పాటల ఊరట

0
4

[dropcap]మా[/dropcap] కజిన్ శ్రీకాంత్ నాకన్నా నాలుగైదేళ్ళు చిన్నవాడు. ఈ మధ్య ఆఫీసులోనూ, ఇంట్లోనూ బాగా ఉదాసీనంగా ఉంటున్నాడని మావయ్య చెప్పాడు. దేని మీద మనసు పెట్టలేకపోవడం, అందర్నీ విసుక్కోడం చేస్తున్నాడట. మునుపెన్నడూ ఇలా లేడని… డిప్రెషన్‌కి తొలి దశలో ఉన్నాడేమోనని చెప్పాడు. నేనంటే  బాగా ఇష్టం కాబట్టి, నా మాట వింటాడు కాబట్టి, ఒకసారి వాడితో మాట్లాడమని మావయ్య అడిగాడు.

శ్రీకాంత్‌కి ఫోన్ చేసి, వీకెండ్‌లో మా ఇంటికి రమ్మన్నా. ఒకటి రెండు రోజులు ఉండేలా కుటుంబంతో సహా రమ్మన్నాను. ఏ కళ నున్నాడో ఒప్పుకున్నాడు.

మా ఇంటికొచ్చినా అన్యమనస్కంగానే ఉంటున్నాడు.

“మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకొకలా

పనేం తోచక పరేషానుగ గదబిడ పడకు అలా?” అని పాడాను.

మావాడు ఓ బలవంతపు నవ్వు నవ్వాడు.

మా వాడికి పాటలంటే ఇష్టం, పుస్తకాలంటే ఇష్టం. వాడికిష్టమైన పాటలు కొన్ని వినిపించి వాడి మనసులోని గందరగోళాన్ని దూరం చేయాలనుకున్నాను. ఆ ప్రోగ్రామ్ రాత్రికి పెట్టాను. పగలు – ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన ఓ పుస్తకం వాడి చేత చదివించాను. లీనమై చదివాడు. వాళ్ళావిడా, మా ఆవిడా కబుర్లలో పడ్డారు. పిల్లలు ఆడుకుంటున్నారు. పుస్తకం చదివాకా, బావుందంటూ… దాని గురించి కాసేపు మాట్లాడాడు. అమ్మయ్య అనుకున్నాను.

రాత్రి భోజనాలయ్యాకా, వాడిని నా గదిలోకి తీసుకువెళ్ళాను. ఎందుకలా ఉంటున్నావు కారణమేంటని అడిగితే, ‘ప్రత్యేకించి కారణం ఏం లేదు… ఏదో దిగులు’ అంటాడు. “సరే. ప్రస్తుతానికి ఏం చెప్పొద్దులే. మంచి పాటలు పెడతాను, హాయిగా రిలాక్స్‌డ్‌గా విను. తర్వాత మాట్లాడుకుందాం” అన్నాను. మా హైస్కూల్, కాలేజీ రోజుల్లో మేం బాగా ఇష్టపడిన పాటలను లాప్‌టాప్‍లో ప్లే చేయడం మొదలుపెట్టాను.

***

శివ సినిమాలో “బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా” పాట మొదటగా వచ్చింది. పాట చివర్లోకొచ్చేసరికి కాళ్ళు తాటించడం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకుని మనసులో పాటని పాడుతూ గానంలో లీనమయ్యాడు.

రాక్షసుడు సినిమాలో వేటూరిగారు రాసిన “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” పాట వచ్చింది. కొన్ని క్షణాలయ్యాకా, ‘జయహో ఇళయరాజా’ అని మెల్లిగా అరిచాడు. “చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం/దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం” అనే లైన్లని పైకి పాడాడు.

తరువాత “ఓ పాపా లాలి” సినిమా నుంచి బాలూ గారి బ్రెత్‌లెస్ సాంగ్ ‘మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు’ పాట వచ్చింది. ప్రశాంతంగా విన్నాడు. “హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు/ వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు” అనే లైన్లు పైకి పాడి మిగతా పాటని హమ్ చేశాడు.

తర్వాత గీతాంజలి నుంచి ‘జగడ జగడ జగడం’. ఇద్దరం పాటని హమ్ చేశాం. మా వాడికి కాస్త ఊపొచ్చింది. చేతులూ, కాళ్ళు లయబద్ధంగా ఆడించసాగాడు.

ఒకదాని తర్వాత ఒకటిగా పాటలు వస్తున్నాయి.  హాయిగా ఆస్వాదిస్తున్నాం మేం.

ఖైదీ నెంబర్ 786 నుంచి భువనచంద్ర గారి గీతం “గువ్వా గోరింకతో” వస్తోంది. “వావ్! ఏం మ్యూజిక్ కదా! రాజ్-కోటి అద్భుతం చేశారీ పాటకి” అన్నాడు. తలూపాను.

ఘర్షణ సినిమా నుంచి “నిన్ను కోరి వర్ణం వర్ణం” అంటూ రాజశ్రీ గీతం చిత్ర గారి స్వరంలో మాయజేసింది. “పలికించాలి స్వాగతం.. పండించాలి జీవితం../నీకు నాకు ఈ క్షణం.. కానీ రాగ సంగమం!!” అంటూ పైకి పాడాను.

పాత మహర్షి సినిమా నుంచి ‘మాటరాని మౌనమిది’ పాట వచ్చింది. “ఏం రాశారు వెన్నెలకంటిగారు, మేస్ట్రోకి తిరుగులేదు…” అన్నాడు మా వాడు.

ఒక పాట జలపాతం హోరులా ఉంటే, ఇంకో పాట నెమ్మదిగా ప్రవహించే నదిలా ఉంది.

సింధూర పువ్వు నుంచి ‘సింధూర పువ్వా’ పాట, శృతి లయలు నుంచి ‘ఇన్ని రాశుల యునికి’ విన్నాం.

అభిలాష సినిమా నుంచి “బంతి చామంతి” పాట వచ్చింది. పాట వింటూ “ఈ పాటకి రాధిక, చిరంజీవి గార్ల స్టెప్స్ సూపర్ కదా” అన్నాడు. “అవును. ఈ పాటకి కోరియోగ్రాఫర్ లేడట. రాధిక చిరంజీవే అప్పటికప్పుడు స్టెప్స్ కంపోజ్ చేసుకుని డాన్స్ చేశారట. పాట చిత్రీకరణ హాఫ్-డేలో అయిపోయిందట. ఈ మధ్య ఓ వీడియోలో ఎస్. జానకి గారు చెప్తుంటే విన్నాను” చెప్పాను.

కొండవీటి దొంగ సినిమా నుంచి ‘శుభలేఖ రాసుకున్నా’ పాట వచ్చింది… పాట వింటూ… “పాటలు పాజ్ చేసి ఈ పాటకి వీడియో చూద్దామా… చిరంజీవి రాధల డాన్స్ గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది” అన్నాడు. తలూపి, ఆ పాట వీడియో పెట్టాను. మా వాడి మనసు తేలిక పడడం చూస్తున్నాను.

మనసు వ్యాకులంగా ఉంటే, గతంలో ఆనందంగా ఉన్న రోజుల్ని తలచుకుంటే – కాస్త తెరిపి పడుతుందని మానసిక నిపుణులు అంటారు. మా వాడికి పాటలంటే ఇష్టమని తెలుసు. అందుకే ఈ మ్యూజిక్ థెరపీ!

ఆ వీడియో అయిపోయాకా, మళ్ళీ పాటలు పెట్టాను.

‘బలపం పట్టి భామ బళ్ళో’ పాట వస్తోంది. “ఆహా… ఏం పాడారు బాలూ గారూ, చిత్రగారూ… సీతారామశాస్త్రి గారి సాహిత్యం అదుర్స్…” అన్నాడు.

శివ సినిమా నుంచి ‘ఆనందో బ్రహ్మ గోవిందో హార్’ వచ్చింది. “లైఫు బోరుగున్నదీ కొత్త టైపు కోరుతున్నదీ/గోల గోలగున్నదీ ఈడు గోడ దూకమన్నదీ” అనే లైన్లు పైకి పాడుతూ… “అప్పట్లో ఎన్నిసార్లు పాడేవాళ్ళమో ఈ లైన్లు…” అన్నాడు శ్రీకాంత్.

“ప్రేమ ఎంత మధురం… ప్రియురాలు అంత కఠినం” పాట వింటూ మౌనంగా ఉండిపోయాం. ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ పాటని తృప్తిగా ఆస్వాదించాం.

“దిల్ హై కీ మాన్‌తా నహీ” అనే సమీర్ గీతాన్ని అనూరాధా పౌడ్వాల్, కుమార్ సానుల స్వరంలో విన్నాం. భావానికి తన్మయులయ్యాం.

“మేరా దిల్ భీ కితనా పాగల్ హై… యే ప్యార్ తుమ్‌సే కర్‌తా హై…” నదీం శ్రావణ్ సంగీతంలో కుమార్ సాను, అల్కా యాజ్ఞిక్ పాడిన పాట వస్తోంది. “సాజన్ లోది కదా” అడిగాడు. అవునని చెప్పాను. “ఈ సినిమాలోదే ‘బహుత్ ప్యార్ కర్‌తే హైఁ’ పాట కూడా బావుంటుంది” అన్నాడు శ్రీకాంత్.

సూర్య ఐపిఎస్ నుంచి “ఓం నమో నమా యవ్వనమా…” పాట వచ్చింది. తర్వాత పాత ఘర్షణ నుంచి ‘రాజా రాజాధి రాజా’ విన్నాం.

బొంబాయి ప్రియుడు సినిమా నుంచి “గుప్పుడు గుండెని తడితే దాని చప్పుడు పేరు సంగీతం” పాట వచ్చింది. వాహ్ చంద్రబోస్ గారూ… అనుకున్నా.

ఇంకా గంట సేపు అలా మాకిష్టమైన పాటలు వింటూనే ఉన్నాం.

మా వాడు పూర్తిగా సేదదీరినట్టు అనిపించింది. పాటల మాధుర్యంలో మనసు ఒకింత ఊరట చెందగలిగితే మరింకేం కావాలి. తెప్పరిల్లిన మనసుకు ప్రశాంతత చేకూరి, సమస్యపై దృష్టి సారిస్తుంది.

“ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం”

అని రుద్రవీణ సినిమాలోని పాట పల్లవి పాడాను.

అప్పుడు మావాడు నోరు విప్పాడు.

వాడిది అకారణ భయం అని నాకనిపించింది. ధైర్యం చెప్పాను. సిట్యుయేషన్‌ని లాజికల్‌గా ఆలోచించమన్నాను. కాసేపు వాడిని ఒంటరిగా వదిలేసి, నేను పిల్లలతో కబుర్లు చెప్పాను.

ఒక అరగంట తర్వాత వాడూ వచ్చి జాయిన్ అయ్యాడు. వాడి ముఖం దిగులు పోయి, మబ్బులు తొలగిన ఆకాశంలా తేటగా ఉంది.

“Music acts like a magic key, to which the most tightly closed heart opens.” అని Maria Augusta von Trapp చెప్పిన మాటలు ఎంత నిజం కదా!

సినిమా పాట వీక్షకుల్ని/శ్రోతల్ని మైమరిపించాలంటే – ఎందరిదో కృషి ఉంటుంది. గీత రచయిత, సంగీతదర్శకుడు, వాయిద్యకారులు, అభినయించిన తారలు – వీరందరి సమిష్టి కృషి సాధ్యమయితేనే పాట విజయం సాధిస్తుంది.

కొన్ని పాటలు ఊపునిస్తాయి, మరికొన్ని నిబ్బరాన్నిస్తాయి. ప్రోత్సాహాన్నీ, ప్రేరణనీ ఇస్తాయి. మనోధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన పాటలెన్నో ఉన్నాయి. అలాంటి పాటలనెన్నో మాకందించిన వారెందరో మహానుభావులు! అందరికీ వందనాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here