[box type=’note’ fontsize=’16’] “మన సంతానమే మన పునర్జన్మ” అంటూ, “మీలో వున్న మీ అమ్మ నాన్నల తత్ కి పేరు పెట్టండి” అంటున్నారు లెనిన్ అన్నె ఈ కవితలో. [/box]
[dropcap]నా[/dropcap]కు సరిగా తెలియదు.
నా గత జన్మలో నేను పుట్టి సుమారు ఎనభైఎనిమిది సంవత్సరాలు అయింది.
గత జన్మలో నా పేరు బాపాయమ్మ.
మా తాత బాపయ్య.
ఆ గురుతు గా నాకా పేరు పెట్టారు.
నేను చనిపోయి ఐదేళ్ళయింది.
నాకు ముగ్గురు కుమారులు.
మొదటి వాడుపెదబాబు.
వాడు ఇండియా లో ఇంజనీరు చేసి అమెరికా లో పి హెచ్ డి చేసాడు.
వాడికిపుడు డెబ్భై యేళ్ళు.
వాడికి మా వారి పోలికలు వచ్చాయి.
నా తెలివి తేటలు పుణికి పుచ్చుకున్నాడు.
నాలుగు సంవత్సరాల క్రితం మాట..
తనకింకా పేరు పెట్టని తత్వానికి నా పేరు ఏమిటి? అని కవిత వ్రాసాడు.
చిత్రం!
ఇన్నాళ్ళకి వాడి కా పేరు లేని తత్వము అర్ధము అయినది.
పేరు పెడతానన్నాడు. ఇది చాలా శుభదినము.
తత్ అయిన నాకు తరతరాలుగా పేరు లేదు.
నేను ఎవరిని ? తత్ అయిన నా పేరు ఏమిటి?!
నిశానుల కుటుంబములో పుట్టిన పెదబాబుకు భాష అంతగా రాదు.
కవి కాదు.
అర్ధము కాని దానిని పది పదిమార్లు ప్రశ్నించి..యోచించి.. విచారణ చేయుట వాడి గుణం.
మనసు ని మధించుకునే తీవ్ర లక్షణం.
అంతరార్ధ సత్వ సాధన వాడి ధ్యేయము.
విత్తనం – మొక్క – పునర్జన్మకు కారణం.
వారసత్వము, సాంప్రదాయాలు?
– తత్వాలకు కారణం.
సత్యం ఎదుట నిలుస్తోంది..
జవాబు తెలుసుకోమంటోంది.
మనలోని తత్ కు మూల కారణము – తల్లితండ్రులు.
అదే వాళ్ళ పునర్జన్మం.
పెదబాబు లోని తత్ నా మొదటి పునర్జననం.
ఇప్పుడు నిజం వెలుగౌతోంది..
నేను ఇప్పటికి మూడు తరాలలో నా పంతొమ్మిది పునర్జన్మలు అయినవి.
పెదబాబు లోని తత్ అయిన నా ముఖ్య లక్షణము విచారణ.
వాడు నాకు పెట్టిన పేరు ‘ఆనంద సాగర విచారణ చూడామణి.’
నిజం నిజం..
ఒక నిజాన్ని చెప్పాలనుంది.