[box type=’note’ fontsize=’16’] గూడూరు గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన నవల ‘ఎండమావులు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ భాగం. [/box]
32
[dropcap]సం[/dropcap]ధ్యతో సహా తాళాలు తీసుకుని సౌందర్య బంగ్లా చూడ్డానికి బయలుదేరాడు. తనతో తల్లిదండ్రుల్ని రమ్మనమన్నాడు సుధాకర్. అయితే ‘తరువాత వెళ్ళవచ్చులే మొదట మీరు వెళ్ళి చూసి రండి’ అని అన్నాడు సారధి.
బంగ్లా సమీపించిన సుధాకర్ కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లాడింది. ఒకప్పుడు తను ఈ బంగ్లా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు పిచ్చి మొక్కలు మొలిచాయి. బంగ్లా లోపల విశాలమైన ప్రాంగణం కూడా ఉంది. అక్కడ నర్సింగ్ హోమ్ కట్టుకోవచ్చు.
బంగ్లా చూస్తుంటే అతని మదిలో సన్నని బాధ. అనేక ఆలోచన్లు. అతని ఆలోచన్ల అన్నీ సౌందర్య గురించే. సినీ ప్రపంచం హరివిల్లులా రంగులమయం. అంతేకాకుండా నీటిబుడగల్లా క్షణభగురమయినది. నీటిబుడగలాంటి ఈ జీవితమే శాశ్వతమనుకుంటే పొరపాటే.
సినీజీవితంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వాళ్ళు ఒక్కసారి పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. క్రిందకి దిగజారి పతనావతస్థకి చేరిన వాళ్ళూ ఉన్నారు. ఇదే పువ్వులమ్మిన చోట కట్టెలమ్ముకోవడం అని అంటారు.
ఇంద్రధనస్సులాంటి రంగుల ప్రపంచంలో విహరిస్తూ తన తళుకు బెళుకుల్తో, తన హావభావాల్లో ప్రేక్షకలోకాన్ని మైమరిపించిన కళాకారిణిగా పేరుగాంచిన సౌందర్య జీవితం అచిరకాలంలో విచ్చిన్నమయిన నీటి బుడగయింది.
రంగుటద్దాలలో సమాజాన్ని చూసిన వాళ్ళకి ఈ సినీ జీవితం, ఈ సినిమా వాళ్ళ జీవితాలు రంగులమయంగా అగుపడుంది కాని ఆ అద్దాలు తీసివేసిన తరువాత ఈ సినీ సమాజం యొక్క నగ్న రూపాన్ని చూడగానే ఆమె ఎంత, ఎటువంటి భ్రమతో కూడిన జీవితం గడిపిందో అర్థమవుతోంది.
సినీ జీవితంలో ప్రేక్షకుల – అభిమానుల నుండి పొగడ్తలు సన్మానాలు – బహుమతులు, అవార్డులు, రివార్డులతో ఆరంభమయిన సౌందర్య జీవితం రాను రాను దుర్భరంగా మారింది. పరిస్థితుల ప్రభావం.
సినీ ప్రపంచం చాలా గమ్మత్తయినది, విచిత్రమయినది. ఈ సినీ జీవిత వైకుంఠపాళీ ఆటలాంటిది. చుట్టూ అనేక చిన్న చిన్న పాములు, పెద్ద పాములు కాటువేయడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. ఆ పాముల కాటుకి గురయిన వాళ్ళు మరికోలుకోలేకుండా మృత్యుముఖంలోకి అడుగుడినట్టు ఈ సినీ ప్రపంచంలోని పాముల్లాంటి వాళ్ళ కాటుకి జీవితాలకి జీవితాలే నాశనమవుతున్నాయి.
పరుగు పందెంలాంటి ఈ సినీ ప్రపంచంలో ఓనాడు విజయం సాధించినవారు రోజులు గడుస్తున్న కొలదీ క్రొత్త ట్రెండులో పోటీపడలేక వెనకబడిపోతున్నారు. క్రొత్తనీరు వచ్చి పాత నీరును త్రోసివేసినట్లు క్రొత్తవారితో, క్రొత్త పోకడల్తో పోటీ పడలేక వెనకబడ్తున్నారు.
అంతవరకూ ఆమె నటన మీద మోజు – ఆసక్తి పెంచుకున్న ప్రేక్షకులు క్రొత్త వారి వేపు మొగ్గు చూపించడం అది చూసి పాతవారు నిరాశ నిస్పృహలకి లోనవడం సహజం. ఈ గ్లామరు ప్రపంచంలో తమ గ్లామరు పడిపోయిందని నిట్టూర్పు విడిస్తారు. మగ, ఆడా అని తేడా లేకుండా డిప్రెషనుకి లోనయి మత్తు మందుకి అలవాటు పడ్తారు తాత్కాలిక బాధని మరిచిపోడానికి. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. క్రొత్త తారల దగ్గర వాళ్ళ అస్తిత్వమే లేకుండా పోతుంది. ఓనాడు సౌందర్య మహానటి- గొప్పనటి. ముఖ్యమైన విషయమేమిటంటే, తన పాటలు తనే పాడుకునేది. ఆమె అందమే ఆమెను మహానటిగా చేసింది. ఆమె నటించిన సినిమాకి గొప్ప డిమాండ్ ఉండేది. నవరసాలు పోషించడంలో ఆమెకి ఆమే సాటి. ఆమెకి సాటి రాగలిగే వారు లేరు. ఆమె చిటికేస్తే కొండమీద కోటినయినా తీసుకురావల్సిందే, డైరక్టర్లు, నిర్మాతలు ఆమె కోసం పడిగాపులు పడేవారు. ఇంపాలా కారులో కాలు క్రింద పెట్టకుండా మహారాణిలా ఉండేది.
విషాదభరితమైన సన్నివేశాల్లో అందరి కళ్ళ వెంబడి తెప్పించేది. ఆమె నటన హాయిహాయిగా ఉండేది. హావభావాలు ప్రేక్షకుల్ని మైమరిపించేవి. పెద్ద రాజభవనం లాంటి బంగళాలో నౌకర్లు, చాకర్లుతో అంత వైభవోపేతంగా ఆమె జీవితం గడిచిపోయేది. అలాంటి ఆవిడ ఈ రోజున రోడ్డున పడింది. బాట తప్పిన బ్రతుకు అయింది ఆమెది. అందుకే అంటారు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని.
బంగ్లా చూసిన తరువాత కళ్ళలో కన్నీరు చిప్పిల్లాడుతూ ఉండగా సుధాకర్ ఆలోచన్లు ఇలా సాగిపోతున్నాయి.
అవతల సంధ్య ఆలోచన్లు మరో విధంగా ఉన్నాయి. పెళ్ళయిన తరువాత కూడా పుట్టింట్లో ఉంటానంటే ఎవ్వరూ హర్షించరు. సుధాకర్ కూడా ఒప్పుకోడు. తన తల్లిదండ్రులకి అల్లుడ్ని ఇల్లరికం తెచ్చుకోవాలని కోరిక ఉన్నా అది జరిగే పనికాదు. తను ఎలాగ తల్లిదండ్రులకి ఒక్కతే కూతురో అలాగే అతని తల్లిదండ్రులకి అతను ఒక్కడే కొడుకు.
ముఖ్యంగా అత్తవారిల్లు, పుట్టిల్లు ఒకే ఊరులో ఉంటే అనేక చిక్కులు, అనేక సమస్యలు కూడా. అదే వేరు వేరు ఊర్లలో ఉంటే ఏ సమస్యలూ లేవు. నిజం చెప్పాలంటే అత్తవారింటిలో తను ఇమడలేకపోతోంది. అక్కడికి అత్తగారు తనను అపురూపంగా చూసుకుంటూనే ఉంది. అయితే అక్కడ వాతావరణంలో తను ఉండడానికి మసలడానికి, ఇబ్బంది పెడుతోంది.
తమిద్దరూ వేరు వేరు గ్రామాల్లో ప్రాక్టీసు చేస్తున్నారు. ఉదయం వెళ్ళిపోతే తిరిగి రాత్రే కలుసుకోవడం. తన తండ్రి పెళ్ళి కానుకగా నర్సింగ్ హెూమ్ కట్టి ఇస్తానన్నారు. ఆ నర్సింగ్ హోమ్ అక్కడే కట్టించినా బాధే. తను తిరిగి అత్తవారింటిలోనే ఉండాలి. సంధ్య ఏంటి ఇంత సంకుచితంగా ఆలోచిస్తోంది. తన తల్లిదండ్రుల్ని అంత ఎక్కువగా ప్రేమించి అభిమానించిన సంధ్య అత్తమామల దగ్గర ఇలా ప్రవర్తిస్తోంది ఏంటి అని సుధాకర్ అనుకోవచ్చు. అయితే తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది. ఇది తనలో వచ్చిన మార్పా?
ఈ బంగ్లా చాలా బాగుంది. బంగ్లా లోపల నర్సింగ్ హోమ్ కట్టుకోడానికి కూడా విశాలమైన స్థలం ఉంది. తమిద్దరూ బంగ్లాలో ఉంటూ ప్రాక్టీసు పెట్టచ్చు. ఇలా సాగుతున్నాయి సంధ్య ఆలోచన్లు.
“సంధ్యా!” పిల్చాడు సుధాకర్.
“ఊఁ!!” ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్తూ అంది.
“నీవు ఏంటి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.”
“ఏంటి?”
“ఇక్కడ ప్రాక్టీసు పెడ్తే ఎవరి బాధా లేకుండా స్వేచ్ఛగా, స్వంతంత్రంగా ఉండొచ్చు అని కదూ!”
సంధ తృళ్ళిపడింది. ‘ఇతనికేఁ ఎదుటివాళ్ళ మనసులో మాట తెలుసునా’ అని అనుకుంది. పైకి మాత్రం. “నేనంత సెల్ఫిష్‌నా?” అంది చిరుకోపంతో.
“ఏదో సరదాగా అన్నాను” సుధాకర్ నవ్వుతూ అన్నాడు.
ఆ తరువాత బంగ్లా తాళాలు తీసి లోనికి వెళ్ళారు వాళ్ళు. రూములో నేలమీద దుమ్ము పేరుకుపోయి ఉంది. అయితే చాలా విశాలంగా ఉంది. ఫర్నీచరు కూడా సర్ది పెట్టినట్లు ఉంది. ఇల్లు చూడగానే ‘అమ్మయ్య ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి’ అని సంధ్య అనుకుంటూ ఉంటే, ‘ఎవరికి ఏది రాసి పెట్టుందో? నుదుటి రాతను ఎవరూ తప్పించలేరు’ అని సుధాకర్ విరక్తిగా అనుకుంటున్నాడు.
33
కొంతమంది ఒక కష్టం, ఆపద, సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా ఉండాలని ఆశిస్తారు. ఆ సమస్య ఎందుకు వచ్చింది. విశ్లేషించి కారణం వెతుక్కోడానికి దానికి పరిష్కారం ఆలోచించి అది దొరికే వరకూ ఒంటరిగా ఉండాలనే వాంచిస్తారు. తన సమస్య తనే పరిష్కరించుకోవాలనుకుంటారు.
అనుకున్నది సాధించాలంటే నైపుణ్యం, తెలివితేటలూ, కృషి పట్టుదల వీటితో పాటు నిరంతరం శ్రమ అవసరం. ఇవన్నీ ఉన్నా ఒక్కొక్క సారి విజయం మనల్ని వెలివేస్తుంది. అపజయం ఎదురవుతుంది. అలా జరిగినప్పుడు ఏ మాత్రం కృంగిపోకుండా ముందుకు వెళ్ళాలి. జీవితం ఇలా అయిపోతుయిదేమిటని అధైర్యపడకూడదు. మన సాధన మనం చేస్తూ ఉండాలి.
అన్ని సమస్యలకీ పరిష్కారం కూడా ఉంటుంది. ఒకే కోణంలో ఆలోచించి పరిష్కారం లేవనుకోవడం మూర్ఖత్వం, తెలివితక్కువతనం. విభిన్న కోణాల్లో ఆలోచించి పరిష్కార మార్గం వెతకాలి.
సంధ్య ప్రవర్తనే తనకి సమస్యగా మారింది. పాజిటివ్ దృక్పథంలో ఆలోచించినా కూడా ఆమె నెగిటివ్ దృక్పథం తనకి చికాకు పరుస్తోంది. తమ పెళ్ళికి ముందు ప్రతి సమస్యని ఎంత పాజిటివ్‌గా స్పందించేది. సంకుచిత తత్వాన్ని తన దరిదాపుల దగ్గరకి రానిచ్చేదేకాదు.
ఆమెకి తల్లిదండ్రుల మీద ఎంత అభిమానం? తన తల్లిదండ్రుల మీద ఆమె కనబరుస్తున్న ప్రేమనురాగాలు ఆమె నోటి వెంబడి విన్న తరువాత తనకి తన తల్లిదండ్రుల మీద కరడు గట్టిన ద్వేషభావం తొలగింది. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవల్సిందే. తనలో ఉన్న నెగిటివ్ భావోద్వేగాలని, భావోద్రేకాల్ని పొగొట్టింది. తను చేసిన తప్పేటో తనకి తెలియజేసింది. అలాంటి సంధ్య పెళ్ళి అయిన తరువాత తన తల్లిదండ్రుల మీద చూపిస్తున్న ఉదాసీనతను తను తట్టుకోలేకపోతున్నాడు.
అందుకే తన సమస్యకి తనే సమాధానం వెతుక్కుంటున్నాడు. చూడ్డానికి ఇది చిన్న సమస్య, చాలా చిన్న సమస్య. ఈ సమస్యను బాగా ఆలోచించి పరిష్కార మార్గం వెతకాలి. తన వల్ల ఇప్పటి వరకూ తన తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యాడు. ఇప్పుడు సంధ్య ప్రవర్తనతో ఇబ్బంది పడ్తున్నారు.
బంగ్లా అంతా కలయజూస్తూ ‘విశాలమైన ప్రాంగణం కూడా ఉంది. ఇందులోనే నర్సింగ్ హోమ్ నిర్మించుకోవచ్చు. నివాసం, హాస్పటల్ ఒకే ప్రాంగణంలో ఉంటాయి’ అనుకుంటూ అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుని ఆలోచిస్తోంది సంధ్య.
“సంధ్యా!” పిల్చాడు సుధాకర్.
ఆలోచనల్న నుండి బయటపడిన సంధ్య “ఊఁ” అంది.
“ఏంటి ఆలోచిస్తున్నావో చెప్పనా?”
“ఏంటి ఆలోచిస్తాను?”
“ఇక్కడ నర్సింగ్ హోమ్ కట్టుకుని ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది? రోజూ ఆ పల్లెటూరికి వెళ్ళి వైద్యం చేసే బాధ తప్పుతుంది. చక్కగా నేను నా భర్త, పుట్టే పిల్లల్లో హాయిగా ఉండచ్చు అని అనుకుంటున్నావు కదా!”
“మీరు మొదట చెప్పినవన్ని నిజం. చివరి వాక్యాలే నాకు నచ్చలేదు. నేను అంత స్వార్థపరురాల్ని అనుకుంటున్నారా?”
“మా వాళ్ళ యడల నీ ప్రవర్తన చూస్తే అలా కోవల్సివస్తోంది సంధ్యా! ఒక్క విషయం మొదట నేను నా తల్లిదండ్రుల్ని ద్వేషించిన విషయం నిజమే. ఆ తరువాత నీ తల్లిదండ్రుల్ని నీవు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసిన తరువాత తల్లిదండ్రుల విలువ నాకు తెలిసి వచ్చింది. ఒక విధంగా నాలో మార్పు తెచ్చిన దానిని నీవే.
పెళ్ళయిన తరువాత నీ తల్లిదండ్రులు నాకు అత్తమామలయినా నాకు తల్లిదండ్రుల్లో సమానం. అలాగే నీకు కూడా నా తల్లిదండ్రులు అత్తమామలయినా తల్లిదండ్రుల్తో సమానం.
మా తల్లిదండ్రులు ఇరుకు గదుల్లో నివసిస్తున్నా వారి మనసులు మాత్రం ఇరుకు కాదు. అమ్మ నిన్ను ఎంత అభిమానిస్తోంది? నీ విషయం నీవు అర్థం చేసుకోలేదు.
ఇంట్లోని ప్రవర్తన గమనిస్తున్నాను. అంత సంతోషదాయకంగా నాకు అగుపడటం లేదు. నీ ప్రవర్తనకి పెద్దవాళ్ళు బాధపెడ్తున్నారు తెలుసా?
మొదటి నుండి నీ స్వభావం ఒకలా ఉంటే సరిపెట్టుకోవచ్చు. కాని నీలో వచ్చిన మార్పే నాకు బాధ కలిగిస్తోంది. నీ ప్రవర్తన చూసి అహంకారం అని అనుకోడానికి ఆస్కారముంది.
అహంకారం ఉంటే మనిషి దృష్టి మందగిస్తుంది. జీవితం విషపూరితంగా మారిపోతుంది. అహంకారం ఉన్న వాళ్ళకి అందరూ పనిముట్లగానే అగుపడ్తారు. అహంకారం ఉన్నచోట స్వార్థమే తప్ప ఏమీ ఉండదు. అన్నీ తనకే కావాలి, అందరూ తనకే తలవొంచాలి, అన్న దురహంకారం ఉంది. అహంకారంతో అన్ని పనులు నెరవేరవు. అహంకారంలో అసంతృప్తి కూడా ఉంది. అహంకారం స్థానంలో వినయం ఉండాలి. వినయం ఉన్న చోట ప్రేమ ఉంటుంది.
నీలో అహంకారం లేకపోవచ్చు స్వార్థం లేకపోవచ్చు. అయితే ఎదుటి వాళ్ళ యడల నీ ప్రవర్తన గమనిస్తే తప్పకుండా ఎదుటి వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు సంధ్యా.
మరో విషయం మన ప్రవర్తన, గుణం, క్రమశిక్షణ మనల్ని ఎదుటి వాళ్ళ దగ్గరకి చేరుస్తాయి. ఏ పనిలోనైనా విజయాన్ని చేకూరుస్తాయి. వినయంతో ఎంతటి కఠినాత్ముల మనస్సునయినా మనం జయిచవచ్చు. ఏ పని నయినా సాధించవచ్చు.
చదువుకున్న మనం గర్వపడకుండా వినయ విధేయతలు కలిగి ఉంటే అటువంటి వాళ్ళ విద్య ఉన్నతమైనదనీ, అది కలిగిన వాళ్ళు ఉత్తములని అని అందరూ అనుకుంటారు. విద్యవలన వినయం కలగాలే కాని అహకారం కల్గ కూడదు.”
సుధాకర్ చెప్పిన మాటలు ఆమెకి ఈటెల్లా తగుల్తున్నాయి. ఆత్మవిమర్శ చేసుకుంటోంది సంధ్య.
నిజమే సుధాకర్ చెప్పినట్టు తను ఈ మధ్య స్వార్థపరురాల్లా, అహింభావిగా తయారయింది. తన భర్త తన తల్లిదండ్రుల్ని ప్రేమించి అభిమానించిన విధంగా తను అతని తల్లిదండ్రుల్ని అభిమానించ లేకపోయింది. తన చుట్టూ గిరి గీసుకుని కూర్చోంటోంది.
అత్తవారింటి అస్తిత్వం మీద విముఖత చూపిస్తోంది. ఆడపిల్లలకి పుట్టింటి వారి మీద మమకారం ఉండడం సహజమే, అయితే అత్తింటి వాళ్ళమీద కూడా అభిమనం పెంచుకోవాలి. అలా పెంచుకోలేకపోతుంది. ఇప్పుడు పరిసరాలలో ఇమడ లేకపోతోంది అంటే అది తనలో ఉన్న దృష్టిదోషం-భావదోషం అని; తన ఈ బలహీనత తన వ్యక్తిత్వాన్ని దెబ్బతిస్తుంది. ఎన్ని గుణాలున్నా, ఏపాటి దుర్గుణం ఉన్నా అది సుగుణాన్ని మరుగుపరుస్తున్నాయి.
ఇకనయినా తన ప్రవర్తన మార్చుకోవాలి అత్తమామలకి కూడా తన భర్త తప్ప మరెవరున్నారు? తన తల్లిదండ్రులకి కూడా తను తప్ప ఎవరున్నారు? జీవన చివర దశలో పెద్దవాళ్ళకి కావల్సింది కాస్తంత సాంత్వన. నేడు వాటిని అందించకుండా పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్చే కొడుకులూ ఉన్నారు.
తను తన ప్రవర్తన మార్చుకోవాలి ఎదుటి వాళ్ళు శాంతిగా ఉంటే మనం శాంతిగా జీవించగలుగుతాము. – ఇలా సాగిపోతున్నాయి సంధ్య ఆలోచన్లు.
“సంధ్యా! నేను నా మాటల్తో నిన్ను బాధ పెట్టాను. సారీ!”
“లేదు… లేదు. నేనే నా ప్రవర్తనతో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాను. నేనే సారీ చెప్పాలి” అంది సంధ్య.
తేలికపడ్డ మనసులో లేచారు ఇద్దరూ.
(ఇంకా ఉంది)