[dropcap]అ[/dropcap]లలూ అక్కడే ఆగిపోండి
అందంగా కనిపించే తీరమిపుడు
కోరల్లేని రాకాసిలా మింగేస్తుంది
కలల్లారా కాగితపు కోనేరు
కడుపు నిండిపోయింది
ఇక కన్నీరుపెట్టకండి
నులిమి నులిమి హృదయం
ఎరుపెక్కుతుంది
నివురుగప్పిన నక్షత్రాల్లారా
ఈ పూటకి మెరవకండీ
ఉల్కల్లా రాలిపోయిన ఈ నిశీధిలో
వెదకండీ..
దిక్కులు మీ స్థానాలను
మార్చుకోకండీ
మీ స్థితి గతులను మరచిపోతారేమో
ఉదయసంధ్యాల్లారా మీ మీ ద్వారాలను
గడియలతో బిగించకండీ
ఏ ఆర్తనాదమెపుడు
మీ గుండె తలుపుతడుతుందో
ఎదురుచూస్తుండండీ…
తోడబుట్టిన అన్నదమ్ముల్లారా
యౌవనతనువులను ఎటువైపు
మలపాలో మననం చేసుకోండి
ఆడతనమా సూర్యచంద్రుల నీడలు
నీకు శాపనార్థకాలు
భంగపరడమే కానీ బ్రతకనీయవు
కూలిన స్వప్నాలను ఏరుకొంటూ
నిరాశ నిస్పృహలతో దిశను వెతుక్కొంటూ
అక్కడ్నుంచి ఎక్కడికో మరెక్కడికో
ఆగాగు…..
సముద్రగర్బమంతా నిర్మలమంట
నిన్ను అక్కడ పదిలంగా భద్రపరుస్తాలే
నీ అస్తికలను రాల్చలేని
నా కన్నీటి చుక్కలతో మూటగట్టి
రాయలేని కలాలకు పచ్చినెత్తుర్ని
అక్షర సిరాగా పోస్తూ…
నా కవితకు శీర్షికగా
నీ ఆర్తనాదాన్ని దిద్దుకొంటా