అనుబంధ బంధాలు-28

0
3

[dropcap]సృ[/dropcap]ష్టికి మొదటి జీవి అమీబా అంటారు.

అసలు భూమీ, ఆకాశం, నీళ్ళు, సూర్యుడు, చంద్రుడు, గాలీ ఉన్న తరువాతనే గదా ఈ జీవి జీవాత్మకు అంకురార్పణా?

అంటే మనం అనుకునే అమీబా కంటే ముందు ఇన్ని ఉన్నయి.

ఇవి ఇలా ఎర్పడడానికెంత పరిణామం జరిగిందో తెలీదు. ఎలా పుట్టాయో కూడా తెలీదు. కానీ పుట్టినయి. జీవి పుట్టే వనరు ఏర్పడ్డాకా అదీ పుట్టింది. ఆ ఏకకణజీవి (అమీబా) ఈ మనిషీ దాకా ఎదగడానికి?

అందే ప్రశ్నకాదు. ఊహ చేయాల్సిందే… నిజా నిజాలు తెలీకపోయినా తెలివిగల వాడు సహేతుకంగా చెపితే నమ్మాల్సిందే.

ఇక…

మనిషిలో జ్ఞానం వెలిగిన నాటి నుంచి ఇప్పటి దాకా… మూలాన్ని గురించి…. అన్వేషణ జరుగుతూనే ఉంది.

ఊహ చేశారు… పురాణపద్ధతిలో.

ఆ తరువాత సైన్సు కలిపి చెప్పారు.

ఎవరు ఎలా చెప్పినా నిర్దుష్టమైన నిజం మాత్రం మనకు దొరకలేదు.

ఇక దాన్ని వదిలేద్దాం.

అయితే ఈ మొత్తం జీవరాశిలో ఒక్క మనిషి అన్నవాడే, మెదడుకు పదునుపెట్టగలిగాడు. జంతువులా తిరిగాడు. గుంపులలోకి మారాడు. జనవాసాల్ని వేరుపరచాడు. జీవనోపాధికి జీవన క్రమానికి మార్గం వెతికాడు. నదుల పంచన నగరాన్ని కట్టాడు. రాజ్యాల్ని ఏర్పరచాడు. ఏలాడు. చివరకు మనిషనే వాడు ప్రకృతిని కూడా జయించగలడేమో ననిపించాడు. ఈ మనిషి పరిణామక్రమంలో మధ్యన పుట్టిన వాడే దేవుడు.

ఈ దేవుడెందుకు పుట్టాడు?

ఈయన అవసరమేమిటి?

అంటే…

అప్పటి మనిషి ప్రకృతి ఒడిలో ఉంటూ దాని ఆటుపోట్లను గమనించి వాటిని తట్టుకునేందుకూ మానసికంగా స్థిమిత పడేందుకూ ఆకాశం వంక చూసి, మౌనంగా నిలబడి ఉపశాంతి పొందాడు.

అందుకే కురుస్తున్న వర్షాన్ని, కాస్తున్న ఎండనూ, తిండినిస్తున్న భూమినీ, పీలుస్తున్న గాలీనీ అతనికి ఉపకరించే ప్రతి దానికీ కృతజ్ఞతను తెలుపుకోవాలిగా! అందుకు ఇంధనంగా భగవంతుని అవసరం వచ్చింది.

ఆ తరువాత వృత్తులు పుట్టినయి. మనిషి మనుగడ కోసం… మనుగడ స్థిమిత పడుతుండగా మతాలు పుట్టినయి.

ఇవి మనిషిని సన్మార్గ వర్తనులుగా చేసేందుకు కొన్ని నిబంధనలను నిర్దేశించినయి. మనుషులు, తక్కువగా ఉన్న కాలంలో, అన్ని మతాలు సంతానం కనమని చెప్పినయి. ఇప్పుడు మనిషిని కనేందుకు చోటు దొరకని దశ రాబోతూంది.

కనుక అప్పటి మంచిని వదిలి ఇప్పటి మంచేమిటో గమనించడం మనిషి చేయాల్సిన పని కాదా. ఇలా సాగుతూంది కథ. ఏ పాత్రా లేకుండా…

సమాజాన్నే హీరోగా చేసో, ప్రకృతిని హీరోగా చేసో…

జరుగుతున్న వాస్తవాన్ని కళ్ళముందుంచినా చదివే వాళ్ళు ఉండద్దూ. “చెప్పే పద్దతి బాగుంది కానీ thrill ఏది?” అనుకుంటూ పుస్తకం మూసింది విజయ.

“అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారు?” అని అరక్షణం ధ్యాసను అటుగా మలిపింది. అలికిడి లేదు. లేచి వరండాలోకి నడచింది.

గడపకానుకుని అమ్మ కునికిపాట్లు పడుతూ కనిపించింది. నాన్న జాడ కనిపించలేదు.

“ఎక్కడికెళ్ళి ఉంటాడు?” అనుకుంది గానీ అర్థం గాలేదు.

దీక్షితులు మామయ్య ఇంటికి పోయొద్దాం అనిపించింది.

అమ్మతో అమ్మా “మామయ్య దగ్గరికి పోయి వస్తాను” అని చప్పింది. ‘ఉఁ! ఆఁ!’ అంది సీతమ్మ మగతలో నుంచే…

తోవకొచ్చింది.

చుక్కమ్మ నిండు చూలాలిగా బస్‌స్టాండు వైపో ఏమో వెడుతూ కనిపించింది. “అసలిది చుక్కమ్మేనా? అని అనుమానం వచ్చింది మొదట. బాగా చూస్తే గానీ తెలియలేదు. ఈ లోపు అదే గుర్తించింది.

“ఏందీ! అలా చూస్తున్నావూ? నేను చుక్కని” అంది ఆయస పడుతూ…. అంత నిస్సత్తులోనూ దాని ముఖంలో కాంతి.

“ఏంటే? బావున్నావా? పెళ్ళయి అత్తారింటికి పోయావన్నారు?” అంటూ దగ్గరికి వెళ్ళింది. ఎత్తుగా ఉన్న పొట్ట వైపు చూసింది.

సిగ్గుపడింది చుక్కమ్మ.

ఆ సిగ్గులో మాతృత్వపు ఇది కనిపించింది.

కాపురానికి కెళ్ళడం పాపం ఆరు మాసాల తరువాత నుంచీ కనిపించిన వాళ్ళల్లా ‘ఇంకా ఏం లేదా?’ అని మొదలెడతారు. కాపురం చేసి కనేవాళ్ళు కంటే మాలావు తొందర వాళ్ళకు. పైగా ఏం లేదు అనగానే జరగరాని అనర్థమేదో జరిగిపోతున్నట్లుగా వెధవ ముఖం పెడతారు . మరి కొందరైమో దగ్గరిగా జరిగి చెవిలో ‘ఏంటంట?’ అంటారు.

ఈ ఆడంగులు ఎందుకిలా అలవాటు పడ్డారో అర్థమేగాదు. వెనకట ఇలా లేదట. మా తాతగారు ముప్పై మూడేళ్ళ వయసప్పుడు ఏడేళ్ళ నాయనమ్మను పెళ్ళాడాడట. ఆవిడ కాపురానికి వచ్చేసరికి ఇంకా ఏడనిమిదేళ్ళయినా గడచి ఉండచ్చుగా. అంటే తాతయ్య నలభై ఏళ్ళదాకా అస్కలిత బ్రహ్మచారేనన్నమాట. ఇప్పుడసలు ఈ కాలమేంటో అవగతమై చావడం లేదు. ఇరవై వస్తుంటేనే పెళ్ళి పెళ్ళి అంటున్నారు. ఏడాదయినా సరిగ్గా తిరగకుండానే పసివాణ్ని భుజానేసుకుంటున్నారు.

చుక్కమ్మ అలా కాదు. అది కాపురానికి పోయి రెండేళ్ళ పైనే అయింది.

“దీనికిప్పుడే కాపురమేంటి?” అనుకుంది. ఇప్పుడది నిండు చూలాలిగా ఎదురుపడింది. అసలిది మొదటి కానుపా? కాదా? అడుగుదామనుకుంది. అడిగింది కూడా.

ఒకటి రెండు కాదట, మూడోకానుపట.

“ఈ సారి ఆపరేషను చేయించుకోవాలని నాల్గు నెలల నుంచీ వైద్యం చేయించుకుంటుదట.” ఇంతా చెప్పి చేతులు పట్టుకుని…. ‘బావున్నావా?’ అడిగింది మళ్ళీ.

“కనపడతున్నాను గదా! ఇట్టా ఉన్నాను. నీ సంగతేంటి?” అన్నది విజయ.

“ఈ బరువు దిగగానే ఆపరేషను చేయించుకోవాలి” అని “వంట్లో మరీ నీరసంగా ఉంటుంది. అరగంట కూర్చుంటే చాలు కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నాయి. అట్టా అని మాములుగా నడక ప్రారంభిస్తే శక్తి చాలడం లేదు. ఒకరి ఆసరాతోనో ఆధారంతోనో నడవటం నాకు ఇష్టం అనిపించదు” అంది నవ్వుతూ.

“మాటలు తగ్గలేదు” అంది విజయ.

“అవి లేకపోతే ఇంకా పీల్చి పిప్పి చేస్తారీ మగవాళ్ళు” అంది ‘నువ్వు జాగ్రత్తోయ్’ అన్నట్లుగా చూస్తూ.

“అంటే సంసారం సాగరంలా ఉందా ఏమిటే?”

“సంసారం ఎట్టాగో ఉంటే ఇద్దర్నెలాకన్నాననుకున్నావు? ఇదేమైన పురాణకాలమా సంకల్పమాత్రాన కనేయడానికా?” అని నవ్వింది.

“ఎక్కడిదాకా?”

“టౌనుకు. వైద్యానికి.”

“పోకపోతే ఏం?”

“ప్రసవానికి తేదీ ఇచ్చింది డాక్టరమ్మ. అంత డిగ్రి పెట్టుకున్నాక ఆవిడదేదో ఆవిడకివ్వాలి గదా. ఆందుకే వెళ్తున్నాను” అంది నవ్వుతూ.

దీనికసలు బాధలు లెవ్వా? లేకపోతే వాటిని మరచేందుకు నవ్వుతూ ఉంటుందా అర్థం గాలేదు.

“విజయా ఎన్నాళ్ళుంటావే?” అంది భుజం పై చేయ్యేసి.

ఏమిటీ ఆత్మీయత నేనేమిచ్చాను దీనికి అనుకొని “ఓ నెల ఉందామనే వచ్చాను” అంది.

“నాల్గుయిదు నెలలకే మగడంటే మఖం మొత్తిందా ఏంటే?” అని గలగలా నవ్వి, “తాలింపు పెట్టినాడు చింతకాయ చెట్నీ చాలా బావుంటుంది. కమ్మటి వాసనతో. నాలుగు రోజులు వరసగా వేసుకుంటే దాన్ని చూస్తే పారిపోవాలనిపిస్తుంది. వస్తువు ఒక్కటే మనం కావాలని చేసుకంటే కానీ వాడకంలో మొహం మొత్తాక భరించలేం. ఇదీ అంతే” అంది.

అదే నవ్వు ఎంత నిండుదనం. ఎంతటి స్వచ్ఛత.

చందమామ చల్లదనం.

అలా చూస్తూ ఉండాలనిపించింది. కానీ దాన్ని అలా నిలబెట్టడం ఇష్టం లేక “అదేం కాదు లేవే నా పద్ధతిలో నేనుండే మనిషిని. తెల్సుగదా” అంది విజయ.

“మొదట్లో ఒకర్నొకరు విడివడి ఉండటం కష్టం అనిపిస్తుందే. శారీరకంగా సుడిపడిందాకా కలవాలని, కొంచం ఓపిక రాగానే మళ్ళీ సుడిపడిపోవాలని. చిన్న ఎడబాటును కూడా సహించే ఓపిక ఉండదు. పాలు పడితే అదీ రోతే” అని నవ్వుతూ “ఇక వెళ్తాలేవే? నువ్వెటు బయలుదేరావో ఏమో?” అని బస్సుస్టాండు వైపు నడచింది.

నా మనస్సును కూడా ఇది చదివిందా అనిపించింది. ఓ క్షణం అలాగే వెళ్తున్న దాన్ని చూస్తూ ఉండిపోయింది విజయ.

తేరుకుని దీక్షితులు మామయ్య ఇంట్లోకి నడచింది. బియ్యంలో రాళ్ళు ఏరుతున్న శాంతమ్మ విజయను చూసి బియ్యం చాటను అక్కడే వదిలేసి “రా! రావే!” అంటూ ఎదురుగా వచ్చింది. వెంట పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళిది. మామయ్య జాడ కనిపించలేదు.

“మామయ్యేడి?” అడిగింది.

“నేను అక్కర లేదా ఏంటే?” అంది శాంతమ్మ ప్రేమగా చూస్తూ…

విజయను చూడగానే కొడుకు గుర్తుకొచ్చాడు. అతగాడు ఇంతే, రాగానే “నాన్న ఏడి?” అనేవాడు.

ఈ పిల్లల్ని శాంతమ్మ ఎంతగా ప్రేమించినా వీళ్ళు మాత్రం ఆయనంటేనే బావుంటారు. వీళ్ళకు ఆయనలో ఏం అర్థమైందో తలీదు. ఇన్నేళ్ళ కాపురములో అర్థంగానంత వీళ్ళకు ఎలా అర్థమయ్యాడు అనిపించేది.

“ఆఁ ఇక మీరు వెళ్ళిరండి” అంటూ ఎవర్నో గడపనుంచే వెనక్కి మలిపి లోనికొచ్చాడు దీక్షితులుగారు. ఆయన మాట వినపడగానే విజయ చెంగున లేచి వెళ్ళింది.

“అయితే నువ్వు ఇక్కడికే వచ్చావన్నమాట” అన్నాడు దీక్షితులు. తల ఊపింది అవునన్నట్లుగా.

“ఇదిగో పిల్లది వచ్చింది. కాఫీ అయిన నీ చేత్తో కలిపి ఇస్తావా, దాన్నే కలపమంటావా?” అన్నాడు లోనికి చూస్తూ పెద్దగా.

“దాని వెనుకే మీరు వస్తుంటిరి గదా! ఇంతలో నేనేమిచ్చేది” అంది శాంతమ్మ.

“మంచి పని చేశావులేగానీ కాఫీ పనికానియ్” అన్నాడు.

“మీరు చెప్పలేదని ఆగాను” అంది కొంచెం కోపంగా.

“ఓర్నీ! ఇదిగో విజయ దానికి మనిషికి వచ్చినంత కోపం వస్తుంటుందోయ్ అప్పుడప్పుడు. ముందు ముందు మనం కొంచం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది” అని నవ్వి “ఇకరా ఇట్టా కూర్చో” అన్నాడు తనూ కూర్చుంటూ.

విజయ కుర్చున్నాక “ఆఁ ఇక చెప్పు నాన్న ఎందుకలా ఉన్నాడు?”

తల వంచుకుని కూర్చుంది తప్ప మాటాడలేదు.

“అమ్మడూ నువ్వు చెప్పక వాడు చెప్పక అసలు సంగతి తెలిసెదెట్లు చెప్పు?” అన్నాడు.

“నాన్నను ఆయన స్కూటరడిగాడు” అంది మెల్లగ.

“మనం ఇస్తానన్నట్లు లేదు.”

“అవును అనలేదట. కానీ ఇదీ అడగాలా? అన్నాడు ఇది చిరుకానుక అయినట్టు. మూడు ముళ్ళు వేసిన మగ వెధవ ఎవడికైనా ఇది ఇవ్వంది లాంఛనం పూర్తి కానట్టా?”

“అంటే ఇవ్వాల్సిందే అన్నాడన్నమాట. అంతేనా?”, అని, ‘అసలే అప్పుల్లో ఉన్నవాడు చిరుకానుక కోసం మరో ఇరవై వేలు అప్పు చేయక తప్పదన్నమాట’ అనుకొని “ఇదన్నమాట వాని చికాకు” అన్నాడు.

“మరి కొత్త అల్లుడితో ఏం చెప్పాడేంటి?”

“ఎక్కడి నుంచి తెస్తాడు? పాత బాకీ అలానే ఉంది” అంటుడగా శాంతమ్మ పొగలు గక్కుతున్న కాఫీ ఇచ్చింది.

కాఫీ కప్పు చేతిలోనికి తీసుకొని ‘ఈ మాట విన్నావా?’ అనడిగాడు శాంతమ్మను.

“ఏంటది?” అంది.

“సాంబయ్య అనే పేరు విన్నావా ఎప్పుడైనా?”

“సిమెంటు ఫ్యాక్టరీ సాంబయ్యేనా?”

“ఆఁ”

“అయితే ఏంటంట?”

“అతగాడ్ని పది లక్షలు పంపించమని నక్సలైట్లు ఉత్తరం వ్రాసారట.”

“వ్రాస్తే?…”

“డబ్బు కట్టకపోతే ఎక్కడ చంపుతారోనని హడలి చస్తున్నాడు.”

“ఎప్పుడైనా పోయేదేగద ఈ ప్రాణం. జరిగేదేదో జరగనియ్యడమే.”

“అట్టా అనుకోలేడు గదా!”

“కాక చేసేదేముంది?”

“సాంబయ్యే ఎందుకివ్వాలట?” అడిగింది వీజయ.

“వ్యాపారంలో అధిక లాభాలు గడించినందుకు.”

“అందుకు ప్రభుత్వం తరుపున Income Tax, Sales Tax, Super Tax, Termous Taxలు” ఉన్నాయి గదా వీరు జనానికేం చేస్తున్నారని?”

“ఇప్పటికి చేయకపోయినా వీటికి తోడు Naxals Tax అన్నదాన్ని కూడా కలుపుకోవాలి మనం” అని, “ఆ, మరచాను రౌడి మాముళ్ళు ఇవ్వాలి గాద అంచేత Roudi Tax కలుపుకోవాలి తప్పదు.”

“అంటే?”

“ఏం లేదు కమ్యూనిజం పుస్తకాల్ని అర్థం కాకపోయినా చదివేసే నాల్గు మాటలు ఆ పక్కీలో మాటాడేందుకు తలపడుతున్నారు. సిద్ధాంతం ఆచరణా అనేవి బొత్తిగా కలవవు.”

“అదెలా? ఆచరణ లేని సిద్దాంతం అసలెందుకు? ఎవర్ని ఉద్ధరిస్తుంది?”

“ఎవర్ని వారు ఉద్ధరించుకునేందుకు ఉపకరిస్తుంది” అన్నాడు నవ్వుతూ

“అందుకు ఇంత సిద్ధాంత రాద్దాంతా లెందుకు?”

“అవి జనం వినేందుకు, ఇవి మనం అనుభవించేందుకు.”

“జనం వేరు? మనం వేరూనా?”

“కాక… జనం జనమే… మనం మనమే”

“అదేం లేదు దీన్ని ఎవ్వరూ కాదనలేరు ఈ సమాజం అలా ఉంది.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here