[dropcap]మి[/dropcap]త్రమా !
వచ్చిందా నీకూ వసంతం
నెరవేరిందా నీ ఆ పంతం
అంతా గమనిస్తూనే ఉన్నా
నీ ఆత్మ స్థైర్యం అమోఘ మన్నా
మనోహరం నీ రూపం
తీర్చును అది మా తాపం
శిశిరం నీపై చేసిన సమరంలో
సర్వం కోల్పోయిన తరుణంలో
చింతకు నీవీయ లేదు స్వాగతం
చెంతకు రానీయ లేదు దురాగతం
చూసానులే నిశ్చలమైన నీ ధీమా
లేక పోయినా నీకు జీవిత బీమా
పోయిన వనరులపై చూపని నీ ఆశ
శ్వాసగ భవితపై సారించే నీ ధ్యాస
నీలో దాగిన శక్తుల సమాహారం
విశ్వ జనాళికి నీవు చూపిన వైనం
ఎంతని పొగడను ఎలుగెత్తి
ఏమని చెప్పను గొంతెత్తి
నిరంతరం శ్రమనే ప్రేమిస్తే
అనంతరం ఆగక శ్రమిస్తే
సంపదలన్నీ సొంపుగ రావా
విందుగ అన్నీ అందక పోవా
మౌనంగానే ఎదుగుతావ్
వినయంగానే ఒదుగుతావ్
దరికి రానీయవు అహంకారం
ఉరికి చూపవు మమకారం
నీ ఉనికే మా ఉనికికి ప్రాణవాయువు
నీవు లేక తీరును అందరి ఆయువు
త్యాగానికి నీవే చిఱునామా
నీ జీవితాని కదే శహనామా
ఐనా మారదు నీ వైనం
కడదాకా ఒకటే పయనం