[dropcap]దే[/dropcap]శమంటే మట్టి కాదట, దేశమంటే మనుషులేనట
మట్టి లేనిది మానవునికి మనుగడెక్కడ వుంటదయ్యా?
పంచభూతాల్ కలిస్తే, పాంచభౌతిక దేహము,
నేల విడిచి సాము జేయుట కలలలోనే సాధ్యము
నేను మాత్రం దేశమంటే మట్టి మరియు మనుషులంటా.
సాంకేతిక ప్రయోగమ్ములు సాగెనెన్నో విశ్వమంతట,
అంతరిక్షము నందు గూడా అంతు తెలియని శోధనములు,
గ్రహము లందున యేమి యున్నదో తెలిసికొనుట ధ్యేయమనిరి,
చావు, పుట్టుక రహస్యాలను ఛేదించుట యెవరి తరమో!
మానవాతీతమగు శక్తిని దైవ మన్నారు మనుషులంతా.
ఏ అవయవ మెక్కడుండునో, అక్కడే వుంటుంది మనిషికి,
ఆపరేషన్ చేసి చూసిన అంతుబట్టును సృష్టి మహిమ.
కొత్త పాత రోగములకున్ కోరి చేసిరి వైద్యమెంతో,
రోగములను పారదోలిరి వైద్యరంగము నందు నిపుణులు
చావు వాయిద పడును గాని తప్పదెన్నటికైన సుమ్మా!