డిసెంబరు 2019 సంపాదకీయం

0
4

[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రికకు పెరుగుతున్న పాఠకాదరణ అత్యంత ఆనందం కలిగిస్తోంది. మరింత ఉత్సాహంగా ముందుకు నడిచే ప్రేరణనిస్తోంది.  కొత్త కొత్త రచనలు, కొత్త రచయితలతో మరింత ఆశాభావంతో సంచిక ముందుకు సాగుతోంది. ఆరునెలలకొక సంకలనం ప్రచురించాలన్న సంచిక సంకల్పం దీపావళికి విడుదలయిన కులంకథకు లభిస్తున్న ఆదరణతో మరింత బలం పుంజుకుంది. ‘కులం కథ’ పట్ల పాఠకులు ప్రదర్శిస్తున్న ఆదరణ ప్రోత్సాహాలు నిజాయితీతో నిస్వార్థంగా చిత్తశుద్ధితో ఆచరించే సత్సంకల్పానికి ప్రజల ఆదరణ అండదండలు లభిస్తాయన్న మా నమ్మకాన్ని మరోసారి నిరూపిస్తోంది. సాహిత్యం రచయిత వ్యక్తిగత సృజనకు సంబంధించిందయినా అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సృజనలోని సార్వజనీనత ఆ రచనకు కాలంతో సంబంధం లేకుండా సజీవంగా వుండే చిరంజీవిత్వాన్ని ఆపాదిస్తుంది. అలాంటి అత్యద్భుతమయిన సాహిత్య సృజనలు తెలుగు కథాసాగరంలో అనేకం వున్నాయి. వాటిని పాఠకులకు చేరువచేయటం ద్వారా ఉత్తమ సాహిత్యాన్ని పాఠకుల దృష్టికి తెచ్చినట్టవుతుంది. రచనల్లోని నిగ్గుతేల్చుకునే వీలు పాఠకుడికి లభిస్తుంది. పాఠకుల అభిరుచులను నిర్దేశిస్తూ, తమకు నచ్చిందే ఉత్తమ సాహిత్యం, తమకు నచ్చినవారే ఉత్తమ రచయితలని  గోబెల్స్ ప్రారంభంతో గాడిదని గుర్రమని నమ్మిస్తూ పబ్బం గడుపుకుంటూ సాహిత్య పెద్దలుగా చలామణీ అవుతున్న కొన్ని సాహిత్య మాఫియా ముఠాల గుప్పెట్లోంచి తెలుగు కథా సాహిత్యానికి విముక్తి లభించే వీలు చిక్కుతుంది. అందుకు సంచిక రూపొందిస్తున్న సంకలనాలు నాందీ వాక్యం పలికితే అంతకన్నా సంచిక ఆశించేది మరొకటి లేదు.

ప్రస్తుతం మన చుట్టూ సమాజంలో నెలకొని వున్న భయానక దౌష్ట్య వాతావరణం చూస్తూంటే ఉత్తమ సాహిత్య సృజన ఆవశ్యకత మరింత స్పష్టమవుతోంది. ప్రజలకు మంచి చెడుల నడుమ భేదాన్ని ప్రదర్శించి మంచిని పెంచే దిశలో ఆలోచనలనివ్వాల్సిన అవసరం వుంది, ఎటు చూసినా ద్వేషం, క్రోధం, హింసలను ప్రోత్సహిస్తూ, మనుషులలోని పాశవిక ప్రవృత్తులను పెంపొందిస్తూ, మనుషుల మధ్య అడ్డుగోడలు సృష్టిస్తూ, అగాధాలను నిర్మిస్తూన్న పరిస్తితులలో మంచిని చెప్పి, మంచి ఎలావుంటుందో చూపి, మంచిని ప్రోత్సహించే రచనల ఆవశ్యకత ఎంతో వుంది. అలాంటి పాజిటివ్ దృక్పథంతో సృజించిన రచనలకు సంచిక ఆహ్వానం పలుకుతోంది. సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించటమే కాదు, సమాజగతిని నిర్దేశించి భవిష్యత్తును రూపొందిస్తుంది. ఈ విషయం భారతీయులమైన మనకు ఇతరులందరికన్నా బాగా తెలుసు. వేదం, రామాయణం, భారతం, భాగవతం వంటి సాహిత్యం మన సమాజానికి మూల స్థంభాలు. సమాజ గతిని నిర్దేశించే సాహిత్యానికి సజీవ ఉదాహరణలు. కాబట్టి రచయితలు సాహిత్య సృజనను ఒక పవిత్ర కార్యం చేస్తున్నట్టు, సరస్వతీదేవికి అక్షరమాల అర్పిస్తున్నామన్న పవిత్రభావనతో, తాము రాసే ప్రతిపదం భవిశ్యత్తును తీర్చిదిద్దుతుందన్న అవగాహనతో, భవిశ్య సమాజానికి, రాబోయే తరాలకు తాము జవాబుదారీ అన్న ఆలోచనతో సాహిత్య సృజన చేయాలి. సృజనాత్మక రచయితగా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.

రచనల పట్ల ఆసక్తి వున్నవారికి రచన ప్రక్రియలపట్ల అవగాహన కల్పించాలన్న ఆలోచన సంచికకు వుంది. ఇంకా ఆ ఆలోచన ఆచరణ రూపం ధరించలేదు. యువ రచయితలకు ప్రోత్సాహమిచ్చి, భవిష్యత్తు రచయితల తరాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన కూడా సంచికకు వుంది. ఈ లక్ష్యాలతో సంచిక ప్రణాళికలను రూపొందిస్తోంది. రచనలపట్ల ఆసక్తి వున్న వారు, రచనలు చేయగలిగీ ఎలా రాయాలో తెలియక సంశయిస్తున్న వారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి సంచికను సంప్రదించాల్సిందిగా మనవి. ఇతర పత్రికలకు భిన్నంగా సంచిక రచయితలను చేతులు జోడించి వారి రచనలతో సంచికను పరిపుష్టం చేయమని, భవిష్యత్తుకు సాహిత్యబాటను నిర్మించటంలో సహకరించమని అభ్యర్ధిస్తోంది. సంచికలో రచన ప్రచురితమయినందుకు సంచికకు రచయితలు ధన్యవాదాలు తెలుపనవసరంలేదు. తమ రచనల ద్వారా సంచికకు వన్నె తెస్తున్నందుకు సంచిక రచయితలకు ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.  అలాగే, సంచికలో ఇంకా ఎలాంటి రచనలను పాఠకులు చూడాలని కోరుకుంటున్నారో తెలియపరిస్తే ఆ సూచనలకనుగుణంగా సంచికను తీర్చిదిద్దే ప్రయత్నాలను సంచిక చేస్తుంది.

రచయితలు, పాఠకుల కోరిక మేరకు ఇకపై సంచికలో ప్రచురితమయిన రచనలను డౌన్‌లోడ్ చేసుకునే వీలును సంచిక కల్పిస్తోంది. ఇంతవరకూ సంచికలో రచనలను ఎవ్వరూ డౌన్‍లోడ్ చేసుకునే వీలుండేదికాదు. కానీ, అందరి అభీష్టాన్ని మన్నించి రచనను ప్రింట్ చేసుకునే వీలును ఈ నెల నుంచీ కల్పిస్తున్నాము.

రచయితలనుంచి రచనలు కోరుతూ, పాఠకులనుంచి సలహాలు సూచనలు అభ్యర్ధిస్తూ, ఈ నెల సంచిక మోసుకువచ్చిన రచనల జాబితాను ఈ క్రింద పొందుపరుస్తున్నాము.

సీరియల్స్:

ముద్రారాక్షసమ్ చతుర్థాంకం-2 – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ​

నీలమత పురాణం – 51 – కస్తూరి మురళీకృష్ణ

జీవన రమణీయం-84- బలభద్రపాత్రుని రమణి

పాదచారి-18 – భువనచంద్ర

అనుబంధ బంధాలు – 23 – చావా శివకోటి​

ఎండమావులు-10- గూడూరు గోపాలకృష్ణమూర్తి

కాలమ్స్:

కావ్య పరిమళం-17 – డా. రేవూరు అనంతపద్మనాభరావు

‘యాత్ర’ చూద్దామా- ఎపిసోడ్ 10 – కొల్లూరి సోమ శంకర్

రంగులహేల-21-  ఆదత్ సే మజ్‍బూర్ – అల్లూరి గౌరిలక్ష్మి​

నవ్వేజనా సుఖినోభవంతు!-5 – ఆన్ ది వే … – భావరాజు పద్మిని

వ్యాసాలు:

మహా భారతంలో భీముడు – అంబడిపూడి శ్యామసుందర రావు

కాంప్రహెన్సివ్ స్టార్ సీ ఎస్ ఆర్ – శంభర వెంకట రామ జోగారావు

కథలు:

సెగినగాడి చిలక – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ఆమె స్వప్నం – పెండ్యాల గాయత్రి

అనుకొన్నదొకటి అయినొదకటి – దామరాజు రామ్‌కుమార్

గమ్యం – గన్నవరపు నరసింహమూర్తి

కవితలు:

ధర్నా – శ్రీధర్ చౌడారపు

మౌన ధనుష్ఠంకారం – పుట్టి నాగలక్ష్మి

వారెవ్వా-5 – ఐతా చంద్రయ్య

గజల్ -5 – శ్రీరామదాసు అమర్‌నాథ్

పుస్తకాలు:

అమ్మకో అబద్ధం – విశ్లేషణ – కస్తూరి మురళీకృష్ణ

గళ్ళ నుడికట్టు:

పదసంచిక-30: కోడిహళ్ళి మురళీమోహన్

భక్తి పర్యటన:

భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 72- పి.యస్.యమ్. లక్ష్మి

భక్తి పర్యటన కాశీ యాత్ర –3 – సంధ్య యల్లాప్రగడ

సినిమాలు:

లోకల్ క్లాసిక్స్-4- సికిందర్

‘ధుంధ్’ – సమీక్ష – పరేష్. ఎన్. దోషి

కార్టూన్:

సింగిడి రామారావు

 

సంచికకి మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ…

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here