‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-12

0
3

[dropcap]రై[/dropcap]లు మొఘల్‌సరాయ్ జంక్షన్‌లో ఆగుతుంది. లేడీ టీచరు తలుపుదగ్గరకొచ్చి నిల్చుంటే కొందరు ముస్లిం మహిళలు వచ్చి ఆమెను తప్పుకోమంటూ ఆ బోగీలికి హడావిడిగా ఎక్కుతారు. రైలు కూత పెట్టగానే టీచరు కూడా ఎక్కి లోపలికి కదులుతుంది. ఎక్కినవాళ్ళు టీచర్ గారి వివరాలు అడిగితే, ఆమె అక్కర్లేని మాటలు చెబుతుంది.

అంతగా చదువుకోని, గ్రామీణ మహిళల సహజ ఉత్సుకత, బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ రిజర్వుడ్‌గా ఉండే పట్టణ నేపథ్యపు మహిళల మధ్య ఉండే తేడాని ఈ సన్నివేశం కళ్ళకు కడుతుంది.

***

రైలు జమాల్‌పూర్ జంక్షన్‌లో ఆగుతుంది. మళ్ళీ బయలుదేరుతుంది. కొందరు కుర్రాళ్ళు రన్నింగ్‌లో ఎక్కుతారు. ఫస్ట్ క్లాస్ బోగీలో ఎక్కి నాయర్ కూపేలో బలవంతంగా కూర్చోడానికి ప్రయత్నిస్తే నాయర్ వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళు ఇంకొందరు కలిసి లేడీ టీచర్ ఉన్న కూపేలోకి దూరడానికి ప్రయత్నిస్తారు. ఆడవాళ్ళు తలుపులు వేసేసుకుంటారు. కుర్రాళ్ళంతా గోల గోల చేస్తూ, తాము స్థానికులమంటూ… తాము ఎక్కడైనా కూర్చుంటామని, ఏ రైలైనా ఎక్కుతామని కేకలుపెడుతూ మళ్ళీ నాయర్ దగ్గరకొస్తారు. కూపేలో ఉన్న కొత్త దంపతుల గురించి అసభ్యంగా మాట్లాడుతారు. నాయర్ వాళ్ళకి నచ్చజెప్పి పంపించబోతే, వాళ్ళు మరీ రెచ్చిపోతారు. పక్క కూపేలో ఉన్న ముస్లిం వ్యక్తి తర్వాతి స్టేషన్‌లో రైలు ఆగగానే పరిగెత్తుకెళ్ళి స్టేషన్ మాస్టర్‌కి ఫిర్యాదు చేస్తాడు. స్టేషన్ మాస్టర్ తర్వాతి స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ సిబ్బంది ఆ రైలెక్కే ఏర్పాటు చేసి, ప్రస్తుతానికి ఆ బోగీల్లోకి టిటిఇని పంపిస్తాను అని చెబుతాడు. కాలేజీ స్టూడెంట్ల అల్లరి బాగా ఎక్కువైపోతోంది అంటూ వాపోతాడు.

రైళ్ళలో ఇలాంటి అల్లర్లు చూడని ఈ తరానికి ఇది కొత్తగా అనిపించవచ్చు. కాని 80వ దశకంలో మొఘల్‌సరాయ్ జంక్షన్ ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు చాలా సాధారణంగా జరిగేవట.

అప్పుడూ, ఇప్పుడూ నోరున్నవాడిదే రాజ్యమనేది ‘మూకస్వామ్యం’లో బాగా కనబడుతుంది.  “Men are cruel, but Man is kind” అని రవీంద్రనాథ్ టాగోర్ చెప్పిన మాటలు ఎంతో నిజం. ఒక్కడే ఉంటే ఎంతో దయగా, సౌమ్యంగా ఉండే వ్యక్తి, మూకలో చేరితే… మారిపోతాడు… క్రౌర్యం పూనుతాడు.

***

రైల్వే పోలీసులు, సిబ్బంది పూనుకుని రైలుని మధ్యలో ఆపి అల్లరి కుర్రాళ్ళను దింపేస్తారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

ఇంతలో ఒక బీదమహిళ టీచరున్న కూపేలోకి వస్తుంది. తన వద్ద టికెట్ లేదని, తాను రూంగియా వెళ్ళాలని, టిటిఇ వస్తే సాయం చేయమని టీచరుని బ్రతిమాలుతుంది. సరే ఇక్కడ కూర్చో అంటుందామె. ఇంతలో మిగతా ఆడవాళ్ళంతా లోపలికి వచ్చి ఆ బీదరాలుని ఇక్కడ కూర్చోమన్నందుకు ఆక్షేపిస్తారు. తీవ్రమైన వాదన అనంతరం వాళ్ళు ఆమెని బయటకు పంపించేస్తారు.

ఆమె ఇంకో బోగీలోకి వెళ్తుంది. టిటిఇ కనబడగానే, అతను చూడకుండా మరో బోగీలోకి వెళ్ళిపోతుందామె.

రైలు తన ప్రయాణాన్ని కొనసాగించి మాల్దా స్టేషన్‌లో ఆగుతుంది. లేడీ టీచర్ ఇక్కడ దిగిపోతుంది. రైలు ముందుకు సాగుతుంది.

***

ఆ బీదరాలు నాయర్ ఉన్న కూపేలోకి వస్తుంది. టిటిఇ అభ్యంతరం చెప్తాడు. ఆమె ఏడుస్తుంది. కొత్త దంపతులు ఆమెని వదిలేయమని అడిగితే, “ఇలా ప్రయాణించడం వీళ్ళకి  మామూలే, ఈమె ఏదైనా దొంగతనం చేస్తే ఎవరిది బాధ్యత?” అంటాడు టిటిఇ.

“వచ్చే స్టేషన్‌లో దింపేస్తాను. అప్పటి దాక ఇక్కడ్నించి కదలద్దు” అంటూ ఆమెని హెచ్చరించి ముందుకు వెళ్తాడు. బీదరాలుని తల్చుకుని కొత్త దంపతులు బాధ పడతారు.

***

చీకటి పడుతుంది. కొత్త దంపతులు తాము కొన్న భోజనం తినడానికి సిద్ధమవుతారు. నాయర్‌ని కూడా తినమని అడుగుతారు. నాయర్ తాను రాసుకుంటున్నాననీ, మీరు తినేయడండని అంటాడు.

“ఏం రాస్తున్నారు?” అని ఆమె అడుగుతుంది.

“నేను అప్పుడప్పుడు నా ఆలోచనలని ఇలా రాసుకుంటాను, డైరీ లాగా” చెప్తాడు నాయర్.

“అయితే మీరు కూడా నాలాగ రచయిత అన్నమాట” అంటారు మాధవ్ ప్రసాద్.

“కాదు. నేను ప్రచురించడానికి రాయను. నేను భార్యకి మాటిచ్చాను… ఆమెకోసం ఒక డైరీ రాస్తానని… అందుకే…” అంటాడు నాయర్.

“మీకు పెళ్ళయిందా? నేనలా అనుకోలేదు? పిల్లలున్నారా?” అని అడుగుతుందామె.

నాయర్ నవ్వేసి, పెళ్ళయిందని, పిల్లలింకా లేరని చెప్తాడు.

“మీ భార్య ఎక్కడుంటారు?”

“త్రివేండ్రంలో. మా అమ్మా నాన్నల దగ్గర. ఈ మధ్యనే ఒక నెల రోజులు సెలవు తీసుకుని వాళ్ళతో గడిపివచ్చాను”

“ఆవిడ ఫొటో ఉందా?”

“లేదు. ఇక్కడ లేదు” అంటాడు నాయర్.

***

మరో రైల్వే స్టేషన్‌ని చూపిస్తారు. అక్కడ ఇద్దరు అధికారులు మాట్లాడుకుంటుంటారు.

“మీ కోసం నా భార్య ఓ సంబంధం తెచ్చింది. వాళ్ళ స్నేహితురాలి చెల్లెలుట” అంటాడు మొదటి అధికారి.

“పెళ్ళి చేసుకునే సమయం దాటి పోయింది. ఇప్పుడు పెళ్ళి చేసుకుని ఏం చేయాలి?” అంటాడు రెండో అధికారి. ఈయన స్టేషన్ మాస్టర్.

“ఇంటి దగ్గర పెద్దవాళ్ళను చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా” అంటాడు మొదటి అధికారి.

“రైల్వేలే నాకంతా” అంటాడు రెండో అధికారి.

“అవును. మీకు రైల్వేలతో పెళ్ళయిపోయిందని అందరూ అంటూంటారు” అంటాడు మొదటి ఆఫీసర్.

స్టేషన్ మాస్టర్… టైం చూసుకుంటూ, “అరే, జైసల్మేర్ – త్రిపుర రైలు టయిమైంది” అంటూ క్యాబిన్‌కి ఫోన్ చేసి తగిన ఆదేశాలిస్తాడు.

***

రైలు అగుతుంది. అప్పర్ బెర్త్ నుంచి నాయర్ పేస్టు బ్రష్ పట్టుకుని దిగుతాడు. అప్పటికే లేచి ఉన్న మాధవ్ ప్రసాద్ ప్రార్థన చేసుకుంటూంటారు.

“ఇది ఏ స్టేషనో కాస్త చూడండి” అంటారు.

భర్త బయటకి చూసి, “శ్రీరామ్‌పూర్” అని చెప్తాడు.

“శ్రీరామ్‌పూర్?” అని, “ధన్యుడి నయ్యాను. ఉదయాన్నే భగవంతుడి నామం విన్నాను. ఒక పని చేస్తాను. ఇక్కడే దిగిపోతాను” అంటారు మాధవ్ ప్రసాద్.

“ఈ ఊర్లో మీకు తెలిసినవాళ్ళున్నారా?” అడుగుతాడు భర్త.

“రైలెక్కక ముందు మీరు నాకు తెలుసా? మిమ్మల్ని పరిచయం చేసుకున్నట్టే…” అంటారు మాధవ్ ప్రసాద్.

తన సూట్‌కేస్‌ని తాను దిగాక అందించమంటూ దిగిపోతారాయన. భర్త సూట్‌కేస్ అందిస్తారు. అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతారాయన.

ఈలోపు టిటిఇ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న బీదరాలుని తీసుకుని స్టేషన్ మాస్టర్ దగ్గరకి వస్తాడు.

“ఏదైనా పెద్ద స్టేషన్‌లో అప్పగించవలసింది…” అంటాడు స్టేషన్ మాస్టర్.

“రాత్రి ఎప్పుడెక్కిందో తెలియదు… అర్ధరాత్రి ఒంటరి మహిళను వదిలేయలేనుగా…” అంటాడు టిటిఇ.

ఆమెని ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే, ముందు తమ బండిని పంపించమంటాడు టిటిఇ.

సిగ్నల్ ఇచ్చి ఆ బండిని పంపేస్తాడు స్టేషన్ మాస్టర్.

లోపలికొస్తాడు. ఆ బీదరాలుని ఏం చేయాలో అర్థం కాదు.

ఆమె గురించి వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ‘బీహార్ పంపిస్తే వెళ్తావా’ అని అడిగితే ఆమె వెళ్ళనంటుంది.

ఇంతలో తన డ్యూటీ టైం ముగిసి, తన ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్తాడు. హరి అనే కూలీ ఆ మహిళని స్టేషన్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్తాడు.

స్టేషన్ మాస్టర్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె స్నానం చేసి శుభ్రంగా తయారవుతుంది. వంట వండి భోజనం వడ్డిస్తుంది.

కాని తానొక ఒంటరిననీ, మరో ఒంటరి మహిళని ఇంట్లో ఉంచుకోకూడదనే సంకోచం ఆయనలో బాగా కలుగుతుంది. భోజనం తిన్నాక పడుకుంటాడు కానీ నిద్ర పట్టదు. ఆ మహిళ ఆలోచనలే ఉంటాయి.

బట్టలు వేసుకుని అశాంతిగా ఇంట్లోంచి బయటకొస్తాడు.

హరి ఎదురుపడితే… యవ్వనవతి అయిన ఆ యువతిని ఇంట్లో ఉంచుకుని తాను తప్పు చేశాననీ, బీహార్ పంపించేస్తానని అంటాడు.

“మీరు తప్పేం చేయలేదు. మా ఇంట్లో చోటు లేదు… లేకపోతే మా యింట్లోనే ఉంచేవాడిని… అయినా మీరొక పని చేయండి… నైట్ డ్యూటీ వేయించుకోండి… అప్పుడు సమస్య ఉండదు…” అని సలహా ఇస్తాడు.

స్టేషన్ మాస్టర్ ఆలోచనలో పడగా, ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

***

ఈ 12వ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.

ముగింపు తదుపరి సంచికలో!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here