కావ్య పరిమళం-19

0
3

[box type=’note’ fontsize=’16’] సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

రామకృష్ణుని పాండురంగ మహత్యం

[dropcap]తె[/dropcap]నాలి రామకృష్ణుడనీ, రామలింగడనే పేర్లతో రాయల కాలం తర్వాత ఉద్బటారాధ్య చరిత్ర, పాండురంగ మహత్యం కావ్యాలను ఈ కవి రచించాడు. ఘటికాచల మాహాత్యము కూడా ఈతని గ్రంథమే. 16వ శతాబ్ది వాడైన విరూరి వేదాద్రి మంత్రికి పాండురంగ మహత్యాన్ని అంకితమిచ్చాడు. తెనాలి అగ్రహారం వీరిది. సరసకవి, వికటకవి అనే పేర ఈయన చాటువులు కొన్ని లోకంలో ప్రచారంలో వున్నాయి. రాయల ఆస్థాన కవుల అష్టదిగ్గజాలలో ఇతనొకడని ప్రతీతి. అయితే రాయల కాలం నాటికి వయోరీత్యా చిన్నవాడు ఈ కవి. ఆంధ్రప్రాంతానికి చెందిన ఇతడు మహారాష్ట్రకు చెందిన పండరినాథుని ప్రశంసిస్తూ కావ్యం వ్రాయడం విశేషం. దానికి విజయనగరకాలపు ఆలయాలలో విఠలనాథుని ఆలయం ప్రసిద్ధి పొందడమే కారణం.

విరూరి వేదాద్రి మంత్రి రామకృష్ణుని ప్రశంసిస్తూ – “మహాంధ్ర కవితా విద్యాబల ప్రౌఢి నీకెదురేది? సరసార్థబోధఘటనా హేలా పరిష్కార శారద నీ రూపము రామకృష్ణ కవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా!” అన్నాడు.

ధారా రామనాథశాస్త్రి రామకృష్ణుని కవితా ప్రౌఢిని వివరిస్తూ – “కథా వ్యూహాన్ని పొరలు పొరలుగా విప్పి పరచడంలోనూ, పాత్రలను దివ్య మానుష ధ్వని సంకేతాలుగా తీర్చిదిద్దడంలోనూ, ప్రౌఢిమ, చమత్కారం, వేగము, జాతీయత మొదలైన లక్షనాలతో సంపన్నమైన శైలీ విన్యాసంలోనూ, అడుగడుగూ అనర్ఘ రత్నాల వంటి తాత్విక భావాలను వెదజల్లడంలోనూ, అన్నిటిని మించి ధ్వని మార్గంలో వేదార్థస్ఫురణ కలిగించి పాండురంగ మాహాత్మ్యాన్ని శైవ వైష్ణవ శాక్తేయాగమసారంగా దర్శించడంలోనూ ‘నీకెదురేరి’ అనిపిస్తాడు” అన్నారు.

రామకృష్ణుని పదగుంఫనం ప్రసిద్ధం. వ్యర్థ పదాలకు స్థానం లేదు. భాశా ప్రయోగంలో ఘనుడు. అందుకే కాకుమాను మూర్తి కవి “పాండురంగ విభుని పదగుంఫనం” అని ప్రశంసించాడు.

ఆరుద్ర అంటారు – “మారుమూల పదాలను, ఔచిత్యం లేని సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయత ఉట్టిపడేలా తెలుగు పదాలు జోడించి సమాసాలు కట్టడం అతనికే తెలుసు.” విశ్వనాథ వారు శైలీ నిర్మాణంలో పాండురంగ మహత్యం ‘కైలాస శిఖరం’ వంటిదన్నారు.

కవి ‘నేను రామకృష్ణుడ’నని జయభేరి మ్రోగించాడు. పండితలోకంలో ఈ కావ్యానికి పంచకావ్యాలలో స్థానం లభించింది. ఈయన పద్యాలు అనేక లక్షణ గ్రంథాలలో ఉదహరించబడ్డాయి. ఎమెస్కో వారు 2009లో దీనిని ‘సంప్రదాయ సాహితి’లో భాగంగా విశ్వనాథ సత్యనారాయణ విపుల పీఠికతో ప్రచురించారు. ఇతనికి ముందు కాలాల్లో కూడా కాళహస్తి మాహత్యం వంటి స్థల పురాణగాథలు కావ్యాలుగా వచ్చాయి. సంస్కృతాంధ్ర భాషలలో రామకృష్ణుడు సమఉజ్జీ. వేదాద్రి మంత్రి రామకృష్ణునకు తాంబూలమందించి ఈ కావ్యం వ్రాయమని అర్థించాడు. పుండరీకుడనే భక్తుని పేరుతో ఒక క్షేత్రం వెలిసింది. సాధారణంగా భగవంతుని పేర క్షేత్రాలుంటాయి.

కథా సంవిధానం:

పూర్వం కాశీపట్టణంలో అగస్త్య మహర్షి నివసించేవాడు. ఆయన వింధ్య పర్వతం పెరగకుండా దాని పొగరు అణచడానికి కాశీ నుండి దక్షిణాదికి వచ్చాడు. శ్రీనాథుడు కాశీఖండంలో ఆ వివరాలున్నాయి. ఆయన దక్షిణ దేశంలో కుమారస్వామి ఉండే స్వామిమలకు భార్యాసమేతంగా వచ్చాడు. అక్కడ స్కందుడు తాను వ్రాసిన స్కాంద పురాణం అగస్త్య దంపతులకు, ఇతర ఋషులకు వినిపించాడు.

అగస్త్యుడు స్కందుని కో ప్రశ్న వేశాడు: “స్వామీ! ఒక దైవం, ఒక నది, ఒక క్షేత్రం కలిసి ప్రధానంగా వుండే ప్రదేశం ఎక్కడైనా వుందా?” అన్నాడు. మా తండ్రిగారి నడుగుదామని వారందరూ కైలాసంలో వున్న పరమశివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో ఆదిదంపతులు వనవిహారం చేస్తున్నారు. వీరందరు సందేహం శివునికి వెలిబుచ్చారు. పరమశివుడు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించి కథ చెప్పడం ప్రారంభించారు. ఈ కథ 192 కోట్ల సంవత్సరాలకు పూర్వం తొలి మనువు కాలంలో జరిగింది. ఈ కావ్యం ఐదాశ్వాసాలలో కొనసాగింది.

పుండరీకుని తపస్సు:

పుండరీకుడు తల్లిదంద్రుల సేవాతత్పరుడు. శ్రీకృష్ణుని భక్తుడు. ఆయన ధ్యానిస్తే చేతిలో వెన్నముద్ద పట్టుకొన్న బృందావన సంచార కృష్ణుడు ఆయన మనసులో వచ్చి తిష్ఠ వేస్తాడు. అదే విధిగా తపస్సు చేస్తున్న పుండరీకుని ప్రత్యక్షమైనాడు. “నీ పితృభక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో” మన్నాడు.

‘కృష్ణా! నీ విక్కడే వుండిపోయి, నా పేర తీర్థం వెలసేలా వరం ఇమ్మ’న్నాడు. స్వామి చిరునవ్వులు చిందిస్తూ ‘తథాస్తు’ అన్నాడు. అప్పటి నుండి ఆ క్షేత్రానికి పౌండరీకమనే పేరు వచ్చింది. అక్కడి నదికి, స్వామికీ అదే పేరు. అక్కడ్ ఒక గోపిక వొళ్ళు మరిచి శ్రీకృష్ణుని ధ్యానించి ప్రత్యక్షం చేసుకొంది. వొంటి మీద బట్టలు కూడా లేని స్థితి ఆమెది. ఈశాన్య దిక్కులో ఆ క్షేత్రంలో ఆమె విగ్రహం ఆరాధించబడుతోంది. ఈ కథను శివుడు పార్వతికి చెప్పగా కుమారస్వామి వినెను.

నిగమశర్మ:

తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన పాత్ర నిగమశర్మ. క్షేత్ర మాహత్యాన్ని శివుడు నారదునకు వివరిస్తూ ఈ కథ చెప్పాడు. శ్రీనాథుని కావ్యాలలో గుణనిథి, సుకుమారుడు, రామకృష్ణుని నిగమశర్మ, కందుకూరి రుద్రకవి నిరంకుశుడు – ఇంకా మందేహాదులు సమఉజ్జీలు. ధూర్తులై సంచరించినా చివరకు వారి అంత్యదశలో లవలేశ పుణ్యం వల్ల భగవదనుగ్రహం పొందారు వారు.

కళింగ దేశంలో పీఠికాపురంలో నైష్ఠిక బ్రాహ్మణ కుటుంబంలో లేక లేక కన్న సంతానంగా నిగమశర్మ పుట్టాడు. వేదాది విద్యలు చదివిన అందగాడు. పెద్దలు పెళ్ళి చేశారు. అతను వేశ్యాలోలుడై ఇల్లు వదిలి తిరగసాగాడు. తాతతండ్రులు సంపాదించిన ఆస్తి ఇష్టానుసారం వారి కోసం ధారపోశాడు. ఊరంతా అప్పులు చేశాడు. దౌర్భాగ్యుడయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న అతని అక్క (ఆమెకు కవి పేరు పెట్టలేదు) పొరుగూరి నుండి పిల్లాజెల్లాతో వచ్చి ఇల్లు చక్కబెట్టింది. ఏదో మిష మీద నిగమశర్మ ఇంటికి వచ్చాడు. అక్కయ్య వానికి తలంటు పోసి, భోజనం పెట్టి, తమ్మునికి హితబోధ చేసింది. కవి అద్భుతమైన పద్యాలు వ్రాశాడు.

“ప్రారంభించిన వేదపాఠమునకున్ ప్రత్యూహమౌనంచునో
ఏరా తమ్ముడ! నన్ను చూడ చనుదో వెన్నాళ్ళనో యుండి చ
క్షూ రాజీవయుగంబు వాచె నిను గన్గోకున్కి; మీ బావయున్
నీ రాకల్ మదిగోరు చంద్రుపొడుపున్ నీరాకరంబున్ బలెన్.”
(పాండు – మూడవ ఆశ్వాసం – 33)

బ్రహ్మ దగ్గర నుండి మన తరం దాకా పవిత్రమైన మన వంశాన్ని గుర్తు పెట్టుకోరా! నీ శీలం పిల్లి శీలమైంది! బంగారం వంటి భార్య వుంటే నీ ఎంగిలి కుండ లెందుకురా?” – అని మందలించింది.

వాడు కొన్నాళ్ళు సరిగా నడచుకొని ఒక రోజు రాత్రి ఇల్లు తుడిచిపెట్టినట్లుగా గుల్ల చేసి సొమ్ముతో పారిపోయాడు. ఇంట్లో అందరూ భోరుమని ఏడ్చారు – నగలు పోయాయని. అతడు అడవి దారిలో పోతుండగా దొంగలు పట్టుకొని చావగొట్టి సొమ్ముతో పరారయ్యారు. చావు బ్రతుకులతో వున్న నిగమశర్మను ఒక కాపు బ్రతికించాడు. కాపు భార్య వెర్రివేషాలు వేసి నిగమశర్మతో సంబంధం పెట్టుకొంది. ఇద్దరూ చెడిపోయి ఒకనాటి జాతర సమయంలో లేచిపోయారు.

పొరుగూరులో కాపురం పెట్టి మద్యమాంసాలు సేవిస్తూ బోయ కులంలో కలిసిపోయారు. కొంతకాలానికి కాపు కోడలు చనిపోతుంది. నిగమశర్మ మరొక కడయింటి పడుచును పెండ్లాడి సంతానం పొందాడు. ఒకనాడు వారందరూ అగ్నికాహుతి అయ్యారు. భార్యావియోగంతో వాడు పాండురంగ క్షేత్రంలో గతించాడు. ఆ క్షేత్ర మహత్యం వల్ల విష్ణులోక ప్రాప్తి పొంది కుముదుడనే పేర నిలిచాడు.

రాధ కథ:

ఈ కావ్యంలో మరికొన్ని కథలున్నాయి. అందులో రాధాదేవి కథ, సుశీల కథ, హంస, పాము, చిలకల వృత్తాంతం, అయుతునియతుల గాథ వివరంగా చెప్పబడ్డాయి.

నందునికి దగ్గర చుట్టం శతగోపుడు. అతని కూతురు రాధ. ఆమె చాలా సౌందర్యవతి. కృష్ణుడు ఆ సమయంలో గోపికల వెంటబడి తిరుగాడుతున్నాడు. రాధ స్వామి కంటబడినది మొదలు ఆమె కోసం తపించాడు. రాధ స్వామి కోసం తపస్సు చేసింది. స్వామి ప్రత్యక్షమై శివుడు పార్వతిని స్వీకరించినట్లు రాధను ప్రేమతో స్వీకరించాడు.

సుశీల కథ:

శ్రీకృష్ణుని శిరస్సుపై పాలధార వదిలిన ఒక ఆవు మరుజన్మలో వైష్ణవ కుటుంబంలో సుశీలగా జన్మించింది. సుశీల భర్త కర్కోటకుడు. హింసలు పెట్టేవాడు. ఆమె సుగుణశీల. భగవంతుడామెను పరీక్షింప నెంచి బ్రహ్మచారి వేషంలో వచ్చి ‘ఆకలి వేస్తోంది! అన్నం పెట్ట’మని గోల చేశాడు. ఇంట్లో వున్న పదార్థాలన్నీ వడ్డించినా తృప్తి పడలేదు. చివరకు భగవంతుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. భర్త మర్యాదగా ప్రవర్తించసాగాడు. వారికి నలుగురు కొడుకులు పుట్టారు. ఆమె చివరి దశలో ముక్తిని పొంది భర్తతో కుడా విమానంలో వైకుంఠం చేరింది.

అయుత నియతుల కథ:

అగస్త్య మహర్షికి కాశీ క్షేత్రంలో ఇద్దరు శిష్యులుండేవారు. వారికి యోగ్యురాండ్రను తెచ్చి పెళ్ళి చేయాలని మహర్షి సంకల్పించి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి గాయత్రి, సావిత్రి – అనే పిల్లలను తెచ్చాడు. అయుతుడు తనకు పెళ్ళి వద్దని భీష్మించుకున్నాడు. నియతునికిచ్చి ఇద్దరు పిల్లలకూ పెళ్ళి జరిపించాడు మహర్షి.

అయుతుడు మోక్షం కోరి హిమాలయాలలో తపస్సు చేశాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తనతో ఒక ఆవును, దూడను తీసుకొచ్చాడు. ఆవును అక్కడ వదిలిపెట్టి, ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాడు. ఆ ఆవు సంరక్షణలో అయుతుని తపోభంగమైంది. ఆ ఆవు వాధూల ముని పుట్టను తొక్కి పాడుచేసింది. ఆయన అయుతునికి శాపమిచ్చి, కప్పగా పడి యుండమన్నాడు. చివరకు కప్పలతో సంసారం చేసి వాటి వలన సంతానం పొంది శాపవిముక్తి పొందాడు.

ఈ విధంగా తెనాలి రామకృష్ణుడు ఆయా కథా సౌగంధ్యం ద్వారా కావ్యాన్ని సురభిళభరితం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here