మానస సంచరరే-32: తలపుల తేరులో ఊరు!

8
3

[box type=’note’ fontsize=’16’] “ఊరు మీది మమకారం ఊపిరున్నంత కాలం ఉంటుంది. అనేకానేక కారణాల వల్ల మనిషి ఊరు విడిచిపోయినా గుండెల్లో ఆ గురుతులు పదిలంగానే ఉంటాయి” అంటున్నారు జె. శ్యామల. [/box]

ఈరోజు వాసంతి చాలా హుషారుగా ఉంది. సంగతేమిటో అడగాలనుకున్నా. కానీ పని ఒత్తిడిలో కుదరలేదు. చివరకు ఆఫీసు పని ముగించుకుని బస్టాపుకు నడుస్తుండగా వాసంతి మళ్లీ తారసపడింది. ఏమిటి సంగతని అడిగేశాను. ‘సంక్రాంతి వస్తోందికదా, మా ఊరు వెళ్తున్నాం. టికెట్లు బుక్ అయిపోయాయి. అదీ సంగతి. మా ఊళ్లో సంక్రాంతి ఎంత బాగా చేస్తారో తెలుసా మేడమ్. అందులో ఈసారి మా బాబాయ్‌లు, పిన్నులు, మామయ్యలు, అత్తయ్యలు అందరూ వస్తున్నారు’ కళ్లు ఆనందంతో మెరుస్తుండగా చెప్పింది. ఇంతలో నా బస్ రావడంతో వాసంతికి బై చెప్పి ఎక్కేశాను. మనసులో ఊరు ఊరేగింపు మొదలైంది.. పొద్దున పనమ్మాయి కూడా “సంక్రాంతికి మా ఊరెళ్తానమ్మా, మా వాళ్లంతా ఎప్పుడొస్తున్నావని ఫోన్ల మీద ఫోన్లు. ఎంత.. ఓ వారం. అంతే” ఉత్సాహంగా చెప్పింది. ఆ తర్వాత ఇస్త్రీ అమ్మాయి వచ్చింది. ‘పిలవకుండానే వచ్చావే’ అంటే ‘సంక్రాంతికి ఊరెళ్తున్నా. వచ్చేసరికి చాలా రోజులవుతుంది. ఉన్నవేవో ఇస్తే ఇస్త్రీ చేసిస్తా’ అంది.

ఊరు.. అందునా సొంత ఊరు ప్రయాణమంటే మనసు ఉరకలేయడం సహజం. సంక్రాంతి అంటే చాలు సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. అందరూ ఊరు ప్రయాణాలే. టికెట్టు దొరక్క పోయినా, చార్జీ ఎంత ఎక్కువైనా, తత్కాల్‌లో రైలెక్కి లేదంటే రెడ్ బస్సో ఏదో ఒకటి పట్టుకుని పల్లెలకు పరుగులు. అవును.. ఊరంటే నా బాల్యపు ప్రయాణాలు స్మృతిపథంలో మెదిలాయి. మా ఇల్లు ఎంత బాగుండేది. డాబా ఇల్లు, అప్పుడు అదెంత గొప్పో. వాకిట్లో గార్డుల్లా నిలువెత్తు కొబ్బరి చెట్లు వచ్చిపోయే వారికి వింజామర సేవ లందిస్తూ మర్యాదలు చేసేవి. ఆ వీధిలో మాదే ఎత్తయిన ఇల్లు. దాదాపు పన్నెండు మెట్లు. ఎడమవైపు పెద నాన్నగారి ఆఫీసు గది. అందులో ఓ టేబుల్, ఆయన కుర్చీ కాకుండా మరో మూడు కుర్చీలుండేవి. గోడలకు గాంధీ, నెహ్రూ, నేతాజీ వగైరా మహనీయుల ఫ్రేములుండేవి. టేబుల్ నిండా ఫైళ్లదొంతర్లు, పిన్నులు, ట్యాగ్లు, రబ్బర్ స్టాంపులు, ఇంక్ ప్యాడ్లు, పెన్ స్టాండ్, రకరకాల ఇంక్ పెన్నులు.. అప్పట్లో బాల్ పాయింట్ పెన్నులు లేవు. తెల్లటి పంచె, తెల్లటి ఫుల్ హ్యాండ్స్ షర్టు, గంభీరమైన వదనం. ఆయన ఇంట్లో ఉన్నాడంటే చాలు పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయనే పలకరిస్తే మహద్భాగ్యమన్నట్లు ఉండేది. ఇక ముందు వరండా, ఆపైన పేద్ద హాలు, హాలుకు కుడివైపున ధాన్యం గది. అందులో ఓ గాదె ఉండేది. హాలు దాటితే మళ్లీ ఓ అడ్డంగా ఉండే హాలు. అందులోనే ఓ చివర వంటకు ఏర్పాటు. దానికి అడ్డగోడ ఒకటి ఉండేది. తలుపు ఉండేది కాదు అడ్డగోడలోపల ఓ వైపు గోడకు గూడు. అందులో ఊరగాయల జాడీలు. ఆ హాలు నుంచి కుడివైపుకి వెళ్లి నాలుగు మెట్లు దిగితే పెరడు. తులశమ్మ. దానికి కొద్ది దూరంలో నిత్యమల్లె చెట్లు, రాములక్కాయల (టొమేటోలనే అలా అనేవాళ్లు) మొక్కలు, పచ్చిమిరపమొక్కలు ఉండేవి. పెరడులో కుడివైపు కొన్నాళ్లు పశువులపాక ఉండేది. పాడి వ్యవహారం కొన్నేళ్లకు ముగిసిపోయింది. అక్కడ మళ్లీ రెండు గదుల నిర్మాణం జరిగింది. పెరడులో ఇంకా ముందుకు వెళితే బోరు పంపు. దాని వెనుకే ఓ బాత్ రూమ్. అందులో ఓ పెద్ద సిమెంటు తొట్టి. పెదనాన్న పంపుకింద స్నానం చేస్తుంటే ఎవరో ఒకరు నీళ్లు కొట్టేవాళ్లు. అదొక తమాషా శబ్దం. పెద్దనాన్న ప్రకృతి వైద్యం ఫాలో అయ్యారట కొన్నాళ్లు. అందుకే తొట్టిస్నానం కోసం ఆ సిమెంటు తొట్టి ఏర్పాటు. మరో వైపు కొంచెం  దూరంగా లావెంట్రీ. ఆ రోజుల్లోనే ఆయన ఆధునిక ఏర్పాట్లు చేశాడు. పడమటివైపు తుంగభద్ర. పెదనాన్న గదికి అటువైపు దక్షిణంవైపు ఓ వాకిలి ఉండేది. అటువైపు రకరకాల పూలచెట్లు ఉండేవి. వెన్నముద్ద పూలచెట్టు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఏదైనా ఫంక్షన్లప్పుడే ఊరు వెళ్లేవాళ్లం కాబట్టి ఇల్లంతా బంధువుల సందడి. ఎదురుఇంట్లో సుబ్బారెడ్డిగారి ఇల్లు. వాళ్లమ్మాయి మాతో కలిసిపోయి ఆడుకునేది. ఇప్పుడు ఏం చేస్తోందో, ఎక్కడ ఉందో. అన్నట్లు మాకు నిమ్మతోట ఉండేది. సరదాగా అటు వెళ్లే వాళ్లం. అక్కడ నిమ్మచెట్లే కాకుండా వంకాయలు, బెండకాయల మొక్కలు కూడా అక్కడక్కడ ఉండేవి. తోటకు నీళ్లు పెట్టడానికి ఇంజను… ఆ ఇంజనుకు ఓ గది.. వ్యవహారం. తుంగభద్రమీద చిన్నపాటి బ్రిడ్జి. దగ్గరున్న పట్నానికి వెళ్లటానికి అరగంటకో బస్సు. బస్టాండు దగ్గర ఓ గుడి ఉండేది. ఊరికి కొంత దూరంలో పోస్టాఫీసు. బాగా దూరంగా రైల్వే స్టేషను. పెదనాన్న పోవటంతో అంతా తల్లకిందులైంది. కొన్నాళ్లు ఇంటిని అద్దెకిచ్చినా, ఆ తర్వాత రెండు, మూడేళ్లకే ఇంటిని అమ్మేశారు. సొంత ఊరు మనసులో మాత్రమే మిగిలి పోయింది.

ఊరి జ్ఞాపకాలతో ఆ గాలి, నేల అనుభూతించినట్లయి ‘సిరివెన్నెల’ పాట గుర్తొచ్చింది..

“ఈ గాలి ఈ నేలా ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్లు నా కళ్ల లోగిళ్లు…”

అన్నట్లు ఆర్.కె.నారాయణ్ ‘మాల్గుడి డేస్’లో చిత్రించిన ఊరు ‘మాల్గుడి’ పాఠకుల చిత్తాన్ని ఎంతగా హత్తుకుంది! ఆ ఊరు, పరిసరాలు, పాత్రలు, స్వభావాలు.. అన్నీ నూరు శాతం పర్ఫెక్ట్‌గా ఉంటాయి.

మనిషికేనా దేవుళ్లకూ ఊళ్లున్నాయి. విష్ణుమూర్తి వైకుంఠపురంలో, ఈశ్వరుడు కైలాసపురిలో, రాముడు అయోధ్యాపురిలో, కృష్ణుడు వ్రేపల్లెల్లో.. శ్రీనివాసుడు తిరుమలలో, శ్రీరాముడు భద్రాచలంలో, సత్యనారాయణ స్వామి అన్నవరంలో, నరసింహస్వామి యాదగిరి గుట్టలో, పానకాల స్వామి మంగళగిరిలో, అప్పల నరసింహస్వామి సింహాచలంలో, మల్లికార్జునుడు శ్రీశైలంలో, కామాక్షి కంచిలో, మీనాక్షి మదురైలో, విశ్వేశ్వరుడు కాశీలో.. ఇలా ముక్కోటి దేవతలకు ఎన్నెన్నో ఊళ్లు ప్రసిద్ధాలు. చదువుకోసం పట్నం వెళ్లి, సెలవులకు ఊరు వచ్చే అబ్బాయి మదిలో ఊళ్లో తన చిన్ననాటి నెచ్చెలి గురించిన ఊహలెలా ఉంటాయో దేవదాసు పాట చెపుతుంది.

“పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో
అల్లరి చేద్దాం చలోచలో..
ఆటపాటలందు కవ్వించు కొంటె కోణంగి..
మనసేమో మక్కువేమో..
నగవేమో వగేమో కనులార చూతము
పల్లెకు పోదాం పారును చూద్దాం చలోచలో
అల్లరి చేద్దాం చలోచలో
పొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము..
నన్నూ చూడగానే
చిననాటి చెలిమి చూ పేనో… నా దరికి దూకునో..
తానలిగిపోవునో
ఏమౌనో చూతము..”

మల్లీశ్వరి చిత్రంలో తిరుణాళ్ల కెళ్లిన బావామరదలు నాగరాజు,మల్లీశ్వరి, తిరిగి తమ ఊరికి ప్రయాణమై ఉత్సాహంగా, ఉల్లాసంగా పాడే పాట బండిలో ప్రయాణాన్ని పదంపదంలో కళ్లకు కడుతుంది.

“హేయ్… పరుగులు తీయాలి
ఓ గిత్తలు ఉరకలు వేయాలి
బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి
మన ఊరు చేరాలి
హోరుగాలి కారుమబ్బులు ముసిరేలోగా ఊగేలోగా
ఊరుచేరాలి..”

ఒకప్పుడు ఊళ్లంటే ఒక మాటమీద నిలబడేవి. అందుకు ఉదాహరణగా ‘శారద’ చిత్రం చెప్పుకోవచ్చు. పల్లె పడుచు శారద భర్త డాక్టరు. పెళ్లయిన రోజే వృత్తిధర్మంగా పొరుగూరు వెళ్లాల్సి వస్తుంది. విధి వక్రించి తిరిగివస్తూ బోటు ప్రమాదంలో మరణిస్తాడు.

అది విన్న శారద షాక్ అవుతుంది. ఆమెకు తెలివి వచ్చేసరికి జరిగిన విషయం మరిచిపోతుంది. భర్త ఇంకా వస్తాడనే భావనలోనే ఉంటుంది. దాంతో శారద బాబాయ్ అందరితో మాట్లాడి ఆమె భర్త పోయినట్లు ఎవరూ ఆమెతో చెప్పటంకాని, ఆ విషయం మాట్లాడటం కానీ చేయవద్దని, ఆమెను అదే ఊహలో ఉండనివ్వాలని చెపుతాడు. అందుకు ఊరంతా సమ్మతిస్తుంది. శారద అదే భ్రమలో ఉంటూ

‘వ్రేపల్లె వేచెను వేణువు వేచెను
వనమె ల్ల వేచేనురా
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈరాధ వేచేనురా.. రావేలా.. రావేలా
కోకిలమ్మ కూయనన్నది
నీవు లేవని
గున్నమావి పూయనన్నది
నీవు రావని
కాటుక కన్నీటి జాలుగ జాలి జాలిగ
కదలాడె యమునానది..
మావాడ అంటున్నదీ
స్వామి వస్తాడనీ
నానీడ తానన్నదీ రాడు రాడేమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా
రావేల చిరుజల్లుగా…”

సినారె కలం సుశీల గళం.. పాట వింటుంటే చెమ్మగిల్లని మనసే ఉండదు.

శారద నటనకు తడవని నయనాలే ఉండవు.

ఆ ఊరివారు మాట తప్పకుండా అలాగే నడుచుకుంటారు కూడా. చివరకు ఎప్పుడో నిజం బయటపడుతుంది. అలా తమ ఊరి ఆడపడుచును కాపాడుకోవటం కోసం అంతా అదే మాట మీద ఉండటం ఎంత గొప్ప! ఇప్పటి పల్లెలు రాజకీయ వైషమ్యాలతో దారుణంగా తయారయ్యాయో. ఊరు ఆధారంగా ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. ఒక ఊరి కథ, ఊరికి మొనగాడు..

ఊరు ప్రయాణికుల మీద ఓ జోక్ కూడా ఉంది. ఓ వ్యక్తి రెల్వే స్టేషన్‌కు వెళ్లి ఊరి పేరు చెప్పకుండా ‘మా ఊరికి టికెట్టివ్వండి’ అనడగటం.. అలా అది కొనసాగటం..

వెళ్లక వెళ్లక ఊరు వదిలి, మరో తావుకు వెళితే, అక్కడేదైనా గందరగోళం జరిగితే మనసంతా ఊరిమీద బెంగతో నిండిపోదూ.. అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలో ప్రవరుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటాడు. ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. ఎంత చక్కని పేరో! భూసురుడైన ప్రవరాఖ్యుడు తన పూజాపునస్కారాలతో, అతిథి, అభ్యాగతులను ఆదరించి, సేవించడంలో నిండా మునిగి ఉంటాడు. అటువంటి ప్రవరుడు, ఒక రోజు అతిధిగా వచ్చిన సిద్ధుడు, ప్రవరుడి మనోభీష్టం తెలుసుకొని, పాదలేపనం పూయగా హిమాలయ సందర్శనానికి వెళతాడు. అక్కడి ప్రకృతిని చూసి పులకించిపోతాడు. అంతలో అక్కడి మంచుకి, తన పాద లేపనం కాస్తా కరిగిపోయిందని తెలియడంతో ఆనందం ఆవిరయిపోతుంది. పాదలేపనం లేకపోతే పక్షిలా ఎగిరి ఊరు చేరలేడు కదా

‘ఎక్కడి మా అరుణాస్పద పురము
ఎక్కడి ఈ హిమవన్నగవరము
కోరివచ్చినాను.. దారి కోలుపోయినాను
ఎగిరిపోదమన్న నాకు రెక్కలైన లేవే
ఏ దిక్కు కానరాదే.. ఏ దిక్కు కానరాదే..’

చింతిస్తూ అలా అలా నడుస్తుంటే వరూధిని కనిపిస్తుంది.

అప్పుడు ప్రవరుడు ‘ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ!’ అంటూ..

భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవ తప్పితిన్
క్రొవ్వున ఇన్నగాగ్రమునకున్ చనుదెంచి
పురంబుజేర నింకెవ్విధిగాంతు తెల్పగదవే
తెరువెద్ది శుభంబు నీకగున్’ అంటూ వేడుకుంటాడు.

వరూధిని అతడి పై మరులుగొని, అతణ్ణి అక్కడే కట్టిపడేయాలనుకుంటుంది. ప్రవరుడు ఇక లాభం లేదని హవ్యవాహనుణ్ణి వేడుకొని ఇల్లు చేరుకుంటాడు. అది ప్రవరుడి కథ.

అసలు కథలన్నీ చాలావరకు ‘అనగనగా ఒక ఊళ్లో’ అంటూనే మొదలవటం తెలిసిన సంగతే. ‘మా ఊళ్లో… అంటూ ఎన్నో ముచ్చట్లు చెపుతుంటారు ఎంతోమంది. ఓ సినిమాలో

‘మా ఊళ్లో ఓ పడుచుంది.. దయ్యమంటె భయమన్నది

ఆ ఊళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడూ…’ అంటూ ఓ సరదా పాట ఉంది.

అన్నట్లు వారసత్వం సినిమాలో…

‘పేరైనా అడుగలేదు.. ఊరైనా అడుగలేదు
మనసేమో అతని విడిచి
మరలి రాదాయే.. మరలి రాదాయే..
వెతలన్నీ ఆతనికే వినిపించానెందులకో
వెన్నుతట్టి మురిపించి వెళిపోయాడతడెవరో..’

అంటూ నార్ల చిరంజీవిగారు ఓ పడుచు హృదయాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.

ఇక ఎలాంటి ఊరయితే నివాసానికి భేషుగ్గా ఉంటుందో సుమతీ శతకకారుడు బద్దెన భలేగా చెప్పాడు.

అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

డబ్బుకు ఇబ్బంది లేకుండా అప్పిచ్చే రుణదాత, అనారోగ్యాన్ని నయంచేసే వైద్యుడు, నీటి కొరత లేకుండా ఎల్లకాలాలు పారే ఏరు, బ్రాహ్మణుడు ఉన్న ఊళ్లో ఉండమని హితవు చెప్పాడు. చాలామంది అప్పిచ్చువాడు వైద్యుడు అని కలిపి చదివి, అప్పిచ్చేవాడే వైద్యుడని అర్థం చెపుతుంటారు. కొందరు కావాలనే డబ్బుతోటే అన్ని రోగాలూ కుదురుతాయి కాబట్టి అప్పిచ్చువాడు వైద్యుడు అన్నది ఒప్పంటూ ఉంటారు.

ఎన్నో ఊళ్లు. ఒక్కో ఊరుకు ఒక్కో ప్రశస్తి ఉంది. మహనీయులు జన్మించిన ఊళ్లు, పుణ్యక్షేత్రాలయిన ఊళ్లు, రకరకాల వస్తూత్పత్తికి పేరొందిన ఊళ్లు.. కొండపల్లి బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, కాకినాడ కాజాలు, తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్లు, నరసాపురం లేసు అల్లికలు, పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట, ధర్మవరం, ఉప్పాడ పట్టుచీరలకు..ఇలా చెప్పాలంటే జాబితా అనంతమే.

‘ఆంధ్రకేసరి’ చిత్రంలో రాజమండ్రిని కీర్తిస్తూ ఆరుద్ర పాట…

“వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం..” అంటూ
“రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించె గౌతమి సూరు… వేదంలా.
ఆది కవిత నన్నయ్య రాసెనిచ్చట
శ్రీనాథ కవి విలాసము పెద్ద ముచ్చట
కవిసార్వభౌములకిది ఆలవాలము…
నవకవితలు వికసించె నందనవనము..
దిట్టమైన శిల్పాలు దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనకమేడలు
కొట్టుకొనిపోయె కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు.. ”

ఎంత గొప్ప భావన.. రాజమహేంద్రవర యశస్సుకు అక్షర నీరాజనమీ పాట.

వంగభూమి గురించి వన్నెకెక్కిన పాట..

“యమహానగరి కలకత్తాపురి.
నమహె హుగిలీ హౌరా వారధి..
నేతాజీ పుట్టినచోట, గీతాంజలి పూసినచోట
పాడనా తెలుగులో.. ఆ హంస పాడిన పాటే
ఆనందుడు చూపిన బాట సాగనా,
బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల
మానిని సరోజిని
రోజంతా సూర్యుడికింద రాత్రంతా రజినీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం, దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట
కళలకు కొలువట
తిథులకు సెలవట
అతిథుల గొడవట
కలకటనగరపు కిటకటలో
వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్ రే సితారా యస్‌డి బర్మన్ కీ ధారా
థెరీసా కీ కుమారా
కదలిరారా జనగణమనముల స్వరపద వనముల…”

పాటల గీటురాయి వేటూరి పాట యిది..

‘బాలరాజు కథ’ చిత్రంలో ఆరుద్ర మరో మంచి పాట అందించారు..

“మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు..”

అంటూ మహాబలిపురంలో శిల్ప వైశిష్ట్యాన్ని పాటలో వివరిస్తాడు.

ఊరుకు సంబంధించి ఎన్నో సామెతలున్నాయి.

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది; ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది; ఊరంతా ఒకదారి, ఉలిపికట్టెదొక దారి; ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?.. ఇలా ఎన్నో..

ఊరు మీది మమకారం ఊపిరున్నంత కాలం ఉంటుంది. అనేకానేక కారణాల వల్ల మనిషి ఊరు విడిచిపోయినా గుండెల్లో ఆ గురుతులు పదిలంగానే ఉంటాయి. పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత సేవలందించే విషయంలో ఇటీవల చాలామందే ముందుంటున్నారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు, భారత సందర్శనంలో సొంత ఊరిని కూడా సందర్శించడం, తాము చదువుకున్న స్కూలు కోసమో, కాలేజీ కోసమో, గ్రంథాలయం కోసమో తమ వంతు ఆర్థికసాయం అందించడం తెలిసిందే. మనిషి మానవీయంగా, మంచికి మారు పేరుగా, ఔన్నత్యంతో నడుచుకుంటూ తనదైన రంగంలో విజయకేతనాలు ఎగురవేస్తే అతడికే కాదు, ఆ ఊరికీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అందుకే ఇంటికి, ఊరికీ కూడా మంచి పేరు తేవాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంతలోనే ఫోను.. ఖమ్మం నుంచి మా తమ్ముడు.. పండుగకు ఫ్యామిలీతో వస్తానన్నాడు. మనసులో ఆనంద తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. ‘వాణ్ని చూసి చాలా రోజులయింది. నేను ఊరెళ్లకపోయినా, ఊరినుంచి నాకోసమే.. నాకోసమే నా తమ్ముడొస్తున్నాడు’ అనుకుంటుండగా స్టాప్ రావడంతో అడుగులు ముందుకు, ఆలోచన వెనక్కు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here