నీలమత పురాణం – 52

1
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

నిత్యం సన్నిహితా దేవా అస్మిన్ కశ్మీర మండలే।
తేషాం భక్తిః సదా కార్యా నాగానాం చ తథా ద్విజ॥

[dropcap]క[/dropcap]శ్మీర మండలం దేవతల నివాస స్థానం. దేవతలను నిత్యం పూజించాలి. నిత్యం నాగులను, బ్రాహ్మణులను పూజించాలి, గౌరవించాలి.

పిశాచాలను కూడా పూజించాలి. వాటికి పద్ధతి ప్రకారం నైవేద్యం సమర్పించాలి. కశ్మీరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ దేశానికి చెందిన సంప్రదాయాలను, పద్ధతులను పాటించాలి.

‘ఈ దేశానికి చెందిన పద్ధతులను పాటించాలి’ అనటం వెనుక ఎంతో ఆలోచన కనిపిస్తుంది, కామన్‍సెన్స్ ఉంది.

ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఆ ప్రాంతపు వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణ పరిస్థితులను అనుసరించి అక్కడి సంప్రదాయాలు ఉంటాయి. దుస్తులు ధరించటం నుంచి ఆహారం భుజించటం వరకూ ప్రతీ దానిపై ప్రాంతీయ పరిస్థితుల ప్రభావం ఉంటుంది.  అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఇవి నిర్దేశిస్తాయి. ఆయా ప్రాంతాలలో సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆయా పద్ధతులను పాటించాలి. అందుకు భిన్నంగా ఉండటం అనారోగ్యాలకు, అశాంతికి దారి తీస్తుంది.

ఇది మనకు అనుభవమే.

ఇతర ప్రాంతాల తిళ్ళు, పద్ధతులను అవలంబించటం వల్ల ప్రస్తుతం మన సమాజంలో ‘తిండి’ ఓ పెద్ద సమస్య అయిపోయింది. ‘తిండి’ ఆధారంగా వచ్చే ఆరోగ్య సమస్యలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయ ‘తిండి’కి ప్రజలు దూరమయి, ప్రచార ప్రభావంలో ప్రాసెస్డ్ తిండి పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు ఇంక ఇలాంటి ‘ఫాస్ట్‌ఫుడ్’లకు దగ్గరయ్యారు. ఫలితంగా ‘ఒబేసిటీ’తో ఆరంభించి పలు కొత్త కొత్త రోగాలు సమాజంలో సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు సమాజాన్ని, సమాజంలోని ప్రతి వారినీ పట్టి పీడిస్తున్న సమస్య ‘ఏది తిని చచ్చేది?’ అన్నది. ఇందుకు కారణం ‘ఈ దేశానికి చెందిన సంప్రదాయాలను పాటించాలి’ అన్న అతి సామాన్య విషయాన్ని విస్మరించటమే.

నీలమత పురాణం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది.

దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కశ్మీరుకు వలస వచ్చేవారిని గౌరవించాలి. వారికి ఆశ్రయం కల్పించాలి. కశ్యపుడి వారసుడయిన రాజు వారి వారి నేరాన్ని అనుసరించి నేరస్తులకు శిక్ష విధించాలి.  రాజు మరీ కఠినంగా ఉండకూడదు. అలాగని ప్రతివారినీ క్షమించి వదలకూడదు. శాస్త్రాలలో నిర్దేశించిన పద్ధతిలో రాజ్యపాలన సాగిస్తూండాలి. ఇది కూడా ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిన అంశం.

ఇటీవలే మన సమాజంలో ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగిన సందర్భంలో సమాజం స్పందనను, ప్రభుత్వ ప్రతిస్పందనను చూశాం. ఏది మంచి? ఏది చెడు? ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి? ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయాన్ని మన్నించి పాలన కోసం ఏర్పాటు చేసుకున్న నియమావళిని పాలకులే ఉల్లంఘించటం సబబా? వంటి ప్రశ్నలు సమాజంలో చెలరేగటం అనుభవించాం. నేరాలకి తగిన శిక్షను వెంటనే విధించటం గురించిన చర్చలు విన్నాం.

రాజు నేరాన్ని అనుసరించి నేరస్తులకు శిక్షను విధించాలి. రాజు మరీ కఠినంగా ఉండకూడదు. అలాగని ప్రతివారినీ క్షమించి వదలకూడదు; ఇది ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది. ఇది కత్తి మీద సాము వంటిది. ఎంతో విచక్షణను ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ ప్రజల మనోభావాల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో ‘విచక్షణ’ అన్నది అభాసు పాలవుతుంది. అంతగా ఉపయోగించటం కష్టం అవుతుంది.

నికుంభుడు ఆరు నెలలు కశ్మీరం వదిలి వెళ్తాడు. ఆ సమయంలో, అంటే నికుంభుడు కశ్మీరు వదిలి వెళ్ళి, మళ్ళీ తిరిగి వచ్చేదాకా రాజు తీర్థయాత్ర చేయాలి, మందిరాలు దర్శించాలి.

రాజు ఇల తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దేశంలోని ప్రతి మందిరంలో సంవత్సరమంతా సంబరాలు జరగాలి, పూజలు జరగాలి.

ఇకపై తీర్థయాత్రలో, ఏయే రోజు ఏయే దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలి వంటి విషయాల ప్రస్తావన ఉంటుంది.

కశ్మీర రాజు గురించి ఇంతవరకు ‘నీలమత పురాణం’లో చెప్పిన అంశాలు చదువుతూంటే ఎక్కడా రాజుకు అహంకారం వచ్చే వీలు లేదు.

రాజు స్నానం చేయటం దగ్గర నుంచి ప్రతి విషయం రాజుకు అతని బాధ్యతను గుర్తు చేస్తూంటుంది. రాజుకు అహంకారం పెరగకుండా అడ్దు పడుతూనే ఉంది. రాజు దేశంలోని పలు ప్రాంతాల నుండి తెచ్చిన మట్టితో స్నానం చేయాలి. రాజ్యంలోని పౌరులందరినీ సన్మానించాలి, సత్కరించాలి. తన దగ్గర ఉన్న ధనాన్ని దానధరమాలలో వినియోగించాలి. తప్పనిసరిగా తీర్థయాత్రలు చేయాలి. దైవ ప్రార్థనలు చేయాలి. సంబరాలు జరపాలి. ఈ రకంగా రాజు ప్రవర్తనని నిర్దేశించి, రాజుకు అహంకారం పెరగకుండా అడ్డుపడటం అడుగడుగునా కనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here