పాదచారి-18

0
3

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 18వ భాగం. [/box]

[dropcap]“ఆ[/dropcap]కాశానికి అంతం ఎక్కడ?” చెట్టు తల్లిని అడిగాడు పాదచారి.

“అంతేనా?” నవ్వినట్లుగా పండుటాకుల్ని గలగలలాడించింది మర్రి చెట్టు. వృద్ధమాత శిరోజాల్లా ఊడలు ఊగాయి…

“ఈ నక్షత్రాలూ, తారలూ, కోటాను కోట్ల మానవ రూపాలు లెక్కకు దొరకని జీవ, జంతు, పక్షి, వృక్ష జాతులూ, ఇవన్నీ ఎక్కడివి?” చుట్టూ చూస్తూ ప్రశ్నించాడు పాదచారి.

“బస్… అంతేనా” బుస్, బుస్‌మందో పక్కన పోయే పాము.

“సరే, వెలుగూ, చీకటీ, సుఖమూ, దుఃఖమూ అనేకానేకానేక భావాలూ, సంకల్పాలూ, ఋతువులు, ప్రకృతి, ప్రభలూ, భగవంతుడు, ఉన్నవీ లేనివీ, తలిసినవీ తెలియనివీ సరేనయ్యా, సర్వం, అన్నీ ఎక్కడివీ?” ప్రశ్నించాడు ఓపిగ్గా.

“ఎక్కడివీ అంటే?” ప్రశ్నిస్తూ వాలిపోయిందో పువ్వు.

“ఎక్కిడికీ అంటే, ఎక్కడి నించి వస్తున్నాయీ, ఎక్కడికి పోతున్నాయీ, ఎందుకొస్తున్నాయీ, మరెందుకు ఎక్కడికి పోతున్నాయీ అని!…” వివరించాడు పాదచారి.

“మరి నీ సంగతేవిటి? వాటన్నింటినీ అక్కడుంచు!… నువ్వెక్కడి నించి వచ్చావు? ఎందుకొచ్చావు? ఎక్కడికి పోతున్నావు? ఎందుకీ ప్రశ్నవేస్తున్నావు?” నేను ప్రశ్నలు కురిపించగలనన్నట్లు తెరలు తెరలుగా వీస్తూ ప్రశ్నించింది గాలి.

“చెప్పు చెప్పు” అన్నట్లు ఊగాయి ఆకులు.

“నాకేం తెలుసూ? తెలీకేగా అడిగిందీ?” చికాకు పడ్డాడు పాదచారి.

“నువ్వెక్కడ్నించొచ్చావో నీకే తెలీదా?” అదిలించింది చిరుగాలి.

“కొంచం తెలుసు…. కొంచం తెలీదు.”

“అయితే పూర్తిగా నీ గురించి నువ్వు తెలుసుకునే ఇతర్ల గురించీ, సృష్టి గురించి అడుగు. నువ్వెవరో నీకే తెలీనపుడు సృష్టి గురించి ఏం చెప్పినా ఏమి తెలుస్తుంది?” ప్రశ్నించింది గాలి.

“అతడికి తెలుసు అయితే తెలుసనే విషయమే తెలీదు!”

నవ్వింది మర్రి చెట్టు ఊడల్ని ఊగిస్తూ.

“తెలవటం ఏమిటీ? తెలుసని తెలవకపోవటం ఏమిటి?” చికాగ్గా ‘బుస్’ మంది పాము.

“నీ దృష్టిలో నువ్వో జీవానివి. నీకు నీ రూపం మాములుగా అందంగా సహజంగా కనిపిస్తుంది. అవునా? నీ కోరల్లో విషం నీకు అత్యంతక సహజమైనదే! అవునా? అలాగే నువ్వు పాకటం కూడా! నీ కోరలు నీకు శతృవుల నించి రక్ష ఇచ్చేవే గదూ?” పాముని ప్రశ్నించింది చెట్టు.

“అవునూ! అయితే దానికీ దీనికీ ఏమి సంబంధం?” బుస్సున లేచి చికాకుపడింది పాము.

“మానవుల దృష్టిలో నీ కోరలు విషపూరితాలు. నువ్వు విషపూరితమైన దానివి. నీ అందం నీజాతికి తెలుసు. నీ భాష నీ వాళ్ళకి తెలుసు. నువ్వు యీ మానవుల్లా సంగమించే గుడ్లు పెడతావు. అయితే మానవులు నిన్నా విధంగా చూడరు. వారి దృష్టిలో నీకు రకరకాల పేర్లు పెడతారు. మీ జాతికంతటికీ భాష ఒకటే. అయితే మానవులు లక్ష భాషల్లో లక్ష పేర్లు పెడతారు. నీ దృష్టిలో నువ్వో సహజమైన జీవానివి. వారి దృష్టిలో క్రూర కాళ సర్పానివి.”

“నేనా?” ఆశ్చర్యంగా తోక మీద నిలిచింది పాము.

“చూశావా? నీకు తెలిసినంత వరకూ నువ్వు సాధువ్వే. నీ కోరలూ నీ విషమూ కేవలం నీ రక్షణకే ననుకుంటున్నావు. అయితే నువ్వు కాటేసినప్పుడు వాళ్ళు చస్తారని నీకు తెలుసా? వాళ్ళ దృష్టిలో నువ్వో మహా క్రూర జీవానివని నీకు తెలుసా?”

“ఇపుడు నేను చెప్తే ఎంత ఆశ్చర్యపడుతున్నావూ? నీకు ఆలోచన తక్కువ. వాళ్ళకు ఆలోచన ఎక్కువ. అందుకే ప్రశ్నలు మనల్ని వేస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళే వేసుకుంటారన్నమాట. మనకి ప్రశ్న మాత్రం వేస్తారు. జవాబు కోసం వాళ్ళని వాళ్ళు మధించుకుంటారు. అదే తెలిసి, తెలియకపోవడం. అంటే, తెలిసినట్టు తెలియికపోవడం” వివరించింది చెట్టు. ఆయాసంతో మధ్య మధ్యలో ఆగి కొమ్మల చేతుల్తో విసురుకుంటూ.

“సరే, ఇంతకీ నా ప్రశ్నకి సమాధానమేమిటి?” అన్ని విని మళ్ళీ ప్రశ్నించాడు పాదచారి.

“ఇంకా తెలీలేదా?” ప్రశ్నించింది వృక్షం ఓపిగ్గా.

“ఏమో! నువ్వున్నట్లు తలిసీ తెలియనట్లుగా ఉంటోంది!”

తల్లిని బిడ్డ కౌగిలించుకున్నట్లు వృక్షాన్ని కౌగిలించుకుని బుగ్గలు బెరడుకి అదుముకుంటు అన్నాడు పాదచారి.

“బిడ్డా నా బిడ్డా” కొమ్మలు చాచి అందుకోవటానికనట్లు ఊపింది చెట్టు.

“చెప్పవా?” ప్రశ్నాంచాడు పాదచారి మళ్ళీ బింకంగా

“ఊ!… జవాబు తేలిక. అనుభవం మాత్రం సాధనలోనే!”

“ఏమిటో జవాబు” ఆత్రంగా ఊగింది చిగురుటాకు

“నీ మనస్సే పాదచారీ!… నీ మనస్సే! ఆకాశానికి ఆదీ, అంతమూ, అసలు మూలమే నువ్వు. నువ్వు అంటే నీ శరీరం కాదు. ఏది శరీరంగా శరీరాన్ని గుర్తిస్తోందో అది. అదే అన్నింటికీ మూలం. అదే సర్వం. అనేకానేక రూపాలుగా ఇమిడి ఉంది” నవ్వుతూ బోధించింది వృక్షమాత.

“అన్ని అతనే అయితే నువ్వూ నేను వేరు వేరుగా ఎలా ఉన్నాం?” ప్రశ్నించేదీ జవాబు చెప్పేదీ వేరు వేరు శరీరాలుగా సందేహంతో అడిగింది చిగురుటాకు.

“ఆ రెండు శరీరాలలోపలా ఉండి గుర్తించేది ఒకటేగా! ఆ ఒకటీ అన్నిట్లోనూ ఉంది” మళ్ళీ వివరించింది వృక్షమాత.

“అది పిచ్చ వేదాంతం. మాకు పని లేదు దాంతో” ఎండి పోతున్న ఆకులు గలగలమన్నాయి.

“ప్రశ్న లేదు గనక మీకు పని లేదు. ముందే చెప్పాగా జవాబు తేలికనీ, అనుభవం సాధనలోనే” అని నవ్వింది వృక్షమాత.”

“సాధన అంటే ఏమిటీ?” ప్రశ్నించింది పాము.

“నువు జీవించటమే!” జవాబిచ్చింది పండుటాకు.

“అంటే?” మరో ప్రశ్న.

“అంటే నువ్వు జీవిస్తూ నిన్ను నువ్వు విశ్లేషించుకోవటమే! నీ ఆలోచన పేరిగిన కొద్దీ ఆ ఆలోచనకు తగిన సంఘటనలు నీకు దారి చూపుతాయి. విశ్లేషించుకుంటే మాత్రమే సుమా!” నవ్వింది వృక్షమాత.

“ఎలా?” అన్నట్టు “క్యూం” అని కూసింది కోయిల.

“నేను పెరుగుతున్నపుడు నా వేళ్ళు పెరిగాయి. వేళ్ళు బలంగా నేలలోనికి చొచ్చుకుపోతున్నపుడు నా పత్రశిణువులూ పెరిగాయి. పెరిగిన కుటుంబం మరింత ఆహారాన్ని సమకూర్చుకునేందుకు ఊడల వేళ్ళు ఉద్భవించాయి. అలానే! యీ దశలో అలాంటివే సంఘటలనల మాలలే! అన్నిట్నీ ఏరి కూర్చితే మాలగా మెడలో ధరిచవచ్చు. దాన్ని దాన్ని వదిలేస్తే ఏదీ లేక తిరగనూ వచ్చు!” వివరించి నవ్వింది వృక్షమాత.

విశ్వాసం ఠీవిగా ముందుకు నడిచింది. ఉత్సాహంగా వృక్షమాతని కౌగిలించుకుని విశ్వాసాన్ని వెంబడించాడు పాదచారి.

***

“నా జోలికి నువ్వురాకు” కోపంగా అన్నాడు దారినపోయే దానయ్య.

“నీ జోలా? ఏదీ నీ జోలి?” పకపకానవ్వాడు వేదాంతి

“వేదాంతీ!” ఆపటానికి ప్రయత్నించాడు పాదచారి.

“అగవయ్యా పాదచారీ! నా జోలీ నాజోలీ అని యీ దారేపోయే దానయ్య మహా ఉబలాటపడిపోతున్నాడు! అతని జోలి ఏమిటో ఎక్కడుందో కాస్త చూడనీ!” నవ్వాడు వేదాంతి

“నాజోలికి అంటే నా యింటికి రాకు… నా వెనక పడబోకు” క్రూరంగా చూస్తూ అన్నాడు దానయ్య.

“ఓహో నీ యిల్లా?” పకపకా నవ్వాడు వేదాంతి

“నా యిల్లే! నేను చెమట ఓడ్చి కట్టుకున్నయిల్లు” పిచ్చికోపంతో అరిచాడు దానయ్య

“అలాగా! చేమటతోనే ఇల్లు కట్టావా” మళ్ళీ నవ్వాడు వేదాంతి.

“మూర్ఖుడా చెమటతో కాదు చెమటోడ్చి డబ్బు సంపాయించి ఇనుమూ, ఇటుకా, సున్నం వేసి కట్టాను” కోపమూ చిరాకూ మిళితం చేసి అన్నాడు దానయ్య.

“సరేనయ్యా ఆ వస్తువులకి మూలం డబ్బు. ఆ డబ్బుని నువ్వు సృష్టించలేదుగా? సరే నువ్వు సృష్టించని డబ్బుతో నువ్వు ఇసుకా, ఇటికా, ఇనుమూ, సున్నం వేసి కట్టావు అవునా? అవన్నీ నీకు అమ్మిన వాళ్ళు వాటిని సృష్టించలేదుగా?”

“భూమిలోపల ఉన్న వాటిని భూమిపైన పేర్చినంత మాత్రాన అదంతా భూమిదికాక నీదెలా అయిందీ?” పకపకా నవ్వి ప్రశ్నించాడు వేదాంతి.

“కనీసం నా బుద్దీ మనసు నావి. వాటిని చికాకు పెట్టకు. నా శరీరం నాది, దాన్ని క్షోభ పెట్టక నీ దారి నువ్వు చూసుకో!” విసిగిపోయాడు దానయ్య.

“నీ శరీరం ఎవరో పేర్చిన ఎముకల, రక్తపు మాంసపు ఇల్లే. అది నీది కాని నువ్వు అదే (అంటే నీ శరీరమే) ఎలా అవుతావూ?” ప్రశ్నించాడు వేదాంతి.

“అంటే?”

“శరీరం ఎవరిది?”

“నాది!” జవాబిచ్చాడు దానయ్య

“నువ్వు శరీరానివా?”

“అంటే?”

“కాలె వరిదీ?”

“కాలు నాది.”

“నువ్వు కాలువా?”

“ఊహూ!”

“చెయ్యెవరిదీ?”

“నాది!”

“అంటే నువ్వు చెయ్యివా?”

“ఊహూ!”

“శరీరం ఎవరిదీ?”

“నాది!”

“అంటే నువ్వు శరీరానివా?”

“ఊహూ.”

“నువ్వు శరీరానివి కాదుగా? మరి నువ్వెవరూ?”

“అంటే?”

“నేనూ అని ఇప్పటి దాకా అనుకుంటున్న శరీరమే నీది కానపుడు ఇక నీది అనేది ఏదో నీకే తెలియనపుడు నన్నెందుకు తిడతావూ?” నవ్వాడు వేదాంతి.

“ఇది లాజిక్. అంటే బ్లడీ తర్కం….” కోపంగా అన్నాడు

“ఏం? ఆ తర్కాన్నే నువ్వు ఉపయోగించట్లేదా? నీకు అవసరం వచ్చినపుడు తర్కం ఉపయోగిస్తావా? అదే తర్కం నేను ఉపయోగిస్తే బ్లడీ తర్కమా? ఎలా?” కళ్ళెర్ర చేశాడు వేదాంతి.

“నేను తర్కాన్ని ఉపయోగించను. హేతువాదిని…” కోపంగా చూస్తూ అన్నాడు దానయ్య.

“అంటే కార్య కారణ సిద్ధాంతివేగా? ఏం? కార్యకారణాలకి మూలం ఆలోచించే స్థితికి ఎదగలేదా? లేక అదే పరమార్థమని కూచున్నావా?” మళ్ళీ నవ్వాడు వేదాంతి.

“కనిపించేదే సత్యం!”

“ప్రాణం కనిపిస్తుందా?”

“ఉనికి ఉందిగా?”

“ఆ ఉనికి అనేది కేవలం నీకే కనిపిస్తుందా? మరెవరికీ తలియబడదా?”

“నాకు తెలియబడుతందిగా?”

“తెలుసుకునేది ఎవరూ?”

“నేను!”

“అంటే” చిరాగ్గా అన్నాడు దానయ్య.

“అదేనోయ్ అడిగేదీ! నేనూ అంటే శరీరమానా?”

“శరీరం తెలియబడేదేగానీ తెలుసుకునేది కాదుగా!”

“జ్ఞానం!”

“జ్ఞానం అనేది ఎక్కుడోందో నీ హేతువాదాన్ని ఉపయోగించి చూపించగలవా?”

“శరీరం తోటి వచ్చేదే జ్ఞానం. ఎందుకంటే చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తూంది. నాలిక రుచి చూస్తుంది… ఇవన్నీ జ్ఞానాలే!”

“చచ్చిన వాడి నోట తేనే పోసి రుచి అడుగు! శరీరం మరి చెప్తుందేమో చూద్దాం! చచ్చిన వాడి వంటి మీద తాచుపాముని పడెయ్యి. స్పర్శ తెల్సుకుంటాడేమో చూద్దాం!…. ” నవ్వాడు వేదాంతి.

“ప్రాణం లేదు గనక తెలీదు.”

“ప్రాణం ప్రాణం ఎక్కడుందిట?”

“అదీ…” నీళ్ళు నమిలాడు దానయ్య

“మరో సిద్ధాంతం వెదుక్కో…” నవ్వి ముందుకు సాగాడు వేదాంతి. ఆలోచిస్తూ ముందుకు నడిచాడు పాదచారి.

***

“అతడు వాదించలేడనేగా నోరు మూశావు తెలివిగా?”

“అనుభవం మూలం అన్నవాడివి, కడుపు కావేట్టు ఆకలి వెయ్యటం అనుభవంకాదా గుండెలు పగిలేట్టు రోదించడం అనుభవం కాదా? శరీర రొచ్చు రొచ్చుగా లోకం పీల్చి పిండి చెయ్యగా, గుక్కెడు గంజి నీళ్ళకు వెచ్చని కన్నీళ్ళు వరదలు పారించటం అనుభవం కాదా? చుట్టు ఉన్న మనుషులు ‘ఎందుకు వచ్చామీ లోకానికి, ఎరగా మిగిలామోయ్ శోకానికి’ అంటూ తలదాచుకుంటూ తమ పుట్టుకనే నిందించుకుంటూ బ్రతుకుతుండగా చూడ్డం అనుభవం కాదా? వేదాంతీ, సుప్త సుషుప్తి వాదనలు కట్టి పెట్టి నిజాన్ని నిజంగా ఎందుకు గుర్తించవు?” నిపులు గక్కుతూ అన్నాడు విప్లవమూర్తి.

“నాలోని భావానివే నువ్వూ!…” నవ్వాడు వేదాంతి

“అలా అని నన్ను మభ్యపెట్టకు!… వేదాంతీ, నువ్వు నేనూ కూడా యీ పాదచారి భాగాలమే! ఆ దారినపోయే దానయ్యా అంతే! నీ స్పెషాలిటీ  అంటూ ఎందుకు గొంతు చించుకుంటావు.”

“నువ్వూ నీ స్పెషాలిటీ చూపించటానికే గా వచ్చిందీ” పకపకా నవ్వింది వేదనలత.

“ఇదుగో చూడు ఆ వేదాంతికీ యీ పాదచారికీ తోడు అనవసరం. కాస్త నా తోడు రాకూడదూ… లోకం చల్లబడుతుందీ” కవ్విస్తూనే విప్ల మూర్తిని ఆహ్వనించింది వేదనలత.

“నువ్వా? నువ్వు తోడైతే నాలో మండే నిప్పు నీ కన్నీళ్ళకి చల్లారిపోతుంది. ఏడ్చేవాడు మరో ఏడ్చేవాడి తోడుగా ఎంచుకుంటాడు గానీ నన్నుగాదు. నేను తోడు రావాలంటే ముందు నీ వేదన కరిగించుకో!” సలహా యిచ్చాడు విప్లవమూర్తి.

“ఎందుకీ పోట్లాటలు? చూడండి! ఆకాశం ఎంత అందంగా ఉందో? పాదచారీ చూశావా! సముద్రంలో ఓడల్లాగా నీలాకాశంలో మేఘాపు తెరచాపలు ఎలా రెపరెప లాడుతున్నాయో! ” సంభ్రమంగా ఆకాశాన్ని చూస్తూ అంది కవితా కుమారి.

“అవకాశాన్నిచ్చేదే ఆకాశం అంటే space ని క్రియేట్ చేసేదన్నమాట. దాన్నే దేశం అంటారు. కాలమూ దేశమూ కూడా మనస్సు నుంచి ఉద్భవించినవి!” వివరించాడు వేదాంతి.

“ఏమో! అదంతా నాకెందుకూ? ఆకాశం అందంగా ఉంది. ఆ పక్షులు చూడు, గాల్లో ఎంత చిలిపిగా అందంగా చెక్రికలు కొడుతున్నాయో!” ఆనందంగా ఆకాశాన్ని చూస్తూ అంది కవితాకుమారి.

నీలాకాశం నిశ్శబ్దంగా నవ్వింది.

గాలి తెర ఒకటి మెల్లగా వీచి అంతలో వేగం అందుకుని మేఘాల్ని బెదరగట్టింది.

పోటా పోటీగా గాలీ వేఘాలూ పరుగుపందెం వేశాయి.

“యీ… లోకం చూశావా పాదాచరీ.”

“ఊ…” చుట్టూ చూసి అన్నాడు పాదచారి.

“ఏమనిపిస్తోంది?… సంభ్రమంగా జవాబు కోసం ఎదురు చూసి అంది మానసి.

“నాలాగే ఉంది… నా భావాల్లాగా క్షణ క్షణానికీ మారుతూ నా జీవితంలానే అనుభవాల ఆకుల్ని రాలుస్తూ… ఏమో యీ లోకం నాలాగానే ఉన్నట్టు నాకనిపిస్తోంది. ఓ క్షణంపు అనుభవం పండిన ఆకు రాలినా మరో క్షణపు ఆశాపత్రం పచ్చగా వొళ్ళు విరుచుకుంటూ నాలాగే ఉన్నట్టుగా ఉంది మానసీ…” సాలోచనగా అన్నాడు పాదచారి.

“నీవు వేరూ, లోకం వేరూ అని అన్పించటం లేదా నీకూ?” ఆశ్చర్యంలో ప్రశ్నించింది మానసి

“ఊహూ!…. వేర్వేరు ఎలా అవుతాము నేను పుట్టింతరవాత పుట్టిందే లోకం! కనీసం, నా వరుకూ నేను పోగానే నాకు యీ లోకమూ ఉండదు… అంటే, జీవించి ఉనంత కాలం యీ లోకమూ నాలోని ఓ భాగమేగా… నా శరీరంలోని అవయవం లాంటిదేగా!… నాకు లోకంతోనో, లోకానికి నాతోనో పని ఉండేది నేను జీవించేటం వరకేగా, అందుకే యీలోకం నాకు అన్యమయినదిగా కనిపించదు….”

“మరి నీ సుఖాలు కష్టాలూ….”

“అవా? అవి నా మనసుకి సంబంధించిన ప్రతిస్పందనలేగా! లోకానికేం సంబంధం? చూడు… నేను కష్టపడదల్చుకోనపుడు లోకం ఎలా కష్టపెట్టగలదు? నేను సుఖపడదల్చుకున్నపుడు లోకం ఎలా ఆపగలదు? యీ కష్టం సుఖం మనసువి… బుద్ధివి… మరింతగా ఆలోచిస్తే జ్ఞానానివి.”

“వేదాంతాచార్యుల బోధ బాగా వంటపట్టినట్టుందే” హేళనగా నవ్వింది మానసి…

“కుందేలు గెంతులు వేస్తూ ముందుకు పరిగెత్తింది. కష్టం సుఖం సంగతి నాకెందుకూ అవి క్షణక్షణానికీ రూపాలు మార్చుకుంటాయి! కానీ, మానసీ అదిగో అందం మాత్రం దానిది అలాగునగునా పరుగులేత్తే ఆ కుందేలుది” దాని వెనకే పరుగుపడుతూ అరిచాడు పాదచారి.

“ఇదిగో… ఆగు ఆగు పాదచారీ” పరిగెత్తి అందుకోవటానికి ప్రయత్నించింది మానసి

ఆగి పకపకా నవ్వాడు పాదచారి. నవ్వి నవ్వి అన్నాడు “చూశావా మానసీ,. నువ్వూ ఆ కుందేల్లాగే గంతులేస్తూ పరుగులుపెడుతున్నావు…”

“హూ” కోపంగా చూసి ఆయాసంతో నిట్టూర్చింది మానసి. “నీకు యీ అల్లరి బుద్ది తగ్గదు!”

“కుందేలు పరిగత్తేటప్పుడు దానికి ఆయాసం ఎందుకు రాదు? ఒస్తుంది.ఆ తరవాత తనలో తానే చిరాకు పడుతుంది. కేవలం తాటాకు చప్పుళ్ళుకి ఎందుకు బెదిరి పరిగెత్తానా అని?” మానసి వంక ఆదరంతోనో జాలితోనో చూసి అన్నాడు పాదచారి

“నాతో ఎందుకూ ఆ సంగతి చెప్పడం?” కోపంగా అంది మానసి

“నీతోనేగా చెప్పాల్సింది!… నువ్వేగా నాతో ఉంటూనే నాకు చెప్పకుండా పరుగులు పట్టేది” నవ్వాడు పాదచారి

“నీ నవ్వు చూస్తే నాకసహ్యం” కోపంగా చూస్తూ అంది మానసి…

“నువ్వు ఓడిపోయి కోపంగా నన్ను చూసినపుడల్లా నాకి ఆనందం” పకపకా నవ్వి మానసి భుజం తట్టాడు పాదచారి.

నిర్ఘాంతపోయి అతని వంక చూసింది మానసి. తనని తను నమ్మలేనట్టు “పాదచారీ… నిజంగా అంటున్నావా నాశరీరం తూట్లు తూట్లు పడి రక్తం ధారలుగా కారిపోవటం చూసి కూడా యీ మాట అంటున్నావా? ఎర్రని నా అహంభవమనే రక్తం పోయి, తెల్లగా పాలిపోయి నన్ను నేను దహించుకోవటం చూస్తూనే అనగలిగావా ఆ మాట” అంది.

జాలిగా క్షణం ఆమె తలని గుండెలకి ఆనించుకుని గట్టిగా హత్తుకున్నాడు పాదచారి.

“నా మానసీ… నా నేస్తమా… నాలోని భాగమా… నిన్ను నేను అవమానించట్లేదు!…. ఆ కుందేల్లానే పొదల్లో ముళ్ళు ఉన్నాయిని కూడా గమనించకుండా నువ్వూ పరిగెత్తావు. నీవంటి నిండా మాటల తూట్లు నీ శరీరం నిండా వేదన ముళ్ళు… నాకు తెలుసు నా నేస్తం!… అయినా నీ పరుగు నువ్వు మానగలవా? అందుకే… అందుకే నా మాట నిజం!…” తల నిమురుతూ అన్నాడు పాదచారి.

తలవంచుకుంది మానసి. విశ్వాసం కుక్క భౌ మనగా భారంగా ఆమెనక్కడే వదిలి ముందుకు కదిలాడు పాదచారి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here