[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 72” వ్యాసంలో గుంటూరు జిల్లా లో భక్తి పర్యటనను ముగిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]గుం[/dropcap]టూరు జిల్లాలోని నేను చూసిన 71 ఊళ్ళల్లోని ఆలయాల గురించి కిందటి వారం దాకా చెప్పాను. ఇంకా జిల్లాలో చాలా ఆలయాలు వున్నాయి కానీ వాటన్నింటినీ చూడలేకపోయాము. అందుకని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇప్పటిదాకా ఆలయాల గురించి చెప్పుకున్నాం గనుక ఇప్పుడు జిల్లా గురించి కూడా నేను సేకరించిన విషయాలు కొన్ని చెబుతాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన రెండవ జిల్లా గుంటూరు. ముఖ్య పట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో వుంది. ఈ జిల్లాకి తూర్పున కృష్ణా జిల్లా, ఆగ్నేయాన బంగాళాఖాతం, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన తెలంగాణా లోని మహబూబ్ నగర్ జిల్లా, వాయువ్యాన తెలంగాణా లోని నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది. కృష్ణా నది, సముద్రంలో కలిసేవరకు, ఎడమవైపు కృష్ణాజిల్లా, కుడివైపు గుంటూరు జిల్లాను వేరు చేస్తుంది.
ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర ఉంది. గుంటూరు ప్రాంతంలో పాతరాతి యుగం నాటినుండి మానవుడు నివసించాడనటానికి ఆధారాలు ఉన్నాయి. రాతి యుగపు పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147, 1158 రెండు శాసనాలలో కూడా గుంటూరు ప్రసక్తి ఉంది.
బౌద్ధం ప్రారంభం నుండి విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకం (ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయంను స్థాపించారు. తారనాథుని ప్రకారం గౌతమ బుద్ధుడు మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్యకటకంలో ఆవిష్కరింపచేశాడు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడు. క్రీ.పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకం (మైకా) కనుగొనబడింది.
ప్రతీపాలపుర రాజ్యం (క్రీ పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – దక్షిణ భారతదేశంలో ప్రథమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు క్రీ.పూ.230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రాజులు పాలించారని తెలుస్తుంది. గుంటూరు ప్రాచీనాంధ్రకాలంనాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడులో ఒక ముఖ్యభాగం. కొందరు సామంత రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుధ్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180లలో జరిగిన ఈ యుద్ధం “ఆంధ్ర కురుక్షేత్రం”గా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది.
మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఈ జిల్లాలోని కారంపూడిలో జరిగింది. మొగలు సామ్రాజ్యం నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైంది.
1687లో ఔరంగజేబు కుతుబ్‌షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొగలు సామ్రాజ్యంలో భాగమైంది. సామ్రాజ్యపు రాజప్రతినిధి ఆసఫ్ ఝా 1724లో హైదరాబాదుకు నిజాంగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750లో ఆక్రమించుకొన్నారు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడి లోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది. 1794లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. 1859లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేసారు. 1904లో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పలనాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలను వేరు చేసి మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు.
సిమెంట్ తయారీలో వాడే సున్నపురాయి, ఇనుప ఖనిజం, రాగి, సీసం ప్రధాన ఖనిజాలు.
జిల్లాలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, మినుములు, కందులు, పత్తి, మిరవ, పసుపు, పొగాకు.
విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. గుంటూరు మిరపకాయ కారానికి పేరు పొందింది.
ఇంత పురాతన ప్రాంతం కనుకే ఇక్కడి ఆలయాలు కూడా చాలా పురాతనమైనవి. వాటిలో చాలా మటుకు ఈ గుంటూరు జిల్లా భక్తి యాత్రలో సందర్సించాము కదా. వచ్చేవారం మరో ఆలయం దర్శిద్దాము.