[dropcap]5[/dropcap]2 మంది కథకులు తాము రచించిన కథలలోంచి తమకు నచ్చిన కథలను ఎంచుకుని ప్రచురించిన రెండవ కథల సంకలనం ‘నాకు నచ్చిన నా కథ-2’. గతంలో యాభై మంది రచయితలో ‘నాకు నచ్చిన నా కథ’ అనే సంకలనం వెలువడింది. దాని రెండవ భాగంగా మరి ఆ సంకలనంలోని రచయితలు కాక, ఇతర రచయితల కథలను ఈ సంకలనంలో ప్రచురించారు. రెండు సంకలనాలకూ సంపాదకులు ఎన్.కె.బాబు.
“సంకలనాలలో చోటు చేసుకోవడంలో చాలామంది రచయితలకు అవకాశం దొరకటం లేదు. దీంతో నిరాశతో పాటు, నిస్పృహ కూడా పొందడం చూస్తున్నాం. సంకలనాలు ప్రచురించే వారికున్న పరిమితుల దృష్ణా లేదా మరేదో కారణాల వల్లనో అన్ని కథలు ప్రచురించడం సాధ్యం కాదు. అందుకే ఆ లోటును కొంతవరకు అధిగమించే ఉద్దేశంతో యీ సంకలనానికి పూనుకున్నాం” అని ‘సంపాదకుని మాట’లో ఎన్.కె.బాబు సంకలనం ప్రచురణ నేపథ్యాన్ని వివరించారు.
మంజరి ‘పాఠకులకో విన్నపం’లో “తెలుగు సాహిత్యం కొన్ని ముఠాల చేతిలో చిక్కుకుపోయింది. దీని నుండి తెలుగు కథని బయటకి తీసుకురావాలంటే గట్టి ప్రయత్నం చెయ్యాలి. ఆ ఉద్దేశ్యంతో రూపుదిద్దుకుంది ‘నాకు నచ్చిన నా కథ’ ఆలోచన” అని ఈ సంకలనం వెనుక ఉన్న ఆలోచనను వివరించారు.
అడపా రామకృష్ణ, బొమ్మదేవర నాగకుమారి, దాట్ల దేవదానం రాజు, అంబల్ల జనార్ధన్, ఎం.ఆర్.వి. సత్యనారాయణమూర్తి, ఎం.వి.రామిరెడ్డి, ఎమ్.వి.వి. సత్యనారాయణ, ఎమ్. సుగుణారావు, సలీం, మేడా మస్తాన్ రెడ్డి, తమిరిశ జానకి, తనికెళ్ళ భరణి, వడలి రాధాకృష్ణ, మల్లాది, యండమూరి వంటి పేరు పొందిన రచయితల కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.
***
నాకు నచ్చిన నా కథ-2 (కథలు)
సంపాదకులు: ఎన్.కె.బాబు
పుటలు: 400
వెల: ₹ 200/-
ప్రతులకు:
గురజాడ బుక్ హౌస్,
షాప్ నెంబర్ 1, ఎన్.జీ.వో. హోమ్,
తాలూకా ఆఫీస్ రోడ్
విజయనగరం – 535002