫలించాయి.

శ్రీకృష్ణునకు సత్య గాక మరి ఏడుగురు భార్యలున్నారు. వారికి తోడు 16వేల మంది గోపిక లున్నారు. ‘నన్ను నెవ్వతెగా చూచితి’వని సత్య ఎంతో దర్పంగా పలికింది. అనుకూలవతియైన భార్యతో దక్షిణనాయకుడు ఎలా సంసారం చేస్తాడో శ్రీకృష్ణుడు ప్రవర్తించినట్లు తిమ్మన కథను నడిపించాడు. స్వర్గలోకంలో ఉండే పారిజాత వృక్షాన్ని తెచ్చి నీ పెరటి చెట్టుగా నాటిస్తానని కృష్ణుడు సత్యతో అంటాడు. చెలికత్తెల మాటలు విని యజమానురాలు ఎలా చెడు భావాలు కల్పన చేసుకొగలదో ఇందులో చూపాడు. నారదుడు రుక్మిణి ఇంట్లో తన ప్రస్తావన తీసుకురావడం ఆమెకు కష్టం కలిగించిన అంశం.

“ఆ మతకరి వేలుపుం తపసి మమ్ము తలంపగ నేల అచ్చటన్‌?” అని బాధపడింది. కృష్ణుడు ‘నేను భవదీయ దాసుడ’అని ప్రాధేయపడ్డాడు. చివరకు అన్నదమ్ముల యుద్ధం అనివార్యమైంది

ఇందులో భగవత్ స్తుతి బుధ కవిత్వంలో పది కవిత్వంలో పది పద్యాలలో నడిపాడు తిమ్మన. తులాభార ఘట్టాన్ని తిమ్మన ప్రస్తావించలేదు. కాని లోకంలో స్టేజి నాటకంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ తమ పీఠికలో (ఎమెస్కో ప్రచురణ) ఇలా శ్లాఘించారు.

“లోకములోని ఒక వృత్తాంతమును కావ్యముగా వ్రాయుట తెలివి. కథ కుదిరినది. కనుక తిమ్మన దాని నాశ్రయించినాడు.
తిమ్మన పలుకుబడి ముద్దు
అతని భావములు ముద్దు
అతని కథావస్తువు ముద్దు
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న మాట ఈ రీతిగా ముప్పేటగా నున్నది” అంటారు విశ్వనాథ.

కథా గమనం:

శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించి, అతని ఇంటిలో చెరపట్టబడిన 16వేల మంది అప్సరసలను నారదుని సూచనతో వివాహమాడాడు. రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ – అనే మరో ఎనమండ్రు మహిషులున్నారు. ఆ రమణీమణులతో ద్వారకలో విశాల భవనాలలో కేళీ వినోదాలు సలుపుతున్నాడు. వారిలో సత్యాదేవితో మరింత చనువు.

ఇలా వుండగా ఒక రోజు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఇంట్లో ఆమెతో వినోదంగా జూదమాడుతున్నాడు. అక్కడకు నారదుడు విచ్చేశాడు. రుక్మిణీకృష్ణులు ఆతిథ్యమిచ్చి సత్కరించారు. నారదుడు కృష్ణుని అవతారాలను స్తుతించాడు. తనతో తెచ్చిన పారిజాత పుష్పాన్ని కృష్ణుని చేతికిచ్చాడు. ఆయనకు వెంటనే సత్య గుర్తుకు వచ్చింది. ఇక్కడ వున్నాను గాబట్టి ఈమెకివ్వడం ధర్మమని రుక్మిణి కిచ్చాడు. ఆమె తలలో ధరించింది.

ఇక్కడే కథ మొదలైంది. నారదుడు పారిజాత మహిమను వేనోళ్ళ కొనియాడాడు. అంతటితో ఊరుకోలేదు తంటాలమారి నారదుడు!

“ఇన్ని దినంబులున్‌ సవతు లిందరలో నల సత్యభామ కన్‌
సన్నల ద్రిమ్మరున్‌ హరి వశంవదుడై యన విందు, గాని ఓ
కన్నియ! నీయెడన్ గలుగు గారవ మెయ్యెడ చూచి కాన; లే
కున్న అనర్ఘ్య కుసుమోత్తమ మేరికినైన నిచ్చెనే!”
(ప్రథమా -65)

సత్యభామ చెలికత్తె ఒకతె ఈ విషయాన్ని చూచినది చూచినట్లుగా చెప్పింది. ఇంతలో సత్య కుడి భుజ మదిరింది. అశుభ సూచకమని భావించింది. తాను దెబ్బతిన్న త్రాచువలె నైనది. నేయి పోయగా భగ్గున మండిన అగ్నిజ్వాల అయినది. ఇన్నాళ్ళు నా మీద భర్త ప్రేమను నటించా డనుకొంది. కోపగృహంలో మాసిన చీర కట్టుకుని, తలకు వాసనకట్టుగట్టి చీకటింటికడ నేలపై విషాదంతో వాలిపోయింది.

ఏదో విపత్తు రాబోతోందని కృష్ణుడు పసిగట్టాడు. అక్కడి నుండి బయలుదేరి రథమెక్కి హుటాహుటీన తత్తరపాటుతో సత్యాసౌధానికి చేరుకున్నాడు. అక్కడ వాతావరణం పసిగట్టాడు. ముసుగు పెట్టుకొని బాష్పలోచనయైన సత్యను చూశాడు. అనునయంగా మాట్లాడాడు. “నీ కడకంటి చూపులతో కటాక్షించవా?” అని వాపోయాడు. కోపావేశంతో సత్య శ్రీకృష్ణునితో పరుషంగా పలికింది. “మానంబె తొడవు సతులకు” అని వాపోయింది. ఆమె పతి శిరస్సును తన వామపాదంతో తొలగదోసింది. “నాధుల్ నేరముల్ సేయ పేరలుకన్ చెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే!” అని కవి సమర్థించాడు.

శ్రీకృష్ణుడు నటనా సూత్రధారి.

“నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ; చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తనుపులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద; నల్క మానవు గదా! ఇకనైన అరాళ కుంతలా!”
(ప్రథమా -123)
అని ఓదార్చాడు

పువ్వు కాదు – పారిజాత వృక్షం తెచ్చి ఇస్తానని ప్రతిన చేశాడు. సత్య ఎలానో ఊరడిల్లింది.

శ్రీకృష్ణుడు వున్న సమయంలో సత్య ఇంటికి నారదుడు వచ్చి సత్యను ఆశీర్వదించి వెళ్ళాడు. దేవలోకానికి కృష్ణుడు ప్రయాణం సమకట్టగానే గరుడుడు స్వయంగా వచ్చాడు. సత్యాకృష్ణులు గరుడునిపై ఎక్కి ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణునికి మొక్కి సాదరాహ్వానం పలికారు. శ్రీకృష్ణుడు సతీ సమేతంగా వైజయంతంలో విడిది చేశాడు. దేవమాత అదితిని దర్శించి ఆమె కుండలాలను ఆమెకు సమర్పించాడు.

సత్యాకృష్ణులు వనవిహారానికి వెళ్ళి జలక్రీడ లాడారు. పారిజాత వృక్షాన్ని పెకలించి తీసుకెళ్లబోయాడు కృష్ణుడు. వనపాలకులు అడ్డగించారు. “ఇంద్రాణి ఎవ్వతె? ఇంద్రుడెవడు?” అని సత్యభామ ప్రగల్భాలు పలికింది. ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. దేవతలు, దిక్పాలురు శ్రీకృష్ణుని చుట్టుముట్టారు. కృష్ణుడు వారిని తరిమికొట్టి ఇంద్రుని నొప్పించాడు. నారదుదు ఆనంద నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు వజ్రాయుధాన్ని వొడిసి పట్టుకున్నాడు. ఇంద్ర ఉపేంద్రులు పరస్పరం ఓదార్చుకొన్నారు.

పారిజాతంతో ద్వారకకు వచ్చిన కృష్ణుడు సత్య పెరటి చెట్టుగా ఆ పారిజాతాన్ని నాటించాడు. నారదుడు మళ్ళీ వచ్చి పుణ్యక వ్రత మహాత్యాన్ని సత్యకు బోధించాడు. వ్రతంలో భాగంగా శ్రీకృష్ణుని దానంగా నారదునకు అందించింది సత్య. నారదుడు కృష్ణునితో మేలమాడాడు. నారదుడు కృష్ణుని సత్యకు తిరిగి ఇచ్చాడు. సత్యాదేవి సవతులందరికి వాయనా లిచ్చింది. రుక్మిణి తదితర సవతులు, పదారువేల భార్యలు ఆనందించారు. నారదుడు చతురోక్తులతో శ్రీకృష్ణుని స్తుతించాడు.

ఈ విధంగా ముక్కు తిమ్మన రమణీయ కావ్యంగా పారిజాతాపహరణ కావ్యాన్ని తీర్చిదిద్ది ఆంధ్ర సాహిత్య నందనోద్యానంలో కల్పవృక్షంగా నాటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here