[dropcap]నే[/dropcap]నూ రాజు గారూ సాయంత్రం పార్కులో కూర్చొని ఉండగా మూర్తి వచ్చేడు.
“శకుని ఉన్న చాలు శని ఏల అని కదా
అవును నిజమె నేను అంత ఘనుడ
కాని పనులనెల్ల కాజేసుకుని గాని
మాని పోవ లేనె మాయలాడి”
అంటూ మాయా బజార్ లో శకుని పాత్రధారి సీ ఎస్ ఆర్ అనబడే చిలకలపూడి సీతారామాంజనేయులు గారు స్వయముగా పాడిన పద్యము పాడుకుంటూ కూర్చున్నాడు మూర్తి.
“ఇంకా మూర్తి కి మాయా బజార్ మత్తు వదల లేదు రాజు గారూ “ అన్నాను.
“మాయా బజార్ ఇచ్చే కిక్కు మరే సినీమా ఇవ్వదు కదండీ రాజు గారూ “ అన్నాడు మూర్తి.
“మాయా బజార్ సంగతి వదిలేద్దాం. మనం చూసిన సినీమాలలో శకుని అనగానే గుర్తుకు వచ్చేవారు ఎవరో చెప్పండి? ” అన్నాడు మూర్తి.
“ఇంకెవరూ? సీ ఎస్ ఆర్ గారే ! ఆ తరవాత ధూళి పాళ గారు అన్నారు” రాజు గారు.
“ఈ రోజు మీకు సీ ఎస్ ఆర్ గారి గురించి చెప్తాను. సరేనా? ” అన్నాడు మూర్తి.
“సరే చెప్పండి మూర్తి గారూ” అన్నారు రాజు గారు.
గొంతు సవరించుకుని ప్రారంభించేడు మూర్తి.
“చిలకలపూడి సీతారామంజనేయులు గారు 11జూలై 1907 న మచిలీపట్టణానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరములో ఉన్న చిలకలపూడి గ్రామములో జన్మించేరు. ఆయన తండ్రి లక్ష్మీ నరసింహ మూర్తి గారు. ఆయన రెవెన్యూ విభాగములో పనిచేసేవారు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. పెద్ద తమ్ముడు నాగేశ్వర రావు గారు వివిధ సినీమాలకు సహాయ దర్శకునిగా పనిచేసేరు. ఆయన చిన్న తమ్ముడు వెంకట రత్నం గారు భరణీ స్టూడియో లో ప్రొడక్షన్ విభాగములో పనిచేసేవారు.
ఆయన తండ్రి గారికి గుంటూరు జిల్లా పొందూరు కు బదిలీ అవడంతో, సీ ఎస్ ఆర్ గారు స్కూల్ ఫైనల్ వరకూ పొందూరులో చదివేరు. ఆ తరువాత ఆయన కో-ఆపరేటివ్ విభాగములో కొన్నాళ్ళు పని చేసేరు. ఆ సమయములో సీ ఎస్ ఆర్ గారు నాటకాలకు ఆకర్షితులయ్యేరు.
ఆ సమయములో నాటక రంగములో మహామహులు ఉద్దండులయిన స్థానం నరసింహారావు గారు , డీ వీ సుబ్బారావు గారు, అద్దంకి శ్రీ రామ మూర్తి గారు, పారుపల్లి సత్యనారాయణ గారు. వీరందరి ప్రక్కన సహ నటుడుగా నటిస్తూ, నటనలోని మెళకువలను వాచకమును, గాత్ర శుధ్ధిని సాధించుకున్నారు సీ ఎస్ ఆర్ గారు.
హావ భావములతో కనుబొమలు ఎగరవేయడము, కోర చూపులు, వాడి చూపులు, సంభాషణల మధ్య నొసలు కదుపుతూ సంభాషణకు నటన జోడించడము ఆయన ప్రత్యేకత. పద్యములను రాగ యుక్తముగా మాట మాటను స్పష్టముగా పలుకుతూ రాగ ప్రస్తారానికి దూరముగా ఉండడము ఆయన విశిష్టత.
నాటక ప్రదర్శన్లలో ఈ అంశములే ఆయనకు పేరు తెచ్చి పెట్టేయి. అటువంటి నటనతోనే ఆయన సినీమాలలోనూ రాణించేరు.
శ్రీ సీ ఎస్ ఆర్ గారు శ్రీ కృష్ణ తులాభారము, రాధాకృష్ణ లలో శ్రీ కృష్ణునిగా, భక్త తుకారంలో తుకారాంగా, భక్త రామదాసులో రామదాసుగ, సారంగధరలో సారంగధరునిగా, చింతామణిలో భవానీ శంకరునిగ ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చేరు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ కొరకు భక్త తుకారం నాటకమును ప్రదర్శించి తద్వారా లభించిన పది వేలరూపాయల సొమ్మును సమర్పించి తన దేశభక్తిని చాటుకున్నారు.
అస్పృశ్యతా సమస్యా నివారణకు పతిత పావన అనే నాటక ప్రదర్శనలనిచ్చి తన సామాజిక బాధ్యతను నెరవేర్చుకున్నారు.”
“మరి సీ ఎస్ ఆర్ గారి చలన చిత్ర ప్రవేశం ఎలా జరిగిందీ, ఆయన తొలి చిత్ర విశేషాలు చెప్తారా మూర్తి గారూ” అన్నారు రాజు గారు.
“చెప్తాను వినండి” అంటూ ప్రారంభించేడు మూర్తి.
“సాగర్ మూవీటోన్ వారు సర్వోత్తమ్ బాదామి దర్శకత్వములో 1932 వ సంవత్సరములో నిర్మించిన రామ పాదుకా పట్టాభిషేకము చిత్రములో సీ ఎస్ ఆర్ గారు లక్ష్మణునిగా నటించేరు. ఆ చిత్రములో యడవిల్లి సూర్యనారాయణ గారు రామునిగ, సురభి కమలాబాయి గారు సీతగ నటించేరు.”
“ఇక కధా నాయకులుగా 1932 నుండి 1945 వరకు సాగిన సీ ఎస్ ఆర్ గారి చలన చిత్ర జైత్ర యాత్ర గురించి చెప్తాను వినండి” అని చెప్పడం ప్రారంభించేడు మూర్తి.
“1936 లో విడుదల అయిన ద్రౌపదీ వస్త్రాపహరణములో శ్రీ కృష్ణునిగా నటించేరు. సీ ఎస్ ఆర్ గారు ముఖ్య భూమిక రామదాసుగా 1937లో విడుదల అయిన భక్త రామదాసు చిత్రం ఘన విజయము సాధించి ఆయనకు పేరు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు తెచ్చి పెట్టేయి. ఆయనను తిరుగు లేని చిత్రకథానాయకునిగ చేసిన చిత్రము భక్త రామదాసు.
అప్పటికి ఇంకా చిత్తూరు నాగయ్య గారు సినీరంగ ప్రవేశము చేయలేదు.
సీ ఎస్ ఆర్ గారు 1938లో విడుదల అయిన భక్త తుకారాంలో తుకారాంగా, 1939వ సంవత్సరములో ప్రఖ్యాత నిర్మాత దర్శకుకు పి పుల్లయ్య గారు నిర్మించిన బాలాజీ (వెంకటేశ్వర మహత్మ్యము) లో వెంకటేశ్వరునిగా నటించేరు.
1939 లో విడుదలైన జయప్రద చిత్రములో సీ ఎస్ ఆర్ గారు పురూరవునిగ నటించేరు. ఈ జయప్రద చిత్రము ద్వారా 17 సంవత్సరముల నవ యువకుడు సాలూరు రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకునిగ చలన చిత్ర పరిశ్రమకు పరిచయము అయ్యేరు.
తరువాత సీ ఎస్ ఆర్ గారు 1945 లో విడుదల అయిన పాదుకా పట్టాభిషేకములో రామునిగ, 1945 లోనే విడుదల అయిన మాయాలోకం లో నవభోజరాజు గా నటించేరు.
మాయాలోకం కథను కొద్ది మార్పులతో గులేబకావళి పేరుతో రామారావు గారు నాయకునిగ, ఎన్ ఏ టీ సంస్థ నిర్మించిన చిత్రం 1962 లో విడుదల అయ్యింది.
ఈ విధముగా 1932 – 1945 మధ్య , అంటే 13 సంవత్సరాలు నాయక పాత్రను పోషించేరు.”
“మరి నాగయ్య గారూ సీ ఎస్ ఆర్ గారూ ఒకేసారి చలన చిత్ర ప్రవేశం చేసేరా మూర్తి గారూ? ” అడిగేరు రాజు గారు.
“కాదండీ ! నాగయ్య గారి కంటే సీ ఎస్ ఆర్ గారే సినీమాల్లోకి ముందు వచ్చేరు. సీ ఎస్ ఆర్ గారి మొదటి సినీమా రామ పాదుకా పట్టాభిషేకము 1932లో వచ్చింది. నాగయ్య గారి మొదటి చిత్రం గృహలక్ష్మి 1938లో వచ్చింది.”
“ఆ విశేషాలు కూడా చెప్తాను వినండి” అంటూ ప్రారంభించేడు మూర్తి.
“అంటే, చిత్తూరు నాగయ్య గారూ, సీ ఎస్ ఆర్ గారూ తెలుగు చలన చిత్ర పరిశ్రమను పది పదిహేనేళ్ళు హీరోలుగా ఏలేరన్న మాట మూర్తీ” అన్నాను.
“అవును. ఏభయ్యవ దశకము వచ్చేసరికి వారు నలభయ్యేళ్ళ ప్రాయములో అడుగు పెట్టడం, కొత్త తరం యువ నాయకులు అక్కినేని నాగేశ్వర రావు గారూ, నందమూరి తారక రామారావు గారూ హీరోలుగా స్థిర పడడంతో వారిద్దరూ చరిత్ర భూమికలు పోషించడము (character roles) ప్రారంభించేరన్న మాట.
“ఇప్పుడు మీకు సీ ఎస్ ఆర్ గారు నవరస నటనా సార్వ భౌమ సీ ఎస్ ఆర్ గా ఎలా రాణించేరో చెప్తాను వినండి.” అంటూ ప్రారంభించేడు మూర్తి.
“చలన చిత్ర రంగములో 1932లో ప్రవేశించిన సీ ఎస్ ఆర్ గారు పదమూడు సంవత్సరాలు కధా నాయక పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాలను, అభిమానమునకు చూరగొన్నారు అని చెప్పేను కదా !
నలభయ్యేళ్ళ పడిలో ప్రవేశించడానికి సిధ్ధమవుతున్న సీ ఎస్ ఆర్ గారు నవ యువ కధా నాయక తరానికి స్వాగతము చెప్తూ చరిత్ర భూమికలను (character roles) అంగీకరించడము ప్రారంభించేరు అని కూడా చెప్పేను కదా! 1947 వ సంవత్సరములో శ్రీమతి పాలువాయి భానుమతి గారు, శ్రీ పాలువాయి రామకృష్ణరావు గారు భరణీ ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మించిన మొదటి చిత్రము రత్నమాలలో సీ ఎస్ ఆర్ గారు ధూమకేతు అనే ఒక ముఖ్య పాత్రను పోషించేరు.
ఆ తరువాత భరణీ వారు నిర్మించిన నాలుగు చిత్రాలు లైలా మజ్ఞు, ప్రేమ, చండీ రాణి, చక్రపాణి లలో నటించేరు. 1950 వ సంవత్సరములో ఏ వీ ఎం వారి జీవితం, పరమానందయ్య శిష్యుల కథ విడుదల అయ్యేయి. నాటి ప్రఖ్యాత హాస్య నటుడు కస్తూరి శివరావు గారు దర్శకత్వము వహించిన పరమానందయ్య శిష్యుల కథ లో సీ ఎస్ ఆర్ గారూ పరమానందయ్య ముఖ్య భూమిక పోషిస్తే, చంద్రసేన మహారాజుగా అక్కినేని నాగేశ్వర రావు గారు నటిస్తే, శ్రీమతి లక్ష్మీరాజ్యం గారు లీలావతిగా నటించేరు.
1951 లో వచ్చిన పాతాళ భైరవి చిత్రము ఆయనని వైవిధ్యముతో కూడిన ప్రముఖ నటునిగా నిలబెట్టింది.
1955 లో వచ్చిన రోజులు మారాయి చిత్రములో ఆయన క్రూరత్వముతో నిండిన జమీందార్ సాగరయ్యగా విలన్ పాత్ర అద్భుతముగా పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు.”
“ఇక కన్యాశుల్కం చిత్రం గురించి, దానిలో సీ ఎస్ ఆర్ గారి నటనా వైదుష్యము గురించి చెప్తాను వినండి.
1955వ సంవత్సరములో శ్రీ డీ ఎల్ నారాయణ అనబడే ద్రోణావఝ్ఝల లక్ష్మీనారాయణ గారు నిర్మించిన వినోదా వారి మూడవ చిత్రము కన్యాశుల్కం విడుదల అయ్యింది. ఈ చిత్రానికి దర్శకులు పీ పుల్లయ్య గారు.
ఈ చిత్రములో డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు, విన్నకోట రామన్న పంతులు గారు, నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, షావుకారు జానకి గారు, వంగర వెంకట సుబ్బయ్య గారు, గుమ్మడి వెంకటేశ్వర రావు గారు ప్రముఖ భూమికలను పోషించేరు.”
కొంచెం సేపు ఆగి ప్రారంభించేడు మూర్తి.
“బహుశః, మరొక సారి కన్యాశుల్కం సినీమాగా రాదని కూడా అనుకోవచ్చును. రంగస్థల నాటకముగా కన్యాశుల్కము 13 అగస్ట్ 1892 న ప్రథమ ప్రదర్శనము జరిగినప్పటి నుండి, గత 127 సంవత్సరములుగా వేల సంఖ్యలో ప్రదర్శింపబడింది. ఇప్పటికీ కన్యాశుల్కం నాటకం ప్రదర్శిస్తే వందల కొద్దీ ప్రేక్షకులు అభిమానముతో వీక్షిస్తారు.
కన్యాశుల్కం నాటకములో రామప్ప పంతులు వేషమును కీర్తి శేషులు జె వీ సోమయాజులు గారితో సహా ఎందరో మహానుభావులు పోషించి రక్తి కట్టించేరు.
కళాతపస్వి క్రియేషన్స్ సంస్థ తరఫున శ్రీ రావి కొండలరావు గారి దర్శకత్వములో శ్రీ మల్లాది సచ్చిదనంద మూర్తి గారూ సమర్పించిన 99 టీవీ వారి కన్యాశుల్కం నాటకములో శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారు గిరీశం గా, శ్రీమతి జయ లలిత గారు మధురవాణి గా నటించిన దూరదర్శక నాటకములో శ్రీ వై వీ రావు గారు రామప్ప పంతులుగా నటించేరు.
కానీ, రామప్ప పంతులు అనగానే సీ ఎస్ ఆర్ గారు మాత్రమే మన కళ్ళ ముందు కనిపిస్తారు. నాటి రామప్ప పంతులు ఇలాగే ఉండే వారేమో అన్నంతగ నటించేరు సీ ఎస్ ఆర్ గారు .
దానికి ప్రముఖ కారణము రచయిత వెంపటి సదాశివ బ్రహ్మం గారు, దర్శకులు పీ పుల్లయ్య గారి సమిష్ఠి కృషి.
మాయాబజార్ సినీమా ఘటోత్కచ ప్రవేశముతో వేగము పుంజుకుంటే, కన్యాశుల్కం రామప్ప పంతులు రాకతో ఉత్సాహము నింపుకొంటుంది.
కర్ణుడి లేని భారతం లేనట్లు రామప్ప పంతులు లేని కన్యాశుల్కం లేదని అనిపించడానికి, దర్శకులు పీ పుల్లయ్య గారు సీ ఎస్ ఆర్ గారు ఎంత శ్రమించేరో కదా !
రామప్ప పంతులు వేషధారణ కూడా నాటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా పంచె, నల్లకోటు,మెడలో కడువా, గుండ్రటి కళ్ళద్దాలు, బట్టతల , పిలకలతో సీ ఎస్ ఆర్ గారి ఆహార్యాన్ని తీర్చిదిద్దేరు.
సీ ఎస్ ఆర్ గారూ కనిపించిన మొదటి సన్నివేశం అద్భుతముగా ఉంటుంది.
మధురవాణి ఇంటిలో మధురవాణి, గిరీశం, పూటకూళ్ళమ్మలతో కూడిన సన్నివేశములో గిరీశం రామప్ప పంతులు తల మీద కొట్టి పారిపోయే సన్నివేశములో సీ ఎస్ ఆర్ గారి నటన నవ్వు తెప్పిస్తుంది.
మధురవాణి ఇంటిలో మధురవాణి, లుబ్ధావధాన్లు, రామప్ప పంతులతో కూడిన సన్నివేశములో రామప్ప పంతులు గిరీశం వ్రాసిన ఉత్తరము చదివే సన్నివేశములో సీ ఎస్ ఆర్ గారి నటన, సావిత్రి గారి నవ్వు, లుబ్ధావధాన్లు పాత్రధారి సుబ్బారావు గారి అమాయకత్వము మనకు మరింత నవ్వు తెప్పిస్తాయి.
కన్యాశుల్కం నాటకంలో రామప్ప పంతులు పాత్రను నక్క జిత్తుల నయవంచకునిగా గురజాడ వారు తీర్చిదిద్దితే, కన్యాశుల్కం చిత్రంలో నక్కజిత్తులకు అమాయకత్వమును జోడించి సీ ఎస్ ఆర్ గారి చేత అద్భుతముగా నటింప చేసేరు దర్శకులు పుల్లయ్య గారు.
1956 లో సీ ఎస్ ఆర్ గారు నటించిన భలేరాముడు, చిరంజీవులు చిత్రాలు ఘన విజయము సాధించేయి.
1957 వ సంవత్సరములో విడుదల అయిన విజయా వారి మాయా బజార్ ఘన విజయము సాధించి నాటికీ నేటికీ ఏ నాటికీ మహత్తర చిత్ర రాజమయి నిలిచింది. మాయా బజార్ చిత్రములో శకుని పాత్ర పోషించిన సీ ఎస్ ఆర్ గారు శకుని ఇలాగే ఉండేవాడేమో అన్నంతగా నటించేరు.
పౌరాణిక చిత్రాలలో శకుని పాత్రకు కొత్త ఒరవడిని కల్పించడములో సీ ఎస్ ఆర్ గారు, దర్శకులు కే వీ రెడ్డి గారు కృతకృత్యులయ్యేరు.
సీ ఎస్ ఆర్ గారు నటించిన మరి కొన్ని ప్రముఖ చిత్రములు , పాత్రలు
- 1957 వ సంవత్సరములో సువర్ణ సుందరి లో మహారాజు
- 1958 వ సంవత్సరములో అప్పు చేసి పప్పు కూడు చిత్రములో రావు బహదూర్ రామదాసు.
- 1959 వ సంవత్సరములో ఇల్లరికం చిత్రములో గుమాస్తా గోవిందయ్య
- 1960 వ సంవత్సరములో భక్త కుచేల చిత్రములో కుచేలుడు
- 1960 వ సంవత్సరములో మహాకవి కాళిదాసు లో కవి రాక్షసుడు.
- 1960 వ సంవత్సరములో అన్నపూర్ణ చిత్రములో జమీందార్
- 1961 వ సంవత్సరములో జగదేక వీరుని కథలో బాధ రాయణ ప్రగ్గడ
- 1961 వ సంవత్సరములో భక్త జయదేవ చిత్రములో పూరీ మహారాజు
- 1962 వ సంవత్సరములో భీష్మ చిత్రములో శల్యుడు
- 1962 వ సంవత్సరములో చిట్టి తమ్ముడు లో అన్సారీ.
దుబాసీ లక్ష్మన్నగా సీ ఎస్ ఆర్ గారు నటించిన ఆఖరు చిత్రము బొబ్బిలి యుధ్ధం ఆయన మరణాననంతరము 04 డిసంబర్ 1964 న విడుదల అయ్యింది.
సీ ఎస్ ఆర్ గారు 1932 – 1962 సంవత్సరాల మధ్య, 30 సంవత్సరాలలో 175 చిత్రాలలో నటించి కళామతల్లికి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అపూర్వమైన సేవలందించి కృతార్ధులయ్యేరు.
సీ ఎస్ ఆర్ అనబడే చిలకలపూడి సీతారామంజనేయులు గారు తన ముప్పదేళ్ళ చలన చిత్ర జీవితములో 175 చిత్రాలలో నటించినా ఆయన కన్యాశుల్కం లో రామప్ప పంతులుగ మాయా బజార్‌లో శకునిగ చిరకీర్తిని సాధించుకుని అమరులయ్యేరు.
కన్యాశుల్కం సినీమా ఒక్కసారే రావడం తో రామప్ప పంతులుగ నటించిన సీ ఎస్ ఆర్ గారు ఆ పాత్రను గురజాడ అప్పారావు గారు తననే దృష్టిలో పెట్టుకుని మలిచేరు అన్నంత అద్భుతముగా నటించేరు.
రామప్ప పంతులు అనే వ్యక్తి ఉండేవాడనీ, ఆయనే ఈయన అని తనను స్మరించుకునేటట్లు నటించిన సీ ఎస్ ఆర్ గారు ధన్యులు.”
“కన్యాశుల్కం సినీమా ఒక్కసారే రావడంతో రామప్ప పంతులుగా సీ ఎస్ ఆర్ గారు అద్భుతముగా నటించేరని ఒప్పుకోవచ్చు. మరి శకుని పాత్రను ఆయన తరువాత ఎందరో నటించేరు కదా! ఆ విషయము చెప్పండి మూర్తి గారూ” అన్నారు రాజు గారు.
“ఆ విషయానికి ఇప్పుడు వస్తాను” ప్రారంభించేడు మూర్తి.
‘మాయా బజార్’ సినీమా విడుదల తరువాత మహాభారతము ఆధారముగా శకుని పాత్రతో సినీమాకి ఏ సంస్థా 1962 వరకు తల పెట్టలేదు. 1960వ దశకములో శకుని పాత్రతో ఉన్న అయిదు పౌరాణిక చిత్రాలు ఘన విజయాన్ని సాధించేయి.
- 11 అక్టోబర్ 1963 న విడుదల అయిన నర్తనశాలలో శకునిగ మద్దాలి సత్యనారాయణ గారు నటించేరు.
- 14 జనవరి 1965 న విడుదల అయిన పాండవ వనవాసం చిత్రములో ముదిగొండ లింగమూర్తి గారు శకుని పాత్రను అద్భుతముగా పోషించేరు.
- 12 అగస్ట్ 1965 న విడుదల అయిన వీరాభిమన్యు చిత్రములో కే వీ ఎస్ శర్మ గారు శకుని పాత్ర పోషించేరు.
- 13 జనవరి 1966 న విడుదల అయిన శ్రీ కృష్ణ పాండవీయము చిత్రములో శకుని పాత్రను ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు పోషించేరు.
- 12 అక్టోబర్ 1967 న విడుదల అయిన శ్రీ కృష్ణావతారం చిత్రం లో ముదిగొండ లింగమూర్తి గారే మరల శకుని పాత్ర పోషించేరు.
- 14 జనవరి 1977 లో సంక్రాంతి పండుగ సందర్భముగా విడుదల అయిన దాన వీర శూర కృష్ణ చిత్రంలో శకునిగా ధూళిపాళ గారు నటించేరు.
- ఈ చిత్రానికి పోటీగా అదేరోజు 14 జనవరి 1977 న విడుదల అయిన కురుక్షేత్రం సినీమాలో ధూళిపాళ గారు ఇంద్రునిగా నటిస్తే శకునిగా నాగభూషణం గారు నటించేరు.
- 28 మే 1979 న విడుదల అయిన శ్రీ మద్విరాట పర్వం చిత్రంలో శకునిగ ధూళిపాళ గారే నటించేరు.
నందమూరి బాలకృష్ణ గారు శ్రీ కృష్ణునిగా అర్జునునిగా ద్విపాత్రాభినయనము చేసిన శ్రీ కృష్ణార్జున విజయము చిత్రము సంక్రాంతి సందర్భముగా 15 జనవరి 1996 న విడుదల అయ్యింది. ఈ చిత్రములో శకుని పాత్రను ఏ వీ ఎస్ గారు ( ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు) నటించేరు.
ఈ విధముగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు మూడు చిత్రాలలో శకుని పాత్ర పోషిస్తే, ముదిగొండ లింగమూర్తి గారు రెండు చిత్రాలలో శకుని పాత్రను సీ ఎస్ ఆర్ గారు, మల్లాది సత్య నారాయణ గారు, నాగభూషణం గారు, ఏ వీ ఎస్ గారు ఒక్కొక్క చిత్రములో శకుని పాత్రను పోషించేరు.”
“ఇక సీ ఎస్ ఆర్ గారి నటనా వైదుష్యము చూద్దాం. మూకీ చిత్రాల యుగము దాటి టాకీ చిత్రాలు ప్రారంభమయిన తెలుగు సినీమాల ప్రారంభ దశలో నాయకునిగా ప్రవేశించి మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిల ద్రొక్కుకున్న ప్రముఖ నటులు సీ ఎస్ ఆర్ గారు, చిత్తూరు నాగయ్య గారు. సీ ఎస్ ఆర్ గారు 1932 లో ప్రవేశిస్తే, నాగయ్య గారు 1938 లో ప్రవేశించేరు. ఆ విధముగా సీ ఎస్ ఆర్ గారు నాగయ్య గారికి సీనియర్ అని చెప్పవచ్చును.
అక్కినేని నాగేశ్వర రావు గారు, రామారావు గారు చిత్ర సీమలో ప్రవేశించేనాటికి సీ ఎస్ ఆర్ గారు, నాగయ్య గారు నాయక పాత్రలు పోషించేవారు.
ఆ రోజులలో సీ ఎస్ ఆర్ గారు తెల్లని గ్లాస్గో పంచె, దాని మీద తెల్లని కుర్తా తో సైకిల్ మీద కూని రాగములు తీస్తూ మద్రాస్ పాండీ బజార్‌లో వెడుతూంటే, ప్రజలు, అభిమానులు ఆయనకు గౌరవ సూచకంగా దారి వదులుతూ చప్పట్లు కొట్టేవారట.
సీ ఎస్ ఆర్ గారు కోపం తెలియని సౌమ్యులు. మృదు స్వభావి. ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించేవారట. మరొక మాట! సినీ తారల గాత్రమును మిమిక్రీ చేసే కళాకారులకు కష్టమనదీ, క్లిష్టమైనదీ ఒక పట్టాన లొంగనిదీ సీ ఎస్ ఆర్ గారి గాత్రము.
మంచి వారి అవసరము భగవంతునికి కూడా ఉంటుందనడానికి నిదర్శనముగా 57 సంవత్సరాల వయసులో 08 అక్టోబర్ 1963న పరమపదించేరు చిలకలపూడి సీతారామంజనేయులు గారు” అంటూ ముగించేడు మూర్తి.
“శకుని లేని మాయా బజార్ లేదు. రామప్ప పంతులు లేని కన్యాశుల్కమూ లేదు . అవి ఉన్నంత కాలం సీ ఎస్ ఆర్ గారు ఉంటారు” అన్నారు రాజు గారు.
“సీ ఎస్ ఆర్ గారు. అమర జీవులు. ఆయన చిరంజీవులు” అంటూ లేచేను.
(ఈ వ్యాసము వ్రాయడానికి సంబంధించిన విషయ సామగ్రిని నేను వికీ పీడియా నుండి సేకరించితిని. – శంభర వెంకట రామ జోగారావు)