సత్యాన్వేషణ

22
3

[dropcap]“న[/dropcap]మస్కారం స్వామి! నేను పట్నం నుంచి మీ దర్శనం కోసం వచ్చాను” అంటూ వినయంగా స్వాముల వారికి నమస్కరించాడతను.

ఆశ్రమ ఆవరణంలోని పచ్చిక బయలుపై కానుగమాను నీడలో కళ్లు మూసుకొని ధాన్యంలో ఉన్న స్వాములవారు కళ్లు తెరచి చూశారు. ఎదురుగా ఓ మధ్యవయస్కుడు చాల హుందాగా, దర్జాగా వున్నాడతను.

“నా కోసం వచ్చానన్నావు? ఏం కావాలి?” ప్రసన్నంగా అన్నారు స్వాములవారు.

“ఏదయినా యిస్తారా?” ప్రశ్నిస్తూనే కూర్చున్నాడతను.

అతని సమయస్ఫూర్తికి స్వాములవారు మెచ్చుకోలుగా చిన్నగా నవ్వి, “ఏదైనా యివ్వటానికి నా దగ్గర ఏముంది నాయనా! నేనొక సన్యాసిని” అన్నారు.

“అయితే జనం మిమ్మల్ని చాల మహిమలు గల స్వామి అని అంటుంటారే?”

“అది వారి వారి విశ్వాసం, నమ్మకం నాయనా”

“అంతే కాని, ఇందులో మీ గొప్ప ఏమీ లేదంటారు” అదో విధంగా అన్నాడతను.

“అహ! నిజంగా సత్యమైన మాట” నిక్కచ్చిగా అన్నారు స్వాములవారు.

“ఇదే మాటని మీరు జనానికి చెప్పొచ్చుగా స్వామి”

“దానికేం భాగ్యం! చెప్పాను నాయనా! కాని వారికి నాపై అపారమైన విశ్వాసం, నమ్మకం అది అలానే వుంది”

“నమ్మకం, విశ్వాసం, మనిషిలో ప్రశ్నలను పదికాలాల పాటు తలెత్తకుండా చేస్తాయి స్వామి”

“నిజం నాయనా! నీ మాటలో సత్యం వుంది.”

“ఆ ‘సత్యం’…. సత్యాన్వేషణకై నేనిక్కడికి వచ్చాను”

“సంతోషం.”

“మీకు సంతోషమే! మరి నాకు”

“నాయనా! నీ సంతోషానికి ఏమైందిప్పుడు”

“ఇంకేం అవ్వాలి, సత్యాన్వేషణకై మీ వద్దకు వచ్చాను. మీరేమో నమ్మకం, విశ్వాసం అంటున్నారు. నా అన్వేషణ, నా ఆశయాలను ఆదిలోనే తుంచేసేలా వున్నారు”

“రామా! రామా! ఎంత మాట”

“అలా అంటారేమిటి స్వామి! నా ఆశయ సాధనకై ఇలా మాట్లాడుతున్నాను యిది తప్పా?”

“తప్పు కాదు”

“మరి”

“నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్! ఒక వ్యక్తిపై లేదా ఒక విషయంపై నమ్మకం, విశ్వాసం కలిగి వుండడం వేరు కాని నీకు నువ్వుగా నీ అనుభవంతో ఆ ‘వ్యక్తి’ని లేదా ఆ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని నిజాన్ని నిగ్గు తేల్చి అందులోని సత్యాన్ని గ్రహించి నీ దారేదో నువ్వు చూసుకోవాలి” సూటిగా అన్నారు స్వాములవారు.

“తప్పయింది క్షమించండి స్వామి”

“తప్పు చేయడం మానవ సహజం నాయనా!”

“అయితే దేవతలు తప్పులు చేయరా?” తనలోని సమయస్ఫూర్తిని మరోసారి బయటపెట్టాడతను. “దెయ్యాలు తప్పు చేస్తాయి!” నెమ్మదిగా అన్నారు స్వాములవారు.

“ఏమిటి స్వామి! మీ సమాధానం” విసుకున్నాడతను.

“ఏ… నాయనా! అలా విసుక్కుంటావ్”

“మరేం చెయ్యమంటారు?”

“నీ సత్యాన్వేషణ కొనసాగించమంటా”

“దెయ్యంతోనా?”

“ఏ! దెయ్యం నీ సత్యాన్వేషణకు పనికి రాదా?”

“నా అన్వేషణకు దెయ్యమైనా, దేవుడైనా పర్వాలేదు స్వామి, కాని అది సత్యంగా వుంటేనా కదా సత్యం అనిపించుకునేది?”

“ఏది సత్యం కాదంటున్నావు నాయనా”

“దెయ్యం స్వామి”

“మరి! దేవుడు”

“దేవుడూను” నిక్కచ్చిగా అన్నాడతను.

“నీ దృష్టిలో దేవుడు, దెయ్యం సత్యం కానప్పుడు అసలు సత్యం అంటే ఏమిటి? సత్యం అనేది ఎలా వుండాలంటావ్?” ప్రశ్నించారు స్వాములవారు.

“ఇది మరి బాగుంది. సత్యం గురించి తెలుసుకోవాలని నేను మీ వద్దకు వస్తే మీరు నన్ను అడుగుతున్నారేంటి?”

“మరి! దేవుడు, దెయ్యం సత్యం కాదన్నావుగా?”

“అవును స్వామి!”

“అయితే నీకు ‘సత్యం’ గురించి కొంతయినా తెలుసుండాలి లేదా ఖచ్చితమైన అభిప్రాయం వుండి తీరాలి” అన్నస్వాములవారి మాటలకు కొన్ని క్షణాలు ఆలోచనలో పడ్డ అతను తనే మళ్లీ మాట్లాడుతాడు.

“స్వామి! మిమ్మల్ని కలవాలని పట్నం నుండి వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు నాతో మాట్లాడుతున్నారు అన్నది ఎంత నిజమో ‘సత్యం’ అనేది కూడ యింతే నిజంగా వుండాలి, కనిపించాలి. అప్పుడే అది సత్యమనిపించుకుంటుంది”

“మరి! నీ జీవితంలో ‘సత్యం’ అనేది నువ్వు అనుకుంటున్నంత నిజంగా నీకెప్పుడు కనిపించలేదా?”

“లేదు స్వామి! నా జీవితంలో నాకు అలాంటి అనుభవమే కలగలేదు. కాగా నా చుట్టు వున్న సమాజం, సమాజాన్ని శాసించే మతం నాకు మరింత ప్రశ్నార్థకంగా కనపడింది” అన్నాడతను.

“ప్రశాంతంగా ఆలోచించు నాయనా! ప్రశ్నకు సమాధానం కనుకోవడంలో మెళుకువ పాటించు. నీ చుట్టూ వున్న సమాజాలు లేదా మతాలు, మత సిద్ధాంతాలు చెప్పే విషయాలలోని ‘స్వచ్చత’ను గ్రహించు. అటుతర్వాత నిజానిజాలు, సాధ్యాసాధ్యాలను ‘బేరిజు’ వేసుకొని. నీ మార్గమేదో నువ్వే నిర్ధారించుకొని సత్యాన్వేషణకు పూనుకో” విపులీకరించారు స్వాముల వారు.

“సరే! స్వామి! మీరు చెప్పినట్టే చేస్తాను నాకు మార్గం నిర్దేర్శించండి”

“ఒకడు నిర్దేర్శిస్తే, చూపెడితే కనపడే మార్గం కాదది. నీకు నువ్వుగా కనుక్కోవాలి”

“మీ వేదాంతం నాకొద్దు కాస్త వివరంగా చెప్పండి”

“వేదాంతం కాదు నాయనా! యథార్థం! యైనా నీ కోరిక మేరకు ప్రయత్నిస్తాను. నీ అన్వేషణకు దారి దొరికితే నాకూ సంతోషమే” అంటూ క్షణకాలం పాటు కళ్లు మూసుకున్నారు.

అతను స్వాముల వారి అనుగ్రహం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.

“నాయనా! నిన్నో ప్రశ్న అడగనా?”

“అడగండి స్వామి!”

“మనం యీ భూమ్మీదే నివసిస్తున్నాముగా?”

“అవును స్వామి!”

“ఇందులో మరే సందేహము లేదు కదా?”

“కచ్చితంగా స్వామి!” “అయితే మన నిజనివాస స్థలం మన శరీరమా? భూగోళమా?”

“శరీరం? భూగోళం… కాదు స్వామి రెండూనూ” కాస్త తడబడుతూ అన్నాడతను.

“సరే! మనుషులు లేని భూగోళాన్ని వూహించగలమా?”

“తప్పకుండా స్వామి!”

“మరి! భూగోళం లేని మనుషులను వూహించగలమా?”

“అసాధ్యం స్వామి! మనిషి వునికి భూగోళం. అది లేనప్పుడు ‘ఊహ’ ఎక్కడిది?”

“అంటే! మనిషికి ఉనికి భూగోళమని ఒప్పుకుంటున్నావా?”

అవునన్నట్టు తలూపాడతను.

“మరి! యీ భూగోళం నిజం కాదా? సత్యం కాదా? నీకి ‘సత్యం’ కనబడటం లేదా?” అడిగారు స్వాములవారు.

నిశ్శబం….

“………..”

“………..”

అతను మాట్లాడలేదు.

కానుగ మానే బోధి వృక్షం అయిందా క్షణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here