[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 27వ భాగం. [/box]
[dropcap]శ్రీ[/dropcap]నివాసు నాల్గోనాడు వచ్చాడు. తెల్లారి విజయను తీసుకొని వెళ్ళిపోయాడు.
నాల్గు నెలలు గడచింది కాలం. దసరా పండుగ దగ్గరకొస్తుంది.
అమ్మాయిని అల్లుణ్ని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు దశరథం. వెళ్ళాడు.
అల్లుణ్ని రాజయ్యను పలకరించి, సంగతి చెప్పాడు. ఆ మరునాడే విజయను పంపారు.
అల్లుణ్ని అడిగాడు. పండగ నాటికి వస్తానన్నాడు. భార్యతో మాత్రం “మొదటి పండుగ కదా స్కూటరు కావాలని అడుగు” అన్నాడు.
“మా నాన్న ఇస్తానన్నాడా?” అంది విజయ.
“ఇది కూడా అడగాలా?” అన్నాడు తేలికగా.
“స్కూటరు విలువ ఎంతనుకున్నారు?”
“పద్దెనిమివేలు.”
“అంత పెద్ద మొత్తం” అంటుండగా… “నువ్వు అడుగు….” అన్నాడు ఆర్డర్ వేసినట్టుగా.
“మా లాంటి కుటుంబాలను అర్ధాంతరంగా ఇలాంటి కోరికలు కోరితే?… “
“ఉద్యోగాలు చేసిన వారే గదా, దాచే ఉంటారు. నేను తరువాత మాటాడుతాను. నీకెందుకు.”
“మీరు ఆడగండి. మా వాళ్ళ పరిస్థితులు తెల్సు గనుక అడగలేను” అంది.
“అంటే నీకు ఇష్టం లేదన్నమాట.”
“నాకు కారులో తిరగాలనే ఉంది నా భర్త R.D.Oగానో ఉంటే ఇంకా బావుంటుంది. ఇవి కోరికలు. మన మానసిక బలహీనతలను ఆసరా చేసుకొని పరుగెడుతుంటయి. మనస్సులో మెదిలేవి మాత్రమే. ఇది అలాంటిది కాదు. వాస్తవం నా పెళ్ళికే మా వాళ్ళు ఇరవైవేలు అప్పు చేసారు. వాళ్ళకొచ్చేది వాళ్ళకే సరిపోతది. అలాంటప్పుడు చేసిన అప్పు తీర్చడమే కష్టంగదా. ఇక మనరాక పొకలకు అయ్యేవి భరించాలంటే…. మీరు గట్టిగా అడగమంటే అడుగుతాను కానీ నా దిగజారుడుతనాన్ని వారెదురుగా తెలుపుకోవడం అవుతది. తల్లిదండ్రుల స్థితిగతుల్ని గమనించలేని స్థితికి నేను దిగజారలేను.”
“నువు బాగా ఉపన్యాసాలిచ్చేలాగున్నావు. నేనేమైన దాని పైన ఊరేగలనుకుంటున్నాననుకున్నావా. మొదటిసారి అల్లుణ్ని తీసుకు వెడదాని వచ్చినారుగదా మనకు రివాజు ఉన్నది గదా అడిగితే పొయే…. అడుగుతాను” అని విసురుగా బయటకు వెళ్ళాడు. దశరధాన్ని అడిగాడు కూడా.
“బాబూ! నా నుంచి అయ్యే పనేనా ఇది? ఇరవై వేలు అప్పు మిగిలింది. ఈ మధ్య కాలంలో అర్ధరూపాయి కూడా జమ వేయలేదు. మిమ్మల్ని మొదటిసారి మా దగ్గరికి తీసుకని వెళ్ళి పది రోజులుంచుకుని బట్టలు పెట్టి పంపుదామని ఇరవై అయుదు వందలు దాచాను. అలాంటిది మీకు స్కూటరు కొనివ్వాలంటే ఎంత కాలం పడుతుందో ఆలోచించించు.”
“మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. స్కూటరు మాత్రం కావాలి. నేను పండగకు వస్తాను” అన్నాడు నిక్కచ్చిగా.
అక్కడ అప్పుడు మాట్లాడడం మంచిదిగా అనిపించలేదు.
విజయను వెంట పెట్టుకొని ఇంటికి వచ్చాడు. దోవల విజయ అన్నది “ఇప్పుడు మేం రాకపోతే ఏం?” అని…
దశరధం ముఖంలో కాంతి పోయింది. మనస్సు చితికింది. మాటాడలేకపోయాడు.
బిడ్డ ఇంటికొచ్చిందన్న సంతోషం దశరథానికి అంతగా కనిపించలేదు.
“ఏమిటిది?” అని ప్రశ్నించుకున్నాడు. కంటతడి ఉబికినా నిగ్రహించుకున్నాడు.
బస్సుస్డాండులోనే దీక్షితులు ‘విజయ’కు స్వాగతం పలికాడు విజయ చేతినున్న సంచి నుందుకొని కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ… నవ్వింది విజయ. “మామయ్యా అత్తయ్య ఎలా ఉంది?” అనడిగింది.
విజయ నవ్వులో నిండుతనం లేదు. గమనించాడు. ధశరథం వైపుగా చూసాడు, అతని ముఖంలో ఏ భావనా దొరకలేదు.
“ప్రయాణం బాగా సాగిందా? అల్లుడెప్పుడొస్తాడట? అయినా దశరథా నువ్వు వెంట పెట్టుకొని రావచ్చుగదా!”
ఇలా ప్రశ్నలు వేస్తూనే నడుస్తున్నాడు దీక్షితులు. దశరథం తల ఊపుతూ తోచింది చెపుతున్నాడు.
విజయ కనిపిచగానే సీతమ్మ కళ్ళలో కాంతి కనిపించింది.
“బావున్నావా?” అని కౌగిలిలోనికి తీసుకొని లోనికి తీసుకెళ్ళంది.
బస్సు దగ్గరకు వెళ్ళావా ఏంటి? అంది దీక్షితులను. తలూపాడు.
“విశేషాలేం లేవుగదా? అడిగాడు మెల్లగా.
“అది ఇంకా గడపలో అడుగు పూర్తిగా పెట్టనే లేదు. విశేషాలు సశేషాలూ అంటావేంట్రా? అది ఇక్కడ పది రోజులుంటుంది గదా! ఇవ్వాళ్ళ కాకపోతే రేపు అదే నీ యింటికి వస్తుంది గదా” అన్నాడు.
నవ్వుతూ అవునన్నట్లు తల ఊపాడు. ఇంతలోనే కాఫీ కప్పుతో విజయ వచ్చింది.
త్రాగుతూ విజయనే గమనించాడు.
‘మనిషి అంత హుషారుగా అనిపించలేదు. కొద్దిగా నలిగి ఉంది. ప్రయాణపు బడలిక కూడా కావచ్చుగదా’ అనుకుంటూ కాఫీ త్రాగడం పూర్తి చేసి లేచి “సాయంత్రం వస్తాను” అన్నాడు.
‘మంచిది’ అని తల ఊపాడు దశరథం, ఊళ్ళో పనులన్నీ వీడికే అని గొణుగుతూ…
“మామయ్యా అత్తమ్మ ఎలా ఉందో చెప్పలేదు గదా? నేనే అటు వస్తాలే” అంది విజయ.
“నువ్వు వస్తానన్నావని చెప్తాను” అంటూ నడచాడు సంతోషంగా
నడుస్తూ ‘ఏదో అర్థంగావడం లేదు. పిల్లదాని మొఖంలో పరిపూర్ణత లేదు. ఏదో వెలితి. ఎందుకో? తోయడం లేదు. వస్తానన్నది గదా అదే చెపుతుంది’ అనుకుంటూ నడుస్తూండగా సిద్దయ్య ఎదురు పడ్డాడు – “దండం దీక్షితులు బాబూ” అంటూ…
ఉలిక్కిపడ్డట్టుగా ఆగి ఎదురుగా సిద్దయ్య కనిపించడంతో తేరుకుని “నువ్వా సిద్దయ్యా? ఎప్పుడొచ్చావు?” అనడిగాడు.
“బాబూ! తోవన నడుస్తూ తోవను పట్టించుకోనలేక పోవడం అంత మంచిది గాదు. పట్టించుకుని నడుస్తున్నా అనర్థాలు జరుగుతున్న కాలం” అని నవ్వాడు.
“అది సరేలే ఎట్టా జరగాల్సి ఉంటే అట్టా జరుగుతది గానీ, భవానిని బళ్ళో వేసావా? మాటలు అవీ బాగా వచ్చాయా” అనడిగాడు.
“చల్లంగనే ఉన్నం బాబూ తమ దయ వల్ల” అని “ఓ చిన్న పని ఉండి మళ్ళీ మీదాకా రావాల్సివచ్చింది” అన్నాడు.
“నాకోసమొచ్చినావా చెప్పు” అన్నడు నడుస్తూనే.
“పిల్లది దిక్కులేనిదని గదా నేను సాకుతున్నది, నీ దగ్గరే ఉంచు అని మీరు అన్నారు గదా.”
“అవును” అన్నాను.
“అదే ఇప్పుడు తిరకాసు అవుతాంది బాబు.”
“చెప్పు.”
“నేనీడ ‘మట్టి’ దిని సంపాదించి అంతో ఇంతో వెనకేస్తున్నాను గదా. అదంతా నా కన్న కూతురుకేననే భ్రమలో ఉన్నారు వాళ్ళు. పెళ్ళి చేసి పంపి పదేళ్ళయినా కన్న బిడ్డ మంచీ చెడు బాగానే చూస్తున్న అప్పుడు అంతో ఇంతో ఈ మధ్యన యాపారానికి తక్కువయినయి అంటే పదివేల రూపాయాలు ఇచ్చిన.”
“నీ బిడ్డ అల్లుడికేగా! బాగుపడితే అదే పదివేలు” అన్నాడు దీక్షితులు నవ్వుతూ.
“ఆ మంచితనమే మంచమెక్కి దిగనీయడం లేదు.”
“సరిగ్గా చెప్పు” అన్నాడు ఆగి.
“కన్నది కనుక కట్నం ఇచ్చిన వప్పుకున్న దాని కంటే అయిదు వేలు ఎక్కవే ఇచ్చిన. అప్పుడుప్పుడు కూడా ఇస్తేనే ఉన్నా. చీరా సారే పెడ్తాన్నా మొన్న పదివేలు ఇచ్చిన అది నాకు బిడ్డే అయినా…. ఇద్దరు పిల్లలతల్లి అయింది గదా. ఇద్దరూ బళ్ళోకి పోతున్నారు. ఇంకా ఇప్పుడు ఏదో ఇయ్యమని పంపుతడేంది. కూల్ డ్రింక్ షాపు పెడతాడట. ఇరవై వేలు అర్జంటుగా కావాల్నటు ఎండ తెల్లిపోతే దాని అక్కర ఉండదట.
నేను ఉంటున్న ఇల్లు తనఖాపెట్టి అయినా ఇప్పించుక రమ్మనమని దాన్ని పంపాడు. నా దగ్గర లెవ్వె అంటే అది వినదు. అన్నం నీళ్ళు ముట్టక ఏడుస్తూ కూర్చుంటుంది. పైసలు లేకుండా మొగుడు దగ్గరకు పొదంట పోయినా వాడు లోనకు రానివ్వడంట. పైగా ఆ పసిదాన్నేందుకు సాకడం మన పిల్లల్లోనే ఒక దాన్ని తీస్కపొమ్మను. దాన్ని ఆ ఇంట్లో ఉండనివ్వడానికి వీలు లేదు. ఎల్లగొట్టాల్నట. అది బిడ్డో నువ్వు బిడ్డవో తేల్చుకొని రమ్మన్నాడట.
ఇదేం పాపమో తోచడం లేదు. నాల్గు రోజులగ చూస్తున్న లాభం లేదని ఇట్టా బయలుదేరి వచ్చిన” అన్నాడు.
“నువ్వు నడువు, ఇంటి దగ్గర కూర్చుని మాటాడుకుందాం” అన్నాడు దీక్షితులు.
తలూపి వెంట నడిచాడు సిద్దయ్య. తోవన సిద్దయ్యను ‘బావున్నావానే’ అని చాలా మంది పల్కరించినారు.
దీక్షితులు ఇంటిలోకి రాగానే శాంతమ్మ సిద్దయ్యను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసి మంచి నీళ్ళించ్చింది.
మంచం పైన కూర్చుని ఎదురుగా సిద్దయ్యను కూర్చోమని “అయితే నీ అల్లుడు ఛీ అన్నాడన్నమాట” అన్నాడు.
తల ఊపాడు సిద్దయ్య.
“అయితే చివరి బస్సుకు వెళ్దామా?” అనడిగాడు దీక్షితులు.
“ఏడికి?” అన్నాడు సిద్దయ్య.
“నీ అల్లుడి దగ్గరికి.”
“ఎందుకు?”
“అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా చూసి వద్దాం.”
“ఆనక పిల్ల దాన్నేమన్నా చేస్తే?”
“మనం ఉన్నాం గద.”
“ఉన్నం.”
“ఊళ్ళో అంతా కాపురాలు చేసుకొనడం లేదా?”
“ఆఁ”
“మరి ఇంకేం?”
“అంటే?”
“వాళ్ళ ముందు మాటడదాం, వాళ్ళు చెప్పినట్లు విందాం మరి.”
“వాళ్ళే తేలుస్తారు.”
“వాళ్ళు తేలుస్తరు వీడ్ని ఊస్తరు అంత వరకు సై సుగనే ఉంటుంది కానీ కాపురం చేసేకాడికి వాళ్ళురారే. అదీ గాక ఇది మనసులో పెట్టుకొని దాన్ని ఎల్లగొడితే ఎట్ట.”
“సిద్దయ్య నీ బిడ్డ కాపురానికెళ్ళి పదేళ్ళు దాటింది. వారి కోసం సంసారం ఉంది. పిల్లలున్నారు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని బ్రతకుతున్నారు. నీ దగ్గర నుంచి వచ్చే పైసల కోసం వారి సంసారాన్ని ఆగం చేసుకుంటారని నేను అనుకోను. నీ దగ్గరున్న బలహీనతను గమనించి వాళ్ళు కలిసే ఇలా చేస్తున్నారని నా అనుమానం.”
“నా బిడ్డ కేమైన అయితే ఎట్ట అన్న భావన నీలో కనిపించినంత కాలం నువ్వు బలిపశువ్వే. నిన్ను రక్షించలేను. నీ కిష్టమైతే వస్తా. లేదంటావా నీ ఖర్మ” అన్నాడు నవ్వుతూ.
“అంతేనంటావా” అన్నాడు సిద్దయ్య ఆశ్చర్యపోతూ.
“కాక.”
“నిజ్జంగా అంతేనంటారా.”
“ఆఁ! ఆఁ! నిజ్జంగా అంతే అని నా నమ్మకం…. తెలుస్తదిగదా” అన్నాడు దిక్షితులు.
“అయితే నానుపోయి వస్తా ఇంటికి పోయినంత నా బిడ్డతో సాఫీ సీదాగా చెప్తా ‘బిడ్డా పైకం నాతాన దొరకది గామాటే పోయి చెప్పు. కొడతాడు తిడతాడు ఎల్లగొడదాడనుకుంటే ఆడ ఉండకు పొరళ్ళను చంకనేసుకొని రా నువ్వునయితే తిండికి చంపను. ఉన్న కలో గంజో నల్గురం తాగుదాం. అని చెప్త సరియితే పరవాలేదు.’ కాకపోతే రావాలి గదా అప్పుడు ఆడికే సీదా పోదం” అని లేచాడు. వచ్చినప్పటి దిగులు పోయింది. స్థిమితము కనిపించింది.
ఇదిగో సిద్దయ్య “ఆగు ఇంత తినిపో మళ్ళీ నువ్వు పోయే సరికి ఎంత పొద్దుపోతదో ఏమో?” అంది శాంతమ్మ.
“అన్నం పెడతానంటే కాదని పోను. చల్లపోసి ఇంత పెట్టురి తినేపోత” అన్నాడు.
నీళ్ళగాబు వైపు కాళ్ళు చేతులు కడక్కునేందుకు వెళ్ళాడు.
***
గుడి గంటలు వినిపిస్తుండగా దీక్షితులుకు మెళుకువ వచ్చంది.
‘రామా’ అనుకుంటూ లేచి కూర్చున్నాడు.
ప్రక్కన శాంత నిద్రలో ఉంది. చీర అంతా చెదరి కనిపించింది. లేపుదామనుకున్నాడు. ఆ లేపకపోతే ఏం? ఏం మునిగిపోతుంది? అనిపించి ఆగాడు. కానీ పక్కనున్న దుప్పటిని కప్పాడు. మంచం దిగబోయాడు. పైట చెంగు నడుంకు బిగుసుకొని కనిపించింది. నవ్వు వచ్చింది. వయస్సుయిపోతున్నా ఈ బంధం లోని మధురిమ ఏమిటోగానీ తరగదు. వయస్సున్న వాళ్ళలా మంచమెక్కాలనే ధ్యాసే అవసరం లేదు. మంచం పై ప్రక్క ప్రక్కన ప్రశాంతంగా ఒకర్ని ఒకరు తాకకుండా పడుకున్నా ఏం లేదు. అదో తృప్తి. భార్యాభర్తలుగా శారీరక సుఖం తగ్గిన కొద్దీ దగ్గరయ్యే శక్తి వివాహ బంధానికుందేమో అనిపించింది. భార్యాభర్తలుగా చాలా కాలం నుంచి జీవయాత్ర సాగిస్తున్నారు గనుక ఒకే పక్క పైన పడుకోవడం తప్ప ఒకరి పై ఒకరికి పెన వేసుకున్న ఆత్మీయత చాలా గొప్పది. ఆనందదాయకమైనదీను.
అందుకే కావచ్చు. ఈ వివాహబంధాన్ని మనవాళ్ళు జన్మ జన్మల బంధంగా చెపుతారు. అంతుమాలిన పవిత్రతను ఆపాదిస్తారు. పైటను తీసి బయటకు నడచాడు. గుఱకొయ్యలు ఇంకా పొద్దు పొడుపుకు ఆలస్యముందని చెప్పినయి. కాలు మడుచుకొని వచ్చి తిరిగి మంచమెక్కాడు. ఈ కదలికకు శాంత అరకొరగా మేల్కొని మంచమెక్కిన దీక్షితులి మెడను వాటేసుకుంది. ఆయన కదల్చక అనుకూలంగా దగ్గరకు జరిగి నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు, పసిదాన్ని జోకొట్టినట్టు శాంతమ్మ వీపుపై చేయి ఆడిస్తూ.
ఎప్పుడు కన్నుమలిగిందో తెలీదు గానీ దీక్షితులు కళ్ళు తెరచేసరికి బాగా ప్రొద్దెక్కింది. శాంత పక్కన లేదు.
(ఇంకా ఉంది)