దత్తత

0
4

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]అ[/dropcap]య్యప్ప, రాందాసు, వేరు వేరు కులాలైనా చిన్నప్పటి నుంచి వాళ్లకి మంచి స్నేహం ఏర్పడింది. క్లాసులో ఒకే బెంచి మీద పక్క పక్కనే కూర్చొనే వారు. అయ్యప్ప, అయ్యప్ప అంటూ ఒక్క క్షణం ఒదిలేవాడు కాదు రాందాసు. అలాగే అయ్యప్ప కూడా దాసూ, దాసూ అంటూ వాడి చుట్టూ తిరిగేవాడు. ఎప్పుడైనా అయ్యప్ప చలిమిడుండలు, చిమ్మిలుండలు తెస్తే రాందాసుకి పెట్టకుండా తినేవాడు కాదు. వాటిని ఎంతో ఇష్టంగా తినేవాడు రాందాసు. “ఎక్కడివిరా చాలా బావున్నాయి?” అంటూ. “మా నాన్నకు గుళ్లో దానం ఇచ్చార్రా” అనేవాడు అయ్యప్ప. అలాగే ఇంట్లో చేసుకున్న పాకుండలు, చెగోడీలు తెచ్చిపెట్టేవాడు రాందాసు. ఓ సారి వేయించిన రొయ్యలు తెచ్చిపెట్టాడు రాందాసు. “నాకు సహించవురా, పైగా మా నాన్న చేపలు, మాంసం తింటే తంతాడు. మా బ్రాహ్మలు మాంసం తినకూడదట మా అమ్మ కూడా చెప్పింది” అన్నాడు అయ్యప్ప.

‘అవునా, సారీ రా’

‘నెవర్ మైండు రా’

అయ్యప్ప వాళ్లది తరతరాలుగా పూజారి కుటుంబం. గుడి మీద ఆదాయం అంతంత మాత్రమే. రోజూ పళ్లెంలో వచ్చే చిల్లర, భక్తులు కొట్టే కొబ్బరికాయలు, ఇచ్చే అరటి పళ్ళు. దాంతో ఇల్లు గడవటం గటాగటిగా వుండేది. అయ్యప్ప వాళ్ల నాన్న దివాకరశాస్త్రికి ఎప్పుడేనా పర్వదినాలు వస్తే నాలుగు డబ్బులు కనిపించేవి. ఏదైనా నికర ఆదాయం లేదు. “ఈ మద్య నాస్తికులు పెరిగిపోయారు. భక్తులు తగ్గిపోయారు దాంతో మా ఆదాయం పడిపోయింది” అంటూ అప్పుడప్పుడు వాపోయేవాడు దివాకరశాస్త్రి.

అందుకే అయ్యప్పని బాగా చదివించి మంచి ఉద్యోగంలో వేయించాలని ఆయన తపన. స్కూల్లో చేర్పించారు అయ్యప్పని. ఏ డిగ్రీ వరకో చదివిస్తే ఏదో ఉద్యోగం రాకమానదు. పైగా ఎండోమెంటు డిపార్టుమెంటులో పై ఉద్యోగస్థులు తెలుసు. వాళ్ల కాళ్లు పట్టుకుంటే ఏదో చిరు ఉద్యోగం రాకపోదు అని ఆయన ఆశ.

ఇక రాందాసు వాళ్ళ తాత చెప్పులు కుట్టి బతుకు వెళ్లదీసినవాడు. అయినా కొడుకు మరిడయ్యను చదివించి రిజర్వేషను ద్వారా ప్రభుత్వంలో మంచి ఉద్యోగమే సంపాదించుకోగలిగాడు.

ఇలా వుండగా కాలగర్భంలో పుష్కరకాలం గడిచిపోయింది. అనుకున్నట్టుగా అయ్యప్ప చదువు సాగలేదు. ఆర్థిక ఒడిదుడుకులతో సగంలోనే ఆగిపోయింది. ఇంటరుతో ఆగిపోయింది. తండ్రి మరణం తరువాత గుళ్లో పూజారిగానే కుదురుకున్నాడు అయ్యప్ప. తోటి పూజారి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. ఒకడు ఐదో క్లాసు, మరొకడు రెండో క్లాసు చదువుతున్నారు.

ఇక రాందాసు డిగ్రీ చదివి సర్వీసు కమిషను ద్వారా ప్రభుత్వ సర్వీసులో చేరాడు. తన ఆఫీసులోనే పని చేస్తున్న బ్రాహ్మణ కులానికి చెందిన సరళ అనే అమ్మాయిని ప్రేమించి రిజిస్టరు పెళ్లి చేసుకున్నాడు. అయ్యప్ప, రాందాసు వేరు వేరు ఊళ్లల్లో వున్నా వాళ్ల స్నేహ బంధం కొనసాగుతోనే వుంది. అప్పుడప్పుడు ఒకరింటికి ఒకరు వస్తూపోతూనే వున్నారు.

రాందాసుకు పెళ్లయి ఆరేళ్లయినా ఇంకా పిల్లలు పుట్టకపోవడం దంపతులిద్దర్నీ వేధిస్తోంది. ఎంతోమంది డాక్టర్లని సంప్రదించారు. ఎన్నో మందులు మింగారు. లాభం లేకపోయింది. చివరకు సంతానయోగం లేదని డాక్టర్లు తేల్చేశారు.

ఓ రోజు హఠాత్తుగా దిగాడు రాందాసు. అయ్యప్ప దిగ్భ్రాంతికి గురయ్యాడు.

“ఏంట్రా చెప్పాపెట్టకుండా వచ్చేశావు. ఏమిటి విశేషం” అంటూ ఆప్యాయంగా పలకరించాడు అయ్యప్ప.

“ఏం లేదురా మాకు పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్లు తేల్చేశారు. ఏవైనా జపాలు చేయిస్తే పుడుతారేమోనని వచ్చానురా. నీ ఆధ్వర్యంలో చేయిస్తే నమ్మకంగా చేయిస్తావని వచ్చాను” సోఫాలో కూర్చుంటూ అన్నాడు రాందాసు.

విచారించాడు అయ్యప్ప. చివరికిలా అన్నాడు…

“ఈ జపాలు, తపాలు శుద్ధబోగస్ రా ఏం ఫలితాలుండవు. డబ్బులు దండగ.”

“అందేంట్రా నువ్వు చేస్తుంటావు గదా!”

“అవును. చేస్తున్నా. ప్రజలు అంధవిశ్వాసాలని మేం క్యాష్ చేసుకుంటున్నాం. నే వద్దన్నా వినరు. మరొకరి దగ్గరకు వెళతారు. అందుకే నేనెందుకు కాదనాలి. డబ్బు సంపాదనకి అదొక మార్గం. మంత్రాలకు చింతకాయలు రాలవని వేమన ఎప్పుడో చెప్పాడు. వినేవారెవరు. అయినా కృత్రిమ పద్ధతేవో వస్తున్నాయి కదా ఇప్పుడు. అవెందుకు ప్రయత్నించకూడదు.”

“అవేమీ మీ చెల్లికి ఇష్టం లేదురా.”

“మరైతే ఎవరినైనా దత్తత తీసుకోవాలి.”

“మీ రెండోవాణ్ణిచ్చెయ్, నీ కభ్యంతరం లేకపోతే. శుభ్రంగా చదివిస్తాం. జాబ్ గ్యారంటీ.”

“నిజంగానే అంటున్నావా….” రాందాసు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు అయ్యప్ప కళ్ళలో ఆనందభాష్పాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here