లోకల్ క్లాసిక్స్ – 7: ఏ కాలానికైనా సందేశం!

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా నిపుణ్ ధర్మాధికారి మరాఠీ సినిమా ‘ధప్పా’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ధప్పా’ (మరాఠీ)

[dropcap]ఈ[/dropcap] రెండేళ్ళూ దేశభక్తి, చారిత్రక, యుద్ధ, అతివాద హిందీ సినిమా కథలు కొత్తగా విభజన భావజాలాలతో హోరెత్తిపోయాయి. నెగెటివిజాన్ని కొత్త నినాదంగా చేసుకుని నర్తించాయి. సినిమాల్లో రాజకీయ పక్షపాతాల కథలే తప్ప, సామాజిక పక్షపాతాలతో కూడిన కథల్ని గతంలో చూడలేదు. సామాజిక భక్తి లేని దేశభక్తిని గ్లోరిఫై చేశాయి. సామాజిక భక్తి లేని దేశ భక్తితో అశాంతేమిటని ప్రశ్నించలేక పోయాయి. దేశ పౌరులనే పెద్దవాళ్ళ మానసిక స్థితి ఇది. ఇప్పుడు రోడ్లమీద యువత మానసిక స్థితి వ్యక్తమవుతోంది. మరి రేపటి పౌరులనే బాలల మానసిక స్థితి? వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు? వాళ్ళ మనస్సుల్లో తల్లిదండ్రులే విష బీజాలు నాటుతున్నారు. ఉత్తరాది మీడియా ప్రచారాలకి అతుక్కుపోయి పిల్లలకి ఆ మేరకు ఉద్బోధలు చేస్తూ, రేపటి ఉన్మాదులుగా తయారు చేస్తున్నారు. ఇవి మతాల కోసం మతాల కొట్లాటలు కావనీ, ఓట్ల కోసం మతాల కొట్లాటలనీ గ్రహించలేక గుండెల్ని మండిస్తున్నారు, గుండెల కింద మాడే కడుపుల్ని గాలి కొదిలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నలిగిపోతున్న పిల్లల నుంచి ఒక సందేశం వస్తే? ఈ దేశం తమది కూడాననీ, తమకూ భావ స్వేచ్ఛ వుంటుందనీ ప్రకటించుకుంటే? ‘ధప్పా’ (చరుపు) అనే పెద్ద వాళ్ళతో కూడిన బాలల సినిమా ఈ పనే చేసింది.

దర్శకుడు నిపుణ్ ధర్మాధికారి నటుడు, రచయితా, నిర్మాత కూడా. 18వ యేటనే స్క్రిప్టు రాసి రాష్ట్ర స్థాయి అవార్డు లెన్నో పొందాడు. నాటక రంగ పునరుద్ధారణ కర్తగా ఫోర్బ్స్ మ్యాగజైన్ అతణ్ణి గుర్తించింది.  2009 నుంచి అతను మరాఠీ నాటక – సినిమా రంగాల్లో కొనసాగుతున్నాడు. 2013లో రోహన్ సిప్పీ దర్శకత్వంలో ‘నౌటంకీ సాలా’ అనే ఆయుష్మాన్ ఖురానా, కుణాల్ రాయ్ కపూర్‌లు నటించిన హిందీ సినిమాకి రచయితగా సినిమా రంగ ప్రవేశం చేశాడు. 2017లో ‘బాప్ జన్మ’ అనే మరాఠీ సినిమాకి దర్శకత్వం హించి, 2018లో ‘ధప్పా’ రూపొందించాడు. ‘ధప్పా’కి 2018 లోనే నర్గీస్ దత్ అవార్డుతో బాటు, జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డు లభించినా విడుదలకి నోచుకోలేదు. 2019 ఫిబ్రవరి లోనే విడుదలయ్యింది.

తను నివసించిన హౌసింగ్ సొసైటీలో విభజన వాతావరాణాన్ని చూసిన అనుభవంతో ఈ సినిమా తీసినట్టు ఇంటర్యూలో చెప్పాడు నిపుణ్. అలాటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లలెలా తయారవుతారన్న ఆందోళనే కథకి పునాది వేసింది. అలాటి వాతావరణంలో పెరిగే పిల్లల దృక్కోణం లోంచి ఈ కథ చెప్పాడు. పెద్దలు విలువల దారి తప్పి పోయారేమో, పిల్లలు సన్మార్గంలోనే సమ్మిళిత్వాన్నీ, సమరస్యాన్నీ కోరుకుంటారనీ తెలియజెప్పాడు.

కథ

పుణే హౌసింగ్ సొసైటీలో కొన్ని కుటుంబాలుంటాయి. స్కూలు  కెళ్ళే వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ, చిన్న చిన్న కొట్లాటలు పెట్టుకుంటూ, ఓ ప్రేమ జంటకి సాయపడుతూ వాళ్ళ లోకంలో వాళ్ళుంటారు. ఒక తెలివైన వాడు, ఒక స్థూలకాయుడు, ఇంకో కోపిష్టి …ఇలా ఒక గ్యాంగ్‌గా ఆరేడుగురు వుంటారు. వీల్ చైర్‌లో సుహృద్ అనే ఒక వికలాంగ బాలుడుంటాడు. అతను స్టీఫెన్ హాకింగ్ అనుకుని గౌరవంగా చూస్తూ, హాక్యా అని పేరుపెట్టి పిలుచుకుంటారు. వాచ్‌మాన్ కొడుకుని కూడా తమలో కలుపుకుంటారు. వాళ్ళల్లో వాళ్లకి తగాదాలు కూడా వస్తూంటాయి. శార్వి ఆ తగాదాల్ని పరిష్కరిస్తూ వుంటుంది.

ఇలా వుండగా గణేష్ ఉత్సవాలొస్తాయి. ఈ సందర్భంగా పిల్లలకి ఒక నాటకం వేసుకోవడానికి పెద్దవాళ్ళు అనుమతిస్తారు. పర్యావరణ పరిరక్షణ అంశంతో వేస్తున్నఈ పిల్లల నాటకంలో చెట్లు నడుస్తాయి, కోతులు మాట్లాడతాయి. సంత్ తుకారాం, ఏసు క్రీస్తులు బోధలు చేస్తారు. భూగోళాన్ని భ్రష్టు పట్టిస్తున్నందుకు ప్రకృతి అంతా కోపిస్తుంది. ఇది మహా శక్తి పార్టీ నాయకుడికి తెలుస్తుంది. మత, సాంస్కృతిక హద్దుల్ని చెరిపేస్తున్న ఈ నాటకాన్ని సహించలేకపోతాడు. కార్యకర్తల్ని పంపి దాడి చేయిస్తాడు. సెక్యూరిటీ గార్డుని కొడతారు, నాటక సెట్ అంతా చెల్లా చెదురు చేస్తారు. మళ్ళీ ఏసు క్రీస్తుతో ఈ నాటకం వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తారు కార్యకర్తలు. పెద్దలు ఈ పరిస్థితి నెలా ఎదుర్కోవాలా అని ఆలోచనలో పడితే, పిల్లలు ఒక నిర్ణయం తీసుకుంటారు. పెద్దలకి తెలియకుండా ఇదే నాటకాన్ని వేయాలనుకుంటారు. ఈ నాటకం ఎక్కడ వేశారు? పార్టీ నాయకుడికి తెలిసిందా? తెలిస్తే ఏం చేశాడు? అప్పుడు పిల్లలెలా బుద్ధి చెప్పారు?…ఇదంతా మిగతా కథ. ఈ కథని ఇంతకంటే ఇక్కడ చెప్పకూడదు. పిల్లల మనోగతాల్ని పట్టించుకునే ఆసక్తి వున్న వాళ్ళు మాత్రం చూసి తెలుసుకోవాల్సిదే.

సూక్ష్మ ప్రపంచం

చుట్టూ వున్న వైషమ్యాల్ని, ద్వేష భావాన్ని అర్థం జేసుకోవాలంటే పిల్లల స్థాయికి -సూక్ష్మ స్థాయికి – దిగి రావాల్సిందేనని ఈ బాలల సినిమా చెప్తుంది. కులమత ప్రాంతీయ తత్వాలు, వర్గ తారతమ్యాలు, సాంస్కృతిక విభేదాలు ఎన్నున్నా పిల్లలు వాటికి  అతీతులుగా వుంటారనీ, వాళ్ళ భోళాతనంతో, సరళత్వంతో కలిసిపోతేనే దేశం ప్రశాంతిగా వుండగలదనీ చెప్తుంది. ఐతే ఈ సున్నిత పరిష్కారాలు కరుడుగట్టిన పరిస్థితిని మర్చగలవా అన్న ప్రశ్న వొకటి వస్తుంది. బాలల హక్కుల పరంగానైతే ఆలోచింపజేస్తుంది. భావ స్వేచ్ఛ పెద్దలకేనా, పిల్లల నోళ్ళు రుబాబుతో మూయించాల్సిందేనా అన్న సూటి ప్రశ్న వేస్తుంది. పిల్లలు వాళ్ళ దృక్కోణంలో ప్రపంచాన్ని చూడకపోతే వికాసమెలా పొందుతారు?

   

115 నిమిషాల ఈ సినిమా సున్నిత హాస్యంతో వుంటుంది, వ్యంగ్య బాణాలు కూడా వేస్తుంది. రాజకీయ నాయకుడితో తప్ప ఎక్కడా సీరియస్‌గా వుండదు. పిల్లల మధ్య వాటర్ బాటిల్ ఫైట్ వినోదాత్మకంగా వుంటుంది. ఈ హౌసింగ్ సొసైటీలో జరిగే చాలా సన్నివేశాలు బయట ప్రపంచంలో జరుగుతున్న కొన్నిటి నకలుగానే వుంటాయి. బయటి ప్రపంచాన్ని సూక్ష్మ స్థాయిలో వొక ఫాంటసీ ప్రపంచంగా చేసి హౌసింగ్ సొసైటీలో చూపించారు. తెలుగులో ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘మరో ప్రపంచం’ లో ధూర్త ప్రపంచం నుంచి అదృశ్యమైపోయిన బాలలు అజ్ఞాతంలో మరో తమ కిష్టమైన ప్రపంచాన్ని నిర్మించుకుంటూ వుంటారు. ఈ ప్రపంచం పర్యావరణానికే కాదు, పిల్లలకి కూడా స్థానం లేని ప్రపంచంగా మారింది.

ఈ కథకి సారధులుగా బాల నటులు అక్షయ్ యాదవ్, శార్వీ కులకర్ణిలు ప్రతిభావంతంగా నటించారు. కెమెరా వుందన్న విషయమే మర్చిపోయి యాదృచ్ఛికంగా నటించేశారు. గాంధార్ సంగీతం వహిస్తే, స్వప్నిల్ సోనావాలే ఛాయాగ్రహణం సమకూర్చాడు. దర్శకుడు నిపుణ్ తీసిన ఈ మరాఠీ బాలల సామాజికం ఏ కాలానికైనా ఒక సందేశమే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here