[dropcap]ఆ[/dropcap]రుగాలమూ శ్రమించి!
ఆకలి మంత్రము పఠించి!
లోకానికి అన్నమొసగు!
లోతగు నీ హృద్భావనను!
పసిగట్టిన ఘన వైద్యులు!
పుట్టలేదు ఈ భువిలో!!
కోడికూతతోనే లేచి!
కాలకృత్యములను తీర్చి!
లేగలొదిలి పాలుపితికి!
పశువులకు కుడితి పెట్టి!
కాడె కట్టి ఎద్దులను!!
పొలము పనులు చేసి చేసి
అలసిన నీ కష్టాన్ని
తెలిసుకున్న నాథుడింక!
పుట్టలేదు ఈ జగాన!!
పగలనకా రేయనక!
పామనక! తేలనక!
కష్టమనక! నష్టమనక!
దుక్కి దున్ని దుమ్ము పట్టి!
నాట్లు వేసి నీరు పెట్టి!
కలుపుతీసి ముందు జల్లి!
ఎరువు వేసి కరువుదీర!
పండించిన నీ పంటకు
వెలకట్టె షరాబింక
కానరాడు భూమి పైన!!
అన్నదాతవంచు నీకు!
కొన్ని బిరుదులిచ్చినారు!
దేశానికి వెన్నెముకని
తెగ పొగిడి విడిచినారు
రైతే రాజని నీకు
భూజులనంటించినారు
కాలినడక నీవెళితే
కారులపై తిరిగినారు
అంతా తెలిసియు నీవు
చింతలేక ఉసులేక
నీకష్టము నీదెయంచు
పేదగా బ్రతికినావు
గవర్నమెంటు రాయితీలు
నీ దరిదాపులకు రాక
అడ్డుకున్న దళారులకు
అన్నదాతపై నిలచిన
రైతన్నా నీ బ్రతుకే
ధన్యతనొందినదన్న!!
శలవెరుగని శ్రామికుడా!
అలుపెరుగని అన్నదాతా!
సంఘమేది సేవకుడా!
నీ కండలు పిప్పి చేసి
నీ రక్తము పీల్చి వేసి
పండుగ చేసిన జనాలు
మానవ సేవయే మాధవసేవగా తలచిన
నీ సూత్రమదేకాలమో మరిచినారు
రైతన్నా నీకు జయం జయం!
రైతన్నా నీకు శుభం శుభం!!
ఆదివారం ఆఫీసుకు శలవు!
ఆచారికి అమావాస్య శలవు!
నేతన్నలకు పౌర్ణమి శలవు!
వర్తకులకు వారాంతము శలవు!!
శలవులేని శ్రామికుడవు నీవే!
ప్రపంచాన మరెవరూ లేరు!!
ధన్యజీవి ఓ రైతన్నా!
నీ జీవితమే ధన్యమన్నా!
అహో అహో ఓ రైతన్నా!!