జీవన రమణీయం-89

1
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఇం[/dropcap]క ఆగస్ట్ 8న ఇండియా వచ్చేసే రోజున కూడా కిరణ్ ప్రభ గారికి ఆఫీస్ పని వుండి, చిట్టెన్‌రాజు గారి అన్నగారి అబ్బాయి చిన్న చిట్టెన్‌రాజు గారే నన్ను ఎయిర్‍పోర్ట్‌లో దింపారు. కాంతి గారు మామూలుగా పది గంటలకి భోజనం పెట్టి, చీర పెట్టి పంపించారు. బాక్స్‌లో ఏదైనా పెట్టిమ్మని నేనూ అడగలేదూ… ఆవిడకీ తోచలేదు… పది గంటలకి ఇంట్లోంచి వెళ్తే, ఆ రోజు ఒంటి గంట ప్రాంతంలో శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్తే సాయంత్రం నాలుగు గంటలకి ఫ్లయిట్… ఆకలికి మాడిపోయాను అని బాగా గుర్తు! కానీ చేతిలో వున్న అమెరికా ఫోన్ మా శేషు (అక్క కూతురు) ఇచ్చినది, ఆఖరిసారిగా వాడి, ఎవరెవరి ఇళ్ళలో వున్నానో వారందరికీ కృతజ్ఞతలు చెప్పాను.

కిరణ్ ప్రభ గారూ, కాంతిగారూ కాస్టికోకి తీసుకెళ్ళినప్పుడు కొన్న చాక్లెట్ ప్యాకెట్లూ, బట్టలూ, మేసీస్‌లో, వాల్‌మార్ట్‌లో కొన్న వాచెస్, ఆడపిల్లల కాస్మోటిక్స్ నా సూట్‌కేసులలో పట్టక వారి దగ్గర ఇంకో బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఆ బరువైన సూట్‌కేసులతో బాటు, ఎన్నెన్నో జ్ఞాపకాలని బరువుగా మోసుకుంటూ నేను శాన్‌ఫ్రాన్సిస్కో రిటర్న్ ఫ్లయిట్ ఎక్కాను. దుబాయ్‌లో చేంజ్.  మరోసారి వంగూరి చిట్టెన్‌రాజు గారికి వందనాలు… “మహాశయా మీ వల్లే ఆ పరాయి గడ్డ మీద ఇంతమంది ఆత్మీయులు… ధారావాహికంగా నా ‘జీవన రమణీయం’లో సంచిక 69 నుండీ ఈ సంచిక 87 వరకూ మీరు పంపిన ఆహ్వానం మేరకు ‘ఆరవ వంగూరి సదస్సు’కి వచ్చిన అమెరికా యాత్రానుభవాలు పొందుపరిచాను అంటే ఎన్నెన్ని మధురానుభూతులు ఆ ట్రిప్‌లో పొందానో, ఎందరెందరు స్నేహితుల స్నేహం నా కొంగున కట్టుకుని వచ్చానో ఆ పుణ్యం అంతా మీదే… అందుకే మీరు మహానుభావులు… మీకు వందనాలు… ఇలా ఎంతమందికి ఈ అవకాశాన్నీ, మధురమైన జ్ఞాపకాలని పంచి ఇచ్చారో… ఇంకా ఇస్తున్నారో చూస్తూనే వున్నాను! ఈ పద్ధెనిమిది సంచికలూ మీకు అంకితం.

ఇందుకు సూత్రధారి అయి.. “ఫలానా రమణిగారిని ఈసారి పిలవండి…” అని నా పేరు సూచించిన కిరణ్ ప్రభ గారికి మరోసారి వందనాలు. మీ పరిచయం ఇలా రక్త సంబంధాన్ని మించి ఎదుగుతుందనీ, అమెరికా గడ్డ మీద నాకో పుట్టిల్లు ఏర్పడ్తుందనీ, కాలిఫోర్నియా రాష్ట్రంలో ‘డుబ్లిన్’ నగరంలో… ఆనాడు అనుకోలేదు. ఈనాడు అనుభవిస్తున్నాను. కాంతి గారి లాంటి స్నేహితురాలిని పొందడం అదృష్టం.

తెల్లవారు ఝామున ఆగస్టు తొమ్మిదో తారీఖున ఇండియాలో నేను లాండ్ అయ్యాను. మా వారు ఓ పుష్ప గుచ్ఛం తీసుకొచ్చి ఇచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. అప్పటికే మా అబ్బాయి అశ్విన్‌కి ఎమ్.ఎస్. చెయ్యడానికి హ్యూస్టన్‌లో ఎ అండ్ ఎం, కాలేజ్ స్టేషన్‌లో సీట్ వచ్చింది. ఇంటికెళ్ళగానే, అమ్మ ఎదురొచ్చి దిష్టి నీళ్ళు తీయించి వరాలు చేత పారపోయించి, కొబ్బరికాయ దిగ తుడిచి కొట్టింది. అప్పటికింకా  మా కుటుంబం నుండి అమెరికా వెళ్ళొచ్చినది నేను మాత్రమే! అమ్మని చూడగానే కౌగలించుకున్నాను. అన్ని సంగతులూ ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తూనే వున్నా, మళ్ళీ చెప్పేయాలనే కోరిక బలవంతంగా ఆపుకున్నాను. బంధుప్రీతీ, త్వరగా ఎవరినైనా స్నేహితులుగా చేసేసుకోవడం, అందరి మీదా ప్రేమా, కలుపుగోలుగా మాట్లాడగలగడం, వంట చేయడం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ మా అమ్మ నుండే సంక్రమించిన ఆస్తి నాకు!

పిల్లలు నా దగ్గర కూర్చుని నేను చెప్పేవి విన్నారు. మా అశ్విన్ అమెరికా వెళ్తున్నాడంటే, నాకు భయం లేకుండా, ఎంతో ఆనందంగా పంపడానికి నా అమెరికా ట్రిప్ పనికొచ్చింది. అల్లు అరవింద్ గారికి నేను వచ్చినట్లు మెసేజ్ పెట్టాను. ఆయన అంత బిజీ షెడ్యూల్స్‌లో కూడా నా గురించి తెలుసుకుంటూనే వున్నారని చెప్పాను కదా! తెల్లారాకా రామానాయుడి గారికి ఫోన్ చేశాను. ఆయన అన్న మాటలు ఇంకా గుర్తు. “అబ్బా రమణీ! వచ్చేసావా? నువ్వు లేవని, నేను ఫోన్ చేసేదాకా నాకు గుర్తుండేది కాదు… ఎన్నిసార్లు చేసేవాడినో తెలుసా? ఇంకెప్పుడూ ఇన్ని రోజుల పాటు వెళ్ళకు!”. ఎంత ఆప్యాయత లేకపోతే ఈ మాటలు వస్తాయి చెప్పండి? అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా నేను “మీరు నిజంగానే కొండబోలు రవిగారికీ వాళ్ళని నేను ఆటాకి నెవార్క్ వస్తున్నట్లు చెప్తారనుకోలేదు” అంటే… “యూ ఆర్ మై ఫ్రెండ్ ఫర్ లైఫ్… ఇలా చాలా కొద్ది మందినే అంటాను. ఈ మాత్రం చెయ్యలేనని ఎందుకు అనుకున్నావూ?” అన్నారు.

అల్లు అరవింద్ గారు ప్రొద్దుట లేచి మెసేజ్ చూసి ఫోన్ చేశారు. “రాక్షసి వచ్చేసింది  బాబోయ్! అనిపించింది మెసేజ్ చూడగానే… ఎంత హాయిగా వున్నానో ఐరు వారాలు…” అన్నారు. ఐదు వారాలు అని ఆయన జ్ఞాపకం పెట్టుకోవడమే నాకు ఆనందం వేసింది. అసలు అల్లు అరవింద్ గారితో పరిచయం… కొద్దిపాటి స్నేహం వున్నా కూడా తెలుస్తుంది, ఆయన ఎలా మాట్లాడ్తారో… ఎవరికి ఫోన్ చేసినా వారితో తనకి జన్మ జన్మల అనుబంధం అన్నట్లూ, వారి ప్రతి చిన్న విషయానికీ తను ఎంతో ప్రాముఖ్యత నిస్తున్నట్లూ, అవతల వాడికి ‘ఈయనకి నేనంటే ఎంత ప్రేమో!’ అనే అపార్థం కలిగేటట్లు మాట్లాడ్తారు. నాకా బాధ లేదు… నాతో మనసులో వున్నది వున్నట్లు మాట్లాడ్తారు సిన్సియర్‌గా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here