[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
యాత్రాం మే కర్తు కామేన పూర్వయేవ దినే శుభే।
వినాయకపతి పూజ కర్తవ్య మోదకోత్కరైః॥
[dropcap]యా[/dropcap]త్రా పండుగలు ఎలా, ఎప్పుడు జరుపుకోవాలో చెప్తున్నాడు నీలుడు. నాలుగో రోజున వినాయకుడి మందిరాన్ని దర్శించాలి. ఆరున కుమారదేవుడి మందిరం, ఏడున సూర్యుడి మందిరం, తొమ్మిదిన దుర్గ మందిరం, అయిదవ రోజున శ్రీ (లక్ష్మీదేవి) మందిరం, ఎనిమిది లేక 14వ రోజున మహాదేవుడి మందిరం, ఎనిమిదిన శుక్రుడి మందిరం, శుక్లపక్షం రోజున చంద్రుడిని, నాలుగవ రోజున ధనాద, అయిదవ రోజున వరుణుడిని, అయిదు, పన్నెండు, పదిహేనవ రోజుల్లో నాగులను దర్శించాలి, పూజించాలి. పౌర్ణమి రోజున అన్ని మందిరాలను దర్శించాలి.
ఎవరైతే ప్రయణాలు చేయాలనుకుంటున్నారో, యాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు శుభదినం కనుక్కుని, ముందుగా వినాయకుడి పూజ చేయాలి. మోదకాలు అర్పించాలి. తరువాతే ప్రయాణం ఆరంభించాలి.
ఇది ఇప్పటికీ ఆనవాయితీగా సాగుతూ వస్తోంది.
వినాయకుడి పూజతోనే అన్ని పనులూ ఆరంభమవుతాయి. పూజ ఏ దేవుడికయినా ముందు వినాయక పూజతోనే ప్రారంభమవుతాయి. గుడి ఏ దైవానిదయినా ముందు వినాయకుడే దర్శనమిస్తాడు. ఆయన దర్శనం తర్వాతే గుడిలో ఇతర దైవాల దర్శనాలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కశ్మీరులో కూడా ఇదే పద్ధతి. ఒక జాతిని ఏకం చేసే విధానం ఇది. ప్రాంతంతో సంబంధం లేదు. భాషతో సంబంధం లేదు, శీతోష్ణస్థితితో సంబంధం లేదు. సంబంధం దైవంతో, సంబంధం ధర్మంతో. ఈ దేశాన్ని ఒకటిగా పట్టి ఉంచి, మనుషుల నడుమ సమస్త భేదాలను తుడిపివేయగల శక్తి కేవలం ధర్మానికే ఉంది. ఆపై దైవానికి ఉంది. అందుకే భారతదేశంలో ప్రతీ విషయానికీ ధర్మంతో, దైవంతో సంబంధం ఉంటుంది. ధర్మం, దైవం లేని దేదైనా భారతదేశంలో నిలవలేవు. భారతదేశ ప్రజలు స్వీకరించరు. ఆమోదించరు. ఎప్పుడయితే ధర్మాన్ని, దైవాన్ని జనజీవితం నుంచి వేరు చేసే ప్రయత్నాలు జరుగుతాయో అప్పుడు సమాజంలో అశాంతి చెలరేగుతుంది. రెట్టించిన శక్తితో ధర్మం, దైవం సామాజిక జీవితంలో భాగమవుతాయి. కానీ స్వరూపం మారుతుంది.
నీలమత పురాణంలో పలు దేవతల ప్రస్తావన వస్తుంది. ఒక దైవం గొప్ప అని కానీ ఒక దైవం తక్కువ అని కానీ ఎక్కడా లేదు. ప్రతి దైవాన్ని అంతే భక్తి శ్రద్ధలతో పూజించటం, ప్రస్తావించటం కనిపిస్తుంది. ఇక్కడ మహా విష్ణువు, శివుడు, బ్రహ్మ ఒక స్థాయి దేవుళ్ళు, మిగతా దేవుళ్ళు మరో స్థాయి దేవుళ్ళు అనే ఆలోచన లేనే లేదు. ప్రతి దైవాన్ని అంత శ్రద్ధగా, అంత ప్రాధాన్యం ఇస్తూ ప్రస్తావించడం చూడవచ్చు. ప్రతీ దైవానికీ ఓ రోజును నిర్ణయించి, ఆ రోజు ఆ దైవాన్ని పూజించాలని చెప్పటం కనిపిస్తుంది. ఇలా చెప్పే దైవాలలో ఋషులు, నదులు, పర్వతాలు ఉన్నాయి. నాగులు, పిశాచాలు ఉన్నాయి. దేన్నీ తక్కువ చేయటం లేదు. పై స్థాయి దేవతలు, క్రింది స్థాయి దేవతలు, ప్రధాన దేవతలు, అప్రధాన దేవతలు అన్న ఆలోచనలు భారతీయ సమాజంలో, ముఖ్యంగా మేధావుల ప్రపంచంలోకి బలవత్తరంగా చొచ్చుకురావటం, వారు సిద్ధాంతాలు, తీర్మానాలు వాటి ఆధారం చేయటం ఎంతో అసమంజసం, అనౌచిత్యం. కానీ ప్రధాన, అప్రధాన దేవతలంటూ ఒక దైవం స్థానాన్ని మరో దైవం ఆక్రమించాడని సూత్రీకరిస్తూ, భారతీయ తత్వానికి సంబంధించిన తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించుకుంటూ, అదే విజ్ఞానమన్నట్టు కాలర్లెగరేయటం చూస్తున్నాం. కశ్మీరుకు మాత్రమే ప్రత్యేకమైన పురాణంలో, భారతదేశమంతటా పాటించే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఈ పురాణం చెప్పింది నాగుల రాజు నీలుడు. ఇలాంటి విషయాలను పరిశీలిస్తుంటే ఏ రకంగా భారతీయ సమాజంలో అపోహలు, పొరపాట్లు సత్యాలుగా ప్రచారమవుతున్నాయో, ఎంతగా ప్రక్షాళన చేయవలసి ఉందో స్పష్టమవుతోంది.
సంవత్సరం పాటు జరిగే సంబరాలలో రెండవ రోజున అన్ని గ్రహాలకు శాంతి చేయాలి. మూడవ రోజున గంధర్వులను పూజించాలి. నాలుగవ రోజున పిశాచాలను పూజించాలి. అయిదున స్థానిక నాగులను పూజించాలి. ఆరవ రోజున బ్రాహ్మణులను గౌరవించాలి. ఏడవ రోజున పేదవారు, నిస్సహాయులను గౌరవించాలి.
చివరి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
‘సప్తమేహాని కర్తవ్యం దీనానాథ జనస్య చ‘
ఏడురోజుల పూజలో రోజు కొకరిని పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఏడవ రోజున పేదవారిని, నిస్సహాయులను గౌరవించాలి, ఆదరించాలి. అంటే ఎవరినీ వదిలిపెట్టలేదు, ఎవరినీ పక్కకు నెట్టలేదు ప్రాచీన భారతీయ సమాజం. ప్రతి ఒక్కరిలో దైవాన్ని దర్శించి, ప్రతి ఒక్కరినీ దైవంలా భావించి గౌరవించి, పూజించటం భారతీయ సమాజం ప్రత్యేకత. ప్రతి మనిషి మరొక మనిషిపై ఆధారపడి జీవిస్తాడు. దీన్లో హెచ్చుతగ్గులు లేవు. దీన్లో గొప్పలు, తక్కువలు లేవు. ఉచ్చనీచాలు లేవు. ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని, బాధ్యతను, ధర్మాన్ని నిర్వహించాలి. అంతే… ఇది భారతీయ ధర్మ స్వరూపం. భారతీయ సామాజిక స్వరూపం. ఇదే సర్వేజనా సుఖినోభవంతు అంటే.
(ఇంకా ఉంది)