[dropcap]”చి[/dropcap]న్నీ! ఇంకా ఎవరైనా ఉన్నారా?”, గట్టిగా పిలిచింది డాక్టర్ రజనీ దేవి. సుమారు 20 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న పేరున్న గైనకాలజిస్ట్ ఆవిడ. కొంతకాలం భారత్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్‌గా ఉండేది, ఆ తరువాత రిజైన్ చేసి, సొంతగా ప్రాక్టీస్ పెట్టింది. ఓపిక ఎక్కువ. హస్తవాసి కూడా బాగుండడంతో ప్రాక్టీస్ బాగుంటుంది. వృత్తితో పాటు మహిళా సాధికారతకు గ్రూపులతో పని చేయడం, సమస్యలు ఉన్న ఆడవారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలా రకరకాల పనులతో రజని ఎప్పుడూ బిజీగా ఉంటుంది.
“అందరూ అయిపోయారమ్మా” లోపలికి వచ్చి చెప్పింది చిన్ని. “అయితే, ఇంక లైట్లు ఆపు చేసి తలుపులు వేసేయ్” అంది రజనీదేవి, బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ. 30 సంవత్సరాల ప్రొఫెషనల్ లైఫ్ దాని ప్రభావాన్ని శరీరం మీద చూపిస్తున్నట్టే ఉంది, తొందరగా ఇంటికి వెళ్లి పడుకోవాలి అనుకుందావిడ.
ఇంతలో, చిన్ని లోపలకు వచ్చి,”ఎవరో ఒక జంట వచ్చారమ్మ” అంది.
” రేపు రమ్మని చెప్పకపోయావా?”
“చెప్పానమ్మా! మీకు తెలిసిన వాళ్ళట, అర్జెంటుగా మీతో మాట్లాడాలి, అంటున్నారు” చిన్ని చెప్పింది. అయిష్టంగానే, “సర్లే! రమ్మను.” అంది రజనీదేవి కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ.
లోపలకు వచ్చి ఆవిడకి నమస్కారం చేసిన ఆ యువ జంటను పలుకరిస్తూ, “హలో శ్రీరామ్! హాయ్ శృతి. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైస్?” అంటూ రజనీ వాళ్ళని కూర్చోమని సైగ చేసింది.
“ఏంటమ్మా! శృతి, పీరియడ్స్ మిస్ అయ్యావా?” ఆప్యాయంగా అడిగింది రజిని.
“లేదాంటీ! వేరే విషయం గురించి, మీతో…” అని నసిగింది ఆ అమ్మాయి.
“సరే, మీ ఆయనను బయటికి పంపించమంటావా?” అంది.
“వద్దు ఆంటీ! ఇద్దరం కలిసే మాట్లాడదాం అనుకుంటున్నాము.” అంది శృతి.
***
వాళ్ళిద్దరూ పుట్టినప్పటినుంచి రజనీకి తెలిసిన వాళ్లే. నిజానికి వారి తల్లులకు ఆవిడే డెలివరీ చేసింది. చిన్నప్పుడు చాలాసార్లు ట్రీట్ చేసింది. వాళ్ళ పెళ్ళికి అటెండ్ అయింది. పెళ్లయిన ఆర్నెల్లు, ఏదో మంచి విశేషమే ఉండాలి అనుకుంటూ ఉంది… రజనీదేవి.
ఇద్దరూ హైటెక్స్ వద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. చూడడానికి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ కపుల్ లాగానే ఉంటారు.
శ్రీరామ్ శృతిల తండ్రులిద్దరూ అప్పట్లో బి ఏ ఎల్ లో పనిచేసేవారు.
శ్రీరామ్ తల్లి లలిత. తండ్రి దశరథ్. లలిత కొన్నాళ్ళు టీచర్‌గా పని చేసి, రెండవ కాన్పుకు సుస్తీ చేయడంతో, ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉండి పోయింది. పిల్లలు ప్రొఫెషనల్ కాలేజీలకు వెళ్ళాక మళ్లీ ఇంటి దగ్గర ట్యూషన్స్ చెపుతోంది. శ్రీరామ్ అక్క పేరు అనూష. ఆమె కూడా ఎంబీఏ దాకా చదివి ప్రైవేట్ జాబ్‌లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ఆ అమ్మాయికి పెళ్లై మూడేళ్లు.
ఇంక శృతి మాటకొస్తే, తండ్రి జానకి రావు, తల్లి సుగుణ. ఒక అక్క ఉంది. పేరు లయ. ఇద్దర్నీ బీటెక్ చేయించారు జానకి రావు, సుగుణలు. పెద్ద పిల్ల లయ బెంగుళూరులో ఉద్యోగంలో జాయిన్ అయిన ఆరు నెలలకే తన సహోద్యోగి ఆదిత్య అనే అబ్బాయినే, చేసుకుంటానని పట్టుబట్టి, తల్లిని తండ్రిని ఒప్పించి సాధించుకుంది.
తండ్రులిద్దరూ కొలీగ్స్ కావడం వలన ఆ కుటుంబాల మద్య మంచి మైత్రి ఉండేది. రాకపోకలు ఎక్కువగానే ఉండేవి. కష్టసుఖాల్లో రెండు కుటుంబాల మధ్య ఎంతో సామరస్యం ఉండేది.
శ్రీరామ్, శ్రుతి ఒకే ఈడు వారు. స్కూల్ వేరే అయినా వాళ్ళ మధ్య సహజంగా కాంపిటీషన్ ఉండేది. కలిసినప్పుడు సుగుణ, “నీకు క్వార్టర్లీ పరీక్షల్లో ఎంత పర్సంటేజీ వచ్చింది?” అని అడిగేది. తన కూతురు శృతి కంటే ఎక్కువ వస్తే ఇంటికెళ్ళి కూతుర్ని ఇంకా చదవమని పోరేది. లలిత కూడా అంతే. శృతి కనపడితే అన్ని సబ్జెక్ట్స్‌లో మార్కులను వివరంగా అడిగి తెలుసుకుని, కొడుకుని మందలించి, “వాళ్ల శృతి చూడు! ఆడపిల్లయినా చక్కగా చదువుకుంటుంది!” అంటూ సాయంత్రం పూట, తన ట్యూషన్ లోనే పెట్టి, తోమేసేది.
ఈ పోటీ వాళ్ళు ఇంజినీరింగ్‌కి వచ్చాక కూడా వదల్లేదు. డిగ్రీ అయిపోయాక ఇద్దరికీ చెరో కంపెనీలో క్యాంపస్ సెలెక్షన్లు వచ్చాయి. శృతికి ఉద్యోగం వచ్చిన ఆరు నెలలకే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు, జానకి రావ్- సుగుణ. పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం కనుక, శృతి కైనా తమకు నచ్చిన సంబంధం చేయాలని ఒక ఉబలాటం. ఓ రెండు మూడు సంబంధాలు వచ్చాయి ఏవో కారణాల వల్ల కుదరలేదు.
ఇంతలో స్నేహితులతో పనిచేసే మరొక కొలీగ్ సుబ్బారావు సూచన మేరకు, మాట్లాడుకుని, తమ ఇంట్లో సంప్రదించి, పిల్లలతో కూడా మాట్లాడి, శ్రీరామ్‌కి, శృతికి పెళ్ళి జరిపించి చేశారు.
చిన్నప్పట్నుంచి సదభిప్రాయం తోటే ఉండడంతో శ్రీరామ్ శృతి చాలా ఈజీగా కలిసిపోయారు. పెద్ద పెద్ద మార్పుల బదులు వడ్డించిన విస్తరిలా జీవితం ఉందని రిలీఫ్ పొందారు. హైటెక్స్‌కి దగ్గరగా ఫ్లాట్ తీసుకుని, కాపురం పెట్టుకున్నారు
జీవితం హాయిగా సాగిపోతోంది. అన్ని వేళలా హాయిగా సాగిపోతే అది జీవితం ఎలా అవుతుంది?! అవును. వాళ్ళ సంసారంలో కొద్దిపాటి కదలికలు వచ్చాయి.
***
కొత్తగా పెళ్లైన జంట, వీకెండ్లో ఒక్కోసారి వాళ్ల పుట్టింటికి, మరోసారి వీళ్ళ పుట్టింటికి వెళ్లేవాళ్లు. ఒకోసారయితే ఎక్కడికి వెళ్ళకుండా ఇద్దరు కలిసి ఇంట్లో గడిపేవారు. అప్పుడప్పుడు స్నేహితులతో ట్రిప్స్ కూడా వెళ్ళి వచ్చేవారు.
పెళ్లి అయిన మూడు నెలలకు వచ్చిన ఒక పండగకి ఇద్దరూ శ్రీరామ్ ఇంటికి వెళదామని తయారౌతుండగా, అంతలో శృతి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, శృతి తల్లికి జ్వరం గా వుందని. భార్యని క్యాబ్‌లో పుట్టింటికి పంపించేసి, శ్రీరామ్ ఒక్కడూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. భోజనాల దగ్గర, “మీ ఆవిడకి అప్పుడే అత్తారిల్లు బోర్ కొట్టేసిందా?” అంది అక్క అనూష. బెంగళూరు నుంచి ఆవిడ మటుకు తల్లి దగ్గరికి రావచ్చు! శ్రీరామ్‌కు ఎక్కడో మనసులో చురుక్కుమంది.
“అదేం లేదు లేవే” అన్నాడు.
ఇంకొంచెం చికెన్ వడ్డించుకుంటూ, “కొత్త భార్యను, కొత్త గుర్రాన్ని ఎంత తొందరగా కంట్రోల్లోకి తెచ్చుకుంటే అంత మంచిది” అన్నాడు బావ ఉచిత సలహా పారేస్తూ. ప్రేమ వివాహం పేరుచెప్పి పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ, ప్రతి పండగకి అత్తారింటికి వచ్చి వాలిపోయి కావలసిన కానుకలను గంపలో పట్టుకు పోయే బావ మాటలు శ్రీరాముని కలవరపెట్టాయి.
పండగ రోజున అందరూ తలంటు పోసుకుని కొత్తబట్టలు కట్టుకున్నారు. తల్లి అడిగింది, “ఏరా శృతికి బట్టలు కొన్నావా?”
“ఆ! కొన్నానమ్మా!” అన్నాడు శ్రీరామ్.
“మీ అత్తగారు ఇంకా కూతుర్లతో సమానంగా డ్రెస్సులు వేసుకొని తిరుగుతోందా?” అంది కాస్త వెటకారంగా. “అలా ఏం కాదులే! ఆవిడ కాలేజీకి టూవీలర్ మీద వెళ్తుంది కదా! చీర కన్నా డ్రెస్ అయితే వీలుగా ఉంటుందని” అన్నాడు శ్రీరామ్
“అబ్బా! చూడవే, అత్తగారినెలా వెనకేసుకు వస్తున్నాడో మన శ్రీరామ్!” అంది అనూష.’ ఇదెక్కడి ర్యాగింగ్ రా బాబు!” అనుకున్నాడు శ్రీరామ్ మనసు చివుక్కుమనగా.
ఇలాంటి సీనే శృతి ఇంట్లో కూడా జరిగింది “మీ ఆయన రాలేదా, శృతీ?” అడిగింది వాళ్ళ అక్క లయ.
“లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు” అని శ్రుతి చెప్పింది.
“ఏం పాపం! అత్తగారికి ఒంట్లో బాలేకపోతే చూడ్డానికి రాలేనంత బోర్ కొట్టేసిందా?” అని రాగం తీసింది. ఏమీ సమాధానం చెప్పలేక ఊరుకుంది శృతి.
శ్రీరామ్, శృతి తమ ఫ్లాట్‌కు వచ్చేశారు. జరిగినది అరమరికలు లేకుండా చెప్పుకున్నారు. కొంచెం మూడ్ ఆఫ్ అయ్యింది ఇద్దరికీ. ఆ తరువాత ఇలాంటి సంఘటనలు మూడు నెలల పాటు ఇంకొన్ని జరిగాయి. ఇద్దరి మనసుల్లో ఎదుటి వారి కుటుంబం గురించి తెలిసో, తెలియకో ఒక దూరం, చేదుదనం వచ్చేసాయి. నెమ్మదిగా మాటా, మాటా పెరగసాగింది. ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు వెనకేసుకు రావడం మొదలుపెట్టారు. తమలో కూడా ఏదో తెలియని స్తబ్ధత చోటు చేసుకోసాగింది.
బాగా తెలుసున్న మనిషే పరాయి అయిపోతుంటే ఇద్దరికీ తోచలేదు. కొద్దిరోజుల మౌనం తర్వాత దాదాపు ఇద్దరికీ ఒకేసారి, ఒకే ఐడియా వచ్చింది, కౌన్సిలింగ్ తీసుకోవాలని.
ఆ తరుణంలో వాళ్ల గుర్తుకు వచ్చిన వ్యక్తి డాక్టర్ రజనీ దేవి. వ్యక్తిగతంగానూ, కుటుంబ పరంగా కూడా వాళ్ళిద్దరికీ రజనీదేవి సుపరిచితురాలే. ఉన్న వాళ్ళలో, కాస్త పెద్ద దిక్కు ఆవిడే అని, తమ సమస్యకు పరిష్కారం అడుగుదామని కలిసి వచ్చారు.
***
ఒకరి తర్వాత ఒకరు చెప్పిందంతా విని దీర్ఘంగా నిట్టూర్చింది రజని. పక్కనే ఉన్న హాట్ జగ్గులో ఫ్రెష్ గా, వేడి నీళ్లు పెట్టి, లిప్టన్ లెమన్ చాయ్ తన చేతులతో తానే కలిపింది రజనీదేవి. ఇద్దరు పిల్లలు బరువు తగ్గిన తరువాత వచ్చిన అలసటతో ఆవిడ ఏం చెప్తారో అన్న ఆసక్తితో కూర్చున్నారు. కాసేపు పిచ్చాపాటీ కబుర్లు చెప్పి, టీ కప్పుల్లో పోసి, మళ్లీ కూర్చుంది రజని.
“సో!! మీ ఇద్దరికీ ఏం జరుగుతోందో బాగానే అర్థమైంది. ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్.!” ఒక నిట్టూర్పు విడిచి, “చెప్పాలంటే మా బ్యాచ్‌కి రెండు మూడేళ్ల ముందు నుంచి ఎంట్రన్స్ పరీక్షలు మొదలయ్యాయి. మెడికల్ ఎంట్రెన్స్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ అంటూ. తర్వాత కొన్నాళ్ళకి రెండు కలిపి ఎంసెట్ అన్నారు.ఇప్పుడు నీట్,ఐఐటీ అంటున్నారు. మీ తరం పిల్లలకు స్కూల్ అడ్మిషన్ దగ్గర్నుంచి ఉద్యోగం వరకు అన్నీ ఎంట్రన్స్‌లే.
అంతా కాంపిటీషనే. మనలాంటి మరో పది మందిని వెనక్కు తోస్తే తప్ప మనం ముందుకు వెళ్లలేనంత ప్రచ్ఛన్న యుద్ధం. ఈ జీవితకాలపు యుద్ధం కోసం మిమ్మల్ని తయారుచేస్తూ మీ, మీ తల్లిదండ్రులు కూడా ప్రతి విషయంలో పోరాట స్ఫూర్తితో పెంచారు. అదేంటో తెలుసా? ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రతి విషయంలో తమ పిల్లలదే పైచేయిగా ఉండాలని ఆశ. అలా ఆశల వలయంలో చిక్కుకున్న తల్లిదండ్రులు వాస్తవాన్ని గ్రహించకపోవడం చాలా దురదృష్టం”.
శ్రీరామ్,శృతీ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో అర్థమైనట్టే అందరి ముఖాల్లో కాస్త చిరునవ్వు వచ్చింది.రజనీ దేవి రిమోట్ తో రూమ్ టెంపరేచర్ ఎడ్ జస్ట్ చేసింది.
“సంసారం అనేది ఒక పోటీ పరీక్ష, ఒక కాంపిటీషన్ కాదు. ఒకరు గెలిచి, ఒకరు ఓడిపోవడానికి. అదేమీ గేమ్ కూడా కాదు. ఒకరికొకరు కాంపిటీషన్ రావడానికి.
భార్య, భర్త మధ్య నిజానికి పోటీ ఉండదు. గెలిస్తే ఇద్దరూ గెలుస్తారు, లేకపోతే ఇద్దరూ ఓడిపోతారు. భార్యగానీ, భర్తగానీ తాను గెలిచి తన భాగస్వామి ఓడిపోయారని భావిస్తే, అది ఆత్మవంచనే ఔతుంది. తెలివితేటలతో భార్య భర్తనో, భర్త భార్యనో గెలవడానికి ఇదేమన్నా ఐక్యూ టెస్టా??
మన మనసుకు పరీక్ష. జీవితాన్ని పంచుకోవడానికి మనతో పాటుగా బ్రతకడానికి వచ్చిన వ్యక్తిని ప్రేమతో ఆకట్టుకోవాలి గానీ, తెలివి, డబ్బు, బలం కొలబద్దలు కావు” చిన్ని తలుపు తీసి తొంగి చూసింది. రజనీదేవి సైగ చేసింది, కాసేపు ఆగమన్నట్టు.
తనను తాను తమాయించుకుంటూ, రజని మళ్లీ అంది…”ఈ విషయంల, మీ ఇద్దరి తల్లిదండ్రులూ చేసిన తప్పు కూడా పెద్దగా లేదు. ఈ పోటీ ప్రపంచంలో మీ మీద ఉండే అతి ప్రేమతో, మీదే పైచేయిగా ఉండాలన్న భావన, ఇదిగో నా చేతిలో రిమోట్ లాగా వాళ్ళని లోపల్నుంచి కంట్రోల్ చేస్తోందన్న మాట” అందరూ నవ్వుకున్నారు.
“కనుక నా సలహా అంటూ చెప్పాలంటే, ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ఇలాంటి వాతావరణానికి దూరంగా ఉండటం! వీలైతే, మరో సిటీకి జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓ పిల్లో, పిల్లాడో పుట్టాక సెటిల్ అవుతారు. మిమ్మల్ని మీరిద్దరూ ముందు బాగా అర్థం చేసుకోండి. ప్రేమ ఎప్పుడూ కండిషన్స్ మీద కాదు, నమ్మకం మీదే పెరగాలి. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది.”
“ఈ చిన్న చిన్న సంఘటనలను బేస్ చేసుకుని మీ పెద్దవాళ్లతో, తోబుట్టువులతో ఉన్న బంధాలను, ఆప్యాయతని పాడు చేసుకోకండి. హేపీగా సర్దుకోవడానికే ప్రయత్నించండి. అలా అని లాంగ్ డిస్కషన్స్ చేసుకోకండి. యూ నీడ్ ఏ బ్రేక్!” నవ్వింది రజనీ దేవి. “బ్రేక్, అంటే విడిపోవడం కాదు. మీ ఇద్దరికీ స్పెషల్ గా ఈ కలుషిత వాతావరణం నుంచి బ్రేక్…”
శ్రీరామ్, శ్రుతి ఇద్దరూ హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా చూసుకున్నారొకరి వంక మరొకరు. సంతోషంగా లేచి నిలబడ్డారు. అంతసేపు ఓపిగ్గా మాట్లాడుతూ ఉన్న ఆవిడకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరారు.
వాళ్ళిద్దరి మనసును తేలిక పడ్డాయి అన్న విషయం ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా వేస్తున్న వాళ్ళ అడుగులే చెబుతున్నాయి. తప్పకుండా ఆనందం దిశగానే అవి అనిపించింది రజనీదేవికి.
***
సరిగ్గా 25 ఏళ్ల క్రితం, తనకి ఇలాంటి సరైన సలహా ఇచ్చే వాళ్ళు లేక, భర్తతో వచ్చిన చిన్న అభిప్రాయ భేదాలను చేసుకొని కోర్టుకెక్కి విడాకులు తీసుకొని ఒంటరిగా మిగిలిపోయింది తాను. అతడు మటుకు మరొక పెళ్లి చేసుకుని పెళ్ళాం, పిల్లలతో హాయిగా ఉన్నాడని తెలిసింది. మోడుగా మిగిలిపోయిన రజనీకి అప్పుడప్పుడు తన పేరులో చీకటి తన జీవితంలోకి ఇంకిపోయిందని అనిపిస్తూ ఉంటుంది.