ఎండమావులు-11

0
3

[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 11వ భాగం. [/box]

24

[dropcap]మ[/dropcap]నిషికి ముఖ్యంగా మగాడికి ఒక కష్టం, ఆపద, సమస్య వచ్చినప్పుడు అతడు ఒంటరిగా ఉండాలని ఆశిస్తాడు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో విశ్లేషించి, కారణం వెతకడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమస్య పరిష్కారం ఆలోచించి అది దొరికే వరకూ అతడు ఒంటరిగా తన పరిధిలోనే ఉండడానికి ప్రయత్నిస్తాడు.

అతడి దృష్టిలో ఆ సమస్య ఇతరులకి చెప్పదగ్గది కాదు, తగ్గేది కాదు. తను చెప్పకుండానే తనకి అంత పెద్ద సమస్య వచ్చిందని అవతలవారు గుర్తించాలి. తను ఒక్కడే తన ఆలోచనతోనే తన తెలివితేటలూ సామర్థ్యంతో సొంతంగా ఎవరి సహాయ సహకారాలు లేకుండానే పరిష్కరించుకోవాలి. కష్టం వచ్చినప్పుడూ, దాన్ని సాధించినప్పుడూ మగాడు దాన్ని ఒక అచీవ్‌మెంటుగా భావిస్తాడు. ఆ సమస్య పరిష్కరించిన తరువాత అతను సంతోషంగా ఫీలవుతాడు.

సుధాకర్‌కి సమస్య ఎదురయింది. అదీ అలాంటి ఇలాంటి సమస్య కాదు, పెద్ద సమస్యే! తన తల్లిదండ్రులు తన తప్పును క్షమించి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. లేకపోతే తను ఎంతో మానసిక క్షోభకి గురి అయ్యేవాడు. ఆ ఆనందం ఎంతో సేపో నిలువలేదు. తనకోదారి చూపించి తనకి సహాయం చేసిన సౌందర్య ఆచూకి తెలియక పోవడం అతన్ని కలవరపాటుకి గురిచేసింది.

మానవజన్మే అంత, ఆ మానవ జన్మలో రాగ ద్వేషాలుంటాయి, సుఖదుఃఖాలుంటాయి, భావోద్రేకాలు సహజం. వీటినన్నింటినీ అనుభవించక తప్పదు. సుఖం, దుఃఖం రెండూ ఒకటికి మరొకటి వ్యతిరేకపదాలు. కష్టం కలకాలం ఉండదు. కష్టం, సుఖం చలించు మేఘాల్లాంటివి. చుట్టం చూపుగా వచ్చిన బంధువులు ఇవి. అయితే విచిత్ర విషయం – సుఖం అందరూ కావాలని కోరుకుంటారు. జీవితాంతం ఏ కష్టాలు రాకుండా తమ జీవితాలు సుఖంగా సాఫీగా సాగాలని అందరూ కోరుకుంటారు. ఇది సహజం కూడా కష్టాల విషయం అలా కాదు.

సౌందర్య కూడా తన జీవితం ఏ ఒడిదొడుకులూ లేకుండా సాగిపోతుందనుకుంది, అయితే ఆవిడ ఉద్దేశం ప్రకారం సినీరంగం వైకుంఠపాళీ ఆటలాంటిది. ఆ ఆటలో పెద్ద పాము పాలినపడిన పిక్క క్రిందకి పతనావస్థకి చేరుకుంటుందో సౌందర్య కూడా పతనావస్థకి చేరుకుంది. అన్ని విధాలా చితికి పోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.

కొంతమంది కష్టాలు కావాలనే కోరుకుంటారు. వారు ధైర్యస్థులు, అలాటి వారు అరుదు, సౌందర్య కష్టాలు కోరుకోలేదు. అయితే కష్టాలే ఆమె దరి చేరాయి. సుఖం శారీరకంగా – మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది. ప్రశాంతతని ఇస్తుంది. మానవుడికి కష్టం, సుఖం రెండు వాళ్ళ వాళ్ళ నుదుటి వ్రాతను బట్టి ఉంటుంది కూడా.

సౌందర్య జీవితం ఇలా తయారవడానికి కారణం ఏంటి? దానికి కారణం కోరికలు – మనిషికి కోరికలు పరిమితంగా ఉండాలి. కోరికలు ఎక్కువవుతున్న కొద్దీ దుఃఖం, కష్టాలు ఎక్కువవుతాయి. ఆ కోరికలే అన్ని తనకి దుఃఖాలకి మూలం.

తన తల్లిదండ్రుల ప్రేమ పొందగలగానని సంతోషించాలో, సౌందర్య ఆచూకీ తెలియలేదని విచారించాలో తెలియని అయోమయ పరిస్థితి సుధాకర్‌ది. తల్లిదండ్రుల ప్రేమపొందానని దూదిపింజలా ఎగిరిపోతోంది అతని హృదయం. సౌందర్య విషయంలో మాత్రం కుచించికుపోతోంది, ఆరాటపడుతోంది. ఆనందాన్ని సంధ్యతో పంచుకోవాలని అనుకున్నాడు, అయితే సౌందర్య పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే భావోద్వేగంతో మనస్సు అశాంతిగా ఉంది.

ఒంటరిగా కూర్చుని పరిసరాలను కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎప్పుడూ హుషారుగా తనతో మాట్లాడే సుధాకర్ ఇలా మూడీగా పూలమొక్కల దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడేంటి? సంధ్య అనుకుంటోంది.

వారం రోజుల క్రితం తామిద్దరూ బీచ్‌లో కలుసుకున్నారు. అప్పుడు తనకి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ గురించి చెప్పింది. “నాకూ తల్లిదండ్రులున్నారు” అన్నాడు.

“మీ తల్లిదండ్రుల గురించి నాకు చెప్పలేదేం?” అని తను అడిగింది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలని వెళ్ళిపోయాడు. “ఇప్పుడు అదే విధంగా మూడీగా ఈ పూలమొక్కల దగ్గర అగుపడ్డాడు” అని అనుకొంటోంది సంధ్య.

“సుధాకర్! ఇలా గంభీరంగా కూర్చుని సీరియస్‌గా ఆలోచించకండి, సీరియస్‌గా ఉండడం అన్నది ప్రకృతికి వ్యతిరేకమైనది, నవ్వుతూ, సంతోషంగా ఉండండి” అంది సంధ్య.

ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య ప్రపంచం లోకి వచ్చిన సుధాకర్ చిన్నగా నవ్వాడు కాని ఆ నవ్వులో జీవం లేదు.

“ఏం జరిగిందబ్బా!” ఆమె అడిగింది.

“ఏం జరగలేదు” అని అందామనుకున్నాడు కాని మరుక్షణమే అతని నిర్ణయం మారింది. ఆమెతో తన మనో వేదన చెప్తే కొంతయినా మనస్సుకి ఊరట లభిస్తుంది అని తిరిగి అనుకున్నాడు అతను.

తన తల్లిదండ్రుల విషయం, వాళ్ల యెడల చిన్నప్పుడు తన ప్రవర్తన, తన ప్రవర్తనకి తల్లిదండ్రుల బాధపడిన వైనం, తను ఇల్లు వదిలి సౌందర్య దగ్గరికి వెళ్లడం, ఆవిడతో తనకి పరిచయం అయిన విధం, ఆవిడ తనకి చేసిన సహాయం, ఆవిడకి సినిమాలో నటించే అవకాశాలు లేకపోయేసరికి బాధపడడం, ఆ తరువాత ఆమె జాడ తెలియక పోవడం అన్నీ వివరించాడు.

అంతా విన్న సంధ్య గాఢంగా నిట్టూర్పు విడిచింది.

“మీ జీవితంలో ఇంత విషాదం, మిస్టరీ ఉందా?” సానుభూతి చూపిస్తూ అంది సంధ్య. అతనికి కావల్సినది సానుభూతి కాదు సాంత్వన. ఈ చికాకులన్నీ తాత్కాలికమే పరిస్థితులు చక్కబడ్డాయి అని నొక్కి చెప్పే స్థిరమైన కంఠం.

“ప్రతీ మనిషికీ సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. ఇదే మానవజన్మ. ఈ సమస్యలన్నీ కాలమే పరిష్కరిస్తుంది. మీ తల్లిదండ్రుల ప్రేమను ఎలాగ పొందారో అలాగే తప్పకుండా ఆ సౌందర్య కూడా అగుపడుతుంది” అంది సంధ్య.

25

సుధాకర్‌కి, సంధ్యకి తమ వైద్య విద్య పూర్తయింది. హౌస్ సర్జన్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రతి డాక్టరూ కొంతకాలం గ్రామాల్లో ప్రాక్టీసు చేయాలి. ఆ ఇద్దరూ అదే పని చేస్తున్నారు. వేరు వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నా సెల్‌ఫోన్ వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టం చేస్తూనే ఉంది. తరుచుగా ఒకర్ని మరొకరు కలుస్తూనే ఉన్నారు.

ఈ మద్యకాలంలో వారి స్నేహం లోనైతేనేమి, మానసిక స్థితిలో నైతేనేమి, ప్రవర్తనలో అయితేనేమి మార్పు అన్నది అగుపడుతోంది. సమయం సందర్భాలను బట్టి వారి దృక్పథాలు మారుతున్నాయి. ఒక్కొక్క పర్యాయం కొన్ని ప్రభావాలకి వారు గురి అవుతున్నారు. ఆ ప్రభవాలు సామాజికమైనవి కావచ్చు, కుటుంబ పరమైనవి కావచ్చు. బాంధవ్యపరమైనవి కావచ్చు. మొత్తానికి ప్రభావాల ప్రభావంతోనే దృక్పథాలు మారుతూ ఉంటాయి. బలపడుతూంటాయి. ఒక్కొక్క పర్యాయం బలహీనమవుతూ ఉంటాయి. మన దృక్పథాలు ఎప్పటికీ శాశ్వతం కావు.

జీవితంలో అనేక సంఘర్షణల్ని ఎదుర్కొనవల్సి వస్తుంది. అవి సైతం మన దృక్పథాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వయస్సు పెరుగుతున్న కొలదీ క్రొత్త ప్రభావాలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రభావాలతో మన దృక్పథాలలో కూడా మార్పు అనివార్యమవుతూ ఉంటాయి. దృక్పథం మారటం వలన మనకి ఈ ప్రయోజనం కలిగించే నమ్మకాల విషయంలో కొన్నింటిని వదులుకోడానికి, మరికొన్నింటిని నమ్మడానికి సిద్ధమవుతాము. మనం ఏర్పరుచుకున్న విలువలకు విఘాతం కలగగలదన్నప్పుడు మన దృక్పథాలలో మార్పుని ఆహ్వానించాలి. ఇలా బావుకతతో ఆలోచిస్తాడు సుధాకర్.

మరొక పర్యాయం మరో రకమైన ఆలోచన్లు, ఒకరు మనకి సహాయపడినప్పుడు ప్రతిస్పందనగా వారికి మనం సహాయపడాలన్న దృక్పథానికి వస్తాం. మన దృక్పథంలోనే అనుకూలతలను, అననుకూలతలనూ, ఇష్టాలను, అయిష్టాలను ఏర్పరచుకోగలం. ఏ నిర్ణయానికైనా మన దృక్పథమే ప్రధానం. మనం ఏ ఒక్కరి విషయంలోనైనా వొదిగినా మన దృక్పథం ఫలితంగానే మన దృక్పథాలు అని అనుకునే వాటికి అంతరిక నేపథ్యమూ, ఒక బహిర్గత నేపథ్యము ఉంటుంది. సుధాకర్ దృక్పథంలో సౌందర్య ఓ ఉన్నతురాలు, ఆమె తనకి ఎన్నో విధాలుగా సహాయపడింది. మానసిక సైర్యాన్ని ఇచ్చింది. తనకి తను చేసిన తప్పు తెలియజేస్తూ హితబోధ చేసింది. ఆమెకీ తనకీ ఏదో అవినావ సంబంధం ఉన్నట్లనిపించింది. ఆమెకి తను ఎన్నో విధాలుగా ఋణపడి ఉన్నాడు. ఆమె అలా సహాయ పడినప్పుడు ప్రతిస్పందనగా తను ఆమెకి ఆమె కనిపిస్తే సహాయపడాలి అనే దృక్పథానికి వచ్చాడు. అయితే ఎలా సహాయపడాలి? అదే అతడ్ని దొలుస్తున్న సమస్య అన్న విషయం. ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళిందో? ఎలా ఉందో? అన్న తెలియని పరిస్థితి. ఆ విషయం అలా ఉంటే సంధ్య విషయంలో అతని దృక్పథం మరోలా ఉంది.

సంధ్యను తను ప్రేమిస్తున్నాడా? లేక ఆరాధిస్తున్నాడా? ప్రేమ ఉన్న దగ్గర ఆరాధన తప్పకుండా ఉంటుంది. ఆ ఆరాధన ఆంతరిక నేపథ్యంగా మిగిలిపోతుందా? లేక బహిర్గత నేపథ్యంగా మిగిలిపోతుందా? అని చెప్పలేని పరిస్థితి. మనం ఎదుటి వాళ్ల మీద అనుకూలతను, ఇష్టాన్ని ఏర్పరుచుకోడానికి మన దృక్పథమే ప్రధానం. దాన్ని బట్టే మన చర్యలుంటాయి. అయితే ఒక్కోక్కసారి అతనికి తన దృక్పథం, భావాలు, ఆలోచనలు, చర్యలు, సహజమైనవేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో అంతస్తులు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి.

ఆర్థిక స్థితిగతుల విషయంలో సంధ్య తన కన్నా ఒక మెట్టు ఎత్తులో ఉంది. ఆమె ఆ ఇంటిలో ఒక్కగాని ఒక్క కూతురు. ఐశ్వర్యవంతమైన కుటుంబంలో గారాభంగా పెరిగింది. అలాంటి అమ్మాయి తనకి జీవితాంతం తోడుగా నిలబడమని అడగడం అత్యాశ అనిపించుకోదా? తన ఆ కోరిక నెరవేరుతుందా? ఒకవేళ ఆమె అలా నిలబడినా తమ వైవాహిక సంబంధాలు కడవరకూ తను ఆశించినంతగా సదా సజావుగా సాగుతాయా? ఇదే సుధాకర్ ఆలోచన.

ఇవతల అతని ఆలోచనలు అలాగ ఉంటే అవతల ఆమె ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ఆమె దృక్పథంలో ప్రేమ చాలా మహత్తరమైనది, స్వార్ధం లేనిదే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమను అతను తనకి అందిస్తాడన్న నమ్మకం ఆమెకుంది. అయితే అన్ని బంధాల్ని విచ్ఛిన్నం చేసేవి ఆర్ధిక సమస్యలు. అతను ఆర్థికంగా తనకన్నా కొద్దిగా సరిసమానుడు కాకపోవచ్చు. దాన్ని తను పట్టించుకోదు. తనకి కావల్సింది అతను, నిష్కలంకమైన అతని ప్రేమ. ఈ విషయంలో తను తన వాళ్ళని ఒప్పించగలదు. ఆ నమ్మకం తనకి ఉంది. అయితే అతని తల్లిదండ్రుల దృక్పథం, వారి భావాలు ఎలా ఉంటాయో తెలియదు.

ఇప్పటి వరకూ తను సుధాకర్‌తో తన ప్రేమ గురించి ఎరుక పరచలేదు. ఎరక పరిస్తే ఈ విషయంలో అతని స్పందన ఏంటో అన్నది తెలుస్తుంది. అతని ఆంతరిక భావాలు తెలుస్తాయి. మొదట అతని అభిప్రాయం తెలుసుకున్న తరువాత తన ఇంటిలో ఈ విషయాన్ని గురించి చర్చించాలి. ఇలా ఆలోచిస్తోంది సంధ్య.

సమాజంలో సామాజిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఎలా ఉంటే ఉండనీ గానీ, ఒక్క విషయం సరిగా చెప్పచ్చు. అతను ఆమెను ఇష్టపడుతున్నాడు. ఆమె అతడ్ని ఇష్టపడుతోందని రూడీగా చెప్పచ్చు. వారి ఇష్టాలు ప్రేమగా మారేయి. వారి మనసులు, భావాలు కలిసాయి. వారి దృక్పథాలు ఒకటయ్యాయి. వారి ఈ కన్న కలలు సాకారమవ్వాలంటే అడ్డుగా నిలిచిన ఆర్థిక అసమానతలు తొలిగిపోవాలి. అలా తొలగాలంటే సంయమనం, అవగాహన అవసరం.

మానవ సమాజంలో ధనికులకి ఎబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంటే చులకన, అదే చిన్నచూపు. ఎబౌవ్ మిడిల్ క్లాసు ఫ్యామిలీకి మిడిల్ క్లాసు ఫ్యామిలీ అంటే ఏవగింపు. మరి మిడిల్ క్లాసు వాళ్ళకో? వాళ్ళకి పేదవాళ్లంటే చులకన, ఒక్కోక్కళ్ళ దృక్పథాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈ వైరుధ్యాలు గమనిస్తే తనకే వింతనిపిస్తుంది. తను సుధాకర్‌ని ఇష్టపడుతోంది అన్న విషయం నిజం ఈ విషయంలో అస్పష్టత ఏం లేదు. అయితే అతను మధ్య తరగతి మనిషి. తను ఎబౌవ్ మధ్య తరగతికి చెందినది, తమిద్దరీకి పొంతన ఎలా కుదురుతుంది? అని లోకం అనుకోవచ్చు. తమిద్దరికీ పొంతన కొన్ని సందర్భాల్లో కుదరకపోయినా కుదిరినట్టు చేసుకోవాలి. ఏదేనా నెగిటివ్ ఎదురయితే ఆ సందర్భాల్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి ఎందుకంటే తను అతడ్ని ఇష్టపడుతోంది, ప్రేమిస్తోంది. ఆరాధిస్తోంది.

ఇష్టం ఉన్న దగ్గర చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. తను ఇలా ఆలోచిస్తోంది కాని రేపొద్దున్న అతని కుటుంబంలో కలసి మెలగవల్సి వస్తుంది. సుధాకర్‌తో అయితే తను సర్దుకుపోగలదు. అదే అతని కుటుంబంతో ఏదేనా పొరపొచ్చాలు వచ్చినా తను సర్దుకుపోగలదా? తన ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించగలదా?

అయితే జీవితంలో మనకు కొన్ని కావాలంటే మరికొన్నింటిని వదులు కోవాలి. సమయానుకూలంగా మన ఆచరణ మన భావాలు మార్చుకోక తప్పదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాటికి అనుకూలంగా మనం మన దృక్పథాల్ని కూడా మార్చుకోవాలి. తప్పదు. ఇలా ఆలోచిస్తోంది సంధ్య తిరిగి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here