ఆఖరి పద్యం

0
3

[dropcap]ని[/dropcap]న్న మళ్ళీ లక్ష్మింపురం వెళ్ళినట్టు కల వచ్చింది.

ప్రొద్దున్నే బస్ దిగినట్లు, అప్పుడే తెలతెల్లవారుతున్న ఉదయపు మంచుతెరల్లోంచి ఎర్రని సూర్యకిరణాలు పచ్చని చెట్ల ఆకులపై పడి ముత్యపు బిందువుల్లా వెలగడం. పచ్చని చేలు ఒక వైపూ, పంటకాలువ ఒకవైపూ, చల్లని గాలి ముఖానికి తగిలి, మళ్ళీ కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్లు, సన్నని కాలి దారి మీద నడుచుకుంటూ వెళ్ళడం. అదే కల వచ్చింది.

ఇప్పుడు కాలి నడకన ఎవరు వెళ్తున్నారు? గుడివాడలో రైలు దిగినా బస్ దిగినా, టాక్సీలు, ఆటోలు లేకపోతే ఐదారు గంటలకొకసారి వెళ్ళే సిటీబస్ – కొత్తగా పడిన గతుకుల కంకర రోడ్డు మీద డీసెల్ లేక పెట్రోల్ పొగతో కాలుష్యాన్ని చిమ్ముకుంటూ టాక్సీలో కూడా అరగంటలో చేరుకోవచ్చు.

కాని నా బాల్యంలో ఇవన్నీ లేవు. నడుస్తూ లేక సైకిల్ మీద లేక మట్టి దారిలో ఎద్దుల బండి మీద వెళ్ళడమే.

ఆ కల పాత రోజులది. నా కొచ్చే కల అప్పటి ప్రశాంతమైన పచ్చని చెట్ల మధ్య, మంచుపడిన దారిలో, అప్పుడప్పుడూ దూరంగా ఆవులు అంబా అంటూ అరిచే అరుపులు, సంగీత ధ్వనులు చేస్తూ ఎగిరే పేరు తెలియని పిట్టలూ, రెల్లు పొదల వాసనతో నిండిన కాలవ నీటి గలగలా ఇవే గుర్తుకొస్తాయి.

లక్ష్మింపురం అంటే నా జన్మస్థలం! నా జన్మభూమి. వందేళ్ళ నాటి ఎత్తైన రాతి గోడల భవనం. గుబురు మీసాలు, కోటులతో పెద్ద బొట్టులతో వుందే తాతముత్తాలల ఫోటోలు, రాజప్రాసాదం లాంటి హాలు. ‘చినబాబూ’ అంటూ పరిగెత్తుకొచ్చి కాళ్ళకి నీళ్ళిచ్చి కాఫీ క్షణాల మీద ఇచ్చే ప్రేమ నిండిన పనివాళ్ళూ…!

కలలో అది! ఇప్పుడు బూజు పట్టిన గోడలు, మాసిపోయి, పగుళ్ళు ఏర్పడిన కొండరాళ్ళ ప్రహరీగోడల మధ్య ఆకాశంలోకి దీనంగా చూస్తున్నట్లున్న పాత బంగళా, వూళ్ళోని ఆధునికమైన డాబాల మధ్య ఓ పాత రోమన్ దిష్టిబొమ్మలా నిట్టూరుస్తుంటుంది.

విశాలమైన ప్రాంగణంలో మామిడి, కొబ్బరి చెట్లు, మల్లె పొదలు, సంపెంగ పందిరులూ, చుట్టూ కమ్ముకుని వున్న తోట, హాల్లోంచి మొదటి అంతస్తులోకి వెళితే దూరంగా కనుచూపు మేరా పచ్చటి పొలాలూ, పెద్ద చెరువూ, చెరువులోని ఎర్రటి, తెల్లటి కలువపూల చుట్టూ ఆకుపచ్చని తామరాకులూ, వాటి మీద ఝుంకారం చేస్తూ తుమ్మెదలూ.

ఇంకా పై అంతస్తుకి చెక్కమెట్ల మీద నడుచుకుంటూ వెళితే, మూడో అంతస్తులో డాబా పక్కన రెండు పెద్ద పెద్ద గదులూ, మెరిసే గచ్చు నేల మీద పరిచిన మాసిన ఎర్రరంగు తివాచీల మీద హార్మోనియం పెట్టెలు రెండు, తంబూరా, గోడ కానించి పాతది బొబ్బిలి వీణా…

అక్కడే వేసంకాలం శలవులలో సాయంత్రాల్లో సంగీతం హార్మోనియం మీద వాయించి, మధ్యాహ్నపు వేడి గాలి సాయంత్రపు పిల్ల తెమ్మరలుగా మారడాన్ని ఆస్వాదించడం జరిగేది! చిన్నప్పటి నుంచి హార్మోనియం వాయించడం నేర్చుకున్నాను. అది ఒక అత్యంత ఇష్టమైన పాషన్. చీకటి పడుతుంటే, గోధూళి వేళ పొలంలో పనులు ముగించుకుని రైతులంతా ఇంటికి వచ్చేవేళ ‘అందమే ఆనందం’ అని పాత పాట వాయిస్తుంటే, తలుపు తోసుకుని వచ్చేవారు రత్తయ్యగారు. పొలాల మీద మా మేనేజర్. ఖాదీ పంచ, బనీను, తెల్ల మీసాలు, కనుబొమలు. నిటారుగా కాయకష్టం చేసి బలిష్టమైన వంగని నడుం, ఖంగుమనే గొంతు. పొలంలో ఈ మూల ‘ఒహోమ్’ అని అరిచాడంటే ఆరు మైళ్ళు వినబడాల్సిందే.

“రవిబాబూ… రెండో నంబరు శ్రుతి భీమ్ పలాస్ ఎత్తుకోవా…!” నాకు చిన్నప్పటి నుంచి హార్మోనియం వాయించడం వచ్చింది. నాన్న టీచరుని పెట్టి నేర్పించారు. రత్తయ్య చౌదరిగారు అడిగితే ఆయనని కాదనలేని పన్నెండేళ్ళ వయస్సు నాది. గబుక్కున హార్మోనియం మీద స్వరాలు రాగం చూపించగానే వరుసగా పద్యాలు కంచుకంఠంతో అందుకునేవారు రత్తయ్యగారు. ఒక్కొక్క పద్యం ఒక్కో ఆణిముత్యం.

కలలో హార్మోనియం మెట్ల మీదుగా వేళ్ళు జారిపడుతున్నాయి.

“భరతఖండంబు చక్కని పాడియావు…”

“మాయామేయ జగంబె నిత్యమని”…

“నానా, రవిబాబూ, మోహన అను… ఆహా ఎంత బాగా వాయిస్తున్నావు నాయానా…”

“జండాపై కపిరాజు…” అలాపన.

చీకటి పడేది. ఆ గ్రీష్మంలో వేడి తగ్గి సాయంసంధ్య అంతమై చల్లని చుక్కలు నిండిన వెన్నెల రాత్రి మొదలయ్యేది డాబా మీద.

అమ్మ ఇద్దరికీ టీలు, పకోడీలు పంపేది.

అయినాక మళ్ళీ పద్యాలు.

అదిగో ఆ పద్యాలు, రాగాలు వాయిస్తున్నట్టే కల వస్తుంది. రత్తయ్యగారి గొంతులో మాధుర్యం, గాంభీర్యం కలిసి…

చివరి పాట, “నాన్నా సింధుబైరవి అందించు” అనేవారు.

మా తాత ముత్తాల నుంచి వచ్చిన ఈనాం పొలాలు, వాటిల్లో వ్యవసాయం. బ్రాహ్మణులకి వ్యవసాయం ఏమిటి అనుకునే రోజులు కాదు. ఇరవై ఎడ్లబళ్ళు, నాగళ్ళు, మరో ఇరవై మంది పాలేర్లు వుండేవారు.

భవంతి వెనక గొడ్లసావడి నిండా డజన్ల కొద్దీ ఆవులూ, దూడలూ, గేదెలూ, వాటి అంబా ధ్వానులతో కలకలంగా వుండేది. ఉత్తరం వైపు ధాన్యం కొట్లల్లో ధాన్యం ఎప్పుడూ నిండుగా వుండేది. దక్షిణం వైపు కొండలా గడ్డివామూ, గోవుల పెంటప్రోగులూ వుండేవి. వ్యవసాయం చేయడానికి, చూసుకోడానికి, అందరిమీద అజమాయిషీగా రత్తయ్య చౌదరిగారు వుండేవారు నాన్నకి.

ఆయన చెరువు గట్టున ఒక పెంకుటిల్లులో భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళతో కలిసి వుండేవారు. రాజసంగా వుండేవారు. ఉన్నవాళ్ళు కాకపోయినా, ఠీవిగా ఆత్మగౌరవంతో బతికిన కుటుంబం వారిది. వాళ్ళ పెద్దబ్బాయి పండరీనాథ్ బాగా గుర్తు… గిరిజాల జుట్టు, సన్నటి మీసం, తెల్లని కండలు తిరిగిన ఒంటితో సినిమా ఏక్టర్ ఎన్.టి.రామారావ్ లానే వుండేవాడు. అతని తమ్ముడు బోసూ, చెల్లెళ్ళు సీతమ్మా, జయలక్ష్మీ అందరూ కళ్ళకు కట్టినట్టే వుంటారు ఇప్పటికీ.

“సింధుబైరవి అందుకో నాన్నా!” అనేవారు రత్తయ్యగారు. క్రింద నుంచి అమ్మ “భోజనాలకి ఆలస్యం అయ్యింది. ఇంక రండర్రా” అని పిలుస్తుండేది.

హరిశ్చంద్రలో పద్యం. కాటికాపరిగా హరిశ్చంద్రుడు స్మశానంలో పాడే పద్యం… ఆ పద్యం…

“ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్ధలిన్

గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ, డక్కటా!

యెన్నాళ్ళీ చలనంబులేని శయనంబు…”

ఆయన గొంతు గద్గదికమైపోయేది. కన్నీరు ధారలు కట్టేది. చివరికి పద్యం ఆపేసి వెళ్ళిపోయేవారు.

నక్షత్రాలు నిండిన ఆకాశం కేసి చూసి నేను మెల్లగా క్రిందికి వెళ్ళిపోయేవాడిని.

అదుగో… ఆ కలలో మళ్ళీ ఆ మంచి రోజుల సాయంత్రంలో హార్మోనియం మీద పద్యం వాయించినట్లు, ఆయన పై తుండుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు…

ఇది వేసంకాలం శలవుల్లో తరచూ జరిగే సంఘటన. ఓ కలగా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది.

***

తెలిసీ తెలియని ఆ రోజుల్లో…

ఒకరోజు తెల్లవారు ఝామున వేసవి శలవుల్లో పొద్దున్నే లేచి కచ్చికపొడితో, వేపపుల్లతో పళ్ళు తోముకుంటుంటే…

ఇల్లంతా ఏదో ఒక టెన్షన్‌ నిండి వున్నట్లు అనిపించింది. పాలేళ్ళూ, పని అమ్మాయిలు అంతా గుసగుసలాడుకుంటున్నారు.

అమ్మ కాఫీ ఇస్తూ నిశ్శబ్దంగా వుందిపోయింది.

“నిజమేనా, చనిపోయాడా, చంపేశారా?” ఎవరో మెల్లగా అడుగుతున్నారు.

ఇంటి బయట… చెరువు గట్టున వున్న ఇంట్లో “పండరీ, నా పండరీ” అంటూ రత్తయ్యగారు, ఆయన భార్యా శోకాలు పెట్టడం ఉదయపు గాలిలో తెరలు తెరలుగా వినిపిస్తోంది.

“ఎడ్లబండి కట్టండి రా, నా బాబు రైలు పట్టాల మీద పడున్నాడంటరా! పదండిరా బాబూ”

అప్పుడు చిన్నతనం వల్ల తెలీలేదు. ఆ తర్వాత పెద్ద పాలేరు వీరన్నని అడిగేను ఏమయిందని.

“రత్తయ్యగారబ్బాయిని పెద్దపాలెం లాకుల కాడ చంపించేరటండి. ఆరు బాగా వున్నోరూ. ఆళ్ళ అమ్మాయి ఎవరితోనో… ఈడు సంబంధమేదో పెట్టుకున్నాడటండి… ఆళ్ళు బాగా మోతుబరులు, రైస్ మిల్లులు అన్నీ వున్నాయి. ఆళ్ళ దగ్గర బస్తాలు మోసే ఉప్పరాళ్ళే చంపేసి, మన స్టేషను కాడ రైలు పట్టాల మీద పడేసారంటండీ!”

అది వింటుంటే ఆ వేసవి కాలపు ఉక్కపోత ఉదయం, మర్రి చెట్టు ఆకుల సందులలోంచి జారిపడే సూర్యుడి కిరణాలూ, చెట్టు మీద నుంచి ఏదో ఉత్పాతం జరిగినట్లు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిన తెల్లటి పేరు తెలీని పిట్టలూ… రత్తయ్యగారి కుటుంబపు హృదయ విదారకమైన రోదనా… అన్నీ ఒక్కసారి నా చిన్ని హృదయాన్ని షాక్‍కి గురిచేశాయి. అది ఒక నిశ్శబ్దమైన ‘ట్రామా!’.

నిజంగా బాధపడేవి ఎవరికీ చెప్పుకోం. ఆ ట్రామా అలాగే వుండిపోయింది అంతశ్చేతనలో…

***

రోజులు మారాయి. దశాబ్దాలు గడిచాయి. సామెతలోలా ఓడలు బళ్ళు అయ్యాయి, బళ్ళు ఓడలు అవుతాయి. బ్రాహ్మల ఆస్తులు కరిగిపోతాయి. పొలాలు చేతులు మారతాయి… ఆడపిల్లల పెళ్ళీళ్లు, మగ పిల్లల చదువులు, వయసు మీరినవారి చావులకీ, శుభ అశుభ కార్యాలకీ డబ్బులూ, ఆస్తులూ హరించుకుపోతాయి, పొలాలు కరిగిపోతాయి.ఇది ఒక జీవనసత్యం.

జీర్ణమైన శిథిలమైన భవనాలు మాత్రం గతానికి గుర్తుగా వుంటాయి.

ఒకప్పుడు పొలాల్లో జీతానికి పనిచేసినవాళ్ళు కాలక్రమేణా పట్టణాలకి వెళ్ళి హోటళ్ళు, సినిమా హాళ్ళు నిర్మించి ధనవంతులయ్యారు. సినిమాలు తీశారు. పత్రికలు పెట్టారు. అన్ని రంగాలలో పైకి వచ్చారు. ఇప్పుడు ధన సంపదలు వారి సొత్తు. వెనుకబడిన ఇతర కులాలు, సామాజిక వర్గాలూ వారిది అభిజాత్యం అనీ, కులాభిమానం అనీ ఆడిపోసుకుంటారు. ఓడిపోయిన బ్రాహ్మణ్యం తమను ఎవరో అణిచివేశారనీ, ఎప్పుడో తాతల మూతులు నేతులతో తడిసాయని చెప్పుకుని పట్టణాలకీ, నగరాలకీ ఆ తర్వాత విదేశాలకి హరితవనాలు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

భూకామందులు అప్పటికీ, ఇప్పటికీ పొలాల్లో మామిడి కాయలు తిన్నవారిని, తమ స్త్రీలని ప్రేమించిన వారిని నిర్దాక్షిణ్యంగా నిర్మూలిస్తూనే వున్నారు.

కాని రత్తయ్యగారి స్మృతే నాకు ఎన్నో ప్రశ్నలు, స్మృతులని మనసులో తిరిగి లేవనెత్తుతూంటుంది.

ఆయన ఉత్తముడూ, రైతూ, కళాకారుడూ. కానీ అదే కాలంలోని అభిజాత్యం ఆయన కొడుకునే బలి తీసుకుంది.

ఆలోచించగా, ఇది కుల వివక్ష కాదు, ధనవంతుడు బీదవాడి మీద చూపే క్రౌర్యమే అని నాకనిపిస్తుంటుంది.

మౌనంగా ఆయన పడిన బాధా, ఆ కుటుంబం వూరు విడిచి వెళ్ళిపోవడమే ఆ రోజులలోని వాస్తవాలు. అప్పుడు కూడా న్యాయం గెలవదు. సాక్షులు నిజం చెప్పరు. కోర్టుకు కేసులు కొట్టివేస్తాయి. బాధితులు ప్రతిఘటించరు. ఓడిపోతూనే వుంటారు.

***

మళ్ళీ ఆ గాలిని ఆస్వాదించాలి. మళ్ళీ ఆ పంటకాలువ మీద ఎగిరే పక్షులని, మెత్తగా చప్పుడు చేసే తుమ్మెదల శబ్దాన్ని వినాలి, ఈసారి అధునాతమైన మొబైల్‌లో ఫోటోలు తీయాలి. ఈ నగరపు కాంక్రీట్ అరణ్యం నుంచి రెండు రోజులు ఆటవిడుపు పల్లె ఒడిలో.

ఏటా జరిగే శ్రీరామ నవమి రాములవారి కళ్యాణం రోజు అయితే మళ్ళీ లక్ష్మింపురం ప్రయాణం కట్టాను.

తాటాకు పందిళ్ళలో, సన్నాయి వాద్యాలు మంత్రాల మధ్య రాముల వారి కళ్యాణం జరిగిపోయింది. ఊళ్ళో పెద్దలు, పిన్నలు అందరూ వచ్చి పలకరించారు. ఒక పక్క ఉక్కపోసే ఎండ, మరొక పక్క చల్లటి పానకం వడపప్పులు… కూల్ డ్రింక్స్ కూడా… ఇస్తున్నారు.

కోలాటం… చెక్క భజన.

అక్కడికి వచ్చిన రైతు, వృద్ధుడు రామశేషయ్యతో నేనన్నాను – “శేషయ్యా, ఆ రోజుల్లో రత్తయ్యగారు కోలాటానికీ, భజనకీ ఎంత బాగా పాడేవారయ్యా.”

“అవును బాబూ, నువ్వు హార్మణీ పెట్టె మీద, పాట ఎంత బాగా పలికించేవాడివి!”

‘జయ జయ శ్రీరామ!’ కోలాటం వాళ్ళు లయబద్ధంగా పాడుతున్నారు.

దుమ్ము రేపుకుంటూ మారుతీ స్విఫ్ట్ కారు దూరంగా ఆగింది.

స్ఫూరద్రూపి, కొంచెం ముఖం మీద చిన్నప్పటి మశూచి వచ్చిన మచ్చలతో, ప్యాంటూ షర్ట్‌తో వున్న వ్యక్తి, అతని వెనక ఆడవాళ్ళు పూలు పళ్ళ బుట్టలు పట్టుకుని వచ్చారు.

“రవి బాబూ! ఎవరొచ్చారో చూడు” ఒకాయన అరిచాడు.

దగ్గరకొచ్చిన కొద్దీ ముఖ కవళికలు గుర్తు పట్టగలిగేను.

బోసు, రత్తయ్యగారి చిన్న అబ్బాయి!

నా వయసే వుండేవాడు. అందుకనే గుర్తు. ఆడుకున్న ఆటలు, కాలవలో ఈతలు అన్నీ గుర్తుకొచ్చినయ్!

“బోసూ, బావున్నావా?”

“రవి బాబూ బావున్నారా?”

సంతోషంగా కావలించుకున్నాను. “ఎక్కడు ఇప్పుడు?” అడిగేను.

“విజయవాడ లోనేనండీ. లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్. అక్కడే మొగల్రాజపురంలో ఇల్లు కట్టుకున్నానండి. ఇదిగో నా భార్య మేరీ, కూతురు రత్న.”

“మన వూరు అమ్మాయే బాబు, ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు” ఎవరో పెద్దాయన చెప్పాడు.

కాలచక్రం గిర్రున తిరిగి ఓ క్షణం ఒక్కొక్క చోట ఆగుతుంది. అప్పుడు భావాలు, ఆలోచనలు కూడా ఓ క్షణం ఘనీభవిస్తాయి.

“బాగా సంపాదించాడు బాబూ. నాలుగు లారీలుండాయి. ప్రతేటా  మనూరు వొస్తాడు!”

“సంతోషం బోసూ. రత్తయ్యగారు… మీ నాన్నుంటే ఎంత సంతోషించేవారో” అనేశాను.

ఒక్క క్షణం అందరూ మౌనం.

మరో రెండు క్షణాల తర్వాత అందరూ మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చాం.

సన్నాయి మేళం – ‘మము పాలించగ నడిచి వచ్చితివా’ అన్న త్యాగరాజ కృతి ఎత్తుకుంది.

రాములవారి కళ్యాణం అయిపోయి, గుడిలో గంటలు మోగుతూ… హారతి ఇస్తున్నారు.

గత స్మృతుల్లోంచి, మారుతున్న కాలంలోంచి నడుస్తున్న చరిత్రలోకి, కలలు కాని వాస్తవంలోకి మళ్ళీ వచ్చి పడ్డాను.

కాని అప్పుడప్పుడు మళ్ళీ ఏదో తెల్లవారు ఝామున కలలో ఆ వేసవి కాలపు ఉదయంలో గాలిలోకి ఎగిరిన పక్షులూ, బండి కట్టుకుని తీసుకువచ్చిన విగతజీవి శరీరం, గ్రీష్మ ఋతు సాయంకాలంలో రత్తయ్యగారు పాడే ఆఖరి పద్యం కలలోకి వస్తూనే వుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here