అనుబంధ బంధాలు-25

0
3

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు’ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 25వ భాగం. [/box]

[dropcap]బ[/dropcap]డి ఆవరణంలో పెళ్ళి మంటపం అందంగా అలంకరించారు. మల్లెలు, కనకాంబరాలు, చామంతులు గుబాళిస్తున్నాయి. మంటపంలో రెండు పీటలు వేసి దానిపై తెల్లటి దుప్పటి పరచారు. పెళ్ళివారు ఒక్కొక్కరే వచ్చి మంటపానికి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు.

ఆడవారు ఎడం ప్రక్కన మగవారు కుడి ప్రక్కన మధ్యన తోవ. అరగంటలో గ్లామర్ అంతా ఒక పక్కనే కుమ్మరించినట్లయింది. చాలా మంది కుఱ్ఱకారు కళ్ళు ఏదో పారేసుకున్నట్లుగా అటేపే వెతుకులాట. అంతటితో ఆగక అటుగా కదలికలు ఏదో పని ఉన్నట్లు…

“పెళ్ళి కూతురును తీసుకురండి” అన్నాడు బ్రాహ్మాణుడు. అలాగే అంటూ ముత్తయుదువులిద్దరు లోనికి నడచారు. మరో బ్యాచ్ బ్యాండ్ మేళంతో విడిది దగ్గరకు పోయి పెండ్లి కుమారునీ మిగిలిన అతిధిలను పెండ్లి మంటపం దగ్గరకు వెంట బెటుకొని వచ్చారు. విజయ పెండ్లి మంటపంలోనికి వచ్చింది. కూర్చోమని పీటవైపుగా చేయి చూపాడు బ్రాహ్మణుడు.

విజయ ముగ్దలా అదృష్ట దేవతా అనిపించింది. వాయిద్యాలను ఎప్పుడు ఆపమనాలో ఎప్పుడు ప్రారంభించమనాలో తికమక పడిపోయాడు పాపం…

రాజయ్య దశరథం ప్రక్క ప్రక్కనే కూర్చుని ఉన్నారు. సీతమ్మే కనిపించలేదక్కడ.

శాంతమ్మ మాత్రం విజయ వెన్నంటే ఉంది.

ఇక దీక్షితులుగారు all in all అయి విరగబడిపోతున్నాడు పాపం. ఏర్పాట్లు చాలా బావున్నాయన్నారు వచ్చిన వాళ్ళు. సంతృప్తిగా కనిపించారు.

“పెళ్ళి కూతురును తీసుకెళ్ళండి” అన్నాడు బ్రహ్మణుడు. పెళ్ళికూతురుకు ఏ చీర కట్టాలో విడమరచి చెప్పాడు. పెళ్ళి కూమారుడు వచ్చి మంటపంలోని పీటపైకెక్కాడు. మంత్రోచ్చారణ జరుగుతుంది.

“కట్నం ఎంతట?” అడిగాడో పెద్దమనిషి.

“నాకు తెల్దు” అన్నాడు పక్కనున్నవాడు.

“మంచి సంభంధమే, దశరథం బాగానే పట్టాడు. పిల్లవాడు చూడడానికి బావున్నాడు. చదువుంది. ఆస్థిపాస్తులూ పర్వాలేదు. పైగా ఇతగాని అన్న పోలీసు ఉద్యోగిట.”

“ఇక్కడకి వచ్చాడంటారా?”

“తమ్ముడు గదా, వచ్చే ఉంటాడు.”

“ఏదీ పోలీసు యూనిఫాం కనిపించడం లేదు గదా.”

“డ్యూటీ మీద వచ్చారా డ్రస్సులో ఉండడానికి వెధవ ప్రశ్నలు వద్దు” అన్నాడొకడు.

“విడిపోయారా? ఉమ్మడి కుటుంబమేనా?”

“తెలీదు”

“ఇన్నాళ్ళు ఎవడుంటాడు? వేరుపడే ఉంటారు.”

“దీన్ని లోకం అని ఊర్కే అనలేదు” అన్నాడొకడు.

దీక్షితుల్ని చూపి “ఈయనేవరట అంతా తానేగా ఉన్నాడు?” అన్నాడు.

“అతనా దగ్గర భందువు. పిల్లా జల్లా లేరు. విజయ అంటే ప్రాణం కన్న కూతురిలా చూసుకుంటాడు.”

పెళ్ళికూతురు మంటపంలోకి వచ్చంది. మగళసూత్రాన్ని కొబ్బరి కుడకలో పెట్టి జనం ఆశీర్వాదం కోసం బయలుదేరాడో బ్రాహ్మణుడు. విజయ తలపై జీలకర్ర బెల్లం పెట్టిస్తూ వాయిద్యాల వైపు చూసాడు. మ్రోగించారు వాళ్ళు.

ఆ వరసలోనే తాళికట్టడం పూర్తయింది.

మంచి జోడీ అనుకున్నారు వచ్చిన వాళ్ళు. చిలకా గోరింకలా ఉన్నరమ్మా అందో ఇల్లాలు.

ఈ మాట చెవిన పడ్డ శాంతమ్మ కళ్ళు వత్తుకుంది. భగవంతుడా పిల్లలకు శుభం కలిగేలా చూడు అని వేడుకుంది.

పూజరయ్య దగ్గరుండి మరీ దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపాడు. నిజానికి ఇద్దరికీ ఆకాశంలో బొత్తిగా ఏమీ కనిపించలేదు. అయినా పూజరయ్య చూపిన దిక్కకు చూసి తల ఊపారు. కాళ్ళు కడుక్కొని తిరిగి మంటపం లోకొచ్చారు.

మంగళహారతిచ్చాడు పూజరయ్య. ఆ తరువాత పిల్లవానికి కట్నకానుకలు చదివింపులుగా వచ్చినయి.

“ఇది ఎందుకు పెట్టారంటారు?” అడిగాడొకడు.

రాజయ్య చెప్పాడు ‘పెళ్ళి అంటే ఖర్చుతోకూడుకున్న పని. భందువులిచ్చే ఈ కానుకలు ఎంతో కొంత బరువును దింపుతాయ’నీ.

“మీరు చెప్పిందే నిజం, అయితే మంచి ఆచారమే గదా.”

“మంచిదే కానీ ఇది రాను రాను బదుళ్ళుగా మారినయి. అలా మారాక కుదరడంలేదు. అంచేత దశరథం వద్దన్నాడు” అన్నాడు దీక్షితులు.

ఆశీర్వదించడానికి వెళ్ళి అక్షింతలు వేసి విజయను అక్కున చేర్చుకొని ఏడ్చేసాడు దీక్షితులు. విజయా అంతే….

వీరి అనుభందం అర్థం గాక శ్రీనివాసు ఆశ్చర్యపోయాడు.

తండ్రిని మించి గౌరవిస్తున్న దీక్షితులుపై గౌరవభావం పెరిగింది. ఒక్క తల్లిదండ్రులే ఆప్యాయతలనివ్వరు. ఇంకా ఉంటారు అనుకున్నాడు. ధీక్షితులుకు మాత్రం తనకు కల్గిన కడుపుకోత వల్లే గదా తన ఇంటికి రావాల్సిన పిల్లను మరో చోటికి తానుగా పంపాల్సి వచ్చింది అనిపించి దుఃఖం కట్టలు తెంచుకుంది. కంట్రోలు చేసుకోలేకపోయాడు.

“మామయ్యా వస్తుంటాగా” అని దగ్గర కొచ్చి, “నువ్వు నాతో రావూ” అంది.

“వస్తాను. ఎందుకు రాను. అత్తయ్య దశరథం కూడా వస్తారు. నిన్ను విడచి ఉండగలమా?” అని పసివానిలాగా అయిపోయాడు.

దశరథాన్ని పక్కకు పిలిచిన రాజయ్య “ఇక బయలుదేరుతాం” అన్నాడు

మంచిదన్నాడు శాంతవైపు ఒక సారి చూసి

“ఆడ బిడ్డ కట్నం మరచిపోయినట్టున్నారు” అడిగాడు నవ్వుతూ రాజయ్య.

“మీకు లేరు గదా…. “

“మా అన్నగారి అమ్మాయి ఉందని చెప్పానుగా…”

“అవును…”

“మరచిపోయారా లేక పెళ్ళి అయిపోయిందనా?”

“అదేం మాట? ఇస్తాం. అక్కడికీ నాల్గువేలు పెట్టి పట్టు చీర తెచ్చాం గదా, అది పోను పైకం ఇస్తాను.”

“అలాగే.”

బోజనాల ముగించినవారు మళ్ళీ కాఫీలు త్రాగి మరీ బయలుదేరారు. వచ్చిన బస్సులు, కార్లు, కదలాయి.

తెల తెల వారుతుండగానే రాజయ్యగారి ఊరు చేరుకున్నారు. ఆ రోజు అక్కడ ఊరబంతి పెట్టాడు రాజయ్య. ఆ రాత్రే దంపతులకు తొలిరాత్రి. దీక్షితులు శాంతమ్మ వెంట ఉన్నారు. ఇంటి నిండా బంధువులు. రాత్రల్లా ప్రయాణం. పగలల్లా ఊరబంతి హడావిడి. ఎప్పుడు ఎవరు ఏ అక్కరకు తలుపు తోసుకొని వస్తారోనన్న భయం. ఆ భయం నిజం అయిన క్షణాలు. తలుపు తెరవకుండానే సమాధానాలు. బయట సర్దడాలు. ఇద్దరూ బితుకు బితుకు మంటూనే సంతోషంగా ఇరుకుగా అదోలా. “హానీమూన్‌కి వెళ్దాం” అన్నాడు విజయను కౌగిలిలోబంధించి శ్రీనివాసు.

శ్రీనివాసుని చూసింది.

దాన అర్థం తెలీలేదు పాపం.

“నీ కిష్టం లేదా?”

నవ్వింది.

“ఈ నవ్వు దేనికి గుర్తు. ఇష్టానికా నా కోరికకా చెప్పొచ్చుగదా నీనోటి ముత్యాలేం రాలతయి.”

మాటాడక శ్రీనివాసు గుండెల్లో తలదాచుకుంది. అర్థమయినట్టు కానట్టు ఉన్నా ఇక ప్రశ్నలనవసరం అనుకున్నాడు. విజయ కళ్ళపై ముద్దుపెట్టుకుంటుండగా తలుపు చప్పుడు. గబుక్కున విడిపోయారిద్దరూ… తలుపు తీసింది విజయ బట్టలు సర్దుకొని. ఎవ్వరూ లేరు. తలుపు తట్టి పొరబాటు అనుకొని వెళ్ళిపోయారేమో అర్థం కాలేదు.

“ఎవరు?” అడిగాడు శ్రీనివాసు.

తలుపేసి నవ్వుతూ వచ్చి గుండెల పై వాలింది “నేనే” అంటూ.

***

పొద్దు పొడుస్తుంది. నిజంగా రాగ రంజితమైందీ పొద్దు పొడుపు. అంతే కాదు. ఈ చరచరావర్తనానికి మేలుకొలుపు. తూరుపు రేఖలు ఎర్రబారుతుంటే… బస్సు వచ్చి ఊళ్ళో ఆగింది. దీక్షితులు శాంతమ్మ విజయను శ్రీనివాసును వెంట పెట్టుకొని దిగారు. అల్లుడు బిడ్డా మొదటిసారి రావడం కదా పెళ్ళయ్యాక. దశరథంగారు హడావుడి పడిపోయాడు. విజయ గమనించింది కాని, వారించలేదు. చూస్తూ ఉర్కొంది.

అమ్మ అడిగింది రహస్యంగా విజయను, “బావున్నావా? అల్లుడు నిన్ను బాగా చూసుకున్నాడా” అని…

ఆ మాటలలోని ఉద్దేశాన్ని గ్రహించింది విజయ. మాటాడలేదు. కానీ ‘బాగానే చూసుకున్నాడు’ అన్నట్లుగా తల ఊపింది.

అయినా పెళ్ళాడిన తరువాత మగడన్నవాడు పెళ్ళాన్ని బాగా చూసుకోక ఏం చెస్తాడు. అదీగాక వెతికి వెతికి చూసి మరి చేసారు గదా.

“అంటే?”

“అంత వెతుకలాటకు ఎంతో కొంత ఫలితం ఉంటుంది. చదువుకున్నవాడు. ఉద్యోగం గట్రా దొరికితే ఇంకా బాగా చూసుకోగలరు” అనిపించింది.

‘అయినా… భార్యాభర్తల తొలి రోజులు… శారీరకంగా ఎక్కువగా కలిసి ఉండాలనే తాపత్రయంలో ఉంటారు. వయసు ప్రభావం అది. ఉపుగా ముందుకు నడుపుతుంది. కొత్త రకం కోరికను ఇస్తుంది. ఒకరినొకరు విడవడకుండా ఉండాలని కోరుకునే దశ మనస్సు స్వభావం అర్థం గావాలంటే ఈ కాలం సరిపోదు’ అనుకుంది.

“మీ బావగారు ఉన్నారా?”

“తెల్లవారే కెళ్ళిపోయారు. శెలవు లేదట. పదిరోజులు ఉండిపోదురుగాని రమ్మన్నారు.”

“ఎప్పుడు వెళ్తారేంటి?”

“తెలీదు… నేనడగలేదు.”

“మీ మామగారు…”

“బాగానే ఉన్నారు. మాతో పాటు వేళకి తింటున్నాడు… ఎటో వెళ్తున్నాడు. ఆ ఊళ్ళో గొడవలు ఎక్కువనిపిచింది. చేసేది వ్యవసాయమైనా వ్యవసాయం పని మాత్రం పోడు. ఆయన అసలేం పని చేస్తాడో నాకు అర్థం గాలేదు.”

“ఊళ్ళలో చాలా మంది ఏం చేస్తారు?”

“అవునమ్మా నువ్వ నాన్నా ఉద్యోగం చేసారు. కనుక మీ పనేదో మీకుంది. స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనేం చేస్తారో నాకు తెలీలేదు. ఏం చేసినట్టుగా అనిపించలేదు. మా వంటావిడతో మాత్రం కలివిడిగా ఉండాడు. వ్యాపారం లాంటిదేదయినా ఉందా… అంటే లేదు. మరి నన్ను ఏం చేస్తున్నడని చెప్పమంటావు” అంది.

విస్తుపోయి చూసింది సీతమ్మ ఓ క్షణం. ఆనక దగ్గరి కొచ్చి “అక్కడ ఉండబుద్ది వెయ్యలేదా?” అంది.

“కొత్త చోటుగదా, అయినా నాకు తప్పదు గదమ్మా” అని నవ్వింది.

“నా మాటలు హాస్యంగా అనిపిస్తున్నయా?” అంది నిష్ఠూరంగా

“అమ్మా నాకుగా కొంచెం దగ్గరయిన నా భర్త తప్ప మరొకరు తెలీదు. అలవాటు పడంది అర్థంగాందీ నేనేమి చెప్పను?”

ఇప్పటి పిల్లల తీరు ఎలాగో ఉంటుంది అనుకుంది తల్లి.

“విజయా” అంటూ శ్రీనివాసులోనికి వచ్చాడు.

“ఆఁ వస్తున్నా” అంది.

“ఇక్కడ అందమైన ప్రదేశాలేమైనా ఉన్నాయా?”

“ఇది పల్లెటూరు. ఏముంటాయని చెప్పేది? అయినా receiving natureను పట్టి అందమైనవి కనిపించవచ్చు” అంది.

“కనీసం చెరువు?”

“ఉంది. కాని ఇప్పుడు నీళ్ళుంటాయా?” అని నవ్వింది.

“మీ మామయ్యగారింటికన్నా వెళ్దాం.”

“ఆయన వచ్చాడో రాలేదో?”

“సర్లే కానీ బాగా ఆకలవుతుందోయ్.”

“అన్నంతో చల్లారే ఆకలేగదా?”

తలూపాడు.

“చెయ్యి కడుక్కొని టేబులు దగ్గరికి రండి” అంది. నీళ్ళ గాబు దగ్గరికి వెళ్ళి చెతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. కంచంలో భోజనం పెట్టింది.

తింటూ “దోసకాయ బావుంది” అన్నాడు.

“ఇంకొంచెం వేస్తాను.”

“బావుదన్నాను కావాలనలేదు.”

“మంచిది” అని పెరుగు పోసింది.

“బోజనానంతరం మీరు పడుకోండి. లేవగానే మామయ్యగారింటికి వెళ్దాం” అంది.

‘నీ యిష్టం’ అని ‘నువ్వు రావా’ అన్నట్లు సైగ చేసాడు.

తల అడ్డంగా ఊపింది.

“ఒక్కడికి నిద్రెలా పడుతుంది?” అన్నాడు రహస్యంగా.

నవ్వి వరండాలోకి వచ్చింది.

దశరథం మంచంపై కూర్చుని కనిపించాడు. లేగదూడ ఆరుబయట గెంతుతూ కనిపించింది. పిల్లల కోడి ఇంట్లోకి రాబోయింది. హి… హి… అని అదిలించాడు దశరథం. ‘కోడి కావాలి, పిల్లలు కావాలి, దాని గుడ్లు కావాలి. అది మాత్రం ఇంట్లోకి రాకూడదు’ అనుకుంటూ వెనక్కి మళ్ళింది విజయ.

సీతమ్మ వెనకే ఉంది.

“అన్నం తినవా?” అడిగింది.

“ఆకలిగా లేదు” అంది విజయ ఆవులిస్తూ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here