[dropcap]రా[/dropcap]మశాస్త్రి ఒక మునిసిపల్ హైస్కూల్లో లెక్కల మాస్టారు. చిరునవ్వుకు చిరునామా ఆయన. ఆయన శాంతమూర్తిగా పేరుబడ్డారు. ఆయన ముఖంలో కించిత్ గర్వం కానీ, అశాంతి కానీ, కోపం గానీ కనబడవు.
శాస్త్రి భార్య సరస్వతమ్మ. వారికి ముగ్గురు అమ్మాయిలు. పద్మజ, నీరజ, జలజ. పుత్ర సంతానం కొరకు ప్రయత్నించి, ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నారు. అయితే శాస్త్రి దంపతులకు ఏ విషయం గాను చింతిచాల్సిన అవసరము లేదు. ముగ్గురు అమ్మాయిలు రత్నాలు. చదువులో, వినయంలో, అందంలో ఎందులోను తీసిపోరు. పెద్దమ్మాయి పద్మజ డి.స్.సిలో సెలెక్ట్ అయి త్వరలో స్కూలు అసిస్టెంట్‌గా చేరబోతున్నది. అట్లాంటి అవకాశం రావడం మధ్యతరగతి తండ్రికి ఎంత ఓదార్పునిస్తుందో.
ఒక రోజు సాయంకాలం అమ్మవారి గుడికి వెళ్ళి వస్తానని బయలుదేరింది పద్మజ. రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. పద్మజ రాలేదు. తల్లీ, తండ్రీ యిద్దరికీ దిగులు మొదలైంది. వాళ్ళ దిగులును నిజం చేస్తూ ఆ రోజు, మరుసటి రోజు గడిచినా పద్మజ రాలేదు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క గండంగా తోస్తున్నది కుటుంబసభ్యులకు. మనిషి జాడలేదు. ఫోన్ కూడా రాలేదు.
ఎన్ని అవాంతారాలు వచ్చినా దైవ పూజ మానని శాస్త్రి కన్నీటి పర్యంతమై ఆలోచిస్తున్నారు. ఎవరినైనా అడుగుదామనుకుంటే తమకై తామే ఆ విషయం బయట పెట్టినట్లవుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ అంటే అది మరీ ఘోరం. తీరని మచ్చగా మిగిలిపోతుంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో నీరజ, జలజ “అమ్మా నాన్నా అటు చూడండి” అంటూ అరిచారు.
దిగులుతో నీరసించిపోయివున్న ఆ ముసలి ప్రాణాలకు జీవం వచ్చినట్లయింది. దిగ్గున లేచి తల వాకిట వైపు చూశారు. కనపడిన దృశ్యం వారిని శిలాప్రతిమలను చేసింది. ఏం జరిగిందో ఊహించడానికి కొన్ని నిముషాలు పట్టింది.
“అమ్మా నాన్నా నేను తప్పు చేశాననుకుంటే నన్ను క్షమించండి” అంటూ పద్మజ వాళ్ళ కాళ్ళ మీద పడింది.
“అంటే అమ్మా నువ్వేమీ తప్పు చేయలేదనుకుంటున్నావన్న మాట. మా దృష్టిలో యిది తప్పు మాత్రమే కాదు మహా పాపం. ఘోరమైన వంచన. మేము నిన్ను క్షమించనక్కరలేదు. తక్షణం మా కళ్ళముందు నుండి వెళ్ళిపో” సున్నితంగానే ఉన్నా కర్కశంగా ఉన్నాయి శాస్త్రి మాటలు.
“ఎందుకే పద్దూ యింత పని చేశావు. మేమంతా చచ్చిపోయామనుకున్నావా?” సరస్వతమ్మ కన్నీళ్ళకు అంతూ ఆపూ లేదు.
“నేను చెప్పేది వినండమ్మా. నేను ప్రేమించిన వ్యక్తి మన కులం కాదు, మన మతం కాదు. అయితే అన్ని మతాల మంచితనం అతని స్వంతం. మీరెలాగు ఒప్పుకోరు. పైగా యిటీవల మీరు నా కోసం పెండ్లి సంబంధాలు చూస్తున్నారు కూడా” తానకు తాను సమర్థించుకుంటూ మాట్లాడుతున్న పద్మజను ఆపింది సరస్వతమ్మ.
“అమ్మా తల్లీ చాలా ఘనకార్యం చేశావు. కనీసం చెల్లెళ్ళు భవిష్యత్తు గూర్చి కూడా ఆలోచించని నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మీ నాన్నగానీ నేను గానీ ప్రాణాలతో ఉండలంటే యీ క్షణం యిక్కడి నుండి వెళ్ళిపో. కాళ్ళు పట్టుకుంటాను” అంటూ భోరుమన్నది.
పద్మజ యింట్లో ఏ విధంగా స్పందిస్తారోనని ఎదురు చూస్తూ నిలబడిన జాకబ్ పద్మజ ఏడుస్తూ రావడం గమనించాడు. ఫలితం ఊహించిందే కనుక ఎక్కువగా దానిని గురించి కదిలించక అక్కడి నుండి కదలిపోయారు.
ఈ సంఘటనతో ప్రశాంతతకు మారుపేరైన శాస్త్రి కుటుంబంలో విషాద రేఖలు అలముకున్నాయి. ఇరుగు పొరుగువారు, చుట్టాలు అడిగినా శాస్త్రిది ఒకే సమాధానం ‘మా పెద్దమ్మాయి చనిపోయింది’.
మానసికంగా దెబ్బతిన్న మనిషికి గాయం మానడం చాలకష్టం. కానీ, తక్కిన బాధ్యతల బరువూ తప్పనిసరి.
ఒక ఆదివారం కూతుళ్ళిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శాస్త్రి. ఆ ముఖంలో నవ్వుగానీ, దిగులుగానీ, కోపంగానీ, ఏమీ లేవు. స్థిరమైన గంభీరమైన స్వరంతో…
“అమ్మా నీరజా, జలజా మీ ముగ్గురిలో నేను ప్రతి రోజు కొలిచే అమ్మవారిని చూసుకొని పొంగిపోయాను. ఏ కారణంగానో అమ్మవారు నా మీద అలిగింది. నా పూజలో, నా భక్తిలో ఏమైనా లోపమున్నదేమో తెలియదు మరి. ఏది ఏమైనా ముసలితనం ముంచుకొస్తుంది. కాలం, కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి. విధి చిన్నచూపు చూస్తే, తల వంచక తప్పదు. ఇంతకూ నేను చెప్పడమేమంటే ఎన్ని బాధలు ఎదురైనా సరే మిమ్మల్ని బాగా చదివించాలనుకుంటున్నాను. కానీ, మీరు మమ్మల్ని వంచించాలనుకుంటే నాకు, మీ అమ్మకు చావే శరణ్యం” అంటూ తన అనుమానాలను, భయాలను వ్యక్తం చేశాడు.
“నాన్నా జరిగిందంతా చూస్తూ కూడ ద్రోహం చేసేంతటి మూర్ఖులం కాదు మేము. అక్క కూడా అలాంటిది కాదు. ఎట్లాంటి పరిస్థితిలో చేసిందో మరి” నీరజ, జలజ తండ్రి చేతులు పట్టుకున్నారు.
“చూడమ్మా నేను చాల నిక్కచ్చిగా మాటాడుతున్నాను. మీరు కష్టపడి చదువుకుంటామని మాట యిస్తే మంచి కాలేజీలో చేరుస్తాను. అందుకోసమై పెద్ద మొత్తాల్లో లోను తీసుకోవాల్సి వస్తుంది. అందుకని మీ మనసులోని మాట నిర్భయంగా చెప్పండి. నేను దేనికైనా సిద్ధమే” చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పాడు శాస్త్రి.
పిల్లలిద్దరికీ ఎక్కడలేని దుఃఖం పొంగిపొరలింది.
“నాన్నా మీరు మమ్మల్ని చేయిపట్టుకొని నడిపించారు. ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నారు. ఎప్పడైనా, ఎక్కడైనా మీ మాటే మాకు వేదం. బాగా చదువుకొని మీ బాధలను మరిపిస్తాం. మమ్మల్ని నమ్మండి నాన్నా” అంటూ తండ్రిని హత్తుకుపోయారు.
***
మరపు దేవుడిచ్చిన వరం. కొద్ది కాలం తర్వాత అందరూ మామూలు మనుష్యులయ్యారు. పిల్లలను కాలేజీల్లో చేర్చాలంటే పి.ఎఫ్ లోను, పర్సనల్ లోను ఎన్ని మార్గాలున్నాయో అన్వేషించి, అన్నింటికీ అప్లై చేశాడు శాస్త్రి.
మునిసిపల్ ఆఫీస్‌లో ఎష్టాబ్లిష్‌మెంట్ క్లర్క్ రమణయ్య లంచం లేనిదే పని చేయడని అందరికీ తెలుసు. లంచం యివ్వకుండానే పని జరగాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. కాబాట్టి లోన్లతో అవసరమున్న ఎవరైనా తమ పని జరగడానికి ఎంతో కొంత యివ్వడానికి సిద్ధపడతారు.
స్కూల్లో తనకు క్లాసులేని టైంలో పర్ణిషన్ తీసుకొని ఆఫీసు కెళ్ళాడు శాస్త్రి. గేట్‌లోనే ఎవరో వార్త చేరవేశారు. ఆడిట్ సమయంలో కొన్ని అవకతవకల వల్ల రమణయ్యతో పాటు మరి కొందరు సస్పెండ్ అయ్యారని తెలిసింది. త్వరలో యింకొక క్లర్క్ ఎక్కడి నుండో బదిలీ అయి రావల్సి వుంది.
అయ్యో దేవుడా గోరుచుట్టుపై రోకలి పోటన్నట్లు యదేం పరీక్షరా స్వామీ అనుకుంటున్నారు లోన్ల కోసం తిరుగుతున్న మధ్య తరగతి ఉద్యోగస్థులంతా.
వారం పదిరోజుల తర్వాత ఖాళీ సీటు భర్తీ అయింది. రహామత్ ఖాన్ వచ్చిన కొద్ది రోజలకే చాల బాధ్యతగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాడని నమ్మకం కుదిరింది. విషయం తెలిసి శాస్త్రి ఖాన్‌ను కలసి, అప్లికేషన్లు యిచ్చి పని తొందరగా జరిగేటట్లు చూడమని చెప్పాడు.
ఐదారు రోజుల తర్వాత రహమత్ ఖాన్‌ను కలిశాడు శాస్త్రి. పని జరగలేదని తెలిసి అప్లికేషన్లు వాపసు యివ్వమనీ, తనే కమీషనర్ గారితో మాట్లాడతాననీ నిష్ఠూరంగా మాట్లాడాడు.
“అది కాదు శాస్త్రి గారూ, మా కసలు కమీషనరు గారిని కలిసే అనకాశమే రావడం లేదు. ఫైళ్ళు ఎప్పుడూ through proper channel వెళ్ళాలండీ. మీరు వెళితే అయ్యే పని కూడా జరగదు. ఆడిట్ చాలా రోజులుగా పెండింగ్ పరిపోయి జరుగుతోంది. కొంచెం నిదానించండి” అంటూ అనునయంగా చెప్పాడు ఖాన్.
మళ్ళీ వారం రోజులు గడిచాయి. ఫీజు కట్టడానికి యింక వారం రోజులే మిగిలింది. ఆఫీసు మెట్లెక్కుతున్న శాస్త్రిని దూరం నుండే గమనించాడు. అయ్యో పాపం అనిపించింది. ఎదుటి వాళ్ల దిగులు, కన్నీళ్ళు రహమత్ ఖాన్‌ను కదిలిస్తాయి. పుట్టినప్పుడే యీ విషయం తెలియకపోయినా తగిన పేరే పెట్టారు ఆయన తలిదండ్రులు.
ఈ రోజు ఏదో ఒక రకంగా శాస్త్రిగారికి ఊరట కల్గించాలి అనుకున్నాడు. శాస్త్రి రాక కోసం ఎదురుచూస్తూ. కానీ, తన రూం దాటుకొని ప్రక్క రూంకేసి వెలుతున్నాడు శాస్త్రి. తన సీట్లో నుంచే ఖాన్ గట్టిగా పిలిచాడు. వస్తానన్నట్టు సైగచేస్తూ వెళ్ళిపోయాడు శాస్త్రి.
మోహనరావు అకౌంటెంట్ గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి.
“అలా ముమ్మాటికీ కుదరదండీ. నా షరతుకు ఓ.కే. అనుకుంటే ఫోన్ చేయండి. రేపు సాయంత్రం డబ్బు సర్దుతాను” అంటున్నాడు మోహనరావు.
పని జరగలేదేమో వ్రేలాడుతున్న ముఖంతో బయటకు వచ్చారు శాస్త్రి. ఖాన్ కూడ ఫైళ్ళన్నీ భద్రపరచి, శాస్త్రిని కలిశాడు.
“శాస్త్రి గారూ కమీషనరుగారితో యిప్పుడప్పుడే పని జరగేటట్టు లేదు. అయితే నా దొక ప్రపోజల్. నిదానంగా వినండి. మాది ప్రేమ వివాహం. రెండు వైపుల వారికీ యిష్టం లేదు. కనుక మమ్మల్ని ఎవ్వరూ చేరదీయలేదు. కనీసం కన్నెత్తి చూడరు. మాకా యింత వరకు పిల్లలు కాలేదు” అంటూ యింకా ఏమో చెప్పబోతున్న ఖాన్‌ను ప్రశ్నార్థకంగా చూశాడు శాస్త్రి.
“ఏం లేదు శాస్త్రిగారూ అవసరంలో ఉన్నవాళ్ళను ఆదుకోవడం అనేది ఇస్లాం మతస్థులకు అల్లా ఆజ్ఞ. మీకు అవసరమైన డబ్బు నేను సర్దుతాను. తర్వాత మీకున్నప్పుడు తీర్చేయచ్చులే” అన్న ఖాన్ మాటలకు ఖండించాడు శాస్త్రి.
‘ఎక్కడి మనిషి ఈయన? సాయం చేద్దామంటే తనకు మాట్లాడే అవకాశమే యివ్వడం లేదే’ అనుకుంటూ యింటి దారి పట్టాడు ఖాన్.
రాత్రి బోజనాల దగ్గర “ఏమండీ మీకొక సంగతి చెప్పాలి” అంటున్న భారతితో…
“అరే నేనూ ఒక ముఖ్యమైన సంగతి నీతో చెప్పాలనుకున్నాను. శాస్త్రిగారని యిక్కడే మునిసిపల్ హైస్కూల్లో టీచరట. పిల్లల చదువుకని ఏవేవో లోన్లు కోసం తెగ తిరిగేస్తున్నాడు. కమీషనరు సంతకాలు కాక ఫైళ్ళు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి” అన్నాడు.
భారతికి ‘రామశాస్త్రిగారు లెక్కల మాస్టారు’ అనగానే తను ఈ రోజు కలిసిన మాస్టారే అని అర్థమైంది. తాము యిద్దరూ ఒకే రోజు మాస్టారు గురించి సంభాషించడం ఆశ్చర్యం కలిగించింది.
“అరే ఈ రోజు నేను కలిసిందీ ఆయననే. నేను సాయంకాలం స్కూలు నుండి బజారుకు పోతుండే దారిలో ఎదురయ్యారు. ఎంత బాగా గుర్తుపట్టి మాట్లాడరనీ. నన్ను తేరిపార చూసి ‘ఓహో ఒక యింటిదానివైపోయావా భారతీ, మీ ఆయన ఏం చేస్తుంటారు? ఎక్కడుంటున్నారు?’ అంటూ ఆప్యాయంగా అడిగారు. మన పెళ్ళి విషయం దాట వేసి మాములుగా మాట్లాడి వచ్చేశాను. ఇంతకూ ఆయన పని ఏమైంది మరి” అంది.
“అదే నేనూ చెప్పబోతున్నా. మన యిద్దరికీ చెప్పుకొదగ్గ ఖర్చులేమీ లేవు. ఏ బాదర బందీ లేదు. బ్యాంకులో మన యిద్దరి డబ్బు కావలసినంత ఉంది కదా. నిన్ను కూడ అడిగి నువ్విష్టపడితే ఆయనకు డబ్బు సర్దాలని అనుకుంటున్నా. ఏమంటావ్?” తన మనసులో మాట పంచుకున్నాడు ఖాన్.
“ఏమంటాను మహానుభావా, మీ మంచి మనసుకు మీ ఆలోచనలకు ఏనాడో జోహారులర్పించేశాను. మా మాస్టారికి సహయం చేస్తానంటే నేనొద్దంటానా. ముగ్గురు పిల్లలతో ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏమో తప్పకుండా సాయం చేయండి” తన సమ్మతిని తెలియజేసింది భారతి.
మరసటి రోజు తనను కలవమని ఫోన్ చేశాడు ఖాన్ శాస్త్రికి. చాలా చాలా సర్ది చెప్పిన తర్వాత శాస్త్రి ఒక షరతుపై ఒప్పుకున్నాడు. ఆ షరతుకు ఖాన్ ససేమిరా కాదన్నాడు.
“శాస్త్రి గారూ ఏ మనిషికైనా కష్టం సుఖం అనుభవం ఒక్కటే. ఒక్క విషయం చెప్తాను. మంచి అనేది ఏ మతంలో ఉన్నా గ్రహించాల్సిందే. హిందూమతంలో ఉన్నతమైన భావాలున్నట్లే, మాకూ కొన్ని దివ్యఖురాన్ సందేశాలున్నాయి. దాన, ధర్మాల విషయంలో అల్లా యిచ్చిన సందేశం గొప్పది. మాములు రోజుల్లో కానీయండి, ముఖ్యంగా రంజాన్ పండుగ సందర్భంలో మాకున్నదాన్లో కొంత శాతం పేదల కోసం ఖర్చు పెట్టాలి. ఒకరి కష్టం మరొకరు. పంచుకోవడమంటే ఇదే. ఇట్లాంటిదే యింకొకటి మా మతం ప్రకారం డబ్బులకు వడ్డీ యవ్వడం గానీ, తీసుకోవడం గానీ మహాపాపం. కాలం మారింది. విలువలూ మారాయి. ఇందుకోసం నేనెవ్వరినీ తప్పు పట్టడంలేదు కానీ. నా విషయం వేరు. వడ్డీ తీసుకునే అవసరం గానీ ఉదేశ్యం గానీ నాకు లేవు. నేను మీకు డబ్బు సర్దుతున్నాను. లోన్లన్నీ శాంక్షనైనప్పుడే యువ్వచ్చు. ఫర్వాలేదు” అంటూ ముగించాడు ఖాన్.
శాస్త్రి తన చెవులను తానే నమ్మలేకపోతున్నాడు. ఈ కలికాలంలో అస్సలు వినబడవనుకున్న మాటలు వింటూంటే బిత్తర పోవడం శాస్త్రి వంతైంది.
డబ్బు సర్దు బాటై పిల్లలిద్దరినీ కాలేజీలో చేర్పించాడు శాస్త్రి. కొన్ని రోజులకు డబ్బులు రావడం, ఖాన్ బాకీ తీర్చడమూ జరిగింది. ఒక్క డబ్బు విషయమే కాకుండా ఖాన్ మాట తీరు, ప్రవర్తన, మత సిద్ధాంతాల పట్ల అవగాహన. మత ప్రమేయంలేని మమతానురాగాలు యిద్దరి స్నేహాన్ని బలపరిచాయి.
తీరిగా కూర్చున్న వేళల్లో, నిద్రపట్టని రాత్రుల్లో శాస్త్రి మనస్సులో ఏదో కలకలం రేగేది. ఎక్కడి కులం, ఎక్కడి మతం. ఎందుకో యూ ఖాన్‌తో స్నేహం తన జీవితంలో మార్పుకు స్వాగతం పలుకుతోందని అన్పిస్తున్నది. ఇలా రకరకాల ఆలోచనలు శాస్త్రిని వెంటాడేవి.
పద్మజ గుర్తుకు వచ్చినప్పుడంతా కన్న పేగు కదలి గుండె గెలికినట్లయ్యేది. ‘ఆ రోజు నా బిడ్డ తెలిసో, తెలియకో వేరే మతస్థుడిని పెళ్లాడింది. అనే కోపంతో చనిపోయందని చెప్పాను తన నోటిని దేనితో కడిగి ప్రక్షాళన చేసుకోవాలి’ అని ఆలోచించేవాడు. మంచితనమే మతం అని ఎందరెందరో చెప్పినా ఒంట బట్టని సత్యం ఖాన్ స్నేహంతో పూర్తి అవగాహనకు వచ్చింది.
మూడు సంవత్సరాల టర్మ్ పూర్తయ్యెటప్పటికి ఖాన్‌ను ప్రమోషన్ యిస్తూ గుంటూరుకు బదిలీ చేశారు. రిలీజ్ అయి వెళ్లిపోతున్న తన ఆప్త మిత్రుడు ఖాన్‌తో వీలైనంత సేపు గడిపాడు శాస్త్రి. ముడివడిన స్నేహబంధం విడదీయలేనిది. ఫోన్ల ద్వారా ఒకరి నొకరు పరామర్శించుకుంటూనే ఉన్నారు.
ఒక రోజు రాత్రి పది గంటలైంది. ఫోన్ మోగింది. ఈ వేళ ఎవరా అని రిసీవే చేసుకున్నడు శాస్త్రి.
“హలో ఎవరండీ నేను రామశాస్త్రిని మాట్లాడుతున్నాను, చెప్పండి.”
“సార్ నా పేరు మూర్తండీ, గుంటూరు ఏరియా హస్పిటల్ నుండీ మాట్లాడుతున్నాను. మునిసిపల్ ఎంప్లాయీ రహమత్ ఖాన్‌కు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కండీషన్ చాలా సీరియస్‌గా ఉంది అంటున్నారు. అతని భార్య మీరు అతనికి మంచి మిత్రులనీ, చాల కావలసిన వారనీ, పిలిపించమని చెప్పారండీ, వీలైనంత త్వరగా బయలుదేరండి” అంటూ అభ్యర్థించాడు.
ఘోరం విన్న శాస్త్రి కుప్పకూలిపోయాడు. మంచితనాన్ని చాలా కాలం మనుష్యుల మధ్య మననీడేమో ఆ భగవంతుడు. కర్తవ్యం ఆలోచించిన శాస్త్రి మరో స్నేహితుని తీసుకొని ట్యాక్సీలో బయలుదేరాడు.
ఆస్పత్రిలో అడుగు పెట్టిన శాస్త్రికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఖాన్‌ను చూసేటప్పటికి దుఃఖం మాగలేదు. మాస్టారి గొంతు విన్న భారతి తలెత్తి చూసింది. శాస్త్రి ఒక్క నిముషం అవాక్కయ్యాడు తన దగ్గర చదువుకున్న భారతి.
శాస్త్రి ఖాన్ దగ్గరగా వెళ్ళి పిలిచాడు. శాస్త్రిని చూసిన ఆనందం ఖాన్ పెదవులపై చిరునవ్వుగా ప్రత్యక్షమైంది. ఏదో చెప్పబోతున్నాడు. మాట రావడం లేదు.
ఒకటి, రెండు నిమిషాలు శాస్త్రి చేయి గట్టిగా పట్టుకొన్న ఖాన్ ఆలోచన ఏమిటో మరి ఠక్కున భారతి చేతిని శాస్త్రి చేతి కందిచాడు. శక్తినంతా కూడదీసుకొని “శాస్త్రి గారూ భారతి యిక మీ బిడ్డ” అంటూ తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు.
విధి నిర్ణయం ఎవరూహించగలరు. మనిషి మేధస్సును వెక్కిరిస్తున్న దాని వింత చేష్టలు అర్థం కావడం ఎవరి తరం.
కార్యక్రమాలన్నీ ముగించి ఏ ఆసరాలేని భారతికి తానే తండ్రి అయి తన కుటుంబంలో స్థాన మిచ్చాడు. ఇంత కాలంగా సంకుచితంగా ఆలోచించిన శాస్త్రికి కుల, మతాల తెర అడ్డు తొలగింది. మానవత్వమొక్కటే శాశ్వతం అని గట్టిగా అరవాలని అనిపించింది.
ఖాన్‌తో స్నేహ ఫలితం భారతి ఆగమనం, పద్మజ, జాకబ్‌ల సమాగమం ఆ సంసారంలో సరిగమలు ప్రతిధ్వనించాయి.