అనుబంధ బంధాలు-23

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 23వ భాగం. [/box]

[dropcap]దీ[/dropcap]క్షితులు వయస్సును లెక్క చేయక పసితనం వదిలిన యువకునిలా బజారెంట పరుగెడుతున్నాడు. ఒంటిపైన బట్టనిలిచే స్థితి లేదు. అంత ఆనందం.

ఎదురు పడ్డవారు సరిగ్గా కనిపించడం లేదు. రెండు చేతులతో ‘పనగడను’ బలవంతముగా లోనకు జరిపి ‘దశరథం, దశరథం’ అంటూ వేగంగా లోనికి వచ్చేసాడు.

లోపలి నుండి వరండాలోకి వస్తున్న దశరథానికి ఈ పిలుపు ఉలికిపాటులా అనిపించింది. ‘ఏదో జరిగింది’ అనుకుని వేగంగా బయటకొచ్చి ‘ఏమిటి? ఏమిట్రా?’ అనడిగాడు ఆతృతగా…

ఎదురొచ్చిన దశరథాన్ని దాటేసుకుని హాలులో జొరబడి ఆరామ్‌గా కూర్చుని “శుభం జరిగిందయ్” అన్నాడు నసపెడుతూ…

దీక్షితులి ముఖంలో అంతులేని ఆనందం తొణికిసలాడింది. శుభాన్ని తలిపే పద్దతి ఇలా కూడా ఉంటుందా? అని చికాకుపడ్డాడు దశరథం. అతను కూర్చున్న చోటుకు చేరి “చెప్పరా ఏం జరిగింది?” అనడిగాడు.

“రాజయ్య వాళ్ళు మన సంబంధాన్ని ఖాయం చేసుకనేందుకు వొప్పుకున్నారు” అన్నాడు ఆనందంగా నవ్వుతూ.

వీడికి పిచ్చి గాని లేవలేదు గదా! అనుకుని ఆగాడు…

‘ఓరి నీ అసాధ్యం కూల. ఈ విషయం మధ్యాహ్నమే రాములయ్య వచ్చి వివరంగా చెప్పి వెళ్ళాడు. నీ దగ్గరకెళ్ళి విషయం చెప్పి లగ్నాలు అవీ ఎప్పుడు బావున్నాయో చూయించుదామనుకున్నాను. ఇంతలో తుఫానులా నువ్వు వచ్చి పడితివి’ అన్నాడు సీరియస్‌గా.

నిజంగా షాక్ తిన్నాడు దీక్షితులు.

‘నేను చూసి కుదిర్చి మంచి చెడు అర్సుకున్న వాణ్ణి నేను ఉండగా మొదట ఇక్కడికా కబురు?’

‘అవును. మధ్యవర్తిత్వపు అక్కర లేనప్పుడు పానకంలో పుడకలాగా ఇంకా మధ్య నెందుకు అనిపించిందా. Am I correct’ అనుకున్నాడు పెద్దగా.

నిజంగా ఆ క్షణాన పంచరంగులూ కదిలినయి.

సీతమ్మ, విజయ కంగారుగా బయటకొచ్చి నిలబడిపోయారు. పరిస్థితి గమనించాక విజయ దీక్షితులు దగ్గరికెళ్ళి “మామయ్య నీకు నా పైన ఉన్న మమకారం ఎంతో ఇప్పుడే అర్థమయింది. ఇంత దొడ్డ మనసున్న నిన్ను, భగవంతుడు ఎందుకు చిన్న చూపు చూసినట్టు? మనిద్దరి అదృష్టాన్ని కూడా చేత పట్టకున్నాడు గద!” అంది భుజానికి తల ఆన్చి.

“అమ్మా! విజయా తప్పమ్మా. అలా మాటాడకూడదు. నా అదృష్టరేఖ చినిగిపోవడం వరకూ కరక్టే కానీ నీ అదృష్టానికేం? తప్పు. పొరపాటున కూడా అలా అనుకోవద్దు. నన్ను చంపుకుని తిన్నట్లే ఆఁ!” అంటూ విజయ తల పై చేయి ఉంచి మనస్పూర్తిగా ఆశీర్వదించాడు.

“మామయ్యా నా పెళ్ళి  కుదిరిందనగానే నీ కళ్ళలో మెదిలిన సంబంరం చూసాక దైవత్వమదేననుకున్నాను. నీకు కానీ సుఖానికి – అంతగా స్పందించడం ఒక్క ఋషులలోనే కనిపించేదట. వారి కోరిక ఈ చరాచర వర్తనపు యాశీస్సు గనుక అలా ఈ కాలాన నువ్వు ఉన్నావు” అని కళ్ళు వత్తుకుంటూ దీక్షితులు పాదాల దగ్గర కూర్చుండిపోయింది.

విజయను లేపి అక్కున చేర్చుకుని “అమ్మా అమ్మా విజయా ఏమిట్రా…. నేను ఇంత కాలం పరాయివానిలా కనిపించానట్రా?” అన్నాడు దీక్షితులు.

“పిచ్చితల్లీ నువ్వు పుట్టిన నాడే మేం వెళ్ళి చూసి ‘ఓరేయ్ దశరథం నీకు శ్రీలక్ష్మి లాంటి పిల్ల కలిగినా అది నాయింటికి వచ్చేదారా’ అని చెప్పి మరీ వచ్చాను. నువ్వు నా పిల్లవి అంటే ఎదురుగానే ఉన్నాడు మీ నాన్న అడుగు నువ్వు. ఎంత దశరథం దగ్గరే పెరిగినా నా కుతురుగానే చూసుకున్నానమ్మా. చాలా ఘనంగా ఆకాశం అంత పందిరి, భూదేవి అంత అరుగేసి పెడ్లి జేసి నా ఇంటికి కోడలు హోదాలో తీసుకెళ్తామనుకున్నాను. అవి కలలు అవుతాయని అనుకోలేకపోయాను. నిజాలనుకున్నాను నిజాలు…” అని అదోలా నవ్వి… “నేను నిత్యం కొలిచే దేముడే నన్ను ఇలా చేసి వినోదిస్తాడని ఊహించలేకపోయాను” అని దీక్షితులు  క్షణం ఆగి విజయ వైపు చూసి “అమ్మా విజయా మనం నమ్మిన ఆ భగవంతుడు కూడా శాడిష్టులా ఉన్నాడు. ఎదుటి వాణ్ణి హింసించి మానసికంగా క్షోభపెట్టి దాన్ని కన్నులారా చూస్తూ ఉలుకు పలుకు లేక చిరునవ్వుతో దర్శనమిచ్చే వాడనీ, అంతే కదా అనాలి. అసలలాంటి వారు భగవంతుడెలా అవుతాడు?” అన్నాడు.

“దీక్షితులు మళ్ళీ గతంలోకి వెళ్తున్నావు? మొదట వర్తమానం సంగతి చూడు” అన్నాడు దశరథం.

“ప్రస్తుతం నడుస్తున్నదిదే గదా!” అన్నాడు లేస్తూ దీక్షితులు. “వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకొని బాధపడే సంయమనం నాకు అధికమయింది. నీకు తెల్సు. అయినా కాలగమనాన్ని చూడకుండా ఉండే వాణ్ణిననుకునేవు. అదేరా నీకు బ్రతుకు చదువు చెప్పిన పాఠం” అని…, “ఇవ్వాళ్ళ తిధి ఎలా ఉంది?” అడిగాడు.

“మంచిదే…”

“అయితే పద పూజారయ్యను కల్సివద్దాం.”

“గుళ్ళో ఉంటాడేమో?”

“కాఫీ కలుపుతున్నాను త్రాగి వెళ్ళండి” అంది సీతమ్మ. ఇద్దరూ ఆగారు. కాఫీ త్రాగి బయలుదేరారు. గడపదాటే ముందు దీక్షితులు విజయ వంక చూసాడు. వెళ్ళి  రమ్మన్నట్లుగా చూసింది. ప్రసన్నంగానే ఉంది మనిషి బాటన నడుస్తుంటే దీక్షతులుకు గాలిలో తేలిపోతునట్లుగా అనిపించింది. గుడి గంటలు అప్పుడప్పుడు మోగుతున్నాయి. దశరథం వెంట నడుస్తున్నాడు.

“అదిగో గుడి…”

గుడి ముందు చలమయ్య ఎదురయ్యాడు. “దండం దొరా” అన్నాడు దీక్షితుల్ని చూస్తూ…

“చలమయ్యా అంతా బావున్నారా  అంటూ ఆగి దగ్గర కొచ్చి “మీ పెద్దమ్మాయి భర్త మిలిట్రీ నుండి పారిపోయి వచ్చాడన్నారు? నీ దగ్గరే ఉంటున్నాడా? పిల్లను తన దగ్గరికి తీసుకెళ్ళాడా? చిన్నోడు పది తప్పాడన్నారు? వాడ్నే చేయిస్తున్నావు?” అంటూ మెట్లెక్కాడు. పై కెళ్ళాక చూస్తే కనిపించలేదు. బాట వంక చూసాడు చాలా దూరాన వెళ్తూ కనిపించాడు చలమయ్య. దశరథం వంక తిరిగి మన “రామరాజు కొడుకు MSc చదివాడు గదా ఉద్యోగం వెలగ పెడుతున్నాడు కూడా. కానీ తల్లిదండ్రులకు రెండొందలు నెలకి పంపడానికి చస్తున్నాడు. ఈ చలమయ్య గాడి కొడుకు షోడాలు అమ్మి వాడు బ్రతుకుతూ అయిదు వందలు పంపుతున్నాడు. మన చదువులకున్న సంస్కారం అది.”

పూజారయ్య గర్భాలయంలో నల్గురితో కనిపించాడు.

“నమస్కారం” అన్నాడు దీక్షీతులు.

“మీరా? ఇప్పుడా?” అన్నాడూ ఆశ్చర్యపోతూ…

“మేం వచ్చింది తమ కోసమే” అన్నాడు దశరథం వెనక నుంచి.

“రెండు క్షణాలలో వస్తాను” అని శిష్యులకు చెప్పివచ్చాడు.

“విజయకు వివాహం కుదిరంది. వియ్యాల వారి నుంచి అంగీకారం తెలిసింది. మనం రెండు, మూడు ముహుర్తాలు పిల్లల పేరు బలం పైన చూసి పంపాలి కదా. ఈ మాటే తమ చెవిన వెసి పోదామని వచ్చాం. గోత్రానామాలు తమకు తెలుసుగదా! అటు వైపు వారివి దీక్షితులు దగ్గర ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని సుభఘడియను వెదకండి. లగ్న పత్రిక వ్రాయించేప్పుడు ఎట్లాగూ వాళ్ళు వస్తారు. చెప్పిపోదాం అని” అన్నాడు దశరథం.

“శుభం” అన్నాడు. అంటే వెళ్ళిపొమ్మన్నట్లు. “అంతేనా?” అడిగాడు దీక్షితులు నవ్వి వెనక్కి తిరుగుతూ…

దూరాన అరుగుపైన పిల్లలు కనిపించారు.

“ఆ పిల్ల లెవరు?” అడిగాడు.

“వేరే పాఠశాల నుంచి వచ్చారు.”

“ఇక్కడికెందుకు వచ్చారు?”

“గంగను గురించి తెలుసుకోవడానికి”.

“మీకు తెల్సునని వారికెలా తెల్సు?”

“తెలియనివేవి ఇక్కడకు వచ్చి తెలుసుకోవల్సిందిగా గురుపీఠం వారు చెప్పారట.”

“చెపుతున్నారా?”

“చెప్పాలి”

“ప్రారంభించారా?”

“ఆఁ! ఇంతలో మీరు కనిపించారు.”

“మేమూ వినవచ్చును గదా?”

“దానిదేముంది” అన్నాడు. ఆ వెంటనే పిల్లల మధ్యకెళ్ళి పద్మాసనం వేసి పాఠంలా విషయాన్ని ప్రారంభించాడు.

“ గంగ…”

భారతీయత జీవనాడి… పవిత్ర జీవవాహిని… సుమధుర ఝురి… ఈ నేలన పుట్టిన వారి ఆత్మ పరమాత్మలాంటిది. ఈ తల్లి అడుగుజాడలలోనే భారతీయ సంస్కృతి పుట్టి పెరిగింది. గుక్కెడు గంగ నీరు త్రాగితే చాలు సకల రోగాలు సకలపాపాలూ పోతాయని భావిస్తారు. అంతే కాదు దృష్ట్యాత్ హరితే పాపం.

గంగను చూసినా చాలు సకల పాపాలు హరిస్తాయట. ఈ జాతికి అంతటి నమ్మకం గంగంటే. గంగ పుట్టుక పూర్తిగా భగవద్దత్తమైనదేమోననిపిస్తుంది.

వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుని పాదాల చెంత పుట్టి పరమ శివుని సిగలో దూకి… హిమశైలం పైకి జారి… భగీరథుని ప్రయత్నంలో ఆయన వెంటపడి ఉరుకులు పరుగులతో భూమి పైకొచ్చి… ఈ నేలను మహిమానత్వం సస్య శ్యామలం చేసి సాహిత సంస్కృతుల్ని వెదజల్లి నడచిన నడక ఒక సుదీర్ఘ సురుచిర యాత్ర… ఇంతే కాదు…దీని వెనుక అల్లుకొని ఉన్న పురణేతి హాసమూను…

వాల్మీకి, భవభూతి, వ్యాస, కాళిదాసులు కీర్తించిన తల్లి ఈ గంగ త్రిగుణత్వం లాంటి సుగుణాలను కలిగిన జలరాశి…

మొన్న మొన్నటి దాకా గంగ మానస సరోవరం నుంచి పుట్టి ప్రవహిస్తున్నదని నమ్మకం ఉండేది.

ఇది ఇలా ఉంటే… ‘గంగ’ పుట్టుకకు పురాణ కథ ఒకటి చెపుతారు… “కర్దముడనే వాడున్నాడు ఆయన కుమార్తె పేరు ‘కళ’. ‘కళ – మరీచి’లకు ‘పూర్ణిమ’ కలిగింది. ఈ పూర్ణిమ చిన్ననాటి నంచి శ్రీహరిని సేవించేది. ఈవిడ భక్తి తత్పరతకు ప్రసన్నుడైన శ్రీహరి ప్రత్యక్షమైనాడు. పూర్ణిమ శ్రీహరి పాదాలను తాకి నమస్కరించింది. శ్రీహరి పాదస్పర్శచేత పరవశించి, ద్రవించి,నీరుగా మారి గంగ అయిందంటారు.”

శ్రీమహావిష్ణువు పాదలపై పడి జాలువారి దొర్లినవీ… పవిత్ర ‘గంగ’గా మారి ప్రవహించిందని అంటారు. అందుచేతనే విష్ణు పదార్చన గంగ అన్నారు గంగమ్మ తల్లిని.

“మరో కథ బలి చక్రవర్తిది…”

మరో  కథ ఉంది భగీరథునిది.

అయితే దృశ్యపరంగా హిమాలయాలలోని గోముఖ్ వద్ద గంగ పుట్టుక మనకు కనిపిస్తుంది.

గంగోత్రి వరకు ఉరుకులు పరుగులతో పరవళ్ళు తొక్కుతూ నడుస్తుంది. అక్కడి నుంచి నడచే నడకలో జాహ్నవి, అలకనంద, విష్ణు గంగ అనే ఉపనదులను తనలో కలుపుకుంటుంది.

ప్రయాగ సమీపంలో యమున వచ్చికలుస్తుంది. అలహబాదు నగరం వద్ద అంతర్వాహిని సరస్వతి నదులను తనలో విలీనం చేసుకుంటుంది. అలా ప్రయాణిస్తునే హుగ్లీ వద్ద సాగర సంగమం చేస్తుంది” అని చెపుతుండగా అయిదారుగురు ముత్తయుదువులు పూజద్రవ్యాలు చేత పుచ్చుకని గుడి మెట్లెక్కి కనిపించారు. ఇక్కడ పూజ… ఆడవారిచ్చిన పూజా ద్రవ్యాలను తీసుకుని దీక్షితుల వైపుగా చూసి “మీరు నడవండి” అని చెప్పాడు.

మంచిదని నమస్కారం చెప్పి తోవకెక్కారు. గంగను గురించి శ్రద్ధగా కూర్చుని తెల్సుకున్న పిల్లలు కూడా ఇంటి ముఖాలు పట్టారు.

“వచ్చే నెలలో మంచి ముహుర్తాలు ఉన్నయని విన్నాను” అన్నాడు దీక్షితులు నడుస్తూ.

“పిల్లల పేర్లతో చూడాలి గదా…” “

“అవును…”

“వస్తానన్నాడు గద!…”

“ఆఁ!” అని “నేను ఇంటికెళ్ళి ఇంత తిని వస్తానేం” అన్నాడు దీక్షితులు…

“తినేది పిడికెడు ఇక్కడే తినవచ్చుగదా” అన్నాడు దశరథం.

“శాంత నా కోసం ఎదురు చూస్తుంటుంది రా…”

“అమ్మాయితో కబురు చేద్దాం లేవోయ్…”

“మళ్ళీ దాన్ని పంపడమెందుకు ఈ ఎండల్లో? నువ్వు బోజనం ముగించేలోపు నేను తిన్నాననిపించుకుని వచ్చేస్తాను” అంటూ వడిగా నడిచాడు.

దశరథం ఒక సారి దీక్షితుల వైపు చూసి ఇక పిలవడం కూడా అనవసరం అనుకొని ఇంటికి చేరాడు.

సీతమ్మ ఎదురు చూస్తూ కనిపించింది… “పూజారయ్య కలిసాడా?” అంది కాళ్ళకు నీళ్ళిస్తూ….

“ఆఁ! కలిసాడు. వీడు మాత్రం భోంచేసి వస్తానని పరుగెత్తాడు” అని నవ్వాడు.

“మీరు రమ్మని ఉండరు?” అంది

“అవును, అనలేదు” అన్నాడు చరుక్కుమనేలా చూసి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here