[dropcap]ని[/dropcap]యోగి సాహితీవేత్తల సంక్షిప్త పరిచయాల పుస్తకం అక్షర నక్షత్రాలు. ఈ పుస్తక రచనలో ఎవరిని ఏ రీతిన కొలమానించారో అన్న విషయంలో నియోగి గారు తన అనుభవాన్ని, లౌక్యాన్ని రంగరించి మన ముందుంచారని, ఏ ఒక్క ముత్యాన్నీ ఆయన వదిలిపెట్టలేదని, తెలుగునాట కల అక్షర నక్షత్రాలను సాహితీ వినిలాకాశంలో కుమ్మరించారని ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ వై.ఎస్.ఆర్.శర్మ గారు ముందుమాటలో రాశారు.
111 మంది ఆధునిక తెలుగు రచయితల జీవిత, పాండిత్య జీవితాల పరిచయం సమాహారం. ఒక్కొక్కరినీ మూడు పుటలలో ఆవిష్కరించారు. ఇది 21వ శతాబ్ద గ్రంథం అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అభినందించారు.
తెలుగు అక్షర సంపదను నిక్షిప్తం చేసిన ఈ సంపుటి సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఉపయోగపడడంతో పాటు, వారిని మరింత లోతుగా సాహిత్యాన్ని అధ్యయనం చేయటానికి ఉపయోగపడుతుందని చింతపట్ల సుదర్శన్ వ్యాఖ్యానించారు.
ఈ గ్రంథం సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉండే విధంగా రూపుదిద్దుకుందని వి.ఆర్. విద్యార్థి రాశారు. నియోగి ఏదో ఒక వాదానికో, మరో దానికో కట్టుబడకుండా కవుల్ని ఎంపిక చేసుకోవడం వల్ల అనేక సాహిత్య విషయాలు, విశేషాలు తెలుసుకోగలుగుతామని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి, పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడుతుందని కేతవరపు రాజ్యశ్రీ రాశారు.
‘తెలంగాణా వైతాళికుడు సురవరం’ అన్న పరిచయంతో ప్రారంభమైన ఈ పుస్తకంలో శ్రీపాద, కాళోజి, విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, దాశరథి, ముఖ్దూం మొహిద్దీన్, తిలక్, ఆరుద్ర, శేషేంద్ర, బుచ్చిబాబు, శ్రీరంగం నారాయణబాబు, కరుణశ్రీ వంటి వారితో పాటు అనిశెట్టి ప్రభాకర్, ధేనువకొండ, కలేకూరి వంటివారితో సహా మొత్తం 111 మంది కవి/రచయితల పరిచయాలు ఉన్నాయి.
***
అక్షర నక్షత్రాలు
(111 మంది సాహితీవేత్తల పరిచయలు)
రచన: నియోగి
ప్రచురణ: భారతీతీర్థ
పేజీలు: 348
వెల: రూ.360/-
ప్రతులకు:
29-185, న్యూ విద్యానగర్,
నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి,
సికింద్రాబాద్ 500056
మొబైల్: 9553097219