[dropcap]ఇ[/dropcap]ప్పుడిప్పుడే….
కుకూన్ నుండి బయటకొచ్చి రూపం
మార్చుకున్టున్న చిన్నిరెక్కల
సీతాకోకచిలుక అది
ఎగరడం నేర్చుకుంటూ
కొత్త ప్రపంచాన్ని
ఆస్వాదిస్తుంది
తనకు తెలిసిన….
తెలియని
ఒక తెలిసిన ప్రపంచంలోకి
అడుగులు వేస్తూ
స్వేచ్ఛా లోకాన
విహరించాలనుకుంటుంది
కన్నవారి ఎత్తైన లక్ష్యాల ఆంక్షలతో
విస్తుపోయి ఎగరలేక నిలుచుంది
నాఅన్న నావారేగా
అనుకుని
తన రెక్కలను సవరిస్తారనుకుంది
తనుకన్న కలలను
వారి సాయంతో ఆవిష్కరించాలనుకుంది
కానీ….
దారి చూపాల్సిన వారే దారి నిర్ణయించి
ఎత్తైన లక్ష్యాల ఆంక్షల బరువుతో
సవరించాల్సిన చేతులే
చిన్ని రెక్కలను కత్తిరిస్తే….!!
ఆ…
ఆంక్షల నడుమ
చిట్టి మెదడు
కొట్టుమిట్టాడదా?
నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చుట్టి
వెలుతురును నిద్రపుచ్చుతున్నట్లు
తేజోవంతమైన కిరణాలను
చేతితో అడ్డుకున్నట్లు
పారేనదికి ఆనకట్ట వేసి దారి మళ్లించి నట్లు
పురుడు పోసుకున్న లేత ఆశలను
అణగదొక్కడమెందుకు..?
కొత్తతరం ఉత్సాహాన్ని నీరుగార్చే
ప్రయత్నాలెందుకు?
కొత్త ప్రపంచాన్ని చూసి పడుతూ లేస్తూ
గొంగళి పురుగు రూపం మార్చుకుని
సీతాకోక అయిన్నట్లు
కాస్తంత….
స్వేచ్ఛను వాడి మస్తిష్కంలో
ఒంపితే చాలు…..
సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి…
మీముందుంచగలడు
విశ్వవిజేతగా నిలిచి తన చేతుల్లోని జెండాపై
అమ్మానాన్నల పేర్లు లిఖించగలడు!!