[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
సిడ్నీ షెల్డాన్ పుస్తకాలు ఎక్కువగా చదివిన నాకు, మన్‌హాట్టన్, పిట్స్‌బర్గ్, ఫిలడెల్ఫియాలు చూసినప్పుడు ‘నేనేనా’ అనిపించింది! ఫీనిక్స్ చాలా వేడి ప్రదేశం! అసలే జూలై మాసం. అదిరిపోయేది ఎంత సెంట్రల్లీ ఎయిర్ కండీషన్డ్ అయినా ఇల్లు! అలాటిది గ్రాండ్ కెనైన్‌లో ఇంకా వేడి అనుభవించాం! మా మావయ్యతో ఒక అసౌకర్యం ఏమిటంటే ఏదీ బయట అమెరికన్ హోటళ్ళలో తినడూ, తాగడూ, అత్తయ్య ఇంటికొచ్చి వంట చేసి పెట్టాల్సిందే! ఇదే కష్టం మా చెల్లెలు లావణ్య దగ్గరకి ఇండోనేషియా వెళ్ళినప్పుడు, నేనూ మా బాబాయ్‍తో కూడా గమనించాను. ఆయన ఇండియన్ హోటల్స్‌లో ఇడ్లీ, దోశ సైతం తినడు! కొత్తిమీర వాడ్తారని ఇష్టం వుండదు! మగవాళ్ళు ఓ వయసు తర్వాత రిస్ట్రిక్టెడ్‌గా ఎందుకిలా మారుతారు? భార్యలు రుచిగా వంట చేసి పెట్టడం వల్లా? అనిపించేది. కానీ పదకొండేళ్ళ తర్వాత ఇప్పుడు మా ఆయనతో నా కొడుకు దగ్గరకి అమెరికా వెళ్ళినప్పుడు నేనూ వాడూ ఇటాలియన్, మెక్సికన్, అమెరికన్ అన్నీ రుచి చూడాలని అనుకుంతే, “నేనేం తినను… ఇంటికెళ్ళి ఒట్టి రైస్ పెట్టు చాలు! పెరుగూ, చింతకాయ పచ్చడీతో తినేస్తా!” అని మా ఆయన అంటుంటే ‘నాకూ తప్పలేదు’ అనిపిస్తోంది. ఓ రకంగా ఆరోగ్యరీత్యా అది మంచిదే కానీ ఆడవాళ్ళకి బయటకెళ్ళినా పని తప్పదు!
ఫీనిక్స్‌లో గ్రాండ్ కేనియన్ చూసాకా, ఓ రోజంతా మేం చిన్నప్పుడు కబుర్లన్నీ మాట్లాడుకున్నాం!
మేం చిక్కడపల్లికి దగ్గరలో, ఆర్.టి.సి. కాలనీలో వుండేవాళ్ళం. వేసవికాలం నాగ్‌పూర్ నుంచి పెద్దమ్మా, పెద్దనాన్న వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చారని బాబు మావయ్య సైకిల్ మీద వచ్చేవాడు. ఆ సైకిల్‌కి పేరు ‘నీల’ అని పెట్టాడు. అందరం పాట పాడే మంచి గాత్రం వున్నవాళ్ళమే! పెద్దమ్మా, పెద్దనాన్నా, అమ్మా, అక్కలూ అంతా మా క్వార్టర్స్‌లో వరండా మీద కూర్చుని పాటలు పాడేవారు అర్ధరాత్రి దాకా! గూర్ఖా కూడా వచ్చి వినేవాడు. మా పెదనాన్నా పెద్దమ్మా ‘పయనించే మన వలపులు…’ అని డ్యూయెట్ పాడ్తుంటే, నేను ‘పై నుండే మన వలపులు…’ అని నేర్చుకుని, అమ్మని ‘కింద నుండే వలపులు లేవా?’ అని అమాయకంగా అడిగేదాన్ని! మావయ్య ‘అందమే ఆనందం… ఆనందమె జీవన మకరందం…’ అద్భుతంగా పాడేవాడు! అక్కల్లో లక్ష్మీ, శాంతి అయితే గిరిజా కల్యాణం, రహస్యం లోది మొత్తం అత్యద్భుతంగా పడేవారు! మా పెద్ద నాన్న తమ్ముడు ప్రసాద్ బాబాయ్ వస్తే ఆయన ఫేవరెట్ సాంగ్ ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ ఇలా ఎన్నో చిన్నతనంలో. అమ్మని ‘నీలిమేఘాలు సత్యవతి’ అనేవారు ఆర్.టి.సి.లో. ‘హోటోంపే ఏసీ బాత్’ అన్న పాట ‘వన్స్‌మోర్’ అంటూ రవీంద్రభారతిలో అమ్మ చేత రెండు సార్లు పాడించుకోవడం, ఆర్.టి.సి. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో నాకు గుర్తుంది! ఎంతో సరదాగా, డబ్బు ఖర్చు లేని అనుబంధాలూ, ఆప్యాయతలూతో అందరం కలిసిమెలిసి చిన్నతనంలో కాలం గడిపేవాళ్ళం! అవన్నీ తలచుకుని ఆనందించాం.
ఒకటే అపశృతి, నా ఈడు వాడే మావయ్య పెద్ద కొడుకు గిరి. టెన్త్ క్లాస్ చదువుతూ, ట్యాంక్ క్లీన్ చెయ్యాలంటే మావయ్య, పైకెక్కి, అంత ఎత్తు నుండీ కిందపడి, మూడు నెలలు కోమాలో వుండి, ఆ తర్వాత స్పృహ వచ్చినా మాటా, నడకా లేకుండా కేవలం వీల్ ఛైర్‌లో జీవితాంతం వుండిపోయాడు! అది వాళ్ళని లైఫ్ అంతా వెంటాడిన బాధ. ఇటీవలే మొదట అత్తయ్యా, తర్వాత గిరీ పై లోకాలకి వెళ్ళిపోయారు… అంటే నలభై ఏళ్ళు దాదాపు గిరి అలాంటి జీవితం గడిపాడు. అత్తయ్యా, మావయ్యా సేవలు చేసారు! దేవుడు మా కుటుంబాలందరిలోకీ మావయ్యేనే స్థితిమంతుడిని చేసాడు! అలాంటి మావయ్యకే ఈ కష్టం కూడా ఇచ్చాడు… అత్తయ్య చెల్లెలు లత, గిరిని చూసుకుంటేనే వీళ్ళు అమెరికా రాగలిగేవాళ్ళు!
ఆ మరునాడు నేను మళ్ళీ ప్రయాణం అయి కాలిఫోర్నియాలో డుబ్లిన్, కిరణ్‌ప్రభ గారింటికి వచ్చేసాను. వాళ్ళు యూనమట్టి ట్రిప్‌లో నన్ను ఎంతో మిస్ అయ్యామని చెప్పారు. చిట్టెన్‌రాజు గారికి అదే వీడ్కోలు ఇవ్వడం! మనసుకి ఎంతో దగ్గరయిన ఆత్మీయుడు దూరం అయిన భావన కలిగింది. నా సూట్‍కేస్ దొరకకపోతే ఆయనా చాలా బాధపడేవారు.
తరువాతి రోజు కాంతిగారి పుట్టినరోజు. జూలై 25న. కిరణ్‌ప్రభగారు లాస్ ఏంజెల్స్ ట్రిప్ వేసారు. మేం మధ్యలో బేకర్స్‌ఫీల్డ్‌లో ‘సురేంద్ర ధారా’ ఆతిథ్యం ఇస్తే ఆగాము. ఆ అబ్బాయి సభలో స్టాండప్ కామెడీ కూడా చెప్పాడు.
కాంతిగారికి సర్‌ప్రైజ్! కేక్ తెప్పించి కట్ చేయించారు. “మీకెలా తెలుసు నా పుట్టినరోజు అనీ?” అని కాంతి గారు అడిగితే, గొల్లపూడి గారు నవ్వుతూ “నేనే కాల్ చేసి చెప్పి ఏర్పాటు చేయించాను” అన్నారు. అందరం హేపీ బర్త్ డే పాడాము. అక్కడ భోజనాలు చేసి, మళ్ళీ బయలుదేరి చీకటి పడ్తుండగా లాస్ ఏంజిల్స్ చేరాము. నేను పుస్తకాలలో చదివి, తప్పక చూడాలి అనుకున్న ప్రదేశాలలో అదొకటి! వెళ్తుంటేనే అక్కడ రాక్స్ మీద హాలీవుడ్ ప్రముఖుల మొహాలు చెక్కి, స్వాగతం చెప్తున్నట్లు కనిపించాయి. లాస్ ఏంజిల్స్‌లో ‘నందన్’ అనే అబ్బాయి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పటికి వాళ్ళకింకా పిల్లలు లేరు. తర్వాత బాబు పుట్టినట్టు తెలిసింది. పెద్ద ఇల్లు. నందన్ తెలుగు వాళ్ళు ఎవరు కనిపించినా, ముఖ్యంగా బాచ్‌లర్స్, తన ఇంటికి తెచ్చి వుంచుకోవడం, వారికి ఉద్యోగాలకి సాయం చేయడం తన హాబీ అని చెప్పాడు. చాలా చతురతతో మాట్లాడాడు. “మా ఆఫీసులో ‘ఇంగ్లీషు’లో మాట్లాడిన తెలుగువాళ్ళని ‘పనిష్’ చేస్తాం” అన్నాడు!
మరునాడు కాంతిగారూ, వాళ్ళని నందన్ సాయిబాబా టెంపుల్‌కి తీసుకెళ్తానన్నాడు. నేను మాత్రం సాయంత్రం సాహితీ సభ కాబట్టి, పొద్దుట చిట్టెన్‌రాజుగారి తమ్ముడు కొడుకు నన్ను యూనివర్సల్ స్టూడియోస్‌కి తీసుకెళ్తానన్నాడు. వెళ్ళి అక్కడకి డైరక్ట్‌గా వచ్చేస్తానన్నాను! చర్చిలు అంటే అసక్తి కానీ నాకు గుళ్ళు చూసే ఆసక్తి లేదు! గుళ్ళు ఇక్కడా వుంటాయిగా.
మర్నాడు నాకు యూనివర్సల్ స్టూడియోస్ చూపించే గైడ్‌ని చూసి ఆశ్చర్యపోయాను. ‘సూర్య’ అని 14 ఏళ్ళ పిల్లాడు. నేను యూనివర్సల్ స్టూడియోస్‌కి వెళ్ళినప్పుడు శాక్రిమెంటోలో సభ కూడా మిస్ అయ్యాను…
(సశేషం)