రెవెన్యూ వ్యవస్థ సమగ్ర దర్శనం

3
3

[dropcap]ఇ[/dropcap]రవయ్యో శతాబ్దపు మధ్య భాగంలో ‘రషోమాన్’ అనే పేరుతో జపనీస్ భాషలో ఒక చలన చిత్రం విడుదలైంది. సుప్రసిద్ధ దర్శకుడు అకిర కురసోవా దర్శకత్వంలో వెలువడ్డ ఆ సినిమా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఎనిమిదో శతాబ్దంలో జరిగిన సంఘటన ఆధారంగా అకుతగవా రాసిన ఒక కథ ఈ సినిమాకు మూలం. ఒకే సంఘటన వేర్వేరు కోణాల్లో చూస్తే ఎలా ఉంటుందో చాలా ఆసక్తికరంగా వివరించే సినిమా ఇది. వేర్వేరు వ్యక్తుల దృక్కోణాల్లో ఒకే సంఘటన పై పరస్పర విరుద్ధ కథనాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూడవచ్చు. కొందరు అంధులు ఒక ఏనుగును వర్ణించే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో శరీరాంగాన్ని తడిమి, ఏనుగు ఎలా ఉంటుందో చెప్పే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆధునిక కాలంలో రెవెన్యూ వ్యవస్థపై కూడా వివిధ వర్గాల అభిప్రాయం కూడా అంతే. ప్రజలకు ఒక విధంగా, రెవెన్యూ ఉద్యోగులకు ఒక రకంగా, ప్రభుత్వానికి వేరే కోణంలో రెవెన్యూ వ్యవస్థ కనబడుతుంది. ఆయా అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు వ్యవస్థ విధులను, బాధ్యతలను, విధుల నిర్వహణలో సాధకబాధకాలను సమర్థవంతంగా వివరించే గ్రంథం ‘తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు’. వ్యవస్థలోని లోపాలను తెలియజేయడం మాత్రమే కాకుండా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖలో సంస్కరణలను కూడా ఈ గ్రంథంలో ప్రతిపాదించారు. రెవెన్యూ శాఖ అధికారులు ఎంత చాకిరీ చేస్తున్నా నిందారోపణలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణాలను కూలంకషంగా చర్చించడంతో పాటు పరిష్కార మార్గాలను కూడా సూచించారు రచయిత.

ఇటీవలి సంఘటనల నేపథ్యంలో రెవెన్యూ శాఖ పనితీరును గురించి తెలుసుకోవాలన్న ప్రజల కోరికను తీర్చే గ్రంథం ‘తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు’. రెవెన్యూ వ్యవస్థలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ రచయిత డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి రాసిన ఈ గ్రంథం రెవెన్యూ శాఖను ఆమూలాగ్రం శోధించి, రాసిన గ్రంథం.

పది అధ్యాయాల ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయమూ విలువైనది. మొదటి రెండు అధ్యాయాల్లో రెవెన్యూ శాఖ పై ప్రజల అభిప్రాయంతో పాటు శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు రచయిత. మూడో అధ్యాయంలో రెవెన్యూ వ్యవస్థ చారిత్రక క్రమాన్ని వివరించారు. హైదరాబాదు రాష్ట్ర చరిత్రలో 1948 సంవత్సరం తీసుకొచ్చిన పెను విప్లవం జాగీర్ల రద్దు. ఆ అంశాన్ని చాలా విపులంగా నాలుగో అధ్యాయంలో విశదీకరించారు. ఏనుగు నరసింహారెడ్డి. సాధారణ ప్రజలకు జాగీర్లన్నీ ఒకే విధంగా కనబడతాయి. కానీ వాటి మధ్య ఉన్న తేడాను ఈ అధ్యాయం వివరిస్తుంది. కేవలం రెండు వారాల్లో భూస్వామ్య అవశేషాలను పెకిలించివేసిన భూ విప్లవంగా జాగీర్ల రద్దును పేర్కొన్నారు రచయిత.

రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిల్లో కీలకమైన అధికారులు గ్రామ రెవెన్యూ అధికారి, తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ అధికారి, జాయింటు కలెక్టరు, కలెక్టరు, చీఫ్ కమీషనరు. ఆయా దశల్లోని అధికారుల విధులను, బాధ్యతలను ఐదో అధ్యాయం వివరిస్తుంది. గ్రామ రెవెన్యూ అధికారులు నిర్వర్తించవలసిన 48 రకాల విధులను సాధారణ పరిపాలనా విధులు, పోలీసు విధులు, సామాజిక సంక్షేమం, ఇతరములు అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు రచయిత. మండల స్థాయి రెవెన్యూ అధికారి అయిన తహసీల్దారు నిర్వర్తించవలసిన 32 విధులను సాధారణ, సంక్షేమ, ఎన్నికల, కార్యనిర్వాహక న్యాయమూర్తి, రెవెన్యూపాలన అనే ఐదు విభాగాలుగా విభజించారు. పహాణీలో ఉండే అంశాలను సవివరంగా ఈ గ్రంథంలో పేర్కొన్నారు రచయిత. పహాణీలోని అంశాలను ఖాళీలు లేకుండా నింపే గ్రామ రికార్డు క్షేత్ర వివరాలకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు.

అవసరానికి సర్టిఫికెట్ల కోసం తిరిగేవారు కొందరైతే అవసరం లేని సర్టిఫికెట్ల కోసం పడిగాపులు పడేది మరికొందరు. ఈ విషయాన్ని ఆరో అధ్యాయం వివరిస్తుంది. రెవెన్యూ శాఖలో కాల హరణానికి ఈ అనవసరపు సర్టిఫికెట్లు ఎలా కారణమవుతున్నాయో రచయిత సోదాహరణంగా పేర్కొన్నారు. సర్టిఫికెట్లు సరైనవో కావో ధృవీకరించడం, ఒకసారి ధృవపత్రం జారీ అయితే తర్వాత ఎన్నిసార్లయినా సర్టిఫికెటు కాపీలు తీసుకోవచ్చనే విషయం తెలియక తిరిగి దరఖాస్తు చేయడం మొదలైనవాటివల్ల శాఖలో పనుల భారం మరింతగా పెరిగిపోతోందని ఏనుగు నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తారు.

కార్యనిర్వాహక న్యాయమూర్తిగా మండల స్థాయిలో తహసీల్దారు పాత్ర అత్యంత కీలకం. శవ పంచనామాలోను, 174 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద అనుమానాస్పద మరణాల విషయంలోను, న్యాయ విచారణ లోను, వివిధ సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు గాను, ఇతరత్రా విషయాల్లోను తహసీల్దారు పాత్ర అత్యంత ప్రధానమైనది.

కానీ బయటి నుండి చూడ్డానికి తహసీల్దారు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నా వ్యవస్థ వైఖరి వల్ల పరిమిత పాత్ర పోషించవలసి వస్తుంది. ఈ విషయాన్ని బయట పెడుతుంది ఏడో అధ్యాయం. మరోవైపు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటుగా ఉన్న తహసీల్దారుపై భారం ఎంతగా పెరిగిందో నగరంలోని బాలానగర్ మండలాన్ని ఉదాహరణగా తీసుకుని వివరించారు రచయిత. ఆ మండలంలో కాలక్రమంలో కొత్తగా తొమ్మిది పోలీసు స్టేషన్లు పుట్టుకురాగా తహసీల్ కార్యాలయం మాత్రం అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కటే ఉందని ఆయన పేర్కొన్నారు. పైగా ఆ ఒక్క మండలంలోనే పోలీసులు వెయ్యి మంది వరకు ఉంటే మండల కార్యాలయంలో డజను మంది సిబ్బంది కూడా ఉండరని వివరించారు.

విద్యావంతులైన వారికి కూడా పూర్తిగా తెలియని పరిభాష రెవెన్యూ శాఖలో వ్యవహారంలో ఉంది. ఆ పారిభాషిక పదాలపై అవగాహన లేనిదే రెవెన్యూ శాఖను పూర్తిగా అర్థం చేసుకోలేం. అందుకే రెవెన్యూ శాఖ పారిభాషిక పదాల కోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్నే రచించారు ఏనుగు నరసింహారెడ్డి. కేవలం ఏడు

పేజీల్లో దాదాపు పారిభాషిక నిఘంటువులా ఈ అధ్యాయాన్ని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడం కనిపిస్తుంది. తూము, అలుగు, ఫీడర్ ఛానెల్స్, శికం, చెరువు పూర్తి సామర్థ్య ప్రాంతం, మధ్యస్థ ప్రాంతం, కత్వా, కార్తీవార్, తైబంది మొదలైన పదాలకు సమానార్థకాలతో పాటు వివరణ కూడా అందజేశారు. కలెక్టరును అవ్వల్ తాలూక్‌దార్ అంటారని, దువ్వం తాలూక్‌దార్ అంటే ఆర్డీవో అని ఈ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ఈ పారిభాషిక పదజాలం మీడియా వారికి రోజువారీ వార్తాలేఖనంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఉద్యోగులతో పాటు సామాన్యులు కూడా ఈ పదజాలాన్ని తెలుసుకోవడం అన్ని విధాలుగా ఉపయుక్తం.

ఈ గ్రంథంలో అత్యంత కీలకమైన అధ్యాయం ‘రెవెన్యూ శాఖలో సంస్కరణల ఆవశ్యకత, ప్రతిపాదన’. శాఖలో రావలసిన సంస్కరణలను ఈ అధ్యాయంలో విపులంగా పేర్కొన్నారు. ఈ సంస్కరణలను వ్యవస్థాగత, సాంకేతిక, చట్టపరమైన సంస్కరణలనే మూడు రకాలుగా వర్గీకరించారు.

ప్రజలు పనిమీద తహసీల్దారు కార్యాలయానికి వెళ్తే తహసీల్దారు టూరులో ఉన్నారనే సమాధానం వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారంలో కనీసం మూడు రోజులు తహసీల్ కార్యాలయ సిబ్బంది

మొత్తం కార్యాలయ పనివేళల్లో కార్యాలయంలోనే ఉండాలంటారు నరసింహారెడ్డి. ధ్రువీకరణ పత్రాల్లో చాలా వరకు అసంబద్ధమైనవని ఆయన పేర్కొంటారు. అందుకే ఆదాయ, నివాస, స్థానిక ధ్రువీకరణ పత్రాలను పూర్తిగా రద్దు చేయాలంటారు. కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా శాశ్వతంగా ఒకటే ఇచ్చే విధంగా చేయాలని పేర్కొంటారు. పహాణీని నిరంతరం నవీకరిస్తే మిగతా రికార్డులన్నీ పహాణీ నుండే సృష్టించుకోవచ్చంటారు. ప్రతి పని పూర్తయ్యేందుకు కాల పరిమితి నిర్దేశించాలంటారు. సిటిజన్ ఛార్టర్ ప్రకారం మిగతా శాఖల్లో ఈ దిశగా కొంత పురోగమించినా రెవెన్యూ శాఖలో మాత్రం ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రాతతప్పులను ఏకపక్షంగా సవరించాలని నరసింహారెడ్డి అభిప్రాయపడతారు.

సాంకేతిక సంస్కరణల్లో అనేక ముఖ్యమైన విషయాలను చర్చించారు నరసింహారెడ్డి. ప్రతి ఫైలును కంప్యూటరైజ్డ్ ఎంట్రీ ద్వారా స్వీకరించి, ముందు వచ్చిన దరఖాస్తును ముందు పరిష్కరించే విధానం రావాలని ఆయన సూచించారు. దీని వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతి ఏడాది ఒకసారి అడంగలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే సూచన కూడా విలువైంది. సాంకేతికతను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

చట్టపరమైన సంస్కరణల్లో సర్వే సెటిల్మెంట్ చట్టాన్ని అమలు చేయాలని వివరించారు ఏనుగు నరసింహారెడ్డి. ఆ చట్టం ప్రకారం ప్రతి 30-40 ఏళ్లకోసారి రీ సర్వే జరపడం వల్ల అనేక భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. పట్టణీకరణ పెరిగిన ఈ రోజుల్లో అన్ని పట్టణాల్లో రీ సర్వేలో భాగంగా టౌన్ సర్వే కూడా నిర్వహించాలని ఆయన సూచించారు. ఆధునీకరణ వల్ల అనేక వ్యవసాయ భూములు వ్యవసాయేతర కార్యకలాపాలకు నిలయమయ్యాయి. రికార్డుల్లో వ్యవసాయ భూములుగా ఉన్నా వ్యవసాయేతర పనులు జరిగే భూములకు నిర్మాణ అనుమతులివ్వాలంటే మొదట వ్యవసాయేతర భూములుగా తప్పనిసరిగా మార్చాలని సూచిస్తారు. కోర్టు దావాల్లో స్పష్టత కోసం పహాణీనే ఆర్వోఆర్ గా ప్రకటించాలని పేర్కొన్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న నిషేధిత భూముల జాబితాను కూడా సత్వరమే స్పష్టంగా ప్రకటించాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.

రెవెన్యూ శాఖలో పనిచేసిన, పనిచేస్తున్న అధికారుల అభిప్రాయాలను కూడా అనుబంధంలో పొందుపర్చడం ఈ గ్రంథంలో మరో విశేషం. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాసిన ఈ గ్రంథం ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఉంది. అందువల్ల తెలంగాణతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు రెవెన్యూ అధికారుల అభిప్రాయాలకు కూడా ఈ గ్రంథంలో చోటు కల్పించారు. అనుబంధంలో పొందుపర్చిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టరు బి.మధుసూదన్, మచిలీపట్నంలో తహసీల్దారుగా పనిచేస్తున్న దేవర గిద్యాను, ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామ రెవెన్యూ అధికారి జి.వి.ఎస్.రామారావుల సంభాషణలు అత్యంత విలువైనవి.

ఈ గ్రంథం చూడడానికి ఒక ప్రభుత్వ శాఖకు చెందిన గ్రంథంగా ఉన్నా, దీన్ని పాఠకులకు ఉపయుక్తంగా మార్చేందుకు అన్ని రకాలుగా శ్రమించారు రచయిత. విషయపరంగా సమగ్రతను చేకూర్చేందుకు పడ్డ శ్రమ ఒక ఎత్తు. ఆ విషయాన్ని సులభగ్రాహ్యంగా చదువరులకు అందించడంలో తీసుకున్న శ్రద్ధ మరో ఎత్తు. రెండింటిలోనూ రచయిత విజయం సాధించారు. రచయిత శాఖలో పనిచేసే అధికారి కావడం వల్ల విషయ పరిజ్ఞానం అందించేందుకు డోకా లేకుండా పోయింది. ప్రవృత్తి రీత్యా ఏనుగు నరసింహారెడ్డి కవి, రచయిత కావడం పాఠకులకు సులభగ్రాహ్యంగా అందించడంలో దోహదపడ్డ అంశం. మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు పాఠకులు విడవకుండా చదివేందుకు ముఖ్య కారణం ఈ గ్రంథంలోని శైలి.

ఈ గ్రంథానికి శోభను చేకూర్చేది ఇందులో వాడిన భాష. మొదటి అధ్యాయంలో కొంత వ్యంగ్యాన్ని మిళితం చేసి, రాసిన విధానం పాఠకుడిని మెస్మరైజ్ చేస్తుంది. ఇందులో జాతీయాలు, సామెతల వినియోగం ఆకర్షిస్తుంది. ‘తహసీల్దారు ఆఫీసులో పనిపడిందంటే గుండెలో రాయబడ్డట్లే’నంటారు రచయిత. ధరణి వెబ్ సైట్లో వైరస్ గురించి ప్రస్తావిస్తూ ఏం ఆట అంటే ఎప్పటి ఆటే అన్నట్లయిందంటారు. ‘దయగల గ్రామ రెవెన్యూ అధికారులు కొందరు కరెక్షన్ చేసినా కనీసం రెండు స్పెల్లింగ్ పొరపాట్లు రైతులకు బోనస్’ అని వ్యంగ్యంగా పేర్కొంటారు.

రచయిత వృత్తి పరంగా రెవెన్యూ శాఖకు ఇన్‌సైడర్. ప్రవృత్తి పరంగా ప్రజాబాహుళ్యానికి ఇన్‌సైడర్. వేర్వేరు కోణాల నుండి రెవెన్యూ శాఖను దర్శిస్తూ, గ్రంథానికి సమగ్రతను తెచ్చి పెట్టేందుకు ఈ రెండు అంశాలు దోహదపడ్డాయి. అందువల్లే ఆచరణ సాధ్యమయ్యే సంస్కరణలను సైతం సూచించి, భవిష్యత్ తరాలకు కూడా ఉపయుక్తమయ్యే పని చేయగలిగారు. రెవెన్యూ వ్యవస్థ సమగ్ర దర్శనం ‘తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు’.

***

తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ -నిన్న, నేడు, రేపు.
రచయిత: డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి,
పేజీల సంఖ్య: 125, వెల: రూ.130/-,
ప్రతులకు:

  • నవోదయ పబ్లికేషన్స్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్-040-24652387
  • అడుగుజాడలు పబ్లికేషన్స్, ఎం.ఎస్.కె. టవర్స్, ఫ్లాట్ నెం. 410, స్ట్రీట్ నెం.11, హిమాయత్ నగర్, హైదరాబాదు -500029. సెల్: 89788 69183.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here